Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
నెత్తుటి కేక
వారిద్దరూ కళ్ళతో కాక తుపాకుల గుడ్డి కళ్ళతో పొంచి చూచుకుంటున్నారొకర్నొకరు.
తుపాకి కంటికి గురిచూడ్డం తప్ప మరేమీ తెలియదు - దానికి ఎదుటివాని రంగుతోనేం పని? వాడు తెలుపైనా, నలుపైనా, పసుపైనా ఒకటే దానికి. అది తన ఎదుటివాడు వృద్ధుడైందీ, యువకుడైందీ, బాలకుడైందీ, ఆడ, మగ భేదం చూడదు. ఫలానావాడు పెళ్లై పిల్లలు గలవాడనీ చూడదు. నవ యువకుడైతే దానికేం? ఒకని పెండ్లి పోయిన్నెల్లో నిశ్చయమై, ఇవ్వాళ రణరంగంలో ఉండికూడా కాబోయే భార్యకు ఉత్తరం వ్రాస్తున్నాడనుకోండి. అలాంటివాడంటే మాత్రం దానికేం దయా?
ఆఁ- అయితే ఆ గుడ్డి కళ్ళు అనేక క్షణాలపాటు ఒకర్నొకరు గురిచూసుకున్నాయి. నలువైపులా మంచుతో కప్పబడిన కొండ చరియలపైన పరచివున్న నీలాకాశంలో ఎగిరే తెల్లని పక్షుల్ను చూస్తే, చల్లని నీలమైన మానస సరోవరపు నీటిలో వెండి చేపలు ఈదుతున్నట్లుంది. దశ దిశలా ప్రశాంతతా, మౌనం వ్యాపించి ఉండగా, అగ్గితో నిండిన రెండు నల్లని గుడ్డి కళ్ళు ఒకదాన్నొకటి పొంచి చూచుకుంటున్నాయి.
కొంటె కుర్రాళ్ళు విసిరిన రాళ్ళు కిటికీ అద్దాల్ను బద్దలు కొట్టినట్లు, ఒకేసారి ప్రేలిన రెండు తుపాకి గుండ్ల ధ్వని ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణాన్ని చీల్చి చెండాడింది. అది నలువైపులా వ్యాపించివున్న హిమచ్చన్న శిఖరాల్లో ప్రతిధ్వనించి, కొండలకు తాకి, పర్వతాలపై నుంచి గంతువేసి, అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు - పిచ్చాసుపత్రిలో పిచ్చివాడు రాతిగోడల్ను తన తలతో కూల్చి బయటపడాలని ప్రయత్నించినట్లు ప్రయత్నిస్తూంది.
వేడి రక్తపు రెండు రేఖలు వెండిలాంటి తెల్లని మంచుమీద వ్యాపించాయి. వ్యాపిస్తూ పోయినాయి. చల్లబడ్డాయి.ఆ తరువాత గడ్డకట్టాయి.
అతడు - ఎంతో దూరంనుంచి నడిచి వచ్చినవాడు - ప్రవహిస్తున్న ఆ రక్తరేఖల్ను, గడ్డకట్టుతున్న ఆ రక్తరేఖల్ను, తెల్లని మంచు కాగితం మీద ఏం వ్రాస్తున్నాయో తెలియని ఆ రక్తరేఖల్ను, చూస్తూ ఉండిపోయాడు. 'ఇది ఏం లిపి? ఇది ఏం భాష? రక్తపు సిరాతో వ్రాయబడిన సందేశం ఏమిటి?' ఆలోచించాడతడు. బహు దూరంనుంచి చావడానికీ, చంపడానికీ పరాయి దేశం వచ్చాడతను. మంచుమీద రక్తపు సిరాతో వ్రాయబడిన శబ్దాల్ను గురించి తెలుసుకోందే కనీసం ప్రశాంతంగా చావలేననిపించిందతనికి. అర్థం ఉందా ఆ శబ్దాలకు?
రక్తం!
సిరా!!
మెరిసిపోయే మంచు తెల్లదనం!
నిలువు లిపిగల స్కూలు బోర్డు.
