Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                              "తల్లికన్న మిన్నరా తల్లిదేశమ్ము!"

    సర్వర్ తెచ్చిచ్చిన కాఫీ తాగుతూ చూపుతో ఒకసారి హోటల్ సర్వే చేస్తే, నా దృష్టి ఒకనిపై అలాగే నిల్చిపోయింది. ఎవరది? పోయిన ఆదివారం కూడా అదే స్థలంలో చూశానతన్ని. అతడూ అలాగే చూస్తున్నాడు నన్ను. లేచి వస్తున్నాడు నా వైపే.
    "సర్! మీ పేరు రాజామణి కదూ?" అడిగాడతను.
    క్షణం చిత్తరువునైపోయా. నన్నెలా గుర్తుపట్టాడతను?
    "మీరు తంజావూరులో సుందరం హైస్కూల్లో చదివారు కదూ?"
    నేను మరింత ఆశ్చర్యపోతూ, "అవును," అన్నాను.
    "రాజా! నీవిక్కడే ఉన్నావా? ఏం చేస్తున్నావిక్కడ?"
    స్నేహం పొంగగా అతను నా చేతులు పట్టుకొని గట్టిగా నొక్కాడు.
    పదహారు సంవత్సరాలకు పూర్వం నాతో చదువుకుని ఒక కంచంలో తిని, ఒక మంచంలో పడుకున్న నా మిత్రుడు అమాంతంగా ఒక రోజు ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఇంతకాలం తర్వాత అతన్ని మళ్ళీ చూచినప్పుడు నా హృదయం ఎలా ఉందో చెప్పలేను.
    "బాలూ! ఎందుకలా చేశావు? నాక్కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? మిలిటరీలో చేరావని ఎవరో చెప్పారు. బ్రతికే ఉన్నావన్నమాట!" ఆదుర్దాలో ప్రశ్నల వర్షం కురిపించాను.
    "రా బయటికి వెళ్దాం. అక్కడ మాట్లాడుకోవచ్చును" అంటూ చేయిపట్టి లాక్కుపోయాడు బాలన్. అప్పూరా గార్డెన్స్ లో అతను కూర్చున్నప్పుడు బొంబాయిలో అద్దె ఇల్లు సంపాదించినంతటి సంతోషం అయింది. నన్నతనేదో అడుగుదామనుకుంటుండగానే "అలా పారిపోయావే అమాంతంగా? ఆ తరువాత ఏం జరిగింది?" అని అడిగాను. అతడు విచారంగా అన్నాడు:    
    "నా తండ్రి వట్టి పిరికిపంద. రెండవ పెళ్ళామంటే భయపడేవాడు. నన్ను అసహ్యించుకున్నాడు. నా సవతి తల్లి మా కళ్ళు తుడవడానికి నన్ను ప్రేమించినట్లు నటించేది. వాస్తవంగా నేనంటే ప్రేమించేవారు ఎవరూ లేరు. నీ తల్లి నామీద సానుభూతి కలిగి నా అవసరాలు తీరుస్తుండేది. అది నాకు తలకొట్టినట్లనిపించింది. ఒకప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. అప్పుడు నా సవతి తల్లికి కోపం వచ్చింది. ఎందుచేతనంటే, ఈ ఖర్చు ఆమెను తన చెల్లెలు పెళ్ళికి వెళ్ళకుండా చేసింది. మా నాన్న కూడా కలవరపడ్డాడు. చివరికి ఎవరి దగ్గరో అప్పు తీసుకొని సవతి తల్లికి తెలియకుండా ఇచ్చాడు. నాకు సిగ్గయింది. నాకంటే కుక్కలు హాయిగా జీవిస్తున్నాయనిపించింది. ఆ డబ్బుతోనే భూగోళం చుట్టూ తిరుగసాగాను. ఈలోగా నాకు మిలిటరీ జీవితపు కూడా కలిగింది. తరవాత ఎలాగో చదువు పూర్తిచేశాను. అయినా, అనందం మాత్రంలేదు. ఎవరికోసం చదవాలి? ఎవరికోసం సంపాదించాలి? నన్ను మెచ్చుకోవడానికి నా తల్లి లేదు. నాకో కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆ డబ్బు నా పొట్టపోసుకోవడానికి సరిపోయేది. ప్రస్తుతం నేను సేల్స్ మేనేజర్ను. నెలకు 400 సంపాదిస్తున్నాను. అదృష్టం విచిత్రం అయింది. అవసరం లేనప్పుడు డబ్బొస్తుంది."
