Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    సిరిపురంలో నేను వార్తలు రాయటం - గేయాలు - వ్యాసాలూ వ్రాయడం, నిజాం ప్రాంతంలో నిజాం వ్యతిరేక ప్రచారం చేశాను. ప్రజల్లో నిజాం వ్యతిరేకత ఎంతకాలంగానో నిద్రాణం అయి ఉన్నది. రజాకార్ల దుశ్చర్యలు. కమ్యూనిస్టు పార్టీ విప్లవ కార్యక్రమాలు, ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలు ప్రజలను జాగృతం చేశాయి. నిజాం వ్యతిరేక ప్రచారం ఏదయినా గుంపులుగా వచ్చేవారు. గొంతు కలిపి పాడేవారు.

 

    "ఎందుకయ్య నీవింక
    రాజ్యమేలుతావు?
    ఇంకనన్న గద్దెదిగు
    ప్రజల కప్పగించు
    అట్లచేయకుంటే
    మేము ఇంకఊరుకోము
    జనులు చుట్టుముట్టి
    నిన్ను గద్దెదింపుతారు."

 

ఇలాంటి పాటలు యుక్త కంఠంగా చదివినపుడు ఎంతో ఉద్రేకం - ఉత్సాహం - ఆవేశం పొంగి పొరలేవి. దుష్టుడు, దుర్మార్గుడు - హీనుడు - నీచుడు - అలా కాకుండా చివరి దశలోనయినా ప్రజలకు రాజ్యం అప్పగించి ఉంటే! కాని అది రాజ్యం! హింసలేకుండా - గుంజుకోకుండా స్వచ్చందంగా - ఒక్క శ్రీరామచంద్రుడు తప్ప - ఎవరూ వదల్లేదు.

 

    ఒక్క సత్యవాస్తవం ఏమంటే - నిజాం ప్రాంతంలో - తెలంగాణంలో - కమ్యూనిస్టులకు ఉన్న పట్టు - పలుకుబడి - ప్రభుత్వం మరెవ్వరికీ లేదు. వారు గ్రామాల్లో సోషలిజం స్థాపించి చూపించారు. భూస్వామ్యంనుంచి నేరుగా సోషలిజానికి వెళ్లారు. మధ్యనున్న కేపటిలిజాన్ని మట్టుపెట్టారు! ఇది అంతటా అందరికీ సాధ్యం అయ్యేదికాదు. అయితే అది కలకాలం నిలువలేదు. కలకాలం నిలువలేదని బాధపడాల్సిన పనిలేదు. కొంతకాలం నిలిచినందుకు సంతోషించాలి. ఆ వ్యవస్థను సాధ్యం చేసినందుకు కమ్యూనిస్టులను అభినందించాలి.

 

    "తెలుగు తల్లి బిడ్డలం
    తెలంగాణ వీరులం
    మాతృదేశ ముక్తికొరకు
    పోరుసలువ కదిలినాం"

 

అని కదం తొక్కి పాడటం తెలంగాణంలో సర్వసాధారణం అయింది.

 

    "బాలవీరులెవ్వరురా
    బాలచంద్రుడెక్కడరా?
    సవాలన్న నైజాముకు
    సమాధానమెవ్వడురా?"

 

అని ఎర్రజండాలు పట్టుకొని బాలలు పాడుతుంటే అందరూ బాలచంద్రులవలె కనిపించారు.

 

    "ప్రజాశాక్తులు కదలండోయ్
    పౌరుషంబుగ పోరండోయ్
    విజయము మనదే రారండోయ్
    ఉరికి శత్రువుల తరమండోయ్
    శత్రుల చంపిన ప్రతిచోటా
    శత్రు ఆయుధాల్ మనవేనోయ్
    తుపాకి, రైఫిల్, తూటాల్, బాంబులు
    దొరుకును విరివిగ మనకండోయ్!"

 

ఇలాంటి పదాలు భజన కార్యక్రమాలంతటి ప్రాచుర్యం పొందాయి.

 

    "గోలకొండ ఖిల్లకిందా
    నీ గోరి కడ్తం కొడుకో
    నైజాం సర్క రోడా!"

 

ప్రతి పౌరుని నాలుక మీద నాట్యం ఆడింది. ప్రజాసాహిత్యానికి ఇది సాధారణమయిన లబ్దికాదు! ఇది అసాధారణం.

 

    గ్రామాలలోనుంచి దొరలు, పటేల్ పట్వారీలు మాయం అయినారు. ప్రభుత్వం మృగ్యం అయింది. రజాకార్లను ఎదురుకునే సామర్ధ్యం ప్రజలకు వచ్చింది.

 

    భూస్వామ్య చిన్హాలయిన గడీలను కూల్చారు. అవి మొండిగోడలతో శిధిల వ్యవస్థకు సాక్షులుగా మిగిలాయి. ఒకనాడు గ్రామంలో మంచివి అన్నీ గడీకి చేరాయి. ఇప్పుడు గడీలనుంచి పేదల ఇళ్లకు చేరాయి. గుడిసెల్లో నిలువుటద్దాలు - పందిరి మంచాలు! ఎంత మార్పు! ఎంత ప్రగతి!! ఎంత విప్లవం!!!

