Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    ఆ కలవరంలో నేను సైతం క్షణంపాటు అతనికేమీ జవాబు చెప్పలేకపోయాను. అప్పుడన్నాను - "నీవే ఏదో ఊహించుకొని బాధపడుతున్నావు. సరే పోనీ, ఇప్పుడు మీ తండ్రితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నావా?"
    "లేదు" అనే జవాబు బుల్లెట్ లా వచ్చింది. "అది తెగిపోయింది" నాకు చొక్కపు బంగారపు ప్రేమ కావాలికాని, ఈ రోల్డుగోల్డు ప్రేమ అవసరం లేదు. రెండోసారి ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ప్రస్తుతం నేను ఒంటిగాణ్ణి. నేను చేసిందానికి నేనే అభినందించుకుంటున్నాను. ఈ లోకాన్ని అనుభవించడం, ఆనందించడం నా ధ్యేయం."
    "పాపం!" అనుకున్నాను. ఇప్పుడు కలవరపడుతున్నాడు. క్రమంగా మార్చవచ్చు. వాస్తవమైన ప్రేమపాశంతో అతణ్ణి కట్టివేయవచ్చు. అతనితో శలవు తీసుకొని వచ్చేటప్పుడు అతని చివరి పదాలు నా చెవుల్లో రింగుమన్నాయి.
    "రాజూ! నేను ఇంత తింటున్నాను. పాలకూ, పండ్లకూ బోలెడు ఖర్చు పెడ్తున్నానంటే నేనేం తిండిపోతుననుకున్నావా? కాని, నేనేం చేయను? అది ఒకటే నాకు ఆనందం. మిగతా ఆకళ్ళన్నీ అదుపులో ఉన్నాయి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సోదరుని ప్రేమకు కూడా ఈ బాలన్ నోచుకోలేదు. భార్య - ఆమె నిష్కల్మష ప్రేమ కూడా నాకు సాధ్యంకాదు. కాని, నావరకు అన్నింటినీ మరిచి, వట్టి జిహ్వకోసం జీవిస్తున్నాను. ప్రస్తుతం నేను నాకు ప్రభువును." ఇదీ అతడు చివరకు చెప్పింది. ఇప్పుడు నిష్కల్మషమైన ప్రేమను చూపి. అతని ఒంటరితనాన్ని దూరంచేసి నా మిత్రత్వాన్ని నిరూపించుకోదలిచాను. బాలన్ కు మా చెల్లెల్ను ఇవ్వమని చెప్తాను - మా తల్లితో.
    కాని, అవేవి జరక్కముందే ఉత్తరం నుంచి పిడుగువంటి వార్త వచ్చింది. స్వాతంత్ర్య పిపాస ఆరిపోయి, దేశం ప్రగతి పధాన పురోగమిస్తున్నప్పుడు రాక్షసులు భారతదేశపు ఉత్తర సరిహద్దున వికటాట్టహాసం సాగించారు. తన మాతృభూమిని గౌరవించేవారు, మాతృదేశాన్ని ప్రేమించేవారు, సౌభ్రాతృత్వంగల గుండె గలవారూ, సరాసరి రణరంగంలో దూకారు.
    యువ తరాలవారు సైతం కదనరంగానికి ఉరుకుతున్నప్పుడు నాలాంటివాని సంగతి చెప్పేదేమిటి? అనుభవం గల మేజర్నైన నన్ను బొంబాయిలో ఉండనిస్తారా? నా భార్య కన్నీరు రాల్చింది. నా తల్లి గుండె ఎలా మండిందో చెప్పలేను. కాని, నన్నెవరూ ఆపలేకపోయారు. ఆ దుఃఖం, ఆ ప్రేమ నన్ను మరీ ఉత్తేజితుణ్ణి చేశాయి. ప్రేమ నిండిన ఈ హృదయాల్ని రక్షించడానికే కదా నేను వెళ్తున్నది? నిజమైన ప్రేమ మనిషినెలా కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది? ప్రేమ లేనివాడు ఎంత యాతనపడ్తాడు!
