Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
9. పార్టీలోని ఆంధ్రనాయకత్వం తెలంగాణ నాయకత్వం మీద పెత్తనం చలాయించిన రీతి గోచరం అవుతుంది. "విశాలాంద్ర" నినాదం ఇచ్చిన కమ్యూనిస్టు పార్టీలోనే తొలుత ప్రాంతీయ భేదాలు - ప్రాంతీయ పెత్తనం కొనసాగడం కన్న వివేక భ్రష్టసంపాతం ఉండదు.
పార్టీ అంతర్జాతీయం నుండి - జాతీయం నుంచి ప్రాంతీయ సంకుచితత్వంలో కూరుకుపోయింది. అసలు అప్పుడే పార్టీలో అంతర్గతంగా రెండు చీలికలు వచ్చాయి. వేరు కుంపట్లు పెట్టుకోవడానికి సుమారు దశాబ్దిన్నర పట్టింది.
10. ఒక అప్రియం అయిన వాస్తవం ఉంది. ఈనాటి అన్ని పార్టీలకు వలెనే - కమ్యూనిస్టుపార్టీకి ప్రజలు దూరం అయినారు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరిగాయి. పార్టీ నిర్మాణం కుంటుపడింది.
భారత కమ్యూనిస్టుపార్టీ తన బలాన్ని కనీసం నిలుపుకొని ఉంటే భారత రాజకీయాలు మరో రకంగా - ప్రగతి పథగామిగా ఉండేవి!
ఇక కాంగ్రెసువారి కథాక్రమం బెట్టిదనిన:-
కాంగ్రెసు చరిత్రయే గ్రూపులు - తగాదాలు - కయ్యములతో కూడింది. సాయుధ పోరాటం జరిపిన కాంగ్రెసువారిని రంగారెడ్డి వర్గంవారు మార్క్సిస్టు కాంగ్రెసు వారినిగా ముద్ర వేశారు. ఈ ప్రగతి కాంగ్రెసుకు రామానంద తీర్ధగారు అధ్యక్షులు వీరికి పార్టీలో బలం ఉంది. రంగారెడ్డి వర్గం వారు అది సహించలేకపోయారు. వారు జనార్ధనరావు దేశాయి అధ్యక్షులుగా 'స్వంత కాంగ్రెస్' ఏర్పరచుకున్నారు.
ఇక్కడ గమనించవలసిన విషయం - పోటీ ఆంద్ర మహాసభ ఏర్పరచినవారే - పోటీ కాంగ్రెసు ఏర్పరచారు.
ప్రజలు ఈ రెండు పార్టీలకు "గోసాయి కాంగ్రెస్" "దేశాయి కాంగ్రెస్" అని పేర్లు పెట్టారు. రామానందతీర్ధ అధ్యక్షులుగా గలది గోసాయి కాంగ్రెస్ తీర్ధగారు సన్యాసి. అందువల్ల గోసాయి అని పేరు పెట్టారు. జనార్ధనరావుదేశాయి అధ్యక్షులుగా గలది "దేశాయి కాంగ్రెస్" అయింది.
గోసాయి కాంగ్రెస్ వరు సభ్యులను చేర్పించారు. సభ్యత్వం ఆధారంగా ప్రతినిధుల ఎన్నికలు జరిపారు. విచిత్రం ఏమంటే - ప్రతినిధులుగా దేశాయి కాంగ్రెస్ వారు కూడా పోటీ చేశారు.
గార్లలో మా అన్నయ్య దాశరథి గోసాయి కాంగ్రెస్ పక్షాన - పుల్లఖండం జానకి రామయ్య దేశాయి కాంగ్రెస్ పక్షాన పోటీ చేశారు. అప్పటికే నేను కుళ్ళు రాజకీయాలకు దూరం జరిగాను. అయినా దాశరథి అభ్యర్ధిత్వాన్ని బలపర్చాను. అందుకు కారణాలున్నాయి:
1. దాశరథి నాకు అన్నయ్యమాత్రమే కాదు - నిజాం నవాబును "ముసలినక్క" అనగలిగిన ధీశాలి - మహాకవి.
2. దేశాయి కాంగ్రెసుకన్న - గోసాయి కాంగ్రెస్ ప్రగతి శీలం అయింది.
3. అవినీతికి - గూండాయిజనికి నాయకత్వం వహించే జానకి రామయ్య గెలువరాదు.