    నేను కళ్ళతో అతన్ని కొలుస్తున్నాను. "అలా అనకు బాలా! గతం మరచిపో. నీవు ఆనందమైన జీవితం గడపొచ్చు. ఒకరోజు ఒక పవిత్రాత్మ నీతో కలసి జీవించడానికి వస్తుంది." అలా అని అతణ్ణి ఓదార్చదలచాను.
    "అవునవును, అదీ నిజమే. కాని, ఎవడైనా పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉంటే కదా?"
    నేను ఆశ్చర్యపడ్డాను. "నీకో అమ్మాయి దొరకదా? ఆడపిల్ల తండ్రులు ఇంకా నిన్ను చూడలేదనుకుంటా?"
    "అదేం కాదు. వారికి నేనంటే భయం. ఇంటి నుంచి పారిపోయిన కొడుకును. మాజీ సైనికుణ్ణి. కాబట్టి, నేను ఒక బాధ్యతగల భర్తను కాలేనని వారి అభిప్రాయం." అతడు నవ్వాడు-ఏడవలేక.
    "అలా అనకోయ్!"
    "అది అంతే బాబూ! నాలుగు సంవత్సరాల క్రితం ఆ అనుభవమూ కలిగింది. మా ఎదురింట్లో ఒక అమ్మాయి ఉండేది. ఎలాగో మా ఇద్దరికీ ప్రేమ కలిగింది. కాని, ఆవిడ తలిదండ్రులకు నామీద విశ్వాసం కలుగలేదు. ఆవిడ వేరేవాణ్ణి పెళ్ళిచేసుకోవాల్సి వచ్చింది."
    "ఇది ఇరవయ్యో శతాబ్దంలోనే అయిందంటావా?" అడిగాను.
    "అవును. అంతేకాదు, తరువాత కర్మ ఎలా కాలిందో తెలుసా? తలిదండ్రుల్తో లేనని నన్ను వాళ్ళు వదిలివేశారు. కాని, ఆవిడ పెళ్ళాడిన కుర్రాడు తల్లిదండ్రుల్తో కలసి, సరైన కట్నం తేలేదనే నెపంతో ఆవిణ్ణి వెళ్ళకొట్టాడు. తత్ఫలితంగా ఆవిడ పెళ్ళయిన బ్రహ్మచారిణిగానూ-నేను పెళ్ళికాని బ్రహ్మచారిగానూ నిలిచిపోయాం. ఆనంద జీవితం మాకు మరీ చిక్కయిపోయింది".
    బాలన్ తన కథ చెప్పడం పూర్తీచేయగానే ఆకసంలో మబ్బులు కూడాయి- అతని ఖర్మానికి ఏడవడానికా అన్నట్లు. తొందర్లో విడిపోయాం. మరుసటి వారం వాళ్ళింటికి భోజనానికి రమ్మన్నాడు. ఒప్పుకున్నాను.

                                      *    *    *    *

    అది పెద్ద హోటల్. పేరు వింటేనే ఆశ్చర్యమయింది కాఫీకి అర్ధ రూపాయి ఇస్తే సరిపోదు. పావలా "టిప్" ఇవ్వాలి. భోజనం చేసిన తరువాత బాలన్ సర్వర్ కు పది రూపాయలిచ్చి చిల్లర సర్వర్నే ఉంచుకోమంటే నాకు ఉండబట్టలేకపోయింది.
    "ఇవ్వాళ నీవు స్వేచ్చా జీవివి. కాని, రేపు? నాకోసం మాత్రమే ఇలా ఖర్చు చేశావు కదూ?"
    బాలన్ పెద్దగా నవ్వాడు. "రాజూ! డబ్బు - డబ్బు. ఎప్పుడూ దాన్ని గురించే ఎందుకాలోచిస్తావు? రేపు.... రేపు.... అని ఏమిటా కల? బ్రతకడం అంటే మనకోసం. ఇంకొకరికోసం ఎందుకాలోంచించాలి? అయినా, నన్ను ప్రేమించేవారు లేనప్పుడు నాకు రేపేమిటి? నా వారేమిటి? చివరి విశ్వాసం వరకు నా సంపాదనతో ఆనందిస్తాను."
