Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                          రణరంగానికి దూరంగా ఎక్కడో...

    కర్నల్ జగ్దీశ్ ప్రసాద్ కపూర్ మా క్యాంపు ఓ.సి. (ఆఫీసు కమాండర్). ఆయన వయసు నలభైయైదుపైనే ఉంటుంది. విశాలమైన నుదురు, నిశితమైన చూపులు, చెవిపై వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. ఆయనది ప్రభావాత్మకమైన వ్యక్తిత్వం. ఆపరేషన్లు చేయడంలో ఆయన కాయనేసాటి. ఎంత ప్రశాంతంగా ఉంటాడాయన....! ఎంత క్లిష్టమైన ఆపరేషన్ చేస్తున్నప్పుడైనా, జటిలమైన శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడైనా, సైనికుల కాళ్ళూ, చేతులు నరికివేసి బ్రతికించాల్సి వచ్చినా, ఆయన మేధస్సు చలించి ఎరుగదు.
    మధ్యాహ్నం మూడు గంటలకు కర్నల్ గారి కొత్త ఉత్తరువు - ఆఫీస్ ఆర్డర్ - జారీ అయింది.
    "ఆఫీసర్లు, స్టాఫు సాయంత్రం 5-00గం.లకు తమ తమ డ్యూటీల్లో హాజరుండాలి. ఆపరేషన్ థియేటర్ క్లీన్ గా - శుభ్రంగా - ఉంచాలి రాత్రి సాంతం డ్యూటీ చేయాల్సివచ్చినా రావచ్చు. లేదా, అందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడొచ్చు."
    కొత్తగా రిక్రూట్ అయిన డాక్టర్లు, నర్సులు కొత్తగా డ్యూటీలో చేరిన ఆఫీసర్, నర్స్ మిస్ శైలాభగత్ సహితంగా అంతా ఒకచోట చేరాం.
    "యుద్ధంలో గాయబడ్డ జవాన్లు వస్తారేమో!" అన్నాన్నేను.
    అక్కడున్న వారంతా పెదవుల్ను పళ్ళక్రింద నొక్కిపట్టి రాబోయే సమస్యల్ను ఎదుర్కోవడానికి ధైర్యంగా తయారైవున్నారు. వాస్తవం ఏమంటే - ఒడలూ, చాతుర్యమూ ఏనాటికీ అలసిపోవు. అలసిపోయేది హృదయం మాత్రమే. ఇప్పటికీ గాయపడిన జవాన్లు చేరగానే హృదయ స్పందనం ఆగిపోతుంది. గాయాల్తగిలి అలమటిస్తూన్న వీరసైనికుల్ను చూస్తే హృదయం వ్యాకులపడుతుంది. వారికి అంత సహనం - అంత ఓర్పు - ఎలా ఉంటుందో! వారి యాతనల్ను చూచి మన గుండె తరుక్కుపోతుందే!! వారు మాత్రం మూలగడం వినా మరే బాధా వ్యక్తపర్చరు!!!
    గడచిన ఒక సంఘటన - "డాక్టర్! కిస్లియే ఆపరేషన్ కర్తేహో? ముఝే జానేదో. బులావా ఆగయా హై. ఫక్త్ ఆయిలా కళ్వా" (డాక్టర్! ఆపరేషన్ ఎందుకూ? పిలుపు వచ్చేసింది. పోనివ్వండి. మా అమ్మకు మాత్రం కబురంపండి) అన్నాడు నవ్వుతూ! నవ్వుతూనే కన్నుమూశాడు. అంతకు ముందతడు ఆరుగురు శత్రుసైనికుల్ను నరకానికి పంపి ఆపరేషన్ టేబుల్ మీదనే వీరగతిని పొందాడు.
    ఆ రోజు నాకు తిండి సయించలేదు. తాను పుట్టిన గడ్డకు వేలమైళ్ళ దూరంలో, తన దేశ స్వాతంత్ర్యాన్ని రక్షించడానికిగాను, గంగారామ్ నాయక్ అసువు లర్పించాడు. చనిపోయేటప్పుడు అతని బంధువులెవరూ దగ్గర లేరు. కాని, స్వతసిద్ధంగానే అతని నోటివెంట అతని చివరి కోర్కె వ్యక్తమయింది. అదీ మరాఠీలో. ఆ భాష తెలిసినవాణ్ణి అక్కడ నేను ఒక్కణ్ణే.
