Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                                       దేశం పిలిచింది

    "జొన్న చేను పెరిగింది
    మిన్నుదాక ఎదిగింది
    కన్నె వయసు పొంగింది
    కన్ను చెదిరిపోయింది."    
    
    పాడుతూ వడిసెలలో రాయి పెట్టాడు ఎంకడు. వడిసెల గిరగిరా తిప్పి వదిలాడు. జొన్న చేలోంచి పిట్టల గుంపు మబ్బులా లేచి రఁయ్యిమని ఆకాశంలోకి దూసుకొనిపోయింది. వాటివైపు అలా చూస్తూ నుంచుండిపోయాడు. ఎంత అందంగా ఉన్నాయి! ఒకే రకం పిట్టలు!! ఎంత హాయిగా ఎగిరిపోతున్నాయి!!! తనూ అలాగే ఎగిరిపోగలుగుతే? ఒంటిగా? ఛా! ఏం బావుంటుంది? లచ్చి తోడుంటే. అక్కడే ఉండిపోగూడదూ ఆకాశంలో.... ....! లచ్చి ఇంకా రాలేదేమీ? అని పొద్దు చూచాడు. మునికాళ్ళమీద లేచి చూచాడు. పచ్చని జొన్న చేనుకు ఆవల బోసి మర్రి కనిపించింది.
    ఇంకా రాలేదు.

    "వలపు పొంగి పొర్లింది
    నిలువలేక పోయింది
    వలపు కన్ను గీటింది
    చెలియ నన్ను పిల్చింది."

