Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    ఎంకనిది సిరిపురం. తాతల్నాటినుంచీ దొర కొలువు చేయడమే వారి వృత్తి. ఎంకని తండ్రి రాముడు ఆజానుబాహుడు. స్వామిభక్తి కలవాడు. రజాకార్ల కాలంలో దొరలు వెళ్ళిపోతూ బంగళా అతనికి అప్పగించిపోయారు. ఊరు దోచుకొనడానికి రజాకార్లు వచ్చినప్పుడు ఊరంతా అడవులు పట్టింది. కాని, రాముడు బంగళా వదల్లేదు. రజాకార్లతో పోరాడాడు. సాము కర్రతో నలుగుర్ని చంపి పట్టుబడ్డాడు. రజాకార్లు అతని తల నరికి చంపారు. నాటినుంచీ ఎంకడు దొర పశువుల్ను మేపుతున్నాడు.
    సిరిపురం పక్కనుంది రావిపాడు. రావిపాటి అడవీ, సిరిపురం అడవీ కలసి ఉన్నాయి. ఆ రెండు ఊళ్ళ పశువులూ కలిసి మేయాల్సిందే. రావిపాటి కుర్రాళ్లతోపాటు గొర్రెల్ను తీసుకొని వస్తుంటుంది లచ్చి. ఒక్కర్తే ఎందుకు వస్తుందీ అంటే- లచ్చి తండ్రి వీరయ్య పెళ్ళాడిన ముగ్గురు భార్యలూ చనిపోయారు. చివరి భార్య కూతురు లక్ష్మి. కూతురుండగా పెళ్ళాడదలచలేదు వీరయ్య. వీరయ్యకు వ్యవసాయం కూడా ఉంది. జీవాల్ను కాయడం, వ్యవసాయం చేయడం కష్టంగా ఉండేది. అందుకే లక్ష్మి చేతికందగానే గొర్రెల్ని కాయడానికి పెట్టాడు.
    ఎంతోమంది పసుల కుర్రాళ్ళున్నప్పటికి లక్ష్మికి ఎంకడంటేనే ఇష్టం. ఎంకడికి లక్ష్మి అంటేనే ప్రేమ. ఏ ఆటలాడినా లక్ష్మి, ఎంకడు ఒకే పక్షంలో ఉండేవారు. వారిద్దరూ అదే మర్రికింద సద్దులు తినేవారు. కుర్రాళ్ళు "లచ్చీ! ఎవర్ని చేసుకుంటవు?" అంటే "బావను" అనేది. చిన్ననాటి స్నేహం వయసుతో బలిసి వలపుగా మారింది.

                                 *    *    *    *

    ఆనాడు ఎంకడు చాలా హుషారుగా ఉన్నాడు. లచ్చి వస్తుందని ఊసబియ్యం తయారుచేశాడు. కొప్పునిండా తురమాలని బంతిపూలు తెచ్చాడు. దండకూడా గుచ్చాడు. సిగనిండా బంతిపూలు తురుముకున్న లచ్చిని చూచిన్నాడు పండుగ ఎంకనికి. దొరోరి ఇంట్లో పెట్టిన మామిడికాయ కారం తెచ్చాడు సద్దిలోకి. మంచెమీద కూర్చుని కోడికూత కోసం, లచ్చి రాకకోసం ఎదురుచూడసాగాడు.

    "కంటిపాపల నీకు గుడిసె కట్టేనే
    నా లచ్చి
    కంటి గుడిసెల నీవు నిలిచిపోరాదే"