    గడిచిన పదిహేను రోజుల్లోనూ ఇలాంటి కేసులు నాలుగు చూడాల్సివచ్చింది. మాది జనరల్ ఆస్పత్రి కాదు. మా యూనిట్ అడ్వాన్స్ బేస్ పైన (రణరంగానికి దగ్గర్లో) ఉంది. మా యూనిట్ కు 30, 40 మైళ్ల దూరంలో మహా ప్రవాహంలా వచ్చి పడుతున్న శత్రు సైనికుల వేగాన్ని అడ్డుతున్నారు మన జవాన్లు. కొందరు అక్కడే కూల్తున్నారు. కొందరు గాయపడుతున్నారు. కాని, ఉలుకు, భయం అనే పేరు సైతం వారికి తెలియదు.
    ఫ్రంట్ లో - యుద్ధ క్షేత్రంలో - మొట్టమొదట బలి ఇవ్వాల్సింది భయం. అక్కడికి చేరేవరకే భయం. చేరింతర్వాత ధైర్యం పొంగుతుంది, సాహసం పొర్లుతుంది, ముందు కురుకుతారు. భయం పారిపోతుంది. నూనుగు మీసాల యువకుల సైతం వెనుకంజ వేయరు. శత్రువంటే జంకరు. చావుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి జవాన్లకు దుఃఖభారం తగ్గించే అవకాశం దైవాద్వానాకు లభించింది. డాక్టర్ను కదూ మరి!
    దేహానికి కలిగిన బాధ మందుల్తో నయమవుతుంది. ఆస్పత్రికి వచ్చినప్పుడు తాము వికలాంగులమవుతామనీ, యుద్ధంలో శత్రువును ఎదిరించలేమనీ తెలిసినప్పుడు వారికి కలిగే వ్యధ ఎలాంటిదో ఎవడు చెప్పగలడు? దానికి మందుందా?
    మేమంతా - జూనియర్ ఆఫీసర్ డాక్టర్లమూ, నర్సింగ్ సిబ్బందీ-ఒకచోట చేరి కర్నల్ కపూర్ ఆర్డర్ కోసం - తరువాతి ఉత్తరువు కోసం - నిరీక్షిస్తున్నాం.
    ఇంతలో మెల్లగానూ, శాంతంగానూ అడుగులు వేస్తూ కర్నల్ మా దగ్గరికి వచ్చారు. ఆచారం ప్రకారం అంతా శాల్యూట్ చేసి, మా కొరకు ఏం వేచివుందో అని ఎదురు చూస్తున్నాం.
    కర్నల్ కపూర్ - శ్రీవారు - ముందు స్టాఫ్ ఆఫీసర్ను అడిగారు:
    "ఇవ్వాళ హాస్పిటల్లో ఎంతమంది రోగుల్ను అడ్మిట్ చేసుకోగలం?"
    "సర్! నలభై పడకలు ఖాళీగా ఉన్నాయి. మరో పదిహేను ఏర్పాటు చేయవచ్చు మొత్తం 55 మందిని." మేజర్ గురుదయాళ్ అటెన్షన్లో ఉండి జవాబు చెప్పాడు.
    "ఎక్కువ కేసులే రావచ్చు. ఎమర్జెన్సీ (అత్యవసరపు) కేసుల్ను చేర్చుకొని మిగతావారికి ప్రథమ చికిత్స చేసి పంపివేయాలి. ట్రాన్స్ పోర్ట్ (రవాణా) మొత్తం సిద్ధంగా ఉంచండి. డ్రైవర్లు, నర్సింగ్ అర్డర్లీలు సర్వదా సిద్ధంగా ఉండాలి" అన్నారు కర్నల్.
    "Yes sir" అని అటెన్షన్ గా ఉండి శాల్యూట్ చేసి తన పని మీద వెళ్ళిపోయారు మేజర్ గురుదయాళ్.
    "Well. కెప్టెన్ దాస్ గుప్తా, మేజర్ ఇరానీ, కెప్టెన్ గుప్తే సిద్ధంగా ఉండండి. రాత్రంతా పనిచేయాల్సి రావచ్చు."
