Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
తెల్లవారి స్నానంచేసి శుభ్రం అయిన బట్టలు కట్టుకున్నాడు. తల్లితో చెప్పి జొన్న గుగ్గిళ్ళు వండించుకున్నాడు. బంతిపూలు తీసుకున్నాడు. జాము పొద్దెక్కేవరకు మర్రి కిందకు చేరాడు. మర్రి ఆ జంట కోసం ఎదురుచూస్తూంది. మర్రి క్రింద కూర్చొని ఆశాసౌధాలు నిర్మించుకుంటుండగానే లచ్చి వచ్చింది. అతని కళ్ళు మూసింది. "చెప్పుకో చూతాం" అంది. పెళ్ళికూతురు అన్నాడు. "ఛీ పో" అని దూరంగా పోయింది లచ్చి. ఎంకడు ఆమె చేయి పట్టుకొని "లచ్చీ! దోసిలి పట్టు" అని జొన్న గుగ్గిళ్ళు ఆవిడ చేతుల్లో పాశాడు. "లచ్చీ! ఇవి ముత్యాలు. ఇంక లగ్గం అయిపోయిందనుకో. ఈ పపంచకంలో ఎవడూ దాన్ని ఆపలేడు. పొలం బేరం చేసిన. రేపు సంచకరి ఇస్తన్న" అన్నాడు. లచ్చి ఆనందం పట్టలేకపోయింది. గుగ్గిళ్ళు మర్రిచెట్టు మొదట పోసి 'మర్రీ తల్లీ! నీ మొక్కు చెల్లిస్తా'నని దణ్ణం పెట్టింది. "బావా! నువ్వెంత మంచోడివి" అంది. ఆమె కళ్ళు మెరిశాయి. ఎంకడు లచ్చిని కౌగిల్లోకి తీసుకున్నాడు. ఈ తడవ ఆమె "ఛీ - పో, తప్పు" అనలేదు.
* * * *
అవి భారతదేశం మీద చినా దండెత్తిన రోజులు. దేశం మొత్తంలోనూ ఉద్రేకం పొంగులు పారుతున్న రోజులు. ప్రతి ఒక్కరూ యుద్ధాన్ని గురించి తెల్సుకోవాలని ఆదుర్దాపడుతున్న రోజులు.
రావిపాట్లో యుద్ధాన్ని గురించిన సభ ఏర్పాటైందని తెలిసింది ఎంకనికి. ఇంటికి వెళ్ళాడు. తాను ప్రాణంతో చూచుకుంటున్న డబ్బు మొలకు కట్టుకున్నాడు. ఇంటికి తడకేసి తల్లిని తీసుకొని రావిపాడు చేరాడు.
"సోదర సోదరీమణులారా!."
రజాకార్లనే రాక్షసుల్ను మీరు చూచారు. మీ ఊరు మొత్తం పెట్రోలు పోసి తగలపెట్టారు వాళ్ళు. ఆ మొండి గోడలు అందుకు సాక్ష్యం పలుకుతున్నాయి. నిండు చూలాలిని నడివీధిలో మానభంగం చేసి చంపారు. బ్రతికి ఉండగానే 20 మందిని కాష్టంలో పెట్టి కాల్చారు. సారంగపాణిగారి తండ్రి కాష్టంలోంచి లేచి పరిగెడుతూంటే తుపాకి గుండు పిక్కకు కొట్టి కాష్టంలో వేశారు. పుస్తెలు, తవ్వల్తో కొల్చిన విషయం మనమింకా మరువలేదు.అలాంటి రజాకార్లను పారద్రోలి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం మనం. అట్టి స్వాతంత్ర్యాన్ని నాశనం చేయడానికిగాను చైనావారు అన్యాయంగా మనమీద దండెత్తారు. అనేక ఘోరకృత్యాలు చేస్తున్నారు. వారు రజాకార్లను మించినవారు. వారిని మన దేశం నుండి తరమకపోతే మన దేశంలో తిరిగి రజాకార్ల రాజ్యం ఏర్పడుతుంది. మన స్వాతంత్ర్యం నశిస్తుంది. రాక్షసమూకలు ఎగబడ్తాయి.
మన సైనికులు మంచుకొండలమీద ఎముకలు కొరికే చలిలో పోరాడుతున్నారు. వారు ప్రాణాలను బలి ఇస్తుంటే మనం ఆనందంగా కాలం గడపటం ధర్మమా? వారికి ఆయుధాలు కావాలి; ఉన్ని బట్టలు కావాలి; డాక్టర్లు కావాలి; నర్సులు కావాలి; అందుకు డబ్బు కావాలి. బంగారం కావాలి, గాయాలు తగిలినవారికిగాను రక్తం కావాలి. మీరు త్యాగం చేయాల్సిన తరుణం వచ్చింది. మిమ్ము కన్న భూమి చేతులొగ్గి మిమ్మల్ని దానం అడుగుతూంది."
