Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    ఆ గదిలో గంభీరమైన ప్రశాంతత రాజ్యం చేసింది. గడియారపు "టక్ - టక్" ధ్వని కఠోరంగా వినిపిస్తూంది. కర్నల్ పేపర్ కట్టర్ ను రెండు చేతులతో త్రిప్పుతూ తన మాటల ప్రభావం ఎలా ఉంటుందో అని అంచనా వేయసాగారు. శైలా వదనం స్వేదబిందువులతో నిండిపోయింది. జేబురుమాలుతో నుదురు తుడుచుకుంది.
    "ఆఖరికి చెప్పేదేమంటే, మీరు భోఁస్లేను వదులుకోండి. అతడు లిలీనే పెండ్లాడాలి. అలాకాకుంటే నా కూతురు కూకటివ్రేళ్ళతో కూలిపోతుంది."
    "అయితే సర్! నన్ను కూడా ఏమన్నా చెప్పమన్నారా?" కంపితస్వరంతో అడిగింది శైలు.
    "చెప్పండి."
    "పెండ్లిని గురించిన నిర్ణయం ఉత్తమ్ కు వదిలివేయండి. మీ కూతుర్ను ఇక్కడికి పిలిపించండి. ఉత్తమ్ ఆవిణ్ణే ప్రేమించేట్లైతే నేను తొలగిపోతాను. కాకుంటే...."
    "ఇంకా ఉత్తమ్ కు ఒక నిర్ణయం తీసుకొనే దశ రాలేదు. గత స్మృతులు జాగృతం కావాలి."
    "Sir! నేనొక సూచన చేయనా....?" ఉండబట్టలేక అడిగేశాను.
    "కెప్టెన్ గుప్తే! దిగువ ఆఫీసర్ల నుండి ఆదేశాలు పొందే అలవాటు నాకు లేదు. నేనే నిర్ణయాలు చేస్తాను." అతి కఠిన పదాలతో తెంపేశారు నన్ను. శైలా కళ్ళు చెమ్మగిల్లాయి. అతి ప్రయాసతో కన్నీరు పొర్లకుండా ఆపుకుంది.
    "సర్! నాకు డిశ్చార్జి ఇవ్వండి. కావాలంటే రాజీనామా ఇస్తాను." గత్యంతరం లేక అన్నది శైలా.
    "లెఫ్టినెంట్ భగత్! సైన్యంలో పనిచేయడం ఒక్క గొప్ప దేశ సేవ. దేశ సేవ చేయడానికి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చారు. కాని, రొమాన్సు చేయడానిక్కాదు. రొమాన్సులో ఓడిపోయి రాజీనామాను గురించి మాట్లాడ్తారా? Shame!"
    శైలకు నిలిపివుంచిన కన్నీరు కట్టలు త్రెంచుకొని ప్రవహించింది.
    "మిమ్మల్ని అతి దూర ప్రదేశానికి ట్రాన్స్ ఫర్ చేయడానికి సిపార్సు చేస్తున్నాను. కమాండర్ హెడ్ క్వార్టర్సుకు వెళ్ళడానికి ఈ రోజే బయల్దేరాలి. తరువాతి ఆదేశాలు మీకు అక్కడ అందుతాయి. స్టాఫ్ ఆఫీసర్ నుంచి Movement order, warrant - అన్నీ ఒక గంటలో దొరుకుతాయి. సాయంకాలం మూడు గంటలకు హెడ్ క్వార్టర్స్ కు ట్రాన్స్ పోర్టు పోతూంది. అందులో వెళ్ళండి." ఈ కర్నల్ గారి ఆదేశంలో ఇసుమంత మార్పు రావడానికి వీల్లేదని మాకు తెల్సు.  
    ఈ వ్యవహారం కెప్టెన్ భోఁస్లే మీద ఎలాంటి ప్రభావం వేస్తుందో, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని ఆలోచించసాగాను.
    "Sir! కెప్టెన్ భోఁస్లేకు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతుంది. మతి భ్రమిస్తుంది. ఒక వీర సైనికుడు నిష్ప్రయోజకుడు అయిపోతాడు. సర్! అతడు పూర్తిగా బాగయ్యేవరకూ నన్నిక్కడ ఉండనివ్వండి. ఈ చిన్న విన్నపం మన్నించండి. అతనికిదొక షాక్ కానివ్వకండి. నా ప్రార్థన.... ఆలకించండి....సర్!"
    "నో, నో, నో. మీరు తప్పక వెళ్ళాల్సిందే.Immediately you must go. ఇందుగ్గాను షాక్ తగిల్తే ఉత్తమ్ కు పూర్వస్మృతి రావచ్చు...." అంటూ కుర్చీలోంచి లేస్తూ "భోఁస్లే పరిస్థితి క్షీణించవచ్చు. అయినా, ఈ చాన్స్ తీసుకోవాలి" అని గొణగసాగాడు.
    "ఇక మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు."
    శాల్యూట్ చేసి మేము బయటికి వచ్చాం. శైలా భగత్ గొంతు గద్గదికం అయింది. ఆవిడ వీపు తట్టి hutment దాకా పంపించివచ్చాను.
    ఇదంతా జరిగింది ఉదయం 11-00 గంటలకు. సాయంకాలం మూడు గంటలకు శైలాభగత్ మోటార్లో కూర్చోవడానికి సంసిద్ధం అయింది. అంతవరకూ ఉత్తమ్ కు ఈ విషయం మాత్రం తెలియనీయలేదు. ఉండబట్టలేక నేనే 2-50కి ఉత్తమ్ దగ్గరికి వెళ్ళి శైలాకు చాలా దూరానికి బదిలీ అయిందని తెలియజేశాను.
    పిచ్చివానిలా పరిగెత్తాడతను. 'నన్ను వదలి ఎక్కడికి వెళ్తున్నావ్?' అని కేకలు వేశాడు. ఇద్దరు మేల్ నర్సులు అతనివెంట పరిగెత్తుతున్నారు.
    అతడు మోటారుకు 50 అడుగుల దూరంలో ఉండగా మోటార్ హారన్ మ్రోగింది. సెల్ఫ్ వత్తడమూ, బండి గేర్లోపడి నడక సాగించడమూ జరిగిపోయాయి. బండ్లో ఉన్న శైలా చేయి ఊపి సైతం శలవు తీసుకోలేకపోయింది.
    మోటారు సాగగానే ఉత్తమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అమాంతంగా కూలబడ్డాడు.
    "డాక్టర్! ఈవిడ లిలీకాదూ? ఎవరావిడ? మసక మసగ్గా జ్ఞాపకం వస్తూంది. డాక్టర్! ఏమిటో చిత్రంగా ఉంది. నా శరీరం బాగుండలేదని నా తండ్రికి తెలియచేశారా? లిలీ ఎందుకు రాలేదు?" అన్నాడు ఉత్తమ్ భోఁస్లే. అతని వీపుమీద చేతితో నిమిరసాగాను. ఒకేసారి షాక్ కాకుండా క్రమంగా గతం స్మరణకు తెచ్చుకోవడానికి ఉపకరిస్తున్నాను.
    ఇక్కడ ఉత్తమ్ భోఁస్లే అంధకారంనుంచి తేజస్సు, నవజీవనం, నవోత్సాహం, నవాశయాలు, నవ తేజస్సులోనికి ప్రవేశించాడు. అదే క్షణంలో శైలా తన ఆశలు, ఆశయాలు, వలపులు, కోర్కెలు హోమం చేసి అంధకారంలోకి వెళ్ళిపోయింది.
    పదండి ముందుకు.
    యుద్ధం కాదూ మరి!

                                                                     *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.