Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
"హే రామ్" అన్నారు. అది వారి చివరి వాక్కు.
మహాత్ముని మత రక్కసి పొట్టన పెట్టుకుంది.
ప్రధాని నెహ్రూ తాను అన్న మాటలకు మరిన్ని జోడించారు. అవి నిత్య సత్యాలు!
"The light has out of our lives...yet I am wrong, or the light that shone in this country was no ordinary light .... and a thousand years later that light will still be seen in this country and the world will see it. For that light represented the living truth."
"మన జీవితాల వెలుగు మలిగింది కాదు. అది సరికాదు. ఈ దేశంలో వెలిగిన ఆ అనంత ప్రకాశం సాధారణం కాదు. వేల సంవత్సరాల అనంతరం సహితం ఆ కాంతి ఈ దేశంలో ప్రకాశిస్తుంటుంది. సమస్తలోకం ఆ కాంతిని కాంచగలుగుతుంది.
కారణం అది నిత్య సత్యకాంతి"
ప్రపంచమంతటా సంతాపం ప్రకటించబడింది. లోకం దుఃఖసాగరంలో మునిగింది. దేశాధినేతలు - ప్రముఖులు - విద్వాంసులు - విజ్ఞాన ఖనులూ సంతాప సందేశాలు పంపించారు.
భారతదేశంలో దుఃఖం భరించలేక కొందరు ప్రాణాలు వదిలారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
తెల్లవారి జనసాగరం దుఃఖసాగరంలో మునుగగా రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగాయి.
అన్ని నదుల్లోనూ అస్తి నిమజ్జనం జరిగింది.
బెజవాడలో కృష్ణానదిలో జరిగిన అస్తి నిమజ్జనాన్ని నేను సైతం దర్శించుకున్నాను.
కర్మభూమి:
మహాత్ముని అంత్యక్రియలు అయిపోయాయి. నేను బెజవాడ కాంగ్రెసు ఆఫీసుకు వెళ్లాను. 'నువ్వు మంచిగ తుపాకి నేర్చినవని చెప్పిన్రు. సిరిపురం పోతవా?' అడిగారు హయగ్రీవాచారిగారు. వెళ్తానన్నాను. "అయితెపో' అని ఒక కాగితం వ్రాసి ఇచ్చారు. నేను మెట్లు దిగాను. మళ్లీ పిలిచారు. "మొదలు వీళ్లవెంట పోయిరా" అని నాకు ఒకర్ని చూపారు. వారితో వెళ్లాను. గంగినేని దగ్గర పట్టాలు పీకాం. ఒక గూడ్సు పడింది. గుండ్రాతిమడుగు దగ్గర ఒక ట్రాలీమీద దాడి చేశాం. నేను ఆ బృందం వెంట ఉన్నాను. నా భాగస్వామ్యం అంతటా ఉన్నట్లు గుర్తులేదు.
అయ్యగారు సిరిపురం పొమ్మన్నడు. ఎట్ల పోవాల్నో చెప్పలే. యాడున్నదో చెప్పలే. మిత్రులు గండి మల్లికార్జునరావుగారు కనిపించారు. వారిది డోర్నకల్లు. వారు సిరిపురం కాంగ్రెస్ క్యాంపులో ప్రధాన బాధ్యత నిర్వహిస్తున్నారు. వారికి మా విషయం సాంతం తెలుసు. వారు నాకు డబ్బు ఇచ్చారు. ఇంట్లో ఇచ్చి సిరిపురం రమ్మన్నారు. మార్గం క్రమం చెప్పారు.
నేను కేసరిపల్లి వెళ్లాను. అమ్మకు డబ్బు ఇచ్చాను. వెంటనే బయల్దేరాను. సిరిపురపు కథా క్రమం బెట్టిదనగా:-
పరిటాల చుట్టూ కృష్ణా జిల్లా ఉందని చెప్పాను. అలాగే మునగాల పరిగణా చుట్టు నల్లగొండ జిల్లా. అంటే నిజాం. మునగాల పరగణా కృష్ణా జిల్లాలోనిది. యూనియన్ ప్రాంతం. మునగాల రాజావారు నాయిని వెంకటరంగారావుగారు. కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయ స్థాపన సందర్భంగా వీరిని గురించి ప్రస్తావించాను.