    గొణుగుతూ లేచి చూచాడు. పచ్చని జొన్న చేనుకు ఆవల బోసి మర్రి కనిపించింది. ముఖానికి చేయి పట్టుకొని పొద్దు చూచాడు. సూర్యుడు నడక చాలించాడనిపించింది అతనికి. వడిశాల అందుకున్నాడు. మర్రి దిశ నుండి మరొక దిశకు తిరిగాడు. రాయి పెట్టాడు. గిరగిరా తిప్పికొట్టాడు. అతడు మర్రి చెట్టువైపు తిరిగి వడిశాల ఎన్నడూ కొట్టలేదు. అది లచ్చి దిశ. ఆ దిశలో లచ్చిలాంటి పిట్టలు స్వేచ్చగా తినాల్సిందే. రివ్వున లేచి పక్షుల గుంపు ఆకాశంలోకి ఎగిరిపోయింది.
    ఎంకడికి ప్రాణాలు లేచివచ్చాయి. "కొక్కొరోకో!" కోడి కూసింది. మళ్ళీ మునికాళ్ళమీద లేచి చూచాడు. పచ్చని జొన్న చేనుకు ఆవల బోసి మర్రి కనిపించింది. నిరాశ ఆవహించింది.
    లచ్చికి ఏమైంది? రాదేం? ఏదైనా అడవి జంతువు........? ఛీ! ఏమిటా ఆలోచన? తోడేలు గొర్రెల్ను వేసుకొనిపోయిందా? ఏమో! ఎన్నడూ ఆలస్యంకాని లచ్చి ఇవ్వాళ........? ఏమైనట్లు?
    గొర్రెల అరుపు వినిపించింది. మునికాళ్ళ మీద నుంచొని చూచాడు. లచ్చి వస్తూంది. కొత్తగా తయారై వస్తూంది. తలంటి పోసుకుంది. కుంకుమ ఎంత పెద్దగా పెట్టుకుంది! నొసట సూర్యుడు మొలిచాడా ఏం అనిపిస్తూంది. లచ్చి వస్తూంది. అదీ చిలకపచ్చ చీర కట్టుకొని. అదో ఆమె రవిక పాలపిట్ట రంగుది. "ఎంత వయ్యారం! మరో ఆడది నడువగలదా అట్లా?"
    చొక్కాను జోలెగా చేసి అందులో ఊసబియ్యమూ, బంతిపూలూ పోసుకొని ఒక చేత్తో పట్టుకొని మంచె దిగాడు. లచ్చి ఎంకణ్ణి చూస్తూనే బావురుమంది. ఎంకని భుజం మీద ఒరిగిపోయింది. ఎంకడు తెచ్చిన ఊసబియ్యమూ, బంతిపూలూ, నేలమీద - లచ్చికాళ్లమీద పడిపోయాయి.
    లచ్చి తల నిమురుతూ అడిగాడు "లచ్చీ! నువ్వట్ల ఏడుస్తే నా గుండె ఏడుస్తది. ఒక్కసారి ఇటు చూసి చెప్పు-ఏమొచ్చిందో నీకు?".
    "లచ్చీ! ఏడవకు. మా అమ్మను పంపిస్తా మీ అయ్యకాడికి. నిన్ను లగ్గమాట్టానికి గుట్టలైన పగలకొడ్త. లచ్చీ! నువ్వేడవకు, నేను చచ్చిపోత" అన్నాడు.
    "బావా! నువ్వెంత మంచోడివి!" అని పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంది. "బావా! నన్ను లగ్గమాడకుంటే బాయిల్నో బొందల్నో పడత" నంది. గొంతు జీరపోయింది.
    "లచ్చీ! ఇగో, నీ చెయ్యిటుతే! చేతిలో చెయ్యేసి చెపుతున్న- నిన్ను లగ్గం చేసుకొని తీర్త."
    "బావా!" అని ఎంకడి భుజం మీద వాలిపోయింది లచ్చి.
    ఆనాడు వారు సద్దులు తినలేదు. మర్రి వెలవెలపోయి చూసింది. చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. పొద్దుకూకింది కూడా వారికి తెలియలేదు. వదల్లేక వదల్లేక ఎంకణ్ణి వదలివెళ్ళింది లచ్చి. కొంతదూరం వెళ్ళి తిరిగివచ్చింది. మర్రి చుట్టూ తిరిగి దండం పెట్టింది. "మర్రి తల్లీ! మా లగ్గం చెయ్యి. నీకు కోడిని బలిస్తా" అంది. మళ్ళీ వెనక్కు చూస్తూ వెళ్ళిపోయింది. లచ్చి కనిపించినంతసేపూ చూచాడు ఎంకడు. కళ్ళు చేత్తో తుడుచుకున్నాడు. కాలుకు ఏదో తగిలినట్లయి క్రిందకు చూచాడు. ముత్యాల్లాంటి ఊసబియ్యం చిందర వందరగా పడివున్నాయి. వాటిమీద బంతిపూలు కుప్పగా పడివున్నాయి. నిట్టూర్చాడు. సద్ది మూట అక్కడే వదిలి ఇంటిదోవ పట్టాడు. అతని మనసులా సూర్యుడు కూడా క్రుంగిపోయాడు.
    తెల్లారి మల్లమ్మ రావిపాటికి వెళ్ళింది. "వీరయ్యన్నా! లచ్చిని నా కోడల్ను చేయవూ?" అని అడిగింది.
    "మల్లక్కా! ఒక్కమాట చెపుతున్నా ఇను. కూతురు సుకపడాలని కోరని తండ్రి ఉంటాడా? ఎంకనికి ఏమున్నది చెప్పు! కూలి చేసుకొని పొట్ట పోసుకోవలసిందేనా? పట్టుమంటే చారెడు పొలం లేదాయె. ఏమని ఇద్దును ఎంకనికి? పేరుకు ఒక ఎకరమన్నా పొలం ఉంటే.... ....".
    లక్ష్మి లోపల ఉండి వింటూంది. ఆమె గుండెదడ పెరుగుతూంది. "అయ్యా! బావ మంచోడు. నా ప్రాణం కపాడిండు. పొలం ఏం చేస్తదయ్యా! గుణం కావాలెగాని" అని చెపుదామనుకుంది. కాని, ధైర్యం చాలింది కాదు.
    మల్లత్త ఏం చెపుతుందోనని చెవులు నిక్కపొడుచుకొని వినసాగింది. "వీరయ్యన్నా! ఈ పొలాలు శాశ్వతమా. గుణం కావాలెగాని? మా ఎంకని సంగతి నువ్వెరగనివానివి కాదు. పొలమే కావాలని పట్టుబడితే సంపాదించుకుంటడు ఏడాదిలో. అప్పటిదాకా లచ్చికి పెళ్ళిచేయవుకదా?" అన్నది.
    "ఉన్నట్లుండి పొలం యాణ్ణుంచి వస్తదక్కా? అయినా, నువ్వు అంటున్నవు కాబట్టి చెపుతున్నా- వచ్చే వరి పంటలకు లచ్చి లగ్గం చేస్త- సరేనా?."
    లచ్చి మనసు కుదుటపడింది.

