Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                           బొమ్డిల్లానుంచి పదిహేను మైళ్ళదూరంలో

    ఆర్ముగమ్ కళ్ళు తెరిచాడు. చంద్ సింగ్ కుడివైపు పడుకొని ఉన్నాడు. రామ్ దత్తా ఒక మీటర్ కంటే తక్కువ దూరంలో పడివున్నాడు.
    చంద్ సింగ్ కళ్ళు సగం తెరిచి ఉన్నప్పటికీ అతడు నిద్రపోతున్నాడు. అతడు నిద్రపోయే పద్ధతే అది. సగం తెరచిన కళ్లు, దట్టమైన కనురెప్పల్ను చూచి అతడు నిద్రిస్తున్నదీ, మెలుకవతో ఉన్నదీ తెల్సుకోవడం కష్టం. సర్వదా దాడికి సన్నద్ధంగా ఉన్నట్లుగా కనిపించేవాడు. తోటివారు వెక్కిరిస్తే అనేవాడు - "మీరు దున్నపోతుల్రా, దున్నపోతులు! యుద్ధాన్ని గురించి మీకేం తెల్సు? దట్టమైన బర్మా అడవుల్లో, పొడవైన చెట్ల క్రింద గడిపిన రాత్రుల్లో ఈ అలవాటు కావాలనే చేసుకున్నాను తెల్సా? రెండో ప్రపంచ యుద్ధంలో నిద్రలో సైతం దాడికి సిద్ధంగా ఉండాల్సి వచ్చేది. వట్టి మొద్దులు, మీకేం తెల్సు?"
    "అందుకే లెఫ్టినెంట్ వైనావు లేవోయ్." ఒకడు పరిహసించేవాడు.
    వాస్తవంగా అతనికి 'కమీషన్" లభించలేదు. ఆఫీసర్ ఏమో కాని, సర్దార్ కూడా కాలేదు. అతి కష్టంమీద నాయక్ అయినాడు. ప్రస్తుతం అతడు హవల్ దార్. అయితే, చంద్ సింగ్ ఆ విషయం లెఖ్ఖచేయకపోయేవారు.
    అర్ధ నిమీలిత నేత్రాల్తో ఆర్ముగమ్ పక్కన పడివున్నాడతను. పెద్ద తలపాగా గల తల ఒక రాతిమీద ఉంది. తలగుడ్డ అంచులు మాసివున్నాయి. దుమ్ముకొట్టుకొని ఉన్నాయి. మిగతా గుడ్డలు కూడా మురికిగానే ఉన్నాయి. అతడు సైనిక దుస్తుల్లో ఉన్నాడు-యుద్ధపు డ్రస్సులో ఉన్నాడు. బరువైన యుద్ధపు బూట్లు. వాటికి పాలిష్ ఉందా? అబ్బే. కనిపించదే! అయితే, పాలిష్ లేకుండా ఉన్నాయా? అబ్బే, లేదే! అక్కడక్కడ! చర్మం లేచింది. ఒకదానికి మడమ లేదనుకుంటే మరొకదానికి లేసుల్లేవు. గడ్డం చిందర వందరగా ఉంది. గడ్డాన్ని కట్టుకొని సింగారించుకునే దారం ఎక్కడో పడిపోవడం మూలాన వెంట్రుకలు గాలికి ఎగురుతున్నాయి.
    రామ్ దత్తా కూడా పడివున్నాడని చెప్పానుకదూ! ఆకుపచ్చని ఉన్ని టోపీ అతని ముఖాన్నీ, తలనూ కప్పివేసింది. కండ్లూ, ముక్కూ, పెదవులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ టోపీ రెండు రకాలుగా ఉపకరిస్తూంది. ఒకటి, చలినుంచి కాపాడ్తుంది. రెండు, తలమీద ఉన్న గాయాన్ని కప్పుతూంది.
    ఏమైంది అప్పుడు? స్మృతిపథంలో వెదుక్కోసాగాడు. ఆ - జ్ఞాపకం వచ్చింది. తాను సన్నీతో ఒక చెవిటి చీనావాని వీపులో పొడిచాడు. చీనావాడు పడిపోగానే బాయినెట్ లాక్కొని శత్రువుమీద దాడిచేయడానికి సంసిద్ధుడవుతూండగానే అంతా మసక కమ్మింది. ఏదో ఒక భారమైన వస్తువు తలకు తగిలింది. కళ్లు తిరిగి తాను పడిపోయాడు. తరవాత ఏమైందో అతనికి జ్ఞాపకం లేదు. యుద్ధంలో అతని తలకు బలమైన గాయం తగిలింది. ఇప్పటికీ అప్పుడప్పుడూ రక్తం ప్రవహిస్తూనే ఉంది అందులోంచి.
    టోపీ ఉండడం మూలాన ముఖానికి తగిలిన గాయాలేకాక, ఆరు రోజుల్నుంచి పెరిగిన గడ్డం కూడా కనిపించడంలేదు.     