    అతడు నిర్లక్ష్యంగా మాట్లాడినా దాని వెనక దాగివున్న బాధను నేను గుర్తించాను. "ఎప్పుడూ రోజులిలా ఉండవోయ్! కాలం మారుతుంది. అనవసరంగా ఖర్చు చేయకు" అన్నాను.    
    "రాజూ!" అని నా కళ్ళల్లోకి చూచాడు బాలన్.
    "నేనిదివరకే చెప్పాను కదూ, ఆనందం నాకు మృగతృష్ణ అని. వాస్తవమైన ప్రేమా ఆత్మీయతా నాకీ జీవితంలో లభించవు".
    "ఎప్పుడూ అవే మాటలా? ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు. నా తలిదండ్రులు ఊర్లో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి బాంధవ్యం కలుపుకుంటే మిగతా బంధువులంతా స్వతసిద్ధంగా నీ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు నీకు దయగల తండ్రి, ప్రేమించే భార్య, ముద్దు బిడ్డలు కూడా కలుగుతారు."
    "రాజూ!" అని ఒక నిట్టూర్పు విడిచి నా నోరు మూశాడు అతని చేతితో.
    కాని, అతని చేతి నాడి అతనిలోని తీవ్రతను తెలియజేసింది నాకు.
    "రాజూ! నీవు నన్నర్థం చేసుకోవు. నీ ఐడియా నాకేమీ కొత్తకాదు. అదికూడా చేసి చూశాను. కాని, నిర్వ్యాజమైన ప్రేమ నాకు లభించలేదు."
    "ఏమి?" నా గుండె ఆగినంతపనైంది. "అయితే, ఇంటికి వెళ్లావా? ఎప్పుడు? మీ నాన్న ఎంతో సంతోషించి ఉంటాడు. ఎందుకు నీ ముఖాన మబ్బులు కమ్ముతున్నాయి?" నా ఆదుర్దాను అరికట్టలేకపోయాను. తండ్రీ కొడుకుల పునస్సమాగమాన్ని గురించిన చిత్రం చూడసాగాను. ఎంత ఆనందంగా ఉంటుంది వారి కలయిక!.
    కాని, బాలన్? అతడు రాయిగా మారిపోయాడు. "రాజూ! నేను వెళ్ళాను. నేనేకాదు, నా శక్తి, నా హోదా, నా డబ్బు అన్నీ కలసి ఒక మనిషిగా మారి, అక్కడికి వెళ్ళాను..... అర్థం అయింది. నన్ను పిచ్చివాడనుకుంటున్నావు. వాస్తవం ఎప్పుడూ కటువుగానే ఉంటుంది. నా సవతి తల్లి నాకు స్వాగతం చెప్పింది. ఎందుకనుకున్నావు? 400 సంపాదించే ఆవిడ కొడుకు వచ్చాడు. పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఆవిడ కూతుళ్ళతో నాకు దండం పెట్టించింది. నాకు పరీక్ష ఫీజుకు పది రూపాయలు ఇవ్వడానికి భయపడిన నా తండ్రి, నా సవతి తల్లి కొడుకును కాలేజీలో చేర్పించడాన్ని గురించి ఆదుర్దాపడుతున్నాడు. కాని, నేనెక్కడికి వెళ్ళాననికాని, ఏంచేశానని కాని ఎవరూ అడగలేదు. నా తండ్రి నన్ను తిట్టి, కొట్టి, 'ఏంరా వెధవా, ఎక్కడికి పోయావురా?' అంటే నేను కాలా ఆనందించేవాణ్ణి. కాని, నా డబ్బు చూసి, నా విధుల్ను మాత్రమే నాకు అప్పగించాడు - అంతే. రాజూ! డబ్బు లేకుండా వట్టి మనిషిగా నేను వెళ్ళినట్లయితే వారు నన్ను ఇలా చూచేవారా? ఇదంతా తమ పెద్ద కొడుకు కోసంగాని, బాలన్ అనే మనిషి కోసంగానీ కాదు - అంతా డబ్బు...డబ్బు కోసం!" బాలన్ ఏదో దయ్యం ఆవేశించినట్లు పెద్దగా అరిచాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.