Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    ప్రజాపోరాటాల్లో మొట్టమొదట వదులుకోవలసింది ప్రాణభయం.

 

    భయంలేదుకాని అప్రమత్తం!

 

    పాము భయం పాముది. శత్రువూ జాగ్రత్త పడ్తాడు! వాడికి మాకన్న ప్రాణం భయం మిన్న. వాడు బతకడానికి చేరాడు! రోడ్డుకు ఇరువైపులా కొన్నిమైళ్లు చెట్లులేకుండా కొట్టేశారు. సుమారు అడవిని క్షవరం చేశారు. అంటే - చాటు దాడి సాధ్యం కాకుండా చేశారు.

 

    మేము 'క్షవరంప్రాంతం సగంలోకి వచ్చాం. ఒక రోడ్డు పక్క పూర్తి మలుపు ఉంది. ఏదయినా మరీ దగ్గరకు వస్తేగాని కనిపించదు. అమాంతంగా వస్తున్న మిలిటరీ ట్రక్కు కనిపించింది.' అది ట్రక్కు. దూసుకుని వస్తూంది. మాది కాలినడక. ఏంచేయాలో తెలియదు. సందిగ్ధం. వెనకా ముందూ ఒకే దూరం ఉంది. అడకత్తెరలో చిక్కుకున్నాం.

 

    "ముందుకే" అన్నాడు కిషన్ రావు. ఒకరి జాడ ఒకరికి తెలియకుండా పరుగు లంకించుకున్నాం. పరిగెత్తడం అంటే అతి వేగంగా ఉరుకుతున్నాం. ఆపరిధి దాటాం. అప్పటికి ట్రక్కులు చేరుకున్నాయి. ఒక్కటి కాదు - వరుస!

 

    మేము దాటుకున్నాం. జిట్రేగు పొదల్లో పడిపోయాను. రోడ్డువైపు చూస్తున్నాను. ట్రక్కులు సాగిపోలేడు. ఆగిపోయాయి! వాళ్ళు మమ్ములను చూసినట్లున్నారు. ఆత్మరక్షణకోసం ఆగారో - దాడికోసం నిలిచారో తెలియదు. కొందరు ట్రక్కు దిగారు. మిలిటరీ వాళ్లు! ఏదో మాట్లాడుకున్నారు. తుపాకులతో మేము ఉన్న వైపు సాగుతున్నారు. నాకు జిట్రేగు పొదనుంచి స్పష్టంగా కనిపిస్తున్నారు. నేనుమాత్రం వారికి కనిపించడం లేదు.

 

    మిలిటరీ వాళ్లు కొంతదూరం వచ్చారు. ఏమనుకున్నారో వెనక్కు తిరిగారు. మళ్లీ రోడ్డుమీదికి చేరుకున్నారు. మళ్లీ ఏదో మాట్లాడుకున్నారు.

 

    "బాహర్ ఆవో, నహీఁతో గోలీ చలెగే" అని కేకలు పెట్టారు. 'బయటికి రండి. రాకుంటే తుపాకిగుళ్లు సాగుతాయి."

 

    నేను జిట్రేగు చాటున ఉన్నాను. కదలను. ప్రాణం అక్కడే పోవాలి. అది నాకు తెలుసు. మిగతా ముగ్గురి సంగతి తెలియదు. వాళ్లలో ఎవడన్నా నిక్కుతాడో భయపడ్తాడో - బయటపడ్తాడో అని అనుమానం.

 

    ఆ క్షణంలో ఆలోచనలు. నా దగ్గర ఆయుధం ఉంటే ఎంత బావుండును? బాంబులుంటే ఇంకా బావుండేది. విసిరేవాణ్ణి. చచ్చేముందు నలుగురిని చంపేవాణ్ణి!

 

    మిలిటరీ వాళ్లు అలా మూడు సార్లు అరిచారు. అరిచి వెళ్లిపోతారనుకున్నా. వాళ్లను భయం వెంటాడుతున్నది. వాస్తవంగానే తుపాకులు తీశారు. మావైపు గురిపెట్టారు. మేము 'గురి' దూరంలోనే ఉన్నాం. టపాకులవలె బుల్లెట్లు పేల్చారు. పేలుస్తూనే ఉన్నారు. బుల్లెట్లు నన్ను దాటిపోతున్నాయి. ఎన్నో తెలియదు. మిగతా వాళ్లు ఏమయింది తెలియదు!

