Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
బలిదానం
మృత్యువు ఎదురుగా ఉంటే రెండే రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఎదిరించి పోరాడ్డం, రెండు ఓటమిని అంగీకరించడం.
అమృత్ మాత్రం ఒంటరిగా లేడు. ముగ్గురు మిత్రులున్నారతని వెంట-రహీమ్, బన్తాసింగ్, మద్రాసీ జోసెఫ్, రైఫిళ్ళను వారు మరీ గట్టిగా పట్టుకున్నారు. నేఫా కొండలు నిరంతరంగా అగ్గి కురిపిస్తున్నాయి- అంత మంచులోనూ, అంత చలిలోనూ!
రాళ్ళ, బోళ్ళ జీవితాలెంత మంచివి?
నేటికి 20, 25 సంవత్సరాల క్రితం జీవితానికి ఒక అర్థం అంటూ ఉండేది. అది వాస్తవమూ అనిపించేది. మరి ఇవ్వాళో! ఇవ్వాళ మృత్యువు ప్రతివస్తువునూ తన గుప్పెట్లో పెట్టుకుంది. దాని ఇష్టం వచ్చినప్పుడు తొక్కేస్తుంది, నలిపేస్తుంది, మ్రింగేస్తుంది. అబ్బ! ఎంత కఠినమైందీ మృత్యువు!! కళ్ళద్దాల మీద దుమ్ముపొరలు చూచాడా ఎవడైనా? చూచాడా ఎవడైనా గుండెను కోస్తున్న రంపాల మొనల్ను? యవ్వనాన్ని మెడపట్టి బురదలో రుద్దుతే దీనికేం జరుగుతుందో? అగ్నిప్రళయాలూ, మట్టిప్రళయాలూ దానికేం జరిగిస్తాయో! అబ్బ! మనిషికి శక్తే ఉంటే దానికీ తెలిసి వచ్చేట్టు చావును చంపగలిగేవాడు.
జీవితం దేన్నంటారు? దాని చెవిమీద దోమసైతం ఎందుకు పాకదో? అది ప్రయాణపు నేత్రాల్ను ఎందుకు పెరికేస్తుందో? గమ్యపు కాళ్ళను ఎందుకు నరికేస్తుందో? బాటల రెక్కల్ను ఎందుకు కాల్చేస్తుందో? అది మానవుని శ్వాస అనే సీతాకోక చిలుకకు అదృష్టం అనే సుగంధం చూపి తనవైపు ఎందుకు లాక్కుంటుందో?
ఒహ్హో! ఏమిటీ ఆలోచన! మృత్యువంటే నాకు భయంలేదు. అయితే, ఎందుకూ నాకీ ఆలోచన్లు? నా మిత్రులేం ఆలోచిస్తున్నారో?
తుపాకి గుండ్ల ధ్వని దగ్గరి దగ్గరికి వస్తూంది. వీళ్ళు కూడా తుపాకుల మూతులు అటు ఇటూ త్రిప్పి అప్పుడప్పుడూ 'ఫైర్' చేస్తున్నారు. దగ్గరున్న మందుగుండు అయిపోతున్నప్పుడు ఏం చేస్తారు మరి! నలుదిక్కుల ఉన్న చౌకీల్తోగల సంబంధం తెగిపోయింది. శత్రువు అట్టే దూరంలో లేడు.
"మిత్రులారా! ఊపిరి ఉన్నంతవరకూ పోరండి, చావడమో, చంపడమో!"
ఆ ధ్వని తన గుండెలోనే అణగిపోయింది. ఎడతెరిపిలేకుండా ఎదుటినుంచి గుండ్లు పేల్తున్నాయి. మంచు మెల్ల మెల్లగా కరుగుతూంది. దూరంగా కనిపించే మంచు శిఖరాల్ని చూచి, క్షతగాత్రులైన సైనికుల్ని తీసుకొనిపోవడానికి వచ్చి, వారు కనిపించకపోగా తిరుగుతున్న హెలికాప్టర్ అనుకొన్నాడతను.