    యుద్ధం ప్రారంభం అయిన చోటు సాధారణం అయిందీ కాదు, అలవాటుపడిందీ కాదు. చలికాలం, మంచుకొండ, ఎత్తు పల్లాలు, విష జంతువులు - వీటితో పోరాడ్డానికీ బోలెడు శక్తి కావాలి. ఒక సైనికుడు ఒరిగినప్పుడు అతని శక్తి మా కొచ్చినట్టవుతున్నది. శత్రువులు ఒక్కణ్ణి చంపితే ముగ్గురు శత్రువుల్ను పొట్టనబెట్టుకోవాలని గుండె మండిపోయేది. భారతభూమిలో జన్మించే ప్రతి ప్రాణీ తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడడం చూస్తుంటే కృతఘ్నుడైన ఈ రక్కసి మన దేశభక్తిని పరీక్షించడానికి వచ్చాడా అనిపిస్తోంది.
    ఆ రోజు నేను పెట్రోలు క్యాంపులో ఉన్నాను. వివిధ భాష, వర్ణ, వర్గాలకు చెందినవారు ఒక్కటై - ఒకే ఒక ధ్యేయం కోసం - శత్రువును మన పవిత్రదేశం నుంచి వెళ్ళగొట్టటం కోసం పనిచేస్తున్నారు. అంతేగాక, తమ పక్కవారి ప్రాణం తమ ప్రాణంగా భావించి రక్షించాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి పవిత్ర పుత్ర రత్నాల్ను కన్న భారతమాత నిజంగా భాగ్యశాలి.
    శత్రువులు మిడుతల దండులా వచ్చిపడుతున్నారు. అంధకారంలో వెన్నెల సైతం చొరరాని చీకటి మంచులో శత్రువులు పిశాచాల్లా తిరుగుతున్నారు. ఈ సైన్యానికి అంతులేదా? వారు రాక్షసులా? రావణుని తలల్లా చచ్చినవాడల్లా పుడుతున్నాడా?
    మేము రాళ్ళ సందునా, చెట్ల చాటునా, పొదలమాటునా దాక్కున్నాం. ఎముకలు కొరికే చలి తినేస్తూంది. ఆకలి డొక్కను కాల్చేస్తూంది. వాటిని గురించి ఆలోచనే రాలేదు. అలా ఆలోచించడానికి అవకాశం కూడా లేదు. కళ్ళు చీకటిని చీల్చి చూస్తున్నాయి. చేతులు తుపాకులమీద ఉన్నాయి. అనుమానం కలిగిన చలనాన్నల్లా అంతం చేయడానికి మేము వంతెనకు ఉత్తరాన ఉన్నాం. గత నాలుగు రోజుల్నుంచీ మేము ఆశిస్తున్న ఆహారం, బ్లాంకెట్లు, ఆయుధాలు అందలేదంటే దక్షిణం నుంచి వచ్చేవారికి మేము ఇక్కడ ఉన్నామని తెలుసా? అనే అనుమానం కలిగింది. అయినా, సాధ్యమైనంత మందిని చంపడానికి మాకు ధైర్యం బోలెడుంది. నా గుండెలో నా తల్లి యొక్క ముడతలుపడ్డ ముఖం మెరిసిపోయింది. ఒంటిగాడైన బాలన్ లాంటివారు అదృష్టవంతులనుకున్నాను. మరుక్షణంలో నాకు నవ్వు వచ్చింది. ఎంత చిత్రమయిన ఊహ! నేను నా మాతృభూమి కోసం చస్తున్నాను. అంతేకాదు, నా కోసం కన్నీరు కార్చేవారూ కొందరున్నారని సంతృప్తి కలుగుతూంది.
