Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
ఒక నర్సింగ్ ఆర్డర్లీ సిరంజ్ లో మందునింపి ముందుకు నడచింది. భగత్ కూడా ముందుకు అడుగువేసింది.
"సూదేం కుచ్చుతావ్? సన్నీ కావాలి, సన్నీ!" ఆఫీసర్ వైపు చూస్తూ అన్నాడు ఉత్తమ్.
"కెప్టెన్! శాంతించండి. త్వరలో బాగుచేసి ఫ్రంట్ కు పంపిస్తాను" అన్నది లెఫ్టినెంట్ భగత్.
మృదువైన నారీ ధ్వనీ. మరాఠీ భాషా విని "వండర్ ఫుల్ మై డార్లింగ్ డాల్!" అంటూ సుమారు శైలా భగత్ ను తన కౌగిలిలోకి తీసుకున్నాడు ఉత్తమ్.
"కెఫ్టెన్ భోఁస్లే! What's it? సరిగ్గా ప్రవర్తించు." గర్జించాడు కర్నల్. "స్పెషల్ టెంట్ (ప్రత్యేకమైన గుడారం)లో ఉంచండి. గట్టి కాపలా ఏర్పాటు చేయండి. కర్నల్ భగత్! ఇతడు మీ పేషెంట్. జాగ్రత్తగా కాపాడండి." ఆదేశించారు.
నాలుగైదు నిమిషాల్లోనే మత్తు రావడమూ, స్ట్రెచర్ లో ఉత్తమ్ ను స్పెషల్ టెంట్ లో చేర్చడమూ జరిగింది.
సర్జికల్ కేసు కావడం మూలాన భోఁస్లే దగ్గరికి వెళ్ళగలిగాను. కుడి పిక్కలోంచి బుల్లెట్ దూసుకొనిపోయి రక్తం ప్రవహించింది. అంత రక్తస్రావం తర్వాత సైతం "చార్జ్" ఆర్డరు ఇస్తూ అలా ఎలా నుంచోగలిగాడో నా కర్థం కాలేదు. గాయానికి చక్కగా కట్టు కట్టాను. మత్తులో ఉన్నాడు కాబట్టి Response ఏమీ రాలేదు.
కర్నల్ గారికి కబురంపాను. ఆయన కూడా Round కు వచ్చారు.
"రోగిని మంచానికి కట్టివేయండి. పారిపోవచ్చు." హెచ్చరించారు కర్నల్.
ఉత్తమ్ భోఁస్లేకు ఉత్తమ చికిత్స ప్రారంభం అయింది. పిక్కలోని గాయం నిండసాగింది. మెదడు బాగా చెదిరినట్లుంది. అతని యూనిట్ లోని ఒక జవాబు గాయం తగిలి వచ్చాడు. అతడు చెప్పిన కథ వింటే మా వెంట్రుకలు నిక్కబొడిచాయి. ఇదీ అతడు చెప్పిన కథ:
"నలభై మంది మాత్రం జవాన్లు గల యూనిట్ తో భోఁస్లేను ఒక దుర్ఘటమైన కొండచరియమీద పోస్టు చేశారు. నాటిరాత్రి శత్రువులు ఆ చౌకీని చుట్టివేశారు. శత్రు సైనికులు 250 కంటే తక్కువ లేరు. వారి దగ్గర ఆయుధాలు, మందుగుండు సామగ్రి పుష్కలంగా ఉన్నాయి.
ఉత్తమ్ దాడిచేయమని ఆదేశించాడు. ఉభయపక్షాల్నుంచీ తుపాకులు పేలాయి. రాత్రివేళ గురి చూచి కొట్టడం అసాధ్యం. శత్రువు నరుల చావుల్ను లెక్కచేయక చొచ్చుకొని వస్తున్నాడు. హవల్దార్ శంభూసింగ్ వెనక్కు తగ్గాలని సూచించాడు.
"అరే ఫో! నేను మహారాష్ట్రుణ్ణి. చంపడమో, చావడమో కాని, వెనుకంజ వేయలేను" అని ఉత్తమ్ హవల్దార్ సూచనను త్రోసిపుచ్చాడు. క్రమక్రమంగా మా ఫైరింగ్ క్షీణించసాగింది. ఎంత లేదన్నా 25 మంది జవాన్లు ఒరిగారు. మందుగుండు ఒడిసింది. శత్రు సైనికులు 50 మంది - ఒక గజంలోనో, అడుగులోనో ఉన్నారు.
చనిపోయిన ఒక సైనికుని రైఫిల్ తీసుకొని "చార్జ్" అని ఆర్డరిచ్చాడు ఉత్తమ్. జవాన్లు తమ వీరత్వపు పరాకాష్ఠను ప్రదర్శించారు. శత్రు సైనికుల్లో సగం పైగా సైనికులు గాయపడ్డారు. రుద్రరూపం దాల్చిన ఈ ప్రతీకారాన్ని చూచి వారు సైతం క్షణం చకితులైనారు.
