Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
ఆర్ముగమ్ తన దృష్టి రామ్ దత్తా వైపు త్రిప్పాడు. రామ్ దత్తా గాయాల్ను చూచి అతనికి సహాయం చేయాలని సంకల్పించాడు. అతడు రామ్ దత్తా చేతుల్ను చూచాడు. ఒక చేయి నొసలు మీద ఉంది. అరచేయి స్పష్టంగా కనిపిస్తూంది. అది నీలం రంగులో ఉంది. మధ్యన రక్తం పేరుకొని ఉంది. నీలం రంగుగా మారిన చంద్ సింగ్ చేతులు చూచాడు. కుడివైపున్న స్ట్రెచర్ కట్టెల వైపు చూచాడు. చంద్ సింగ్ వ్రేళ్ళ రక్తపు గుర్తులున్నాయి ఆ కర్రలకు.
"ఒహ్హో, నేను చావగలుగుతే!" ఆర్ముగమ్ ఆత్మ పరితపించింది. "వారిని ఇంకా కష్టపట్టే హక్కు నాకేం ఉంది?" అనుకొని గొంతు పిసుక్కోవడానికి చేతులు పైకి లేపే ప్రయత్నం చేశాడు. ఉహుఁ - వాటిల్లో శక్తిలేదు, అవి లేవలేదు.
రామ్ దత్తా పడుకొని, పడుకొనే ఒక దీర్ఘ నిశ్వాసం వదిలాడు.
"ఏదో కలగంటున్నాడు. ఏమైవుంటుంది?" ఆలోచించాడు ఆర్ముగమ్. కలలో తల్లిని చూస్తున్నాడేమో? తల్లికి అతడంటే అపారమైన ప్రేమ. అతనికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేరు. అతడు పుట్టిన కొద్ది రోజులకే తండ్రి చనిపోయాడు. ఇరవై అయిదు సంవత్సరాల క్రితం. అతని తల్లి ఎంత భయపడ్తూందో? రామ్ దత్తా చనిపోతే? అతని తల్లీ చనిపోతుంది. అబ్బ! రెండు చావులు. నా పరిస్థితి? అది అలాకాదు. మా అమ్మకు నేనంటే అంత మక్కువేంలేదు. నా కుటుంబంలో నేను అందరికంటే చిన్నవాణ్ణి. నా తలిదండ్రులు నన్నూ, నా చావునూ మరిచిపోగలరు. రామ్ దత్తా బ్రతకాలి, జీవించాలి. కాని, నేనేం చేయను? ఏం చేయగలను? చావెందుకు రాదు? నేను శవానికంటే నికృష్టంగా ఉన్నాను. అయినా, బ్రతికి ఉన్నాను. చంద్ సింగ్, రామ్ దత్తాలే నన్ను బ్రతికించి ఉంచుతున్నారు. చంద్ సింగ్ శక్తిశాలి. అతడు నాలాంటి పనికిరానివానికి జీవం పోశాడు. నాలుగు రోజులు బ్రతికించాడు. అతడు మృత్యువును సైతం ఓడించగలడు! నేనూ హవల్ దార్ చంద్ సింగ్ ను కావాలి. కాని, అలా కావడానికి వీల్లేదు. నాకు చావు గడియలు దగ్గరపడ్డాయి. చంద్ సింగ్ లెక్కలేనంతమంది శత్రువుల్ను కూల్చి ఉంటాడు. అది నిస్సంశయమైన వాస్తవం. నేనో? ఇద్దరు చైనావాళ్ళను మాత్రం కూల్చాను. అయినా, నేను చిన్నవాణ్ణి కదూ! బ్రతకగల్గుతే మళ్లీ యుద్ధానికి వెళ్తాను. ఉహుఁ - వట్టిది. నేను జీవించలేను. రామ్ దత్తో? అతడు తప్పక జీవించాలి. తన తల్లికోసం. మన మాతృభూమి - కోసం.
నిన్నటివరకూ ఆర్ముగంలో మాట్లాడే శక్తి ఉండింది. అతడు చంద్ సింగ్ తో అన్నాడు "గురూ! నువ్వు నన్నిక్కడ వదిలేయి. నా పరిస్థితి బాగా చెడిపోయింది" అని.
"నోర్ముయ్, ఆర్ముగమ్! నీకు యుద్ధమంటే ఏం తెలుసు? ఇంకా కుర్రాడివి. చదువుకొన్న కుర్రాళ్ళంతా ఇంతే. తోటివాణ్ణి మృత్యుముఖంలో వదిలి వెళ్ళలేం. ఏం రామ్ దత్తా, అంతే కదూ?" అన్నాడు చంద్ సింగ్.
"జీ హుజూర్!" అన్నాడు రామ్ దత్తా.
ఆ సాయంకాలం మరొక నెపం వెతికాడు ఆర్ముగమ్. మళ్లీ గద్దించాడు చంద్ సింగ్. ఆ రాత్రి మిగిలిన కొద్ది అన్నం అరచేతిలో పెడ్తూ అన్నాడు - "ఇక నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది. అయినా విచారపడకు బాబూ! యుద్ధం చేయడం ఇది నాకు మొదటిసారి కాదు. తిండీ, నీళ్ళూ లేకుండా జీవించడం నేను మొదటినుంచీ అలవర్చుకున్నాను. ఉన్న ఆశలన్నీ నిరాశలైపోయినాయనిపించినప్పుడు ఏదో కొత్త ఆశ చిగురిస్తుంది. ఏదో కొత్త ఉపాయం గోచరిస్తుంది. ఇవాళ మన రేషన్ అయిపోయింది. రేపు తప్పక ఎక్కడో ఏదో దొరుకుతుంది. మీకేం తెల్సు - వట్టి మొద్దులు!"