తాళ్లూరి రామానుజస్వామి రిటర్నింగ్ ఆఫీసరుగా వచ్చారు. బాజాబ్తా పోలింగు బూతు పెట్టారు. ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ ప్రజలు ఓటు వేయడం అదే మొదలు! ఆ సాయంకాలం అందరి ముందు ఓట్లు లెక్కించారు. జానకిరామయ్య లెక్కింపుకు రాలేదు. అతనికి ఒక్క ఓటు వచ్చింది. మా అన్నయ్య దాశరథి కృష్ణమాచార్య కాంగ్రెస్ ప్రతినిధిగా గెలిచారు.
దీనిని నేను కాంగ్రెస్ విజయంగా భావించలేదు. ఇది మేము నిర్వహించిన ఉద్యమాలకు ప్రజల ప్రతిస్పందన మాత్రమే!
కాంగ్రెస్ విషయంలో గమనించదగినది ఒకటి ఉంది. హైదరాబాదు రాష్ట్రంలో తెలుగువారివి ఎనిమిది జిల్లాలు. అధిక సంఖ్యాకులు తెలుగువారు. అయినా ఉభయ కాంగ్రెసులకు అధ్యక్షులు మహారాష్ట్రులే! ఇది ఆంధ్రుల అనైక్యతకు తార్కాణం.
కేంద్రప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూగారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉండిన తీవ్ర అభిప్రాయ భేదాలు జగమెరిగిన రహస్యం. గాంధీజీ హత్య జరగడానికి కొద్దిసేపటి ముందు పటేల్ మహాత్మునితో ఆ విషయాలే ప్రస్తావించారు. నెహ్రూ ఆదర్శవాది. పటేల్ కార్యవాది.
నెహ్రూజీ హైదరాబాదు వచ్చారు. అప్పుడు ఉభయ కాంగ్రెసువారూ ప్రధానిని కలిశారు. వారు దేశాయి కాంగ్రేసువారిమీద చిర్రుబుర్రులాడారు. బయటపడ్డారు.
సర్దార్ జీ హైదరాబాదు వచ్చారు. యథారీతిగా ఉభయ కాంగ్రెసులు వారిని కలుసుకున్నాయి. వారు ఇద్దరినీ సమాధానపరిచారు. పోటీ కాంగ్రెస్ రద్దు అయింది. రామానంద తీర్ధ అధ్యక్షతన ఒకే కాంగ్రెస్ ఏర్పడింది. అది అఖిల భారత కాంగ్రెసులో అంతర్భాగం అయిపోయింది.
భూదానం:
తెలంగాణలో ఉన్న అల్లకల్లోల దృష్ట్యా 9.4.1951 నుంచి అయిదు రోజులు హైదరాబాదులో - సర్వోదయ సమ్మేళనం జరిగింది. అప్పుడు వినోబాజీ తెలంగాణలో రెండు నెలలు పర్యటించాలని నిర్ణయించారు. 16.4.1951 న వారి యాత్ర ప్రారంభం అయింది. వారు పాదయాత్ర సాగించారు. తొలిరోజు హయత్ నగర్ లో విడిశారు. మలిరోజు బాటసింగారంలో నిలిచారు.
మూడోరోజు పోచంపల్లి వెళ్ళాలి. ఆ మార్గం గుట్టలమయం. కమ్యూనిస్టులకు తావరం. ఆ బాటన సాగడానికి అందరూ జంకారు. వినోబాజీ ఏ మాత్రం భయపడలేదు. వారికి ఆత్మవిశ్వాసం ఉంది. వారు గుట్టల్లోంచి నడిచిసాగారు. పోచంపల్లి చేరారు. వినోబాజీ - ఆయుధం కన్న ఆత్మవిశ్వాసం మిన్న అని నిరూపించారు.
వినోబాజీ వద్ద ఒక ఆకర్షణ ఉంది. అది ఏమిటి అంటే చెప్పడం కష్టం. వారిలో విశ్వాసం ఉంది. మనోబలం ఉంది. దైవచింతన ఉంది. వారు ఎవరికీ ఏమీ ఇస్తానని చెప్పలేదు. శాంతంగా జీవించండి అని మాత్రం ఉపదేశించారు. ఆ సందేశం వినడానికి తండోపతండాలుగా జనం కూడారు.
పోచంపల్లిలో సభ జరిగింది. జనం బాగానే వచ్చారు. వినోబాజీ శాంతి సందేశం వినిపించారు. అది విన్నాడు ఒక హరిజనుడు. లేచాడు. "ఆకలి దప్పులతో అలమటించేవారికి శాంతి సందేశం వల్ల ప్రయోజనం ఏమి?" అని అడిగాడు.