    "Yes sir" అమాంతంగా సావధానులై అన్నారంతా. కర్నల్ దృష్టి కొత్తగా వచ్చిన లెఫ్టినెంట్ శైలాభగత్ మీద పడింది."భగత్" అనే ఇంటి పేరు మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశాల్లో సర్వసామాన్యం కావడాన ఈ కొత్త ఆఫీసర్ ఎక్కణ్ణుంచి వచ్చిందో తెలియడంలేదు.
    "లెఫ్టినెంట్ భగత్! నర్సింగ్ లో మీ అనుభవం ఎంత?"
    "సర్! పూర్తి అయిదు సంవత్సరాలు".
    "ఎక్కడ పని చేశారు?"
    "గాంధీ మెమోరియల్ హాస్పిటల్, ఇందూర్లో సర్! అంతకుముందు కాన్పూర్ లో."
    "Well. మరాఠీ వచ్చా?"
    "Yes sir. నేను మరాఠానే."
    "That's fine. అయితే, మీకొక బాధ్యత అప్పగించాలా?"
    "I am ready sir! (నేను సిద్ధంగా ఉన్నాను)" శైలాభగత్ సంతోషంగా సిద్ధమైంది.
    "ఇవ్వాళ్టి క్షతగాత్రుల్లో ఉత్తమ్ భోఁస్లే కూడా ఉన్నాడు. అతనికి అట్టే గాయాలేం తగల్లేదుకాని, మెదడు చెదిరిందని రిపోర్టు వచ్చింది. చాలా మంచి కుర్రాడు. ధైర్యం గలవాడే కాని, కష్టాల్ను ఎదుర్కొనేప్పుడు హృదయంమీద భారం పడుతుంది. నాకు ఉత్తమ్ భోఁస్లే కేసులో Interest ఉంది. సాద్యమైనంతవరకు అతని చికిత్స ఇక్కడే జరగాలని నా అభిప్రాయం - అభిలాష. అతణ్ణి నీ బాధ్యతకు అప్పగిస్తా. సహకరిస్తావు కదూ?"
    "I am very glad sir! (చాలా సంతోషం సర్)."
    నాక్కూడా అవకాశం ఇప్పించమని కర్నల్ ను అడుగుదామనుకున్నా. కాని, ఆయన కోపగిస్తారని ఊరుకున్నా.
    తరవాత కొద్దిసేపటికే "రెడ్ క్రాస్" గుర్తు గల ట్రక్కులు కనిపించసాగాయి. క్షణం తరువాత గాయపడిన సైనికులకు ప్రథమ చికిత్స ప్రారంభించాం.
    చివరి ట్రక్కులోంచి కెప్టెన్ భోఁస్లే దిగాడు. అతణ్ణి ఇద్దరు జవాన్లు పట్టుకున్నారు. ఆ దశలో సైతం అతడు కర్నల్ గారికి శాల్యూట్ చేశాడు.
    "Well My boy!" అంటూ కర్నల్ గారు అతనివైపు అడుగులు వేశారు.
    జవాన్ల నుండి విదిలించుకున్న భోఁస్లే "హర్ హర్ మహదేవ్! హిందూస్తాన్ జిందాబాద్ అనండి. చార్జ్.... .... అరె.... .... నుంచున్నారెందుకూ!.... చార్జ్.... చార్జ్...." అని అరిచాడు.
    తూలిపడిపోయే ఉత్తమ్ భోఁస్లేను జవాన్లు పడిపోకుండా పట్టుకున్నారు.
    కర్నల్ సాహెబ్ ముందుకు నడిచి అతని వీపు నిమిరి "శాంతించు బాబూ! శాంతించు. సబ్ కుఛ్ ఠీక్ హోజాయ్ గా" (అంతా బాగవుతుంది) అన్నారు.
    "No. No. కర్నల్! నేనిక్కడుంటే ఎలా? నా కంపెనీలో ఉండాలి. హవల్దార్ మేజర్ శంభూసింగ్ ఎటుపోయాడు? నేను ఫ్రంట్ కు వెళ్తాను. ఇక్కడ నాకేముంది?" అని పలవరిస్తూ సిపాయీలు పట్టుకోకుండా తప్పుకోసాగాడు.
    "లెఫ్టినెంట్ భగత్! ఉత్తమ్ కు వెంటనే పెథిడిన్ ఇంజక్షన్ ఇవ్వండి."




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.