    రామ్ దత్తా ఒక ప్రక్కకు తిరిగి పడుకొని ఉన్నాడు. ఆర్ముగమ్ ను చూస్తూ తిన్నగా పడుకునే శక్తి అతనికి లేదు. అతని కమీజుమీద ఉన్న జర్సీ అనేకచోట్ల చిరిగివుంది. పంట్లాం అతనికంటే పెద్దగా ఉంది.
    ఆర్ముగమ్ కళ్ళు తెరిచి చంద్ సింగ్ వైపు చూచాడు. అతన్నే చూస్తూ ఉండాలనేది అతని మనోకామన. చంద్ సింగ్ వదనంలో ఏదో ఆకర్షణ కనిపించిందతనికి. అదే అతని దృష్టికి కేంద్రం అయింది. ఉన్నతమై, బలయుతమైన అతని శరీరంలో ఆకర్షణ ఎలా వచ్చిందో? ఎందుకుందో? అతడు గ్రహించలేకపోయాడు. కాని, చంద్ సింగ్ అతనికేదో శక్తిని ప్రసారం చేస్తున్నట్లనిపించింది. అతడే అతని బలమూ, జీవితమున్నూ, అతడు తన జీవితమేనా? ఇది సాధ్యమేనా? సాధ్యమేమిటి? వాస్తవం అయితేనూ! చంద్ సింగ్ లేకుంటే గత కొద్ది రోజుల్నుంచి అసలు జీవించగలిగేవాడా తను? తనకు మృత్యువు ఆసన్నం అయిందనుకొన్నాడు. ఎక్కణ్ణుంచి వెతుక్కొచ్చాడోగాని తనకు ప్రాణం ప్రసాదించాడు. అది జరిగీ అప్పుడే నాలుగు రోజులైపోయింది. అసలు చంద్ సింగ్, రామ్ దత్తా అక్కడి కెందుకొచ్చిందీ అతనికర్థం కాలేదు. అతనికి తెలిసిందల్లా బులెట్ పిక్క పైభాగంలో తగలడం. అప్పుడతను 303 రైఫిల్ గుళ్ళ పెట్టె ఒక స్థావరం నుంచి మరొక స్థావరానికి తీసికెడుతున్నాడు. తనను హెడ్ క్వార్టర్స్ వెనక్కు ప్రథమ చికిత్స కోసం తీసికెళ్ళింది బాగా గుర్తుంది. అల్ఫా కంపెనీ హెడ్ క్వార్టర్స్ వెనక్కు ప్రథమ చికిత్స కోసం తీసికెళ్ళింది బాగా గుర్తుంది. అల్ఫా కంపెనీ హెడ్ క్వార్టర్స్ కమాండర్ ముత్తుస్వామి తన్ను చూడ్డానికి వచ్చిందీ, వెనక్కు తగ్గమని ఆదేశించిందీ అతడు మరిచిపోలేదు. తాను లేచి తిరగ్గల్గుదుననుకొన్నాడతను. స్ట్రెచర్ లో పడుకోవడానికి నిరాకరించాడతడు. ఎందుచేతనంటే, కొందరు క్షతగాత్రులైన సైనికుల పరిస్థితి అంతకంటే హీనంగా ఉంది. వారికి అవకాశం కల్పించడానికి అతడు కాలి నడకన బయల్దేరాడు. సంధ్య, రేయి దుప్పటి కప్పుకుంది. తోడివాళ్ళనుండి విడిపోయాడతను. లాన్స్ నాయక్ చేత్వా మాత్రమే అతనివెంట ఉన్నాడు. మిగతావారు వెనకనే దిగబడిపోవడమో, ముందు వెళ్ళిపోవడమో జరిగింది.
    వారు నడిచీ, నడిచీ అలసిపోయారు. బాగా అలసిపోయారు. ఆర్ముగమ్ బాగా నీరసించిపోయాడు. తిండీ, నీళ్ళూ ఏమీలేవు వారి దగ్గర. గాయాలవల్ల ఏమోగాని ఆకలితోనే చచ్చిపోతాననుకున్నాడు ఆర్ముగమ్. కూర్చున్నాడు. గాయాల్నుంచి రక్తం ప్రవహించసాగింది. రక్తస్రావం నిలపడం అసాధ్యం అనుకున్నాడు "చిత్తోర్." నడవడం అసాధ్యం. ఆర్ముగమ్ స్ట్రెచర్ మీదనే కదలాలి. ఆర్ముగమ్ అక్కడే పడిపోయాడు. చుట్టుపట్ల ఎవరైనా కనిపించవచ్చునని ధైర్యం ఇప్పించి, వెతకడానికి బయల్దేరాడు "చిత్తోర్." తిరిగి వచ్చి అన్నాడు - కొండకావల వెలుగు కనిపిస్తోందని. అక్కడికి వెళ్తే తిండి, నీళ్ళు దొరుకుతాయని అతని అభిప్రాయం అయివుంటుంది.
    "ఇప్పుడు కాదు, ఉదయం" అన్నాడు ఆర్ముగమ్.