"పొలాలకు వెళ్ళండి. పని చేయండి" అన్నారు వినోబా.
"మాకు పొలాలు లేవు పని ఎక్కడ చేయాలి?" ప్రశ్న.
అప్పుడు వినోబాజీకి మెరపువంటి ఆలోచన వచ్చింది. వారు భూమి సమస్యను గ్రహించారు. సమస్య భూమి అని అర్ధం అయింది. పరిష్కారం ఏమి? బలవంతం హింస వీటిమీద వినోబాజీకి నమ్మకం లేదు. తటాలున వారికి "భూదానం" గుర్తుకు వచ్చింది.
ఇచ్చేవాడు స్వచ్చందంగా ఇవ్వాలి. గ్రహించేవాడు సంతోషంగా గ్రహించాలి. ఆయుధం - హింసకాక - మానవత పని చేయాలి. అల అనుకొని భూదానం చేయవలసిందని వినోబాజీ పోచంపల్లి సమావేశంలో కోరారు.
పోచంపల్లిలో వినోబాజీ ఉపదేశం విన్నారు వెదిరె రామచంద్రా రెడ్డిగారు వంద ఎకరాల భూమి దానం చేశారు. అలా మొదలయింది భూదానోద్యమం. అప్పటినుంచి ఆ ఊరికి 'భూదాన్ పోచంపల్లి' అని పేరు వచ్చింది.
వినోబాజీ దృఢసంకల్పంతో పాదయాత్ర సాగించారు. నల్లగొండ జిల్లాలో నాలుగువేల ఎకరాల భూదానం ఆర్జించారు. వారు నిస్వార్ధంగా - మనో బలంతో నాలుగువేళా ఎకరాల భూదానం ఆర్జించారు. వారు నిస్వార్ధంగా - మనో బలంతో కాలి నడకన - తెలంగాణమంతటా పర్యటించారు.
వినోబాజీని నేను గార్లలో దర్శించుకున్నాను. వారిని చూచినప్పుడు మహాత్ముని చూచినట్లు - బుద్దుని చూచినట్టూ అనిపించింది. స్వచ్చమయిన వారి వదనం నిష్కళంకం అయిన దరహాసంలో అనంతం అయిన ఆకర్షణ ఉంది. వరికి 'భూదాన' ఆలోచన పరిశోధన వల్ల కలిగింది కాదు. ప్రజలవల్ల - ప్రజలనుంచి ఉద్భవించిన ఆలోచన! బుద్దునికి సుజాత అనే గొల్లపిల్ల వల్ల జ్ఞానోదయం అయింది. వినోబాజీకి ఒక హరిజనుని వల్ల జ్ఞానోదయం అయింది!
వినోబాజీ సంక్రాంతినాడు గార్ల వచ్చారు. వారు సూర్యుణ్ణి కాలపు గడియారానికి పెండ్యులంగా పోల్చారు. ఆ ఉపమానం నాకు అద్భుతం అనిపించింది. వారి ఉపన్యాసం నిర్మలంగా ఉంది. వారికి మనసు మీద - మనిషిమీద ఉన్న విశ్వాసానికి అబ్బురపడ్డాను.
"వేతనంలో కొంత భాగం దానం చేయండి" అని అర్ధించారు వినోబాజీ.
"కాగితం వ్రాసి ఇవ్వాలా?" అడిగాన్నేను.
"నాకు వ్రాతమీద నమ్మకం లేదు. మనిషిమీద నమ్మకం ఉంది. మనసుమీద నమ్మకం ఉంది. మనస్సాక్షిగా దానం చేయండి" అన్నారు వినోబాజీ.
అంతే! ఆ మాట నాకు వినోబాజీ మీద ఉన్న దురభిప్రాయాలను పటాపంచలు చేసింది. వినోబాజీ మీద భక్తిభావం ఏర్పడింది!
అంతకుముందు నేనూ వినోబాజీధి నాటకం అనుకున్నాను. కమ్యూనిస్టులకు విరుగుడుగా సర్కారు పంపిన సన్యాసి అనుకున్నాను. కాని వినోబాజీని దర్శించింతరువాత వారు "కర్మయోగి" అని గ్రహించాను. భూమి పంచడంలో కమ్యూనిస్టులకు అధికార వాంఛ ఉంది. వినోబాజీ వాంఛారహితుడు! అతడు యోగి!