గెలవడం వారి కర్తవ్యం.
ముందడుగు వేసిన శత్రు సైనికుని డొక్కలోనికి మా సన్నీ దూరి, రక్తం రుద్దుకొని బయటికి వస్తూంది.
"ఏకేక్ కా చార్జ్-ఏకేక్ దుష్మన్ మర్నాచాహియే" (ఒక్కొక్క చార్జికి ఒక్కొక్క శత్రువు ఒరగాలి.) అని అభిమన్యునిలాంటి ప్రతాపంతో కెప్టెన్ యుద్ధం చేస్తున్నాడు. అమాంతంగా అరుణోదయం అయింది. శత్రు సైనికులు స్పష్టంగా కనిపించసాగారు.
వారింకా చాలామంది ఉన్నారు.
ఒక బులెట్ 'సాబ్' పిక్కలోంచి దూసుకొనిపోయింది. ఆయన తూలి పడిపోయాడు. మాలో నలుగురైదుగురిని శత్రువు పట్టుకున్నాడు. మిగిలినవాళ్ళమూ అంతేమందిమి. గాయాల బాధకు మూలిగే సమయం కాదది. ప్రాణం ఏమూలన ఉన్నప్పటికీ శత్రువు సన్నీ దూరడమో, బుల్లెట్ దూసుకుపోవడమో తథ్యం.
శవంలా నిశ్చలంగా పడివుండి, అవకాశం దొరికినప్పుడల్లా కళ్ళు తెరిచి, శత్రు సంచలనం చూచి కళ్ళు మూసుకుంటున్నాను. అలా ఎంతసేపు పడివున్నానో ఎవడికి తెల్సు? కనీసం రెండు మూడు గంటలు గడచి ఉంటుంది. నా కుడిచేయి పనికిరాకుండా పోయింది. శత్రువు వెళ్ళిపోయింతరువాత నిశ్శబ్దత గుర్తించి లేచి చూచాను. చుట్టుపట్లు తిరిగాను.
హవల్ దార్ మేజర్ శంభూసింగ్ గడ్డకట్టిన రక్తంలో పడి ఉన్నాడు. సిపాయి గజానంద్, రఘూనాయక్, జమేదార్ ప్రతాప్ కిషన్ శవాలు కనిపించాయి.
మా మెషిన్ గన్స్ శత్రువు తీసుకుపోయాడు.
చివరకు కెప్టెన్ సాబ్ కనిపించాడు. శరీరంలో వేడి ఉంది. కదలిక ఉంది. పిక్కలోంచి స్రవించిన రక్తం గడ్డకట్టి ఉంది. నా వాటర్ బాటిల్లోని నీరు కెప్టెన్ గారి నోట్లో పోసి, చెట్టుకొమ్మ ఒకరి విరిచి విసరసాగాను.
కళ్ళు మిటకరిస్తూ చూశాడు సాబ్.
"కెప్టెన్ సాహెబ్!" అని పిలిచాను.
"కౌన్ హై?" (ఎవరు?) క్షీణించిన ధ్వని గొంతులోంచి వెడలింది!
వాటర్ బ్యాగ్ మూతిని సాబ్ నోట్లో పెట్టాను.
"సిపాయీ రామ్ భావును సార్!"
రెండు గ్రుక్కలు నీరు త్రాగింతరువాత కొంత చలనం కలిగింది. కాని కళ్ళు వింతగా కనిపించాయి. చూపుల్లో వైచిత్రి గోచరించింది. అధికంగా రక్తస్రావం అయినందున లేవడం, కూర్చోవడం చాతకాలేదు. అయినా శక్తి తెచ్చుకొని లేచి కూర్చున్నాడు. తల తిప్పి చుట్టూ పడి ఉన్న శవాల్ను చూచి "శత్రువు పారిపోయాడా?" అడిగాడు.
"అవును సార్!"
"శభాష్ సిపాయిల్లారా! అని, నువ్వేం చేస్తున్నావ్? చార్జ్.... చార్జ్! తరమండి.... నరకండి" అని కేకవేసి గాయపు పిక్కతోనే లేచి నుంచున్నాడు. నేను పట్టుకొన్నాను....
తరవాత 36 గంటలు అన్నం నీళ్ళు లేకుండా గడిపాం. వాటర్ బాటిల్లో నీరు ఎప్పుడో అయిపోయింది. మొన్న రెడ్ క్రాస్ స్ట్రెచర్ పార్టీవారు వచ్చారు. మా మొత్తం యూనిట్ లోనూ గాయాలు తగిలి-ప్రాణాల్తో మిగిలినవాళ్ళం మేమిద్దరమే. మిగతా యూనిట్ల క్షతగాత్రులందరినీ ఒకచోట చేర్చి అడ్వాన్సు రిపోర్టు పంపించారు.
