Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
2. పెరుగుతున్న కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని అరికట్టడం. హైదరాబాదు రాష్ట్రంలో ఒక్క కమ్యూనిస్టునూ దక్కనీయను అని సర్దార్ పటేల్ ఫతేమైదాన్ బహిరంగ సభలో ప్రకటించారు.
పోలీసు చర్య తరువాత హైదరాబాదు రాజ్యం కాదు- రాష్ట్రంలో సైనిక పాలన ఏర్పడింది. ఇదీ తెలంగాణం ప్రత్యేకతయే. మరెక్కడా సైనిక పాలన ఏర్పడలేదు. మేజర్ జనరల్ J.N. చౌదరి 18-9-48 న మిలిటరీ గవర్నరుగా ప్రమాణం చేశారు. వారి సలహా సంఘంలో P.S. బాఖ్లే ICS సివిల్ అడ్మినిస్టేటర్ గాను, నవాబ్ జయిన్ యార్ జంగ్, రాజా ధోండేరాజ్, శ్రీ పి. వి. ఎస్. రావు, శ్రీ పి. హెచ్. కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు.
పోలీసు చర్య ముగిసిన మరునాడే మొదటి లక్ష్యం నెరవేరింది. నిజాం దాసోహం అన్నాడు. రజ్వీని - ఇతర మంత్రులను అరెస్టు చేశారు. రజాకార్లు ఆయుధ సమర్పణ చేశారు. కొందరు తమ ఆయుధాలను కమ్యూనిస్టులకు అప్పగించారనీ, కొన్ని ఆయుధాలను కమ్యూనిస్టులు కరీదు చేశారనీ అనుకున్నారు.
పోలీసు చర్య నాటినుంచి కమ్యూనిస్టులకు - రజాకార్లకు ప్రధాన శత్రువు భారత ప్రభుత్వమే. అందువల్ల రజాకార్లు కమ్యూనిస్టులకు స్వచ్చందంగా ఆయుధాలు అందించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు! రజాకార్లు - తాము సాధించలేని పని కమ్యూనిస్టులు సాధిస్తారని ఆశించి ఉండవచ్చు.
మిలిటరీ పాలన కొన్ని ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది:
i) నిజాం సర్కారులో శుక్రవారం - ముస్లిముల నమాజు దినం - వారాంతపు శలవుగా ఉండేది. దానిని ఆదివారం - క్రైస్తవుల ప్రార్థనాదినాన్ని - వారాంతపు శలవుగా ప్రకటించారు. ఇందువల్ల భారతదేశపు వారాంతపు శలవు హైదరాబాదు రాష్ట్రంలో కూడా అమలు జరిగింది. ఆదివారం శలవు బానిసత్వ చిహ్నమే. ఇంతకాలం అయినా ఆ శలవు మార్చుకోలేకపోయాం!
ii) నిజాం కాలంలో దేశీయ భాషలను రూపుమాపడానికి ప్రయత్నం జరిగింది. విద్యాబోధన సాంతం ఉర్దూలో ఉండేది. మిలిటరీ ప్రభుత్వం ఉర్దూ మీడియం రద్దు చేశారు. తెలంగాణంలో తెలుగు మీడియం ప్రవేశపెట్టారు. అప్పటికీ ఇది హైస్కూలు వరకు - ఆ సంవత్సరంలో 8 వ తరగతి నుంచి అమలు జరిగింది. అమాంతంగా ప్రవేశపెట్టడం వల్ల ఆ బ్యాచ్ వారు ఇబ్బందులు పడ్డారు. తెలుగు చెప్పే ఉపాధ్యాయులు లేరు.
ఈలోగా హిందీ ఛాందసులకు ఉస్మానియా యూనివర్సిటీని హిందీ యూనివర్సిటీ చేయాలనే ఆలోచన వచ్చింది. హిందీ బ్యూరోక్రాట్స్ దాన్ని బలపరచారు. ఉస్మానియాను హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి వ్యతిరేకంగా దేవులపల్లి రామానుజరావుగారు పెద్ద ఉద్యమం నిర్వహించారు. అందువల్ల అది నిలిచిపోయింది.