రేయి, చీకట్ల గుంపులు, మరీ భయానకం అయింది. మోర్చా (స్థావరం) కంపిస్తూంది. క్షణాల్లో ఎంత ఘోరం!
ఆలోచనలు కఠినములు. వాటికి దయ ఉండదు. క్షణాల్లో ఎక్కడెక్కడికో మోసుకొనిపోతాయి.
అతనికి గతం గుర్తుకు వచ్చింది. అప్పుడతనికి పదహారేండ్లు. అలిగి ఇంటినుంచి పారిపోయాడు. అప్పుడతణ్ణొక భూతం ఆవేశించింది. ఏదో ఒక మహా శక్తి అతణ్ణి ఆకర్షించింది. ఏదో అగోచరమైన గమ్యంవైపు లాక్కొనిపోయింది.
'ఇండియన్ నేషనల్ ఆర్మీ'లో చేరి దేశసేవ చేద్దామనుకున్నాడు.
ఆ పదాలు అతనిముందు తళుక్కుమన్నాయి. ఏదో ఆశ-ఆశయం-అతణ్ణి బంధించివేసింది. ఒక జ్యోతి రెపరెపలాడింది. జీవితంలో కొత్తబాట వెతుక్కున్నాడు. బ్రతుకులోని ఒక భారం దిగిపోయింది. మాతృదేశానికీ, తలిదండ్రులకూ సేవచేసే అవకాశం లభించింది.
నాలుగు సంవత్సరాల తరువాత ఇంటికి తిరిగివస్తే గ్రామానికి గ్రామమే మారిపోయింది. ఆ కాలిబాటలు, అ మధురగీతాలు అతణ్ణి బాహువులు చాచి ఆహ్వానించాయి. అదే బావి, దాని అంచున ఉన్న తుమ్మచెట్టూ అదే. అదే నీలాటి రేవు. అతని మనోఫలకంమీద పూర్వస్మృతులు తళుక్కుమనగా ఊళ్ళో ప్రవేశించి కూడా 'మోర్చా' మీద ఉన్నట్లుగా భావించాడు.
ఆ వూరు తనదే. అదే తాను పుట్టిన గడ్డ.కాశ్మీరపు పుష్పక్షేత్రాల్లో వికసించిన జమ్మూకు నలభై మైళ్ళ దూరంలో ఉన్న "ఫారఖ్" ఆ గ్రామం. ఈ కాలి బాటలమీద, ఈ మైదానాల్లో, ఈ ఎత్తుపల్లాల్లో అతని బాల్యం, కౌమార్యం, గడియల్లో రెక్కలు విచ్చుకుని గగనపథంలోకి ఎగిరిపోయినాయి.
అవే పొలాలు. తన జీవనక్షేత్రంలో వేల పూల మొక్కల్ను ఉయ్యాలలూపిన పొలాలే అవి. ఆ బావి, ఆ ముసలి తుమ్మచెట్టు, తాను ప్రేమించిన "అల్ఠర్ సర్ నౌ"- ఆ సర్ నౌ కోసమే అతడు ఊరు వదిలి వెళ్లిపోయింది.
"సర్ నౌ".... గ్రామం....జీవితం. అతడు నిరాశచెంది కూర్చున్నాడు. "పారఖ్" దృశ్యాలు ఒకదానితర్వాత ఒకటి అతణ్ణి ఆకర్షించసాగాయి. పారఖ్ యువకులంతా కేకలు వేసి చెప్పారు "అమృత్! మన ఊరి పేరు దక్కించాలి" అని.
మరొకసారి "పారఖ్"ను తనలో ఇముడ్చుకున్నాడు. తనవారూ, పరాయివారూ అంతా అతని స్మృతిపథంలో మసలుతున్నారు.
"సర్ నౌ" అతనిదైపోయింది. ఎంత అందమైనవా రోజులు! ఎంత ఆనందమైనవా క్షణాలు!! తల్లి, తండ్రి, ఊరు, పొలాలు, సర్ నౌ - మొత్తం దేశం.
"అమృత్, అమృత్! నీ తుపాకి మౌనం వహించిందేం? ఏమిటా ఆలోచన? ఇది ఆలోచించే సమయం కాదు, పోరాడే సమయం." బన్తాసింగ్ అన్నాడు.