    "ఢాం, ఢాం. ఢాం" అనే ధ్వనులు మెదడులోని ఆలోచనలను దూరం నెట్టేశాయి. మెరుపులాంటి కాంతి చీకటితో పోరాడుతూంది. మంచుతో పోటీ పడుతున్న పొగలో ఎవరు ఎవర్ని కాల్చాలనేది అర్థం కాలేదు. అర్ధగంట.... గంట.... ఎంతకాలం అయింది? ఒక యుగం గడిచిందా? ప్రపంచం అంతా భూకంపం వచ్చి కూలిపోయిందా? కాదు కాదు. ఇవి మన పవిత్రమైన హిమాలయాలు. ఇవి రక్తపాతాన్ని భరించలేక అగ్నిపర్వతంగా మారేయేమో? తరువాత ప్రశాంతత ఏర్పడింది. అప్పుడుగాని నా ఎడమ కాలిలో పోటు గుర్తుకు వచ్చింది కాదు. ఆ.... భగవంతుడా! ఎంతమంది చనిపోయారు? ఎందరు వికలాంగులైనారు? ఎందరు మృత్యువుతో పోరాడుతున్నారు? అసలే మేమున్నది 20 మందిమి. ఎంతమంది బ్రతికి ఉండొచ్చు?
    సూర్యుని తొలి కిరణం భారత భూమిమీద పడి ఏడ్చింది. రాత్రంతా మంచు కురిసి ఏడ్చిన తల్లి తన క్షతగాత్రులైన బిడ్డల్ని గుండెలో దాచుకుంది. అబ్బ! ఒకళ్ళ తరవాత ఒకళ్ళం మెల్లగా లేచి వచ్చాం జీవితం చూడ్డానికి. వెంటనే "రిట్రీట్" వెనక్కు తగ్గమని ఆర్డరు వచ్చింది.
    ఆ కలవరంలో మిగిలిన ఆహారం, బ్లాంకెట్లు మరిచాం. ఒక్క బ్లాంకెటు మాత్రం నా వద్ద మిగిలిపోయింది. సగం చచ్చిన మాలాంటి వాళ్ళం అలసిపోయి రక్తం ఒడుపుతూ ఒకచోట కూర్చుని, క్షణం అటూ ఇటూ చూశాం. ఏడి అతడు? గత వారం నుంచి నా వెంట ఉండి నన్ను రక్షించడానికి నీడవలె అనుసరిస్తున్న మిత్రుడేడి?
    "రాజూ! నేను చనిపోయినా నాకోసం కన్నీరు కార్చేవారు లేరు. నా తల్లి నన్ను భూమాత కప్పగించి, ఆమె నన్ను పెంచి పెద్దవాణ్ణి చేస్తుందనుకుంది. ఆ నా మాతృభూమికి ఆపద సంభవించినప్పుడు రక్షించడం నా కర్తవ్యం. నేను నిన్ను చూచినప్పుడు చాలా ఆనందించాను." ఒక నెల క్రితం ఇలా అంటూ బాలన్ నా ప్రక్కన మిలటరీ శాల్యూట్ లో నిలిచి ఉన్నాడు. తరువాత అతడు నన్ను రక్షించాడు. నేను జీవించాలని, జాగ్రత్తగా ఉండాలనీ, నాకు మరికొన్ని బాధ్యతలున్నాయనీ హెచ్చరిస్తుండేవాడు. ప్రభుత్వం కోరగానే మాజీ సైనికుడైన బాలన్ సైన్యంలో చేరాడు. కాని అలాంటివాడేడీ ఇప్పుడు? "వెంటనే బయల్దేరండి." మాకు ఉన్నతాధికారుల ఉత్తర్వులు వచ్చాయి. రెండు మైళ్ళ అవతల జీపులు దాగి ఉన్నాయి. అక్కడిదాకా నడవాలి. లేదా పాకాలి. చేతకానివారిని మోసుకొని వెళ్ళాలి. అక్కడి నుంచీ రాంజీ హాస్పిటల్ కు ఢిల్లీ ద్వారా పంపుతారు. కాని, చనిపోయినవారు?