 

    అలా కొంతసేపు సాగింది. ఎవరు చచ్చారో - ఎవరు బతికారో తెలియదు. మిలటరీవాళ్లు కాల్చడం మానారు. మేము చచ్చాం అనుకొని ఉంటారు. అన్ని తూటాలు కాల్చాం. తగలలేదా అనుకొని ఉంటారు. లేదా తూటాల కర్చు లెక్క చూచుకొని ఉంటారు. ట్రక్కులు ఎక్కారు. వెళ్లిపోయారు.

 

    నేను లేవలేదు. రేగుపొదలో ఉన్నాను. ముళ్ల బాధ ఇప్పుడు అర్థం అవుతున్నది. ట్రక్కుల చప్పుడు సమసిపోయేవరకు పడుకున్నాం. అప్పుడు లేచాం. వంటినిండా ముళ్లు. లేవడం చాతకావడం లేదు. భగవదనుగ్రహం. నలుగురం క్షేమం.

 

    నిజాం మిలిటరీ గురికి నవ్వుకున్నాం.

 

    అవి మాదగ్గరుంటే మసిచేసేవాళ్లం అనుకున్నాం.

 

    మనసూ శరీరం రెండూ అలసిపోయాయి. కదలడం చేతకాదు. కాని విధిలేదు. ఇంకా చాలా నడక ఉంది. మనం పరిగెత్తకుండా ఉండాల్సింది... అయితే పట్టుపడే వాళ్ళమేమో! వాళ్లకెందుకు అంత భయం? ఇలా మాట్లాడుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ సాగాం.

 

    తెల్లవారుతుండగా ఏరు వచ్చింది. ఏరు సరిహద్దు. ఏరుదాటితే 'మనరాజ్యం' యూనియన్! ఏరు దాటాం. ఏటి ఇసుకలో పడిపోయాం. ఎంత నిద్ర! ఎంత నిద్ర! పొద్దు పొడిచింది. ఎండ వచ్చింది తెలియలేదు. నీళ్లకు వచ్చిన ఆడవాళ్లు నీళ్లు చల్లారు - మేము బ్రతికి ఉన్నామని ధ్రువపరచుకోవడానికి!

 

    అప్పుడు లేచాం. కొంత సిగ్గుపడ్డాం. ఏటిలో ముఖాలు కడుక్కున్నాం. అది 'తక్కెళ్లపాడు.' ఊళ్లోకి వెళ్లాం. చాయ్ తాగాం. బస్సెక్కాం. బెజవాడ చేరుకున్నాం.

 

    విరామ విరమాయాసా దస్మాద్దురధ్యవసాయతో
    విపది మహతాం ధైర్యధ్వంసం యదీక్షితు మీహసే
    అయి జడవిధే కల్పాపాయేఁ స్యపేత నిజక్రమాః
    కువ శిఖరిణః క్షుద్రానైతే నవాజల రాశయః.

 

    విధీ! మహాత్ములకు ఆపదలు కలిగిస్తావు. వారి ధైర్యం ధ్వంసం చేయాలనుకుంటావు. అది నీకు అసాధ్యం. మానుకో.

 

    కల్పాంతం అవుతుంది. ప్రళయం వస్తుంది. సముద్రాలు పొంగుతాయి. అవి అంత క్షుద్రములు కావు. కులగిరులను కదిలించవు!

 

    బెజవాడ చేరారు. Pleasant surpise! విచిత్ర సంతోషం! అన్నయ్య విడుదలయి -క్షేమంగా బెజవాడ చేరుకున్నాడు. ఆఫీసులో కనిపించాడు.

 

    ఎదురుగా అన్నయ్య! నమ్మరాని నిజం!

 

    తమ్ముడూ"! అనే పిలుపు.

 

    పున్నమినాడు సంద్రంలా మనసు పొంగింది.

 

    "అన్నయ్యా!" అది గుండె చీల్చుకొని వచ్చింది.

 

    ఇద్దరం గట్టిగా కావిలించుకున్నాం.