అప్పుడు ఆర్ముగమ్ రామ్ దత్తాతో అన్నాడు "మీరు నన్ను ఇలా వదిలివేయండి. నావల్ల మీ ప్రాణానికి అపాయం కలుగుతుంది. నువ్వు గురువును ఒప్పించు. చైనా వారితో పోరాడ్డానికి అతడు తప్పక జీవించి ఉండాలి. ఇది మన చివరి యుద్ధం కాదని నాకు తెలుసు" అని.
చంద్ సింగ్ లాంటి మనిషిని ఆర్ముగం ఒప్పించగలడా? "అన్ని ప్రశ్నలకూ జవాబులతని దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆర్ముగమ్! అతడు చురుకైనవాడు. అతనికి కందమూలాల్ను గురించీ, చెట్ల వ్రేళ్ళను గురించీ తెలుసు. ఆహారంగా పనికివచ్చే ఔషధాలు కూడా అతనికి తెలుసు. రేపణ్ణుంచి అలాంటివాటిని వెతికి తెస్తానన్నాడు. అతని ముందు మనం వట్టి కుర్రాళ్ళం. ఏమీ తెలియని మొద్దులం."
"నీ పరిస్థితి మాత్రం ఏమంత బావుందని? మీరు స్వయంగా గాయాల్తో బాధపడ్తూ నాకోసం ఎందుకు ఇంత ఇదౌతారు?" అన్నాడు ఆర్ముగమ్.
"నన్ను గురించి మరిచిపో ఆర్ముగామ్! నేను బొత్తిగా బాగున్నాను. నేనేమన్నా కసరత్తు చేస్తున్నానా? గురువే నిన్ను మోసుకుపోతూంట. నేను ఊరికే చేయి తగిలిస్తానంతే. అంతేకాక, నువ్వెంత బరువున్నావని? ఒక కుర్రానిలా, ఒక పూవులా తేలిగ్గా ఉన్నావు. గురువు ఏమంటాడో తెలుసా? 'ఎంత తేలిక మనిషి. అని."
ఆర్ముగమ్ వారిద్దరి చేతులూ చూచాడు. రక్తం పేరివుంది. మళ్ళీ ఆలోచించాడు. నిజంగా నేను కుర్రానిలా తేలిగ్గా ఉన్నానా? నన్ను స్కూల్లో చదివించిందెందుకూ? వజ్ర సంకల్పం, దృఢ నిశ్చయం కలిగి, మనిషి ముక్కుమీద వ్రేలు వేసుకునే పనులు చేయాలని. గత నాలుగు రోజుల్నుంచీ మూర్తీభవించిన సంకల్పాన్ని చూస్తున్నాను. చంద్ సింగ్ సంకల్ప ప్రభావమే నన్ను జీవించి ఉంచిందనడంలో ఎట్టి సంశయం లేదు. ఇప్పుడు నా వంతు వచ్చింది. నా సంకల్పాన్ని వ్యక్తపర్చాలి. అది చంద్ సింగ్ అంతటి బలమైన సంకల్పమై ఉండాలి.
నాకు చావు రావాలి. ఇక్కడే, ఇప్పుడే.
చంద్ సింగ్ రామ్ దత్తాను త్వరలోనే ఆరోగ్యవంతుణ్ణి చేస్తాడు. ఇంతకూ నా చావువల్ల కలిగే వ్యత్యాసం ఏమిటి - చంద్ సింగ్ లాంటి వాళ్ళు మరణిస్తే లోపంగాని! అలాంటి మహావీరులు భారత సైన్యానికి ప్రాణతుల్యులు.
ఆర్ముగమ్ చిరునవ్వు నవ్వాలనుకున్నాడు. కాని, అతడు పెదవి సహితం కదలించలేకపోయాడు. అతడనుకున్నాడు చావు దరి చేరిందని. రామ్ దత్తానూ చంద్ సింగ్ నూ లేపనా? నేను వారిని గురించి ఏమనుకుంటున్నాను? నా ఆశయాలేమితో వారికి తెలియజేస్తే? ఉహుఁ - వీల్లేదు. చంద్ సింగ్ మేల్కొంటే నాకూ మృత్యువుకూ మధ్యన నుంచుంటాడు.
ఆర్ముగమ్ కళ్ళు మూసుకున్నాడు. కుడివైపు ఏదో కదలిక. చంద్ సింగ్ దగ్గాడు. చేత్తో గడ్డం దువ్వుకొని మరొక ప్రక్కకు తిరిగి పడుకున్నాడు. కుడి మోచేయి తలక్రింద పెట్టుకున్నాడు. తలమీది నుంచి తలపాగా ఒరిగిపోతూంది.
ఆర్ముగమ్ కొన్ని క్షణాలపాటు చంద్ సింగ్ ను చూస్తూ ఉండిపోయాడు. తరువాత కనురెప్పలు స్వతసిద్ధంగా మూసుకున్నాయి.
"జైహింద్!" అతని పెదవుల్నుంచి బయటపడింది.
* * * *