                                *    *    *    *

    ఎంకడు పొలం కొనేందుకు ఎముకలు నుసిచేసి పనిచెయసాగాడు. దొర నడుగుతే రెండు వందల రూపాయలు అప్పు ఇచ్చాడు. మరో రెండు వందలు అయితేకాని కనీసం ఎకరం పొలం రాదు. ఎంకడు చుట్ట తాగడం మానేశాడు. రాత్రి అన్నం మానేశాడు. దొరకు చేసేపనికాక త్రాళ్ళు పేనీ, ఆకులు అమ్మీ సంపాదిస్తున్నాడు.

                                *    *    *    *

    ఆ రోజు అతని పంట పండింది. నాలుగు వందల రూపాయలు కూడాయి. అమ్మకానికి వచ్చిన పొలం కూడ మాట్లాడాడు సాహుకారు. సంచకరి కూడా ఇవ్వవచ్చు.
    ఎన్నాళ్ల తపస్సో ఫలించింది అనుకున్నాడు. లచ్చి తనది అవుతుందనుకున్నాడు. లచ్చి తనది అయిన్నీటి ఆనందాన్ని తలచుకున్నాడు. తన గుడిసె ముందటి మురికి అంతా శుభ్రం చేయాలనుకున్నాడు. కొన్ని పూల మొక్కలు నాటాలనుకున్నాడు. ఇలాంటి ఎన్నో ప్రణాళికలు అల్లుకున్నాడు.ఎన్నో తీయని కలలు కన్నాడు. ఆ రాత్రి నిద్రపోలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.