Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
కాటూరు - ఎలమర్రులలో మలబారు పోలీసులు చేయని ఘాతుకం లేదు. ప్రజలను దిగంబరులను చేసి ఊరేగించారు.
ప్రజలను గాంధీ విగ్రహం ముందు దిగంబరంగా నిలిపారు!
అది నిరంకుశత్వం కరాళ నృత్యం చేసిన వేళ!
అహింసారాజ్యంలో హింస పురివిప్పి ఆడిన వేళ!!
ఓ మహాత్మా! ఓ మహర్షీ!
"I see a day when gandhians will be hanged in India" అన్నాడు బట్రెండ్ రస్సెల్.
"భారత దేశంలో గాంధీ వాదులను ఉరితీసేరోజు వస్తుంది."
ఈ సంఘటనను నేను 'జనపదం' నవలలో చేర్చాను.
ఇరవయి మూడు
సమరశంఖం:
మార్పు వ్యక్తి జీవితంలోనూ, జన జీవితంలోనూ, సమాజ జీవితంలోనూ సమస్యలు సృష్టిస్తుంది. 'మార్పు' మంచిదయినా సమస్యలుంటాయి. మంచిదికాకున్నా సమస్యలు ఉంటాయి.
భారతదేశ చరిత్రలో మనకు వచ్చిన స్వాతంత్ర్య చరిత్రలో ఇలాంటి పరిణామాలు చాలా, చాలా అరుదుగా వస్తాయి.
ఆంగ్లేయులు భారతదేశాన్ని బలవంతంగా వదిలారు. వెళ్లేప్పుడు అనేక సమస్యలు సృష్టించిపోయారు. భారత జాతికి ఎన్నడూ ఎరగని మతకలహాలు ఆంగ్లేయుల సృష్టి. వారు పాకిస్తాన్ సృష్టించారు. సంస్థానాధీశులకు స్వాయంత్ర్యం ఇచ్చారు. అదొక సమస్య.
హైదరాబాదు సంస్థానం ఒక సమస్య. నిజాం రాజు పెద్ద బెడద. అతడు కొంప కాలేప్పుడు వారం పీక్కోవాలనుకున్నాడు. మరిన్ని సమస్యలు సృష్టించాడు. భారత ప్రభుత్వం మత్తమాతంగం. అది నిజం. నిజాము మశకం. దోమ ఏనుగు చెవిలో దూరి బాధించింది.
ఒకటిన్నర శతాబ్దంగా భారత్ సైన్యాలు సికిందరాబాదులో ఉంటున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిం తరువాత ఉన్నాయి. అప్పటికి సుమారు 1400 సైన్యం ఉంది. వీటిని మించి మందుగుండు గిడ్డంగులున్నాయి. వాటిమీద దాడికి రజ్వీ అనేకసార్లు ప్రయత్నించి విఫలుడయినాడు. యధాతథ ఒప్పందం ప్రకారం సేనలను ఉపసంహరించడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 1948 జనవరినుంచి ఏప్రెల్ వరకు ఉపసంహరించింది.
నిజాం నవాబు సైన్యాలు పెరుగుతున్నాయని - బలం పెంచుకుంటున్నాయని పుకార్లు బయలుదేరాయి. పాకిస్తాన్ లో అయిదు లక్షల మందిని నిజాం రిక్రూట్ చేశాడని మద్రాసు ప్రధాని రెడ్డియార్ ప్రకటించాడు. నిజాంసేన దాడి చేస్తే తన రాష్ట్రానికే ప్రమాదం వాటిల్లవచ్చునని భయపడ్డాడు.
దొంగచాటుగా సిడ్నీ కాటన్ ఆయుధాలు చేరవేస్తున్నాడు. విదేశాల్లో ఆయుధాలు కొనడానికి నిజాం ప్రయత్నిస్తున్నాడు.
వీటన్నింటితో దేశంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. వీటిని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 1948 జనవరిలో సైన్యాన్ని హెచ్చరించింది. 1948 జనవరి 20 వ తేదీన సైనిక ప్రధాన కార్యాలయం "హైదరాబాదు సైన్యాలు భారతదేశం మీద దండెత్తే వీలులేకుండా చూడాల్సిందని" అందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సదరన్ కమాండును ఆదేశించింది.
1948 ఫిబ్రవరిలో ఈ ప్రణాళికకు POLO అని నామకరణం చేశారు. సైనికులు తమ వ్యూహాలకు పేర్లు పెడ్తారు. హైదరాబాదు "పోలో" అనే ఒక క్రీడకు ప్రసిద్ధం. అందువల్ల దానికి "పోలో" అని పేరు పెట్టారు. "పోలో" ఆటలా సైనిక చర్య జరుపుతామని ఆ పేరు పెట్టారు.
సదరన్ కమాండువారు "హైదరాబాదు సైన్యానికి దాడి చేస్తే శక్తి లేదని" నివేదిక అందించారు. ఆనాటి నుంచి భారతదేశంలో అనుకూలంగానూ హైద్రాబాదులో వ్యతిరేకంగానూ పరిణామాలు సంభవించాయి.
భారతదేశానికి అనుకూల పరిణామాలు:
1. విభజన వల్ల కలిగిన రక్తపాతం అంతం అయింది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
2. కాశ్మీర్ పరిస్థితి కూడా అల్లకల్లోలంగా లేదు. పాకిస్తాన్ ప్రణాలికలను భగ్నం చేయడం జరిగింది.
3. సుమారుగా సంస్థానాలన్నీ భారతదేశంలో లీనం అయిపోయాయి.