    "ఉదయందాకా బ్రతగ్గలవా?" అంటూనే వెళ్ళిపోయాడు చిత్తోర్.
    కొంతసేపటికి ఆర్ముగమ్ కు ఒక పెద్ద కేకా, ఒక బరువైన పదార్ధం పడిన ధ్వనీ వినవచ్చాయి. చిత్తోర్ కాలు జారి ఉంటుంది. ఆర్ముగమ్ లేచాడు. పరిగెత్తాలని ప్రయత్నించాడు. రెండడుగులు వేశాడో లేదో, రాయి తగిలి పడిపోయాడు. తర్వాత 36 గంటలు అక్కడే పడివున్నాడు. అక్కణ్ణుంచే చంద్ సింగ్ అతణ్ణి వెతికి తెచ్చింది.
    చంద్ సింగ్ ఏమాత్రం ఆశ్చర్యం వ్యక్తపరచలేదు. కాని, "అరే! ఇక్కడేం చేస్తున్నావు జవాన్?" అన్నాడు. చేయి ఊత ఇచ్చి లేపడానికి ప్రయత్నించాడు. ఆర్ముగమ్ నుంచోగలడా? కూర్చోవడం కూడా అసాధ్యం అనిపించింది.
    "నీళ్ళు." అరచాడతను.
    చంద్ సింగ్ తన బాటిల్లోంచి కొన్ని చుక్కల నీరు ఆర్ముగమ్ నోట్లో పోశాడు. ఈలోగా రామ్ దత్తా కూడా వచ్చేశాడు.
    "ఏమిటి గురూ?"
    "ఏం, కనిపించడంలా? జవాన్ పిక్కకు గుండు తగిలింది. అతణ్ణి ఎత్తుకొని పోవాలి" అన్నాడు చంద్ సింగ్.
    ఎత్తుకొనే? చంద్ సింగ్ ఎంత తేలిగ్గా నిర్ణయించేశాడు? ఎత్తుకుపోవడం మామూలు మాటా? అయితే చంద్ సింగ్ కు కావచ్చు. కాని, ఆర్ముగమ్ కు కాదు.
    ఆ కొండల్లోంచి, దుర్ఘటమైన కొండచరియల్లోంచి మోసుకొనిపోవడం సాధ్యమా? అసలు అక్కడ కాలిబాట కూడా కనిపించందే! చిత్తోర్, తానూ! ఎలా ఇంతదూరం వచ్చారసలు! చంద్ సింగ్, రామ్ దత్తా ఆ బాటనే ఎందుకొచ్చారు? తాను చుట్టుపట్ల ఉన్న ఎత్తైన కొండల్ను చూచాడు. మనిషిని మోసుకొని ఈ కొండల్లోంచి నడవడం అసాధ్యం అని నిర్ణయించుకున్నాడు. కాగా, మోసుకొనిపోవడంవల్ల కలిగే ప్రయోజనం మాత్రం ఏముంది? బొమ్డిల్లా అక్కణ్ణుంచి 15 మైళ్ళు - అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. వారికి బాట మాత్రం తెలుసా? తోవలో అయిదు రోజులు గడచినా గడవొచ్చు. పదిహేను రోజులు గడిచినా గడవచ్చు. అన్నిరోజులు జీవించడం అసాధ్యం. గాయం పెరుగుతూంది. బలం క్షీణిస్తూంది. తెలివిలేని ఆ పని చేయకుండా తన సహచరుల్ను ఆపాలనుకున్నాడు ఆర్ముగమ్. కాని, చంద్ సింగ్ ముందు ఆ మాట అనే ధైర్యంలేకపోయింది. చంద్ సింగ్ సాధువాక్యాలు అతనిపై మంత్రంలా పనిచేశాయి. ఆ సిక్కు హవల్ దార్ ముందు అతడు వట్టి మూగవాడైపోయాడు.
    ఆర్ముగమ్ చంద్ సింగ్ వైపు చూచి అనుకున్నాడు - 'కాదు, కాదు. ఇది నా తప్పే. నేనే వారికి మోసుకొని వెళ్ళడానికి అనుమతించాను. ఇది అనవసరం అయిన శిక్ష. గత నాలుగు రోజుల్నుంచీ ఎంత బాధపెట్టాను వారిని! ఇప్పటికి వారు బొమ్డిల్లా చేరివుండేవారు. కాకున్నా సురక్షిత ప్రదేశానికి చేరివుండేవారు. నేను దోషిని. నిజమే కాని, ఏమి చేయాలి నేను? ఇక్కడ వదిలేస్తాడా నన్ను చంద్ సింగ్? అతడు నా పల్టన్ పేరూ అడగలేదు. నేనెలాంటి పరిస్థితుల్లో గాయపడిందీ అడగలేదు. స్ట్రెచర్ తయారుచేయడానిగ్గాను కొమ్మలు కొట్టమని రామ్ దత్తాకు ఆర్డరు ఇచ్చి చంద్ సింగ్ తన దగ్గర కూర్చున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.