చావనున్నవాని స్మృతిపథం ఉత్తుంగ హిమాలయ శిఖరాలు దాటి, అతని స్వదేశంవైపు పరిగెత్తింది. అతని స్మృతి యవ్వనపు రాతి కొండలపై నుంచి దిగి, కౌమార్యపు వంపు సొంపుల్నుంచి జారుతూ బాల్యపు పచ్చ పచ్చని మైదానాలవైపు మళ్లుతూంది. అది నిత్య వసంతంలా ఉండే స్థానం. చెర్రీ చెట్ల మొగ్గలు సర్వదా నక్షత్రాల్లా మెరుస్తుంటాయక్కడ.
ఇప్పుడతను, కూనిరాగంతీసే సెలయేటి ప్రక్కన ఎదురు బొంగుల్తో నిర్మించబడిన బళ్ళో మరో ఇరవై నలుగురు పిల్లల్తో కూర్చొని ఉన్నాడు. అతని ఎదుటనున్న బోర్డుమీద "బ్రష్"తో చేయబడిన బొమ్మల్లాంటి అక్షరాలున్నాయి. అప్పుడతని చెవులో తన వృద్ధ గురువు శాన్-కూ ధ్వని రింగుమంటూంది.
"చాంగ్-చూన్! ఆ బోర్డు మీద వ్రాసి ఉన్నది చదువు."
"తెలియదు, గురూజీ! నాకు చదువు రాదు."
"ఎనిమిదేళ్ళు వచ్చినా చదవడం రాదంటే సిగ్గుచేటు."
"పేద రైతు బిడ్డను గురూజీ."
"అయితే ఏం? రైతు బిడ్డలు కూడా చదువుకోవాలి. జాగ్రత్తగా చూడు - ఆ బొమ్మల్లాంటి అక్షరాల్ను, మొదటి బొమ్మలో ఏం కనిపిస్తూంది?
చాంగ్-చున్ బొమ్మల్ను జాగ్రత్తగా పరిశీలించాడు.
"రెండు చేతులు, రెండు కాళ్లు, ఒక తలా కనిపిస్తున్నాయి గురూజీ! మనిషి నుంచున్నట్లుంది."
"ఆఁ. సరిగ్గా చెప్పావు. దీని అర్థం - మనిషి. ఆఁ- ఇప్పుడు రెండో బొమ్మ చూడు. ఆ గుండ్రని వలయం ఉంది చూశావా? అది సరస్సు - హాంగ్ - చావు పట్టణం దగ్గర ఉన్నలాంటిది. సముద్రపు నీటిలో తరంగాల కల్లోలం ఎక్కువగా ఉంటుంది. కాని, సరస్సు అలా కాదు. అందులోని నీరు కల్లోలం లేక ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి, ఈ బొమ్మకు అర్థం - శాంతి."
అలాగే బొమ్మలా ఉన్న ఒక్కొక్క అక్షరమూ చదివించి అర్థం చెప్పి "చాంగ్-చూన్! ఇక మొత్తం చదివి చెప్పు" అన్నాడు గురూజీ.
"మానవుడు శాంతి కాముకుడు. చతుస్సముద్రవలయితమైన జగత్తులోని మానవులంతా అన్నదమ్ములు - సోదరులు" అని చదివాడు చాంగ్-చున్.
"దీనికంటే గొప్ప వాస్తవం మరొకటిలేదు" అని సాన్-కూ మరొక బల్ల చాంగ్-చూన్! ముందుంచి బ్రష్ తో కొత్త అక్షరాలు వ్రాసి, "జ్ఞాపకం ఉంచుకో చాంగ్ - చున్ జ్ఞానం సంపాదించడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఎప్పుడైనా నీకు అర్థంకాని వ్రాత కనిపించినప్పుడు అందులో దాగివున్న అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి" అన్నాడు.
అవి చాంగ్ - చున్ కు అంతిమ క్షణాలు. అప్పుడతనికి తెల్లని కాన్వాసులాంటి మంచుమీద ఎర్రని రక్తపు సిరాతో వ్రాయబడిన - అర్థం కాని - అక్షరాలూ కనిపించాయి. చాంగ్ - చున్ చస్తున్నాడు. అయినా, బలవంతంగా బ్రతకాలనుకుంటున్నాడు - ఆ లిపికి అర్థం తెలుసుకునేదాకా ఆ శబ్దాల అంతరార్థం గ్రహించేదాకా.
