Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
ఒక యువక తరానికి తరమే బలియై పోతున్నప్పుడు ఈ సామాను ఒక లెఖ్ఖా?!
హడావుడిలో ఉత్తమ్ భోఁస్లే విషయంలో అట్టే శ్రద్ధ తీసుకోలేకపోయాను. కర్నల్ గారి స్వంత కేసు అది. అంతేకాక, లెఫ్టినెంట్ భగత్ విశేషంగా శ్రద్ధ తీసుకొంటూంది.
ఒకరోజు కెఫ్టెన్ భోఁస్లే కలిశారు. శరీరం స్వస్థం అయింది. అరవడం వగైరా అణగిపోయాయి. మిగిలిన లక్షణమల్లా ఒక్కటే - అది మెదడుకు తగిలిన షాక్. గతాన్ని గురించిన స్మృతి లేదతనికి. షాక్ తగిలి స్మృతి పోతుందనే విషయం వైద్య గ్రంథాల్లోనూ, కథల్లోనూ, నవలల్లోనూ చదివాను - ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నాను.
ఒకనాడు కనిపిస్తే క్షేమం అడిగాను.
"Well captain! ఎలా ఉందిప్పుడు?"
"fine! ఎలా కనిపిస్తున్నాను డాక్టర్?"
"very fine!" అన్నాన్నేను.
"మరి ఫ్రంట్ కెప్పుడూ పంపేది?"
"మీ కపూర్ గారి దగ్గర ఉంది కేసు. ఆయన 'ఫిట్' చేస్తే వెళ్ళవచ్చు" అని మళ్ళీ అడిగాను- "మీకు కర్నల్ కపూర్ తో ఇంతకుముందునుంచే పరిచయం ఉందా?" అని.
"హుష్. ఈ క్యాంపులోనే చూశాను నేనాయన్ను."
"బాగా ఆలోచించండి. ఎక్కడో అంతకుముందే పరిచయం ఉండివుంటుంది."
"నిజం చెప్పమంటారా డాక్టర్! నాకు గడచిన నెల పదిహేను రోజుల అవతలిది ఏదీ గుర్తుకు రావడంలేదు."
"మీ తలిదండ్రులు ఎక్కడుంటారు? జీవించి ఉన్నారా?"
"పుట్టినప్పుడు నాకూ తలిదండ్రులుండొచ్చు. కాని, నా పూర్వ చరిత్రే నాకు గుర్తుకు రావడంలేదు. చాలాసార్లు గతాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. కాని.... కాని.... గుర్తుకు రాలేదు. శైలా, మీరూ ఈ క్యాంపులో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం బాగయ్యాను. మీరు లేకుంటే పిచ్చివాణ్ణైపోయేవాణ్ణే." వ్యధిత హృదయంతో అన్నాడు.
నేను నవ్వాను.
"ఎందుకు నవ్వుతున్నారు?" అడిగాడతను.
"ఊరికెనే. యోగులకు గతమూ, వీరులకు భవిష్యత్తూ ఉంటాయంటారు."
"మంచిదే. భవిష్యత్తు కోసమే బ్రతకాలనుకుంటున్నాను."
గతంలోకి దూరి అతని పూర్వవృత్తాంతాన్ని తెల్సుకోవడంలో విఫలుణ్ణైనాను.
శైలా భగత్, ఉత్తమ్ భోఁస్లేల సంబంధం నర్స్, పేషంట్ సంబంధాన్ని మించిపోతున్నట్లు కనిపిస్తూంది.
ఒకనాడు ఉత్తమ్ భోఁస్లే నా దగ్గరికి వచ్చి స్పష్టంగా అడిగాడు "డాక్టర్! సైన్యంలోని ఆక్టివ్ డ్యూటీకి నన్ను అయోగ్యుణ్ణి - అన్ ఫిట్ చేయగలరా?" అని.
"అంటే?"
"నాకు డిశ్చార్జి లభిస్తుంది."
"తరవాత?"
"శైలాతో పెండ్లి."
నాకిదేమీ ఆకస్మికంకాదు. ఇలాంటిదేదో జరుగుతుందని ఊహిస్తూనే ఉన్నాను. అయితే, ఇలాంటివి సైనిక క్రమశిక్షణకు విరుద్ధాలు.
పదిహేను రోజుల తర్వాత కర్నల్ గారు నన్ను తమ ఆఫీసుకు పిలిపించారు.
లెఫ్టినెంట్ శైలా భగత్ కూడా యూనిఫారంలో అక్కడ నుంచుని ఉంది. శాల్యూట్ చేసి నుంచున్నాను. ఒకదాని తర్వాత ఒకటి విపరీత పరిణామాలు జరగసాగాయి. కర్నల్ కపూర్ కు క్రమశిక్షణంటే మక్కువే అయినప్పటికీ కమీషన్డ్ ఆఫీసర్లు శాల్యూట్ చేసినతరువాత కూర్చోమని కుర్చీ చూపేవారు. ఇవాళ మా ఇద్దర్నీ నుంచోపెట్టే ఉంచారు.