    మరోవైపు తిరిగాడు. రాయి వడిసెల్లో పెట్టాడు. గిరగిరా తిప్పాడు, విసిరాడు. ఈ తడవ చిలకల గుంపు లేచింది. పచ్చని పంటచేలు ఆకాశానికి ఎగిరిపోతున్నట్లుంది. అలా చూస్తూ ఉండిపోయాడు ఎంకడు. పచ్చని గుంపు ఆకాశంలో చెదిరిపోయింది. చిలకల గుంపు జొన్న చేనుకంటే అందంగా ఉంది. లచ్చి చిలకపచ్చని చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది! ఆ చీరకు చిలక ముక్కులాంటి ఎర్రని అంచు ఉండాలి. తాను అలాంటి చీర తేగలడా?
    "కొక్కొరోకో, కొక్కొరోకో!" అంది జాము కోడి.
    కోడి కూత అతని ఆలోచనకు అంతరాయం కలిగించింది. మర్రి వైపు తిరిగి చూచాడు. లచ్చి వస్తూంది సద్ది నెత్తిన పెట్టుకొని. "ఎంత వయ్యారం! మరో ఆడది నడవగలదా అట్లా? ఎంకడు వడిసెల మంచె మీద పెట్టాడు. సద్దిమూట చేతపట్టుకొని మంచె దిగాడు. మంచివి, బంగారు రంగువి, నాలుగైదు దోసకాయలు తెంపాడు. అవి తీసుకొని చేనుదాటి మర్రికిందికి వచ్చాడు. అప్పటికి జీవాల్తో లచ్చి కూడా అక్కడికి చేరింది. లచ్చిని ఆపాదమస్తకం ఆకలిగొన్న కళ్ళతో చూచాడు ఎంకడు. ఎన్నేళ్ళ నుంచో చూడనట్లు చూచాడు. ఎంత కాలానికోగాని మరి చూడనన్నట్లు చూచాడు. కళ్ళతో తాగేయాలన్నట్లు చూచాడు. లచ్చి మెరపులా ఒకసారి ఎంకణ్ణి చూచింది. అతని చూపు ఎదురైంది. బెదిరింది. తల వంచుకుంది. ఎంకని పాదాలు చూడసాగింది. కాలి వ్రేళ్ళతో ఒక వ్రేలు తెగివుంది. అది ఆమె రోజూ చూస్తుంది. అయినా, రోజూ కొత్తగానే ఉంటుంది.
    చిన్నతనంలో తాను గొర్రెల్ను కాస్తున్నప్పుడు పశువులు కాస్తూ కనిపించాడు ఎంకడు. ఎందుకో అతనంటే ఎనలేని ప్రేమ తనకు చిన్నప్పట్నుంచిన్నీ. నాటినుండి నేటివరకూ ఒంటిగా సద్ది తినలేదు తాను. ఎంకణ్ణి చూడంది బ్రతకలేదు తాను.
    ఒకరోజు జీవాలగ్గాను మండలు నరుకుతూంది. ఒక మండ పెద్దదైంది. తెగడంలేదు. ఎంకడు కాలితో అణగద్రొక్కి గొడ్డలితో లాగి కొట్టాడు.. మండ తెగినమాట నిజమేగాని గొడ్డలి కాలి వేలుమీద పడింది. వ్రేలు తెగిపోయింది. రక్తం మడుగులు కట్టి పారసాగింది. కాని, ఎంకడు కిమ్మనలేదు. అబ్బ! ఎంత ఓర్పు!! పసులకాపర్లు ఆ ఆకూ ఈ ఆకూ కట్టారు. రక్తం కట్టుబడింది. కాని, వేలు సగం అయింది. అందుకే ఆ వేలు ఎప్పుడు చూచినా కొత్తగా ఉంటుందామెకు. తన వేలే ఒకటి సగమై ఎంకని కాలికి అతుక్కుందన్నట్లుగా చూస్తుంది.
    "సిలక పచ్చ సీర కట్టుకుంటే ఎట్లుంటవే లచ్చీ?!" అన్నమాట వినిగానీ మళ్ళీ ఈ లోకంలోకి రాలేదామె.
    "దయ్యమోలె! నాకు చిలకపచ్చ గిట్టదు. పాలపిట్ట రంగు ఎంత బాగుంటది!" అంది లచ్చి.
    ఎంకడు చిన్నబుచ్చుకున్నాడు. లచ్చి కనిపెట్టింది. చిలకపచ్చ తనకు గిట్టదు. పాలపిట్ట రంగు ఎంత బావుంటుంది! అయినా బావకోసం చిలకపచ్చ చీర కట్టుకుంటే ఏం? బావ తనను మర్రి చెట్టుకిందికి లాక్కొని ఉండకపోతే తాను ఆనాడే చనిపోయి ఉండేది. చిన్నతనపు మరొక దృశ్యం గుర్తుకు వచ్చిందామెకు:
    ఆనాడు ఆకాశం అమాంతంగా మబ్బుల్తో నిండిపోయింది. పెద్ద ఉరుము ఉరిమింది. ఆ ఉరుము విని అంతా పారిపోయారు. తాను పెద్దగా ఏడ్వసాగింది. ఎంకడు తనను లాక్కొనిపోయి మర్రి చెట్టుకింద నుంచోపెట్టాడు. క్షణం తరవాత పిడుగుపడి పది జీవాలు చచ్చాయి. బావ లేకుంటే తానిందాకా బ్రతికేదా? ఈ బ్రతుకే బావది. అలాంటప్పుడు చిలకపచ్చ చీర కట్టుకోలేదా బావకోసం? "బావా! కట్టుకుంట చిలకపచ్చ చీర. మా అయ్యను తెమ్మంట చిలకపచ్చ చీర!" అంది కళ్లు పెద్దవిచేసి అతనివంక చూచి.