నిజాం ప్రాంతాల మీద దాడికి మునగాల అనువుగా ఉంటుంది. అందువల్ల అక్కడ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాంటి క్యాంపులలో సిరిపురం ఒకటి. అయితే బెజవాడ నుంచి సిరిపురం చేరడానికి నిజాం ప్రాంతం కోదాడు దాటాలి. కార్యకర్తలు బస్సులమీద వెళ్లరు. ఎంచాతంటే - కోదాడులో నిజాం పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పరిటాలలో కార్యకర్తలవలె - కోదాడులో పోలీసులు ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఈ విషయం నాకు తెలియపరచలేదు.
నేను బస్సులో మునగాలకు బయలుదేరాను. కోదాడులో బస్సు ఆగింది. పోలీసులు చుట్టుముట్టారు. వాళ్లలో గార్ల పోలీసుకూడా ఉన్నాడు. వాణ్ణి చూశాను. నాకు కాలం మూడింది అనుకున్నాను. గార్ల పోలీసు దృష్టినుంచి తప్పుకోవాలి. నేను బచ్చాగాణ్ణి. నన్ను వేరే వాళ్లు గుర్తించరు. నేను చప్పున బస్సు దిగాను. పోలీసులు నా జేబులు - సంచి చూశారు. పంపించారు. నేను మూత్రపు మిషన చెట్టుచాటుకు వెళ్లాను. తప్పుకొని చాటుకు వెళ్లిపోయాను. అలా జారుకున్నాను. బస్సు నాకోసం వేచింది. నేను తిరిగి రాలేదు. అప్పుడు అనుమానించారు పోలీసులు. అది గతజల సేతు బంధనం!
ఎన్నిసార్లు ఇలా పోయే ప్రాణం - వచ్చే ప్రాణం! నాకు డొక్క జబ్బు. తిండి లేక జీవిస్తున్నాను. ఈ మధ్య వాంతిలో రక్తం పడింది. దరిద్రం. చికిత్సలేదు. కుటుంబ భారం. గార్లలో చచ్చి బతికాను. ఇప్పుడు మళ్లీ ఈ దశ. వారంటు ఉన్న విషయం విన్నవించాను.
అసలు విచిత్రం ఇంతకాలం ఎలా బ్రతికాను అని.
ప్రాణం పోవడం ఆశ్చర్యం కాదు. గాలియే కదా! గాలి నిలవడమే ఆశ్చర్యం అంటాడు ఒక ఉర్దూ కవి.
ప్రపంచంలో అన్నింటిని మించిన వైచిత్రి జీవితం!
జీవితం కన్నా విచిత్రమయింది మరొకటి లేదు!!
జీవితం ఎందుకు వచ్చింది? ఎటు పోతుంది? కస్త్వం? కుత ఆయాతః? ఇంతవరకు అంతు పట్టలేదు!
కొంతసేపు అలా దుబ్బుల్లో - తుప్పల్లో దాక్కున్నాను. బస్సు వెళ్లింది చూచాను. నాకోసం ఎవరూ రావడం లేదని ధ్రువపరచుకున్నాను. బయలుదేరాను. కాలి నడకన సాగాను. గ్రామాల్లోకి ప్రవేశించలేదు. ఎవరెవర్నో అడుక్కుంటు సాగాను. తోవలో నీళ్లు కూడా త్రాగలేదు. నడిచీ నడిచీ మునగాల చేరాను. ఎందుకో ఇది మన రాజ్యం - మన ఇల్లు అన్నంత విశ్వాసం - భద్రత!
మునగాల నుంచి నడవలేకపోయాను. ఈ మనస్సుందే అది బడే బద్మాషుది! అంతదూరం నడవనిచ్చింది. స్థిరత్వం ఏర్పడింది - మొరాయించింది.
ఒక తల్లి వాకిట్లో కూర్చొని ఉంది. ఆమె నా స్థితిని గమనించింది. ఆడదానిది తల్లి మనసు. "నాఅయనా౧ నీళ్లు తాగుతవా?" దాంతో సేద దీరింది. అరుగుమీద కూలబడ్డాను. మాటసైతం రావడం లేదు. సీతమ్మ కంచుచెంబుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. నీళ్లు ఆశగా తాగాను. ముఖంమీద పోసుకున్నాను. కాళ్లు చేతులు కడుక్కున్నాను. తుడుచుకోలేదు. సీతమ్మ తల్లి చూస్తేనే ప్రాణం నిలిచింది. నీళ్లు తాగాను. ప్రాణం ఎదలో చేరింది.