4. జునాగఢ్ పాకిస్తాన్ సరిహద్దు సంస్థానం. జుల్ఫిఖాన్ అలీ భుట్టో జన్మస్థానం. అక్కడ భారతదేశంలో విలీనాన్ని గురించి రెఫరండం జరిగింది. భారతదేశంలో విలీనానికి అనుకూలంగా 2,22,304 ఓట్లురాగా, వ్యతిరేకంగా 150 మాత్రం వచ్చాయి.
5. స్వాతంత్ర్యం లభించిన ఆరు నెలలకు ప్రభుత్వం స్థిరపడింది. అంతర్జాతీయ సముదాయం భారత స్థిరతను గుర్తించింది.
6. మిగిలిన ఒక్క హైదరాబాదు సమస్యను పరిష్కరించగలిగే శక్తిస్తోమతలను సమకూర్చుకుంది.
నిజాం రాజ్యానికి ప్రతికూల పరిస్థితులు:-
1. నిజాం బడ్జెటు 2.25కోట్లకు చేరుకుంది. ఇది బడ్జెటులో కనబరచిన సంఖ్య పరిస్థితి ఇంతకంటె అధ్వాన్నంగా ఉంది. ఇది భారత ప్రభుత్వం విధించిన దిగ్బంధ ఫలితం.
i) గ్రామాధికారులు గ్రామాలు వదిలారు. ఇందుకు కారణం ప్రజా ఉద్యమం. కొందరు అభిమానంతో వదిలారు. ఇందుకు కారణం ప్రజా ఉద్యమం. కొందరు గ్రామాల్లో నిలువలేక వదిలారు. ఫలితంగా రెవెన్యూ వసూళ్లు నిలిచిపోయాయి..
ii) వర్తకులు రజాకార్ల భయానికి రాజ్యం వదిలి వెళ్లారు. వ్యాపారం సుమారు నిలిచిపోయింది. వ్యాపారం నిలిచిపోవడంవల్ల ప్రభుత్వానికి రాబడి తగ్గింది. ప్రజలకు బాధలు హెచ్చినాయి. అందువల్ల మరింత వలసపోయారు.
iii) దిగ్భంధం వల్ల సరుకుల రాకడ తగ్గింది. అందువల్ల కరోడ్గిరీ - కస్టమ్స్ ఆదాయం తగ్గింది.
iv) పనాహ్ గజీర్ - శరణార్థులను స్వాగతం పలికి తీసుకొని వచ్చారు. వారికిగాను ఖర్చు పెరిగింది.
v) సుమారు లక్షమండి రజాకార్లను పోషించాల్సి వచ్చింది.
vi) ప్రజా ఉద్యమాలను అణచడానికి పోలీసు - మిలిటరీ ఖర్చు ఎక్కువయింది.
2. ఇది ఆర్థికం. శాంతి భద్రతలు మృగ్యం అయినాయి. ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది.
i) ప్రభుత్వం నిజాం నవాబుదో - కాసిం రజ్వీదో అర్థం కాని దశ వచ్చింది. కీలక నిర్ణయాలలో సహితం రజ్వీ పెత్తనం కనిపించింది. ప్రధాని లాయకలీ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ తో ఒక అంగీకారానికి వచ్చాడు. ధ్రువీకరణకు మాత్రం హైదరాబాదు వచ్చారు. రజ్వీ కాదన్నాడు. నిజాం మిన్నకున్నాడు.
ii) అధికారులకు తమ విధులు నిర్వర్తించడం అసాధ్యమైంది. ప్రభుత్వ యంత్రాంగం సాంతం నిలిచిపోయింది. ప్రభుత్వం లేకుండా అయింది.
iii) తెలంగాణా గ్రామాలను కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజలు వశపరచుకున్నారు. పాలించుకున్నారు. ప్రజలను దోచుకోవడానికి అప్పుడప్పుడు వచ్చిన రజాకార్ల ముఠాలే ప్రభుత్వం అనిపించింది.
iv) కాంగ్రెసువారు సరిహద్దులలో సాయుధ క్యాంపులు నెలకొల్పారు. హైదరాబాదు శాసన సభలో పోలీసు మంత్రి ప్రకటనను అనుసరించి బొంబాయి సరిహద్దులలో 23 కేంద్రాలు - మద్రాసులో 21 - మధ్య పరగణాల్లో 4 ఉన్నాయి. వారు సుమారు 400 దాడులు చేశారు.
v) 1948 ఫిబ్రవరిలో ఉమ్రీ పట్టణంలోని హైదరాబాదు స్టేట్ బ్యాంక్ లూటీ జరిగింది. 22 లక్షల 60 వేల రూపాయిల దోపిడీ జరిగింది. ఈ చర్యలో 17 మంది ప్రాణాలు పోయాయి.
ఈ చర్య సోషలిస్టు పార్టీ అభిమానంగల కాంగ్రెసువారు చేశారని చెప్పుకుంటారు. ఈనాటి వృద్ధ కాంగ్రెసు నాయకుడు గోవింద్ దాస్ ష్రాఫ్ అందుకు కారణం అని ప్రవాదు. అందులో చాల వరకు ప్రజాపోరాటానికి కర్చు చేశారు. మిగతా ధనంతో గాంధీ భవనం నిర్మించారని చెప్పుకున్నారు.
vi) 1948 మే 23వ తేదీన 'గంగాపూర్' రైల్వే స్టేషను దగ్గర మద్రాసు దోచుకున్నారు. ఇద్దరిని హత్య చేశారు. అనేకమందిని గాయపరచారు. పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
vii) కాంగ్రెసులో వ్యక్తులు మాత్రమే ఉంటారు. వారిది ఇష్టారాజ్యం. వారు దేనికీ కట్టుబడరు.