    లచ్చి వయ్యారమంతా ఆవిడ కళ్ళల్లోనే ఉంది. ఆమె రంభా కాదు. ఊర్వశీ కాదు. మన ప్రబంధ నాయిక అంతకంటే కాదు. ఆమె మేను పసిడిని కాలతన్నదు. ముఖం చంద్రుణ్ణి మించదు. ముక్కు సంపెంగకాని, పెదవులు దొండపండ్లూకాని కావు. ఆమె చామన చాయగల అచ్చ తెలుగు కన్నె. కొద్దిగా కోల ముఖం నవ్వితే గుంటపడే చెక్కిళ్ళు. అన్నిటినీ మించి పొంగిపొర్లే నదిలా పొంగే వయసు, సొగసు ఆమె కనుల్లోంచి తొంగి చూస్తుంటుంది. కళ్లు చాలా పెద్దవి. వాటిల్లో ఎర్రని చారలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఆమె చూచిందంటే స్వర్గం అందిందనుకుంటాడు ఎంకడు. చూపుకో ప్రాణం చొప్పున ఇమ్మన్నా ఇచ్చేస్తాడు.
    ఆమె చూపు నిస్తంత్రీవిద్యుత్తును ప్రవహింపచేసిందతనిలో. "నా లచ్చి ఎంత మంచిది!" అని దగ్గరికి లాక్కొని కళ్ళల్లోకి చూచాడు.
    "ఛీ పో! తప్పు" అని వదిలించుకొని దూరం జరిగింది లచ్చి.
    ఇద్దరూ పక్కనున్న వాగులో చేతులు కడుక్కున్నారు. లచ్చి ముంతలో నీరు తీసుకుంది. వారు మర్రి కిందకు వచ్చారు. సద్ధులు విప్పుకున్నారు. ఇద్దరు తెచ్చిందీ జొన్న బువ్వే. ఇద్దరు తెచ్చిందీ కొరివికారమే. అయినా, ఎంకడు సగం లచ్చికి పెట్టాడు. లచ్చి సగం వెంకడికి పెట్టింది.
    ఇది ఈనాటి అలవాటు కాదు. చిన్ననాటి నుంచీ వారు అంతే. ఒకర్ని విడిచి ఒకరు సద్ది తినరు. తెచ్చుకున్నది చెరి సగం పంచుకొని తింటారు. "ఏదైనా చెరిసగం బావా!" అని కిలకిల నవ్వుతుంది లచ్చి.
    "మరి నీ నవ్వో?" అంటాడు ఎంకడు. "అంతా నీదే బావా!" అంటుంది లచ్చి తలవంచుకొని. వారు సద్దులు తినేశారు. రెండు దోసకాయలు తాను తీసుకొని, రెండు లచ్చికి ఇచ్చాడు. ఒక దోసకాయ కొరికాడు ఎంకడు. లచ్చీ కొరికింది. "ఛీ! చేదు" అని విసిరికొట్టింది. దూరాన ఉన్న గొర్రె దాన్ని తినేసింది. ఇంకోటి కొరికింది. అదీ చేదు. లాగి విసిరికొట్టింది.
    "ఏరి చేదు యిచ్చినవేం?" అంది మూతి ముడుచుకొని.
    "ఇగో! ఇది తియ్యగున్నది" అని తాను కొరికిన కాయ అందించాడు.
    "ఛీ- తప్పు." నవ్వి అతని దగ్గరున్న మరో కాయ లాక్కొని కొరికింది. "అబ్బ! ఎంత తియ్యగున్నది- ప్త.... ప్త" అని తినసాగింది.    
    "లచ్చీ! ఒక మాటడుగుదునా?"
    "అడుగూ" అంది దోసకాయ నముల్తూ.
    "నీ కళ్లల్ల ఏమున్నది?"
    తల ఎత్తి ఆశ్చర్యంగా చూచింది.
    "చెప్పవా?"
    "నువ్వు" అంది తల వంచుకొని. మిగిలిన దోసకాయ పారేసింది.
    "లచ్చీ! నీకు మనసుందా?"
    "హూఁ!"
    "ఏమైంది?"
    మంద కుక్క మొరిగింది. గొర్రెలేమైనాయోనని సద్ది మూట పట్టుకొని పరిగెత్తింది. లచ్చి వెనక్కు తిరిగైనా చూడకుండా. కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఎంకడు లచ్చికిచ్చి, సద్ది మూటతో మంచె ఎక్కాడు.
    ఆ కొద్ది గడియలు ఎంకని బ్రతుకులో అమృతపు గడియలు. మళ్ళీ రేపటివరకు బ్రతుకుతాడూ అంటే, మళ్ళీ కోడి కూస్తుందనీ, మళ్ళీ లచ్చి వస్తుందనీ మాత్రమే. అది లేకుంటే అతనికి జీవితంలో ఏం పని? జీవితపు ఎడారిలో మానవుడు పయనిస్తాడూ అంటే అక్కడక్కడా ఇలాంటి ఒయాసిస్సులు కనిపిస్తాయనే.
    మళ్ళీ 24 గంటలు నిరీక్షణ తరువాతగాని ఆ గడియ రాదు.

                                                       *    *    *    *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.