"సద్యోబలకరం త్రీణి. వారి, వారిచరః, పయః" అన్నాడు.
వెంటనే బలం ఇచ్చేవి మూడు. నీరు, చేపలు, పాలు.
భగవంతుడు, దయామయుడు - కరుణాసముద్రుడు. ఇలా ఎవరినో చూపుతూనే ఉంటాడు. ఆకాశంలో పక్షికే ఆధారం కల్పించాడు. నేలమీద మనకు కల్పించడా? అంటారు ఆదిశంకరులు.
సీతమ్మతల్లి ముచ్చట పెట్టింది. అన్నం పెట్టింది. 'ఇప్పుడు పోకు బిడ్డా! చీకటి పడ్డది. పొద్దున్నే లేచిపో' అని చాప ఇచ్చింది. సీతమ్మ నీడలో కన్ను మలిగింది. తెల్లవారి లేచాను. సీతమ్మ ఆశీస్సులు పొందాను. బయలుదేరాను.
ఇది అన్నపూర్ణల దేశం - కాని ఇప్పుడు మృగ్యం అయినారు.
"అన్నపూర్ణా ఇంటిలోనా అన్నమే కరువాయెగా" - దశకు చేరుకున్నాం.
సిరిపురం చేరుకున్నాను. మల్లికార్జునరావుగారు కనిపించారు. ఇంకొందరు తెలిసినవాళ్లున్నారు! మాటేటి కిషన్ రావుగారు గార్లవారు 2. నరసింహారెడ్డిగారిది పెరుమాళ్ల సంకీస. నేను చదివిన ఆరవ క్లాసువరకు సహాధ్యాయి. 3. బొగ్గారపు సీతారామయ్యది గార్ల జాగీరు పండితాపురం. తొలినుంచీ కాంగ్రెసు వాది. కమ్యూనిస్టు ద్వేషి. గార్ల జాగీరులో తొలి కాంగ్రెస్ సత్యాగ్రహి. జేలుకు వెళ్లి శిక్షపూర్తి చేసుకొని వచ్చారు.
సిరిపురం కాంగ్రెసులో స్థూలంగా రెండు ధోరణుల వారున్నారు.
1. కమ్యూనిస్టు ద్వేషులు. దాడుల్లో వారి మొదటి గురి కమ్యూనిస్టులు. తరువాతనే రజాకార్లు. వస్తుతః వీరు భూస్వాములు. నరసింహారెడ్డి - సీతారామయ్య అలాంటివారు.
2. మాజీ కమ్యూనిస్టులు - లేదా కమ్యూనిస్టు అభిమానులు. వీరు కమ్యూనిస్టులను ద్వేషించరు. ప్రగతి పథంలో సాగాలని ప్రయత్నిస్తారు. భూసంస్కరణలు మున్నగువాటిని విశ్వసిస్తారు. గండి మల్లికార్జునరావుగారు - మాటేటి కిషన్ రావుగారు అలాంటివారు.
ఈ వర్గీకరణ 'సిరిపురం' మాత్రమునకే కాదు. కాంగ్రెసు క్యాంపులకు - మొత్తం కాంగ్రెసుకు వర్తిస్తుంది.
సిరిపురం వంటి మరి కొన్ని క్యాంపులకు "నేలమర్రి" ప్రధానకార్యాలయం. నేలమర్రి ప్రముఖ గాంధేయులు కోదాటి నారాయణరావుగారి స్వస్థలం. నేలమర్రి సాయుధ కార్యాలయ బాధ్యత కోదాటివారు నిర్వహించారు. అక్కడ కార్యకర్తలకోసం ఒక చిన్న ఆస్పత్రి కూడా నిర్వహించారు. సింహాద్రి డాక్టర్ గా ఉండేవారు. కొన్నాళ్లు నేను అక్కడ ఉన్నాను. చికిత్స చేయించుకున్నాను.