మంత్రిగారి ఉపన్యాసం ముగియకముందే అనేకులు డబ్బు ఇచ్చారు. స్త్రీలు బంగారం ఇచ్చారు. ఒకావిడ మంగళసూత్రం సైతం ఒలిచి ఇచ్చింది. ఎంకడు బైల్దేరాడు. లచ్చి గుండె దడదడ కొట్టుకుంది. మంత్రిగారికి డబ్బు అప్పగించాడు. "వెంకయ్యగారు 400 ఇచ్చారు" అని చెప్పారు మంత్రిగారు. లచ్చి పొంగిపోయింది.చప్పట్లు కొట్టింది.సభవారంతా చప్పట్లు కొట్టారు.
విరాళాలు ఇవ్వడం అయిపోయింతర్వాత మంత్రిగారు మరొకసారి లేచి "దేశాన్ని రక్షించడానికి సైనికులు కావాలి. మన స్వాతంత్ర్యం రక్షించబడాలంటే మనుషులు కావాలి. పురుషులు కావాలి.సైన్యంలో చేరే యువకులు ముందుకు రావాలి" అన్నారు.
సభలో గుసగుసలు మొదలైనాయి. ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. ఎంకని కళ్ళముందు మంచుకొండలూ, మన సైనికులూ కనిపించారు. ఊరు తగులపెడుతున్న రజాకార్లు కనిపించారు. తల నరుకబడ్డ తన తండ్రి కనిపించాడు. లేచాడు. వేదికవైపు నడిచాడు. సభ యావత్తూ అతనివైపు చూడసాగింది. లచ్చి లేచి నుంచుంది. ఆనందంతోనూ ఆదుర్దాతోనూ చూడసాగింది. మల్లమ్మ లేచి నుంచుంది. భయం భయంగా చూడసాగింది. ఎంకడు వేదిక ఎక్కి "నేను సైన్యంలో చేరుతా"నన్నాడు. లచ్చి కళ్ళకు నీరు వచ్చింది. ఆమె గొంతు జీరపోయింది.
మంత్రిగారు ఎంకణ్ణి కౌగిలించుకున్నారు. లచ్చి బాష్పపూర్ణ నేత్రాల్తో వేదిక ప్రక్కనే వచ్చి నుంచుంది. ఎంకడు వేదిక దిగి వచ్చాడు, లచ్చి దగ్గరికి. లచ్చి ఎంకని భుజంమీద పడి బావురుమంది. సభయావత్తూ కంటతడి పెట్టింది. మంత్రిగారు సైతం జేబురుమాలుతో కళ్ళు తుడుచుకున్నారు. ఎంకడు లచ్చిని ఓదార్చడానికి రెండు చేతుల్తోను లచ్చి తల తీసి తన ముఖం ముందుంచుకొని "లచ్చీ! నీవంటి కోట్లకొలది ఆడవారి మానం కాపాడటానికి నేను యుద్ధానికి పోతున్నా. గెలిచి వస్తా" నన్నాడు.
"వెంకయ్యగారికి జై!" అనే నినాదాల్తో దిక్కులు పిక్కటిల్లాయి. లచ్చి కళ్ళు తుడుచుకొని గర్వంగా చూచింది ఎంకనివైపు.
ఎంకడు తల్లి పాదాలంటి శలవు కోరాడు. తల్లి అతణ్ణి గట్టిగా కావలించుకొని భోరుమంది. ఆమెను విడిపించుకొని కళ్ళు తుడుచుకొని "తల్లీ! నీవు నా ఒక్కనికి తల్లివి. నీ అసువంటి కోట్లమందికి తల్లి నన్ను పిలుస్తాంది" అని ఆమెను ఓదార్చి వెనక్కు వేదిక మీదికి వెళ్ళాడు. ఎక్కణ్ణుంచి తెచ్చారో అనేకమంది పూల దండలు అతని మెళ్ళో వేశారు.
"వీర వెంకయ్యగారికి జై!" అనే నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి.
ఎంకయ్య మిలిటరీ లారీలో ఎక్కాడు. లారీ కదిలింది. లచ్చి కళ్ళూ, మల్లమ్మ కళ్ళూ బాష్పపూర్ణములైనాయి.
"బావా! నీకోసం ఎదురుచూస్తుంటా" నన్నది లచ్చి జీరవోయిన గొంతుతో.
"జయించి వస్తా" నన్నాడు ఎంకడు.
మరోసారి "వీర వెంకయ్యకూ జై" అనే నినాదంతో దిక్కులు పిక్కటిల్లాయి.
లారీ కంటికి కనిపించకుండాపోయిందాకా చూచింది లచ్చి.
లచ్చి కనిపించినంతసేపూ చూచాడు ఎంకడు.
లారీ సాగిపోతూంటే బోసి మర్రి కనిపించింది. దాని మొదట బంతిపూలూ, అక్కడక్కడా జొన్న గుగ్గిళ్లూ కనిపించాయి ఎంకడికి.
తన మెడలో ఉన్న దండలన్నీ తీసి మర్రివైపు విసిరాడు. అవి మర్రి కొమ్మల్లో తగులుకొని నిల్చిపోయాయి.
"గిరి మేల్కొన్నది, పురి మేల్కొన్నది
గిరి గుహలో కేసరి మేల్కొన్నది
గిరి,పుర,వనముల ధర మేల్కొన్నది
నర, నారీ సంతతి మేల్కొన్నది."
(దాశరథి)
* * * *