 

    మళ్ళీ విడిపోతామేమో అన్నట్లు అలాగే ఉండిపోయాం.

 

    ఇద్దరి బుజాలూ తడిసిపోయాయి - నవ్వినా - ఏడ్చినా - కన్నీళ్లే వస్తాయి! అవి ఆనంద బాష్పాలు!

 

    అయ్యవారు - హయగ్రీవాచారిగారి - కళ్లు చెమ్మగిల్లాయి. వారు కండువాతో కళ్లు తుడుచుకున్నారు. మా ఉభయుల వెన్నులు తట్టారు! మమ్ములను తమముందు కూర్చుండ పెట్టుకున్నారు. చాయ్ తాగుతూ మనసులు తోడుకున్నాం. ముచ్చట్లు పెట్టుకున్నాం.

 

    తులసీదాసు రామాయణంలో 'భరత్ మిలాప్'కు ఎంతో ప్రాధాన్యత ఉంది! అన్నదమ్ములు కలుసుకోవడాన్ని ఎంతో హృద్యంగా చిత్రించాడు ఆ మహానుభావుడు!

 

    మేము ఇద్దరమూ దాశరథులమే! రాముడూ - భరతుడూ దాశరథులే!

 

    అన్నయ్యా - నేను ఇద్దరం కలిసి కేసరిపల్లె వెళ్లాం.

 

    "అమ్మా! అన్నయ్యను తీసుకొని వచ్చాను" అన్నాను.

 

    అమ్మ చేతిలో గరిటెతో ఉరికి వచ్చింది. ఒక లిప్త నమ్మలేనట్లు చూచింది. గరిట నేలక్కొట్టింది.

 

    "నాయనా! నిజంగా వచ్చినవా!" అని అన్నయ్యను తీవచుట్టుకున్నట్లు చుట్టుకుంది. చెల్లెళ్లు నివ్వెరపోయి చూచారు.

 

    అమ్మ ఏడుపుకు చలమయ్య - గోపయ్యగారలు కుటుంబాల సహితంగా బయటికి వచ్చారు. అది వారికి సచిత్ర సంతోషం.

 

    సరస్వతి వచ్చింది. నన్ను పట్టుకుని నిలిచింది. 'కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ బాష్పబిందువులు రాల్చింది.

 

    "రంగడూ! నాకు ఒక్కడే మిగుల్తడు అన్నవుగద - నా కొడుకులు ఇద్దరు నాకు దక్కిన్రు!" మా ఇద్దరినీ చెరొకవైపు పట్టుకొని - అనంత విశ్వాసమూర్తివలె నుంచుంది అమ్మ.

 

    అమ్మ - లవకుశులను పట్టుకున్న - సీతమ్మ అనిపించింది.

 

    అందరూ ఆనందం బాష్పాలు రాల్చారు.

 

    ఒక జీవిత కాలం బ్రతకడానికి ఆ దృశ్యం చాలు!

 

    అది ఆనందాల రోజు. సంతోషాల రోజు. సంబరాల రోజు.

 

    కులాలను కూలదోసి అందరం ఒకేచోట వండుకున్నాం, తిన్నాం. మా కుటుంబం - చలమయ్యగారి కుటుంబం - గోపయ్యగారి కుటుంబం - సీతం రాజురాని సరస్వతి.

 

    కలిసి ఉంటే ఎంత ఆనందమండీ!

 

    అయినా అదీ చేత కావాలి!!

 

    రాళ్లది - బోళ్లది - ఏళ్లది - లేళ్లది ఏ కులం?

 

    మళ్లీ సిరిపురం వెళ్లాల్సిన అవసరం పడలేదు. మేము ఇక్కడ ఉండగానే పోలీసు చర్య జరిగింది.

 

    ఒక్క విషయం మనవి చేసి పోలేసు - పోలో - చర్యకు సాగుతాను.

 

    గాంధీజీ అస్తమయం తరువాత స్వతంత్ర భారత రక్షక భటులు కృష్ణాజిల్లాలో రజాకార్లను మించిన కిరాతకాలు చేశారు.

 

    కమ్యూనిస్టులను అణచడం పేరుతో ప్రజాస్వామ్యాన్నీ - పౌరహక్కులను పాతిపెట్టారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.