అసలు ఎవరు చనిపోయారు? ఆ ఆదుర్దాలో నేను అటూ ఇటూ చూచాను. ఒక కళేబరం కనిపించింది. "బాలూ!" నా గుండె వక్కలై కేక వెలువడ్డది. కళ్లలోంచి నీరు ప్రవహించసాగింది. ఏమిటిది? త్వరగా బయల్దేరండి. తొందరపడాలి. "ఎవరది? ఓ ఎవరు? బాలనా? పాపం!" దగ్గరికి వచ్చిన అధికారి కూడా వంగి తుపాకి పైకెత్తి చూచాడు. గుండ్లయిపోయాయి. దాగినచోటునుండి పరుగెత్తుకొని వచ్చి పదిమందిని హతమార్చి పడిపోయాడు. "రాజూ! చూడు ఎంత వీరుడో? రాజూ! ఆ బ్లాంకెటు. అతనికి కప్పు. అంతకంటే ఎక్కువ ఇప్పుడు మనమేమీ చేయలేం" అన్నాడు. నేను బ్లాంకెటు తీసుకున్నాను. ఇతడు వీరుడైన బాలన్! ఇది సాధారణ మృతకళేబరం కాదు. ఇది "బాలన్" అనే ఆత్మకు ఇల్లు. కాబట్టే, ఆ వీరాత్మకు మన గౌరవం వ్యక్తం చేయడం మన విధి. కాని, నా చేతుల్తోనే ఆ పని చేస్తున్నప్పుడు దుఃఖం నిలవలేకపోయింది.
    "బాలన్! నేను నీ జన్మభూమివాణ్ణి, శౌర్యానికి సోదరునిలాంటివాణ్ణి. నీ వీరత్వానికి, శౌర్యానికీ, మానవతకూ జోహార్లర్పించడానికి కన్నీరు కారుస్తున్నారు. నీ చావును వీరమరణం అంటాం. అలాంటి మరణం కలిగే అదృష్టం కలిగిందని నిన్ను కీర్తిస్తాం. నాకెవరూ లేరనీ, నన్ను ప్రేమించే వారెవరూ లేరని నిట్టూర్చే నీకు ఇప్పుడు నిజమైన ప్రేమ ఏమిటో అర్థం అయిందా? నీకు శాంతి లభిస్తుందా?" నేను బ్లాంకెటు కప్పాను. బూట్లన్నీ ఒక్కసారి ఠక్ మని శాల్యూట్ చేశాయి. తరువాత వెనక్కి తిరిగాం. బ్లాంకెటు అతనికి కప్పడంతో శిబిచక్రవర్తికంటే ఎక్కువ సంతృప్తి కలిగింది నాకు.
    "జైహింద్!" అనే కోరస్ మృతవీరుల వీర స్వర్గానికి బాటలు పరిచింది.
    బ్లాంకెటు లేకున్నా మంచుగాలి మమ్మల్నేమీ చేయలేకపోయింది. గుండెలో ఉండే దేశభక్తి అనే అగ్నివీరుల మరణం అనే విసనకర్రతో విసరబడి మా శరీరాలకు అపరిమితమైన వేడి నిస్తూంది. బాలన్.... ఒక వీరుడు. అతనికి ఇల్లుగాని, తనవారు కాని లేరు. కాని భారతదేశమంతటికీ అతని రక్తం వ్యాపించింది. ఆ రక్తం నుంచి వేలమంది బాలన్ లు పుడ్తారు. వారు పగ తీర్చుకుంటారు. అనిత్యమై, సాధారణమైన ప్రేమ కోసంగానూ తపించే ఆత్మ నేడు విశాలమూ, నిత్యమూ, అసాధారణము అయిన ప్రేమ కౌగిలిలో ఒదిగిపడుకుంది.

                                       *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.