మోటార్ వచ్చింతరువాత నిన్న సాయంకాలం ఇక్కడికి చేరాం.
డాక్టర్ సాబ్! నిజం చెపుతున్నాను. బ్రతుకుతె కెప్టెన్ గారి కోసం బ్రతకాలి, చస్తే ఆయనతోనే చావాలి. ఆయన వీరాధివీరుడు. బాగవుతారు కదండీ?" ఆతుర హృదయంతో అడిగాడు రామ్ భావు.
నా ప్రక్కనే కూర్చున్న లెఫ్టినెంట్ భగత్ శైలా ప్రాణమంతా కళ్ళల్లో పెట్టుకొని ఉత్తమ్ ను చూస్తూ కథంతా విన్నది.
"ఎంత భయంకర దృశ్యం అయ్యుంటుంది డాక్టర్!" శైలాభగత్ నన్నడిగింది పెద్ద నిట్టూర్పు విడుస్తూ. సైనిక గుడారానికి ఇంతదూరంలో నేనూ, ఉత్తమ్, రామ్ భావూ, శైలాభగత్- నలుగురం మాత్రమే మరాఠీ మాట్లాడేవాళ్ళం కావడం మూలాన ఏదో ఆత్మీయత కనిపిస్తూంది మాలో మాకు.
"భయంకరమైంది ఇంకా ముందుంది. "షెల్ షాక్' ఫిరంగుల నిరంతర గర్జనవల్లా, నిద్రలేకపోవడంవల్లా, హృదయం మీద ఎడతెగని ఒత్తిడివల్లా శూరులైన ఆఫీసర్లు సిఅతం పిచ్చివారైపోయిన ఉదాహరణ లెన్నో ఉన్నాయి. ఉత్తమ్ మానసికంగా కుదుటపడేట్లు చేయాలి. అలా చేయకపోతే పాపం, కష్టమే మరి!!" అన్నాన్నేను.
"ఎందుకలా అంటారు డాక్టర్? ఈ వీరుణ్ణి బాగుచేయడానికి మనం మన వైద్య విద్యా నైపుణ్యంలో పందాలు వేసుకోలేమూ? బాగవుతారు కదూ కెప్టెన్?" భయకంపిత స్వరంతో అన్నది.
"బాగవుతారు. కాని, కొన్నాళ్ళు కావాలి. మెంటల్ డాక్టర్ (మానసిక వైద్యుడు) దగ్గరికి తీసికెళ్ళాల్సి ఉంటుంది" అన్నాన్నేను.
"మరి, కర్నల్ ఇక్కడే చికిత్స జరగాలంటున్నారే! భోఁస్లే విషయంలో ఆయనకు ఇంటరెస్ట్ ఉందన్నారు కదూ! ఏమిటో అది?" అడిగిందామె నన్ను.
"నాకు మాత్రమేం తెల్సు? కర్నల్ చెప్పాలి. లేదా, బాగైన తర్వాత ఉత్తమ్ చెప్పాలి. అప్పుడుగాని తెలియదు" అన్నాన్నేను.
రోజులు గడిచిపోతున్నాయి. యుద్ధం కొనసాగుతూనే ఉంది-ఒకసారి ఈ ఫ్రంట్ లో ఒకసారి ఆ ఫ్రంట్ లో. ఒక్కొక్కప్పుడు అన్నివైపులా ప్రశాంతత వ్యాపిస్తూంది. ఒకరోజు ఉత్తరువు అందింది-తక్షణమే బేస్ హాస్పిటల్ ను 20 మైళ్ళ వెనక్కు ఒక నిర్దేశ స్థలానికి తరలించమని. ఆదేశం అందిన తర్వాత అక్షరశః అమలుజరపని సైన్యమూ ఒక సైన్యమా? వెంటనే సామాన్లు సర్దుకొని గుడారం కట్టకట్టి ఒక క్రమం ప్రకారం వెనక్కు తగ్గాం. సాధ్యమైనంత సామగ్రి తీసుకున్నాం. బరువైన సామగ్రి ముక్కలు ముక్కలుగా నరికి అక్కడే పారేశాం, అలా చేయకుంటే అది శత్రువులకుపయోగపడుతుందని. విలువైందీ, అత్యవసరమైందీ అయిన సామగ్రి విరిచి పారేయడం అంటే మనసు ఒప్పనిమాట నిజమే కాని, చేయగలిగేది మాత్రం ఏమిటి? అంతా తీసికెళ్ళడం సాధ్యపడదు. వాటిని యథాతథంగా అక్కడ వదలి శత్రువును బలపర్చడం మంచిదికాదు. చేయగలిగిందల్లా వాటిని పనికిరాకుండా చేసి అక్కడ పారవేయడమే!