ఛాందసుల పిడివాదం వారికే ముప్పు తెస్తుంది. ఛాందాసులు మూర్ఖులు, వారు తమ ముప్పును సహితం గుర్తించరు.
iii) నిజాం సర్వతంత్ర స్వాతంత్ర్యానికి చిహ్నం కరోడ్గిరి. కరోడ్గిరి అంటే కస్టమ్స్. తనది స్వతంత్ర రాజ్యం కాబట్టి రాజ్యంలోకి వచ్చే సరుకులమీద సుంకం విధించేవాడు. మిలిటరీ ప్రభుత్వం కరోడ్గిరిని రద్దుచేసింది.
iv) నిజాంకు ప్రత్యేక తపాల శాఖ ఉండేది. దాన్ని భారత తపాలా శాఖలో లీనం చేశారు. ఇది ఒకేసారి జరుగలేదు. క్రమక్రమంగా జరిగింది.
v) నిజాం సర్వతంత్రత్వానికి ప్రధాన నిదర్శనం అతని కరెన్సీ! హుసేన్ సాగర్ పక్కన ఉన్న 'మింట్' లో నాణేలు చేసేవారు. నిజాం కరెన్సీ ఏడురూపాయలు భారత కరెన్సీ ఆరు రూపాయిలతో సమానం. నిజాం 116-10-0 భారత నూరు రూపాయిలకు సమానం.
మిలిటరీ ప్రభుత్వం నిజాం కరెన్సీని ఉపసంహరించడం ప్రారంభించింది. ఇది వర్తకులకు లాభం - ప్రజలకు నష్టంగా పరిణమించింది. వర్తకులు ఆరు రూపాయిల సరుకు ఏడు రూపాయిలకు అమ్మారు. వారికి ఆరు రూపాయిలకు ఒక రూపాయి లాభం వచ్చింది. ప్రజలు ఆరు రూపాయిలకు ఏడు చెల్లించారు. ఆరింట ఒకటి నష్టపోయారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టే సంస్కరణలు అన్నింటిలోనూ ఎక్కువగా ప్రజలే నష్టపోతుంటారు!
ఎన్జీవోలు వేతనాలు ఇప్పుడున్నంత భారత కరెన్సీలో చెల్లించాలని డిమాండు చేశారు. అప్పటి ప్రభుత్వం మా వద్ద రూపాయీల చెట్లు లేవు కాయలు కాయించటానికి' అని నిరాకరించింది. ఎన్జీవోల సంఘాలు కూడా అప్పటికి బలపడలేదు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కూడా ఆరింట ఒకవంతు తగ్గించి నిర్ణయించారు. ఇది సైనిక శాసనంలో కాదు - ప్రజా శాసనంలోనే జరిగింది.
vi) సైనిక శాసనం చేసిన అతిముఖ్య - ప్రగతి చర్య జాగీర్లను రద్దు చేయడం. జాగీర్లను గురించి ఇంతకు ముందు వివరించాను. 1167 జాగీర్లను నష్టపరిహారం చెల్లించి రద్దు చేయడానికి నిర్ణయించారు. ఇది విప్లవాత్మక చర్య అగును. కాని నేను నష్టపరిహారం ఇవ్వడాన్ని వ్యతిరేకించాను. శతాబ్దాలుగా బాధలు పడింది జాగీర్లలోని ప్రజలు. జాగీర్దార్లు ప్రజల రక్తం పీల్చారు. విలాస జీవితం గడిపారు.
ఒక నవాబు, కుక్కల పెళ్లికి లక్షలు కర్చుపెట్టాడు. మహామహులందరిని పిలిచాడు. అట్టహాసంగా పెళ్లి చేశాడు.
మరొక నవాబు సంచులలో ఉన్న రూపాయిలు ముక్కిపోతాయని - కొలిచి - ఎండపోయించాడు! పనివాళ్ళకు జాగీర్దారు మూర్ఖుడు అని తెలుసు. వారు చెప్పులకు మైనం పెట్టుకున్నారు. చెప్పులకు అంటిన రూపాయిలు కాజేశారు. తిరిగి కొలిచారు. తక్కువ వచ్చాయి. జాగీర్దారు కారణం అడిగాడు. ఎండినవి కదా సర్కార్, తగ్గవా మరి అని విన్నవించుకున్నారు. నవాబుగారు నిజమే ననుకున్నారు, మిన్నకున్నారు!
ఇంకొక నవాబు కోటమీద శత్రువులు దాడి చేశారు. అంతా పారిపోయారు. నవాబు పట్టుపడ్డాడు. శత్రువు నవాబును ఎందుకు పారిపోలేదని అడిగాడు. దాసి చెప్పులు అందించలేదట! అందుకోసం మంచం దిగలేదు నవాబ్ సాహెబ్!! దాసీది ప్రాణ మానాలు దక్కించుకొనడానికి పారిపోయింది!!!
అంటే అందరూ అలాంటివారని కాదు. సాలార్ జంగ్ వంటివారు - ప్రజలను పీడించినా - మ్యూజియం ఏర్పరచి గొప్ప సేవ చేశారు.
అలాగే వనపర్తి - గద్వాల - జటప్రోలు - పాలవంచ సంస్థానాధీశులు తెలుగు భాషకు కొంత సేవ చేశారు. తిరుపతి వేంకట కవులు గద్వాల సంస్థానం దర్శించారు. వారి చాటువు ఒకదానికి అర్థం ఇలా ఉన్నట్లు గుర్తు.