అతని చూపు కదిలింది - తన రక్తరేఖ వెంట సాగింది. మరొకని ఘనీభూత రక్తరేఖ తన రక్తరేఖలో కలిసిన కేంద్రందాకా సాగిపోయింది. ఆగిపోయింది. చాంగ్ - చున్ రెండు రక్తరేఖల్నూ చూచాడు. మరొకని రక్తం సైతం తన రక్తంలాంటిదే. అంత ఎర్రనిదీ - అంత వెచ్చనిదీ - ఇప్పుడు అంత చల్లనిదీ - అంత గడ్డకట్టిందిన్నీ. చూపు మళ్ళీ సాగింది. ఆ రేఖ చివర్న పడివున్న వ్యక్తి ముఖంమీద నిలిచింది.
ఇంతకుక్రితం అదే ముఖాన్ని నల్లని తుపాకి గుడ్డి కంటితో చూశాడతను - అప్పుడదొక శత్రువు ముఖం - భయానక ముఖం. ఇప్పుడు తుపాకి మీదనే కాదు, అతని కన్నులమీద సైతం తెల్లని స్వచ్చమైన మంచు పొర కప్పుకుంది. ఇప్పుడా గుడ్డితనం లేదు. ఆ ముఖాన్ని చాంగ్ - చున్ తన - స్వంత - కళ్ళతో హంగ్ చౌ దగ్గరి సరస్సు తీరాన ఉన్న దట్టమైన వెదురు పొదల చంచలచ్చాయలు చూసిన కళ్ళతో, పసుపు గులాబిలాంటి మేమీ సౌందర్యం చూసిన కళ్ళతో చూస్తున్నాడు. చివరి తడవ 'మేమీ'ని వదిలి వచ్చేటప్పుడు, ఆవిడ ఒడిలో ఉన్న చిన్నారి ముద్దుల పాప సుందర రూపం ఇముడ్చుకున్న కళ్ళవి. ఆ కళ్ళతోనే చూస్తున్నాడిప్పుడు శత్రువు ముఖాన్ని -ప్రాణహీనమైనప్పటికీ సజీవంగా ఉన్నట్లు కనిపిస్తున్న ముఖాన్ని - గుండెలో బుల్లెట్ దూసుకొనిపోయినప్పటికీ చిరునవ్వు నవ్వే ముఖాన్ని.
ఆ భారతీయ సైనికుని ప్రాణంలేని పెదవులపై చిందులాడే చిరునవ్వులో సైతం ఏదో సందేశం వినిపించిందతనికి. అది ఏం చెపుతోంది? తుపాకి గుండు గుండెలోంచి దూసుకొనిపోతున్నప్పుడు చిరునవ్వు నవ్వడం సాధ్యమా? వారిద్దరూ ఒకరి గుండుతో ఒకరు గాయపడ్డారు - అవే గుండ్లు వారి గుండెల్ను చీల్చేశాయి. ఇద్దరి రక్తమూ మంచుమీద ప్రవహించింది-గడ్డకట్టుకపోయింది. అలాంటప్పుడు ఒకడు చచ్చి సైతం చిరునవ్వెందుకు నవ్వుతున్నాడు? రెండోవాడికి చచ్చేటప్పుడు సైతం - ఏమిటి? ఎవరు? ఎందుకు? ఎక్కడ? భూతాల్లా వెంటపడి ఎందుకు కలవరపెట్టాలి? అవి బెదిరిస్తున్నాయి, భయపెడ్తున్నాయి. చావనివ్వవు, బ్రతకనివ్వవు.
ఎందుకు....ఎందుకు....ఎందుకు చస్తున్నాన్నేను? ఎందుకు చంపాన్నేనీ భారతీయుణ్ణి? ఎందుకు దండెత్తుతున్నాయి చైనా సైన్యాలు?ఎందుకు? ఎందుకు?? ఎందుకు???
* * * *
ఏమిటి? ఎవరు? ఎందుకు? ఎక్కడ?
"ప్రపంచానికి సంబంధించిన విజ్ఞానమంతా - సమస్త భూగోళము, చరిత్ర, అర్థశాస్త్రము - ఆ నాల్గూ శబ్దాల్లోనే ఇమిడి ఉంది. శాస్త్ర విజ్ఞానానికి ఈ నాలుగూ నాలుగు స్తంభాల్లాంటివి. ఏమిటి? ఎవరు? ఎందుకు? ఎక్కడ? ఈ ప్రశ్నలు వేసుకుంటూ పోతే విజ్ఞానపు కవాటాలు తెరుచుకుంటూ పోతాయి."