 

    కమ్యూనిస్టు దళాలు సుమారు మూడువేల గ్రామాలను విముక్తం చేశాయి. విముక్తం అయిన గ్రామాలకు "రాజ్యకమిటీలు" ఏర్పడ్డాయి. ఇవి ఎన్నికల ద్వారా ఏర్పడిన కమిటీలు. ప్రతి కమిటీలో అయిదు నుంచి పదివరకు సభ్యులు ఉండేవారు. వారు ప్రజాసమస్యలను పరిష్కరించారు. భూ సంస్కరణలు అమలు జరిపారు. పది ఎకరాల మాగాణి లేక 100 ఎకరాల మెట్ట సీలింగుగా నిర్ణయం అయింది. ఈ సీలింగు ఉద్యమానికి వ్యతిరేకులు కానివారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రజాద్రోహుల భూములు సంపూర్ణంగా స్వాధీనపరచుకున్నారు. ఇలాంటి మిగులు భూములను భూములు లేనివారికి పంచారు. ఆ విధంగా విసునూరు రామచంద్రారెడ్డికి చెందిన 40 వేల ఎకరాలు ప్రజలకు పంచారు. అంటే - విముక్తం అయిన మూడువేల గ్రామాలలో పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడం జరిగింది. ఇది ఆమహా ఉద్యమపు చారిత్రాత్మకతకూ - పోరాట ఫలితాలకు నిదర్శనం.

 

    భారతదేశంలో అనేక పోరాటాలు జరిగాయి. జరుగుతున్నాయి. వాటన్నింటిలో ఇంత విజయవంతం అయిన పోరాటం ఇదే! ప్రజానీకానికి ఇంత పెద్ద ప్రయోజనం సమకూర్చిన పోరాటమూ తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం మాత్రమే!

 

    ఇది గాంధీజీ కలలుగన్న రామరాజ్యం!

 

    రైతులు - కూలీలు - పేదలు - బాలలు - మహిళలు వీరోచితంగా పోరాటం జరిపి సాధించుకున్న గ్రామ స్వరాజ్యం! ప్రాణాలు అర్పించి ఆర్జించుకున్న గ్రామ స్వరాజ్యం! రక్తం ధారపోసి సాధించుకున్న గ్రామ స్వరాజ్యం! ప్రజలు తమ కంటి రెప్పలా కాపాడుకున్న గ్రామ స్వరాజ్యం!

 

    ఇది ఈనాడు కలగా కల్పనగా కనిపించవచ్చు.

 

    కాని, ఈవ్యవస్థ చూడగలిగిన అదృష్టం మాది!

 

    ఇందుకు గురించి వ్రాయగల భాగ్యం నాది!

 

    సిరిపురంలో కొంత ఆరోగ్యం కుదుటపడింది. అంతకుముందు ఎన్నడూ లేని చికిత్స లభించింది. నేను చాల చురుకుగా - ఉత్సాహంగా - ఆవేశంగా - ఉద్రేకంగా పని చేశాను. అలా చేయటం నా సహజ స్వభావం.

 

    ఒకసారి బెజవాడ వెళ్లాల్సి వచ్చింది. ఏదో పనిమీద క్యాంపువారు పంపారు. మేము నలుగురం. మాకు లీడర్ మాటేటి కిషన్ రావు. అతనికి మాత్రం పిస్తోలు ఇచ్చారు. అతను మమ్ములను రక్షించాలి. రక్షించలేకుంటే పోవాల్సిందే. ప్రాణాలను లెక్కచేయని కాలం అని ముందే చెప్పాను.

 

    ఈనాడు ప్రపంచమంతటా తీవ్రవాద సంస్థలకు ఆత్మహత్యాదళాలు - suicide squads ఉన్నాయి. లక్ష్యం ఏదయినా విశ్వాసం కలుగుతే - మానవుడు ప్రాణాలర్పించడానికి వెనుదీయడు. పేర్లు - ధ్యేయాలు - లక్ష్యాలు - విశ్వాసాలు వేరుకావచ్చు. కాని, తలపండు ఇచ్చుకోవడంవంటి త్యాగాలు కలకాలంగా ఉన్నాయి.

 

    ఆత్మహత్యదళం అనేపేరు లేకున్నా అందరూ ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అయినవాళ్లే. ఇవ్వాళ చిన్న పదవి - చేతిలో డబ్బు వదలడానికి గిజగిజలాడుతున్నారు. ఆనాడు ప్రాణాలర్పించడానికి సిద్ధం అయినాం. సమాజం ఎంత దుష్టంగా మారిందంటే - అలాంటివారినే వెక్కిరిస్తూంది. పరిహసిస్తూంది. అపహాస్యం చేస్తున్నది!!!

 

    ఇంతకన్న నైతిక పతనం ఉండదు!

 

    కిషన్ రావు నాయకత్వాన మేము నలుగురం బయలుదేరాం. రాత్రికి రాత్రి పరగణా తరువాత ఉన్న నిజాం ఇలాకా దాటాలి. తెల్లవారే వరకు యూనియన్ ప్రాంతం చేరుకోవాలి. ఊరిలోనుంచి పోరాదు. రజాకారు - పోలీసు జాడతెలుస్తే బాట వదలాలి. లేని మార్గం చూచుకోవాలి. బ్యాటరీ వెలిగించరాదు. సిగరెట్టు కాల్చరాదు. ఉనికి తెలిసేటట్లు మాట్లాడరాదు. ప్రమాద స్థితిలో కాగితాలు శత్రువుకు అందనీయరాదు.

 

    నడక, నడక, నడక. రాత్రి. చూపుల వెలుగు. ఆరుబయట బాగానే వుంది. ఎక్కడ ఏది పొంచి ఉందో తెలియదు. భయం లేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.