రెండవది - సైన్యంలో ఒకణ్ణి చీవాట్లు పెట్టాల్సి వచ్చినప్పుడు మూడోవాణ్ణి అక్కడ ఉంచాల్సిన పనిలేదు-చీవాట్లు పెట్టేవాడూ, చీవాట్లు పడేవాడూ మాత్రమే ఉండాలి. నేను మూడోవాణ్ణి.
"లెఫ్టినెంట్ భగత్! మిమ్మల్నెందుకు పిలిపించిందీ గ్రహించే ఉంటారు." కళ్ళతో శైలా మనసును కొలుస్తున్నట్లుగా చూస్తూ, కఠిన స్వరంతో గర్జించి అడిగారు కర్నల్.
"నో సర్!" నత్తి నత్తిగా జవాబు చెప్పింది భగత్.
"కెఫ్టెన్ భోఁస్లే ఆరోగ్యం ఎలా ఉందిప్పుడు?"
"బాగానే ఉంది. కాని, గత స్మృతి ఏమాత్రం లేదు."
"అది నాకూ కనిపిస్తూంది."
"మీరు ఆదేశించినట్లు చికిత్స జరుగుతూంది. మందు తీసుకోవడానికి మంకు చేస్తారు. ఆ మాటా, ఈ మాటా చెప్పి మందు త్రాగిస్తున్నాను."
"మీరు చెపితే వింటాడు కదూ!"
"yes sir!"
"అతని హృదయం మిమ్మల్ని పట్టేసింది. అవునా?" తీవ్రంగా అడిగారు కర్నల్.
శైలా మౌనం వహించింది.
నేను తికమకపడ్డాను.
"కెఫ్టెన్ గుప్తే! మిమ్మల్ని కావాలనే పిలిపించాను. ఉండండి."
"సావధానుణ్ణై "yes sir!" అని మామూలుగా నుంచున్నాను.
"speak out. లెఫ్టినెంట్ భగత్! చెప్పండి. నాకు స్పష్టమైన సమాధానం కావాలి. జారుడు జవాబులవసరం లేదు." కర్నల్ గర్జించారు.
"అతణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? అలా శంకించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి."
భగత్ నేలను చూస్తూ "yes sir" అన్నది.
"కెఫ్టెన్ భోఁస్లే విషయంలో నాకు ఆసక్తి ఉందని చెప్పానా?"
"అవున్సర్."
"ఆ ఇంటరెస్టేమిటో తెలుసా? మరేమిటీ ఇదంతా?"
"No sir!"
"కెఫ్టెన్ భోఁస్లే నా కూతుర్ను ప్రేమించాడు. అతడామెను పెళ్లాడాల్సింది........"
"అతడల్లాంటిదేదీ అనలేదు."
"అతనికి గత స్మృతి ఎక్కడిదీ? నేను 'లిలీ' తండ్రిని. నా చెల్లెలు మిసెస్ కేవల్ కృష్ణ. బ్రిగేడియర్ కేవల్ కృష్ణకు సంతానం లేకపోవడం మూలాన లిలీ బాల్యంనుంచీ అక్కడే ఉంటూంది. జనం 'లిలీ' వారి కూతురేననుకుంటారు. బెల్గావ్ఁలో వారిద్దరు కలుసుకోవడమూ, పరిచయం కావడమూ, ప్రేమించుకోవడమూ జరిగింది. 'లిలీ' 'ఎంగేజ్ మెంట్' అయింతర్వాత ఉత్తమ్ ఫ్రంట్ కు వెళ్ళాల్సి వచ్చింది. నా కూతురు సర్వనాశనం కావడానికి వీల్లేదు." కర్నల్ గారు ఒక్కొక్క పదం తూచి, కొల్చి ఎక్కడెక్కడ ఏ పదం వాడాలో, వాడి మాట్లాడుతున్నారు. చివరివరకూ తమ దృష్టిని శైలా ముఖం మీదినుంచి మరలించారు కారు.
ఇదంతా విని శైలా గడగడలాడింది. తనకు తెలియకుండానే కుర్చీని ఆధారం చేసుకొని నుంచుంది. ఆవిడ దయనీయస్థితి చూచి కర్నల్ గారు అన్నారు:
"sit down.... భగత్ కెప్టెన్ గుప్తే! మీరూ కూర్చోండి."
"Thank you sir!" అంటూ నేనూ, మౌనంగా శైలా కుర్చీల్లో కూర్చున్నాం.
"Look here, చూడండి లెఫ్టినెంట్ భగత్! మీ ప్రవర్తన క్రమశిక్షణ ప్రకారం లేదు. You are an officer here. మీ డ్యూటీని గురించి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు - వికలాంగులకు సేవ చేయడం, క్రింది ఉద్యోగులతో పని తీసుకోవడం - కాని, మీరు రొమాన్సులో పడ్డారు. ఇది రొమాన్సుకు స్థానం కాదు...." కర్నల్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆగిపోయారు.