"ఓ. నేను ఆలోచించడం లేదు మిత్రమా, ఆలోచించడం లేదు. నేను నా కోసం ఆలోచించను. అందరికోసం ఆలోచిస్తాను. నేనే మౌనంగా ఉన్నానా? ప్రకృతి సాంతం శాంతం వహించింది. శాంతి, శాంతి కొరకేగా మనం సమరం సాగిస్తూంట?"
బుల్లెట్ల వర్షం కురుస్తోంది. నలువైపులా అగ్గి రగిలింది. అగ్గి....అగ్గి....అగ్గి.
"కాని, మనం ఓటమి నంగీకరించం. వతన్ కీ ఆబ్రూ............(దేశగౌరవం)."
బన్తాసింగ్ మెడ వాలిపోయింది. బులెట్ కణతలోంచి దూసుకొనిపోయింది. అతని పెదవులు ఆ పద్యపాదం పూర్తి చేయకుండానే శాశ్వతంగా మౌనం వహించాయి.
బన్తాసింగ్ జాట్. పొడవైన దేహం, విశాలమైన వక్షం, గుండ్రని తేజోవంతములైన నేత్రాలు, పెద్ద గడ్డం గల బన్తాసింగ్, పంజాబ్ క్షేత్రాల రక్షకుడు. బన్తాసింగ్ కోట్ల కోర్కెలు గుండెలో ఉంచుకునే శాశ్వతంగా నిద్రించాడు. ఒక వారం ముందు శలవు మీద వెళ్ళాల్సినవాడు- తన ఇంటికి, తన భార్య బసంతీ దగ్గరికి. మొన్న మొన్ననే అతని పెళ్ళైంది. జీవితంలో ఏ నలుసు చూచాడతను? పొలాల్లోని ఎర్రని మట్టిలా అతడు హిమాలయాల మీద చెదిరిపోయాడు-తన పంజాబ్ జానపద గీతాలు గుండెలో ఉంచుకొని, తన బసంతీ కుంకుమ తన చేత్తో చెరిపి ఒరిగాడు-దేశం కోసం!
"ఒక్క బన్తాను కూల్చి, ఒక్క బసంతీ మంగళసూత్రం తెంపి! మా నేల లాక్కోలేవురా. ఇంకా లక్షల మంది బన్తాలు తమ దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నారు!" అమృత్ కోపోద్రిక్తుడై అరిచాడు.
బన్తాసింగ్ పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేస్తూంది. అది శాశ్వతమైన మందహాసం. దాన్ని ఏ తుపాకీ, ఏ బాయినెట్టూ, ఏ బుల్లెట్టూ ఏమీ చేయలేదు. అది నశించని చిరునవ్వు. అది అనంతమైన చిరునవ్వు.
శత్రువులు చాలా దగ్గర్లోకి వచ్చేశారు. వారు నాలుగు వైపుల్నుంచీ చుట్టివేశారు. తిండి ఎన్నడో ఒడిసిపోయింది. మందుగుండు కూడా కొన్ని క్షణాల అతిథే. ఇప్పుడే వారు ఒక్క ఫైర్ చేసి ట్రెంచిలోకి ముడుచుకుంటున్నారు.
రహీమ్!
ఒక బ్రెన్ గన్ "బస్ట్" అతని గుండెను జల్లెడ చేస్తూ కందకంలో త్రోసి వెళ్ళిపోయింది.
"తరవాత ఎవరివంతో?" అమృత్ ఆలోచిస్తున్నాడు. ఫైర్ చేస్తున్నాడు.
రహీమ్....పది పది శవాల్ను తన భుజంమీద వెనుకవున్న చౌకీలదాకా చేర్చిన రహీమ్....కందకంలో గడ్డకట్టుకుపోతున్నాడు. అతణ్ణి ఎవరు లేపగలరు? జోసెఫ్ ఒకటి రెండుసార్లు ప్రయత్నించాడు. కాని, అమృత్ అతణ్ణి ఆపాడు.
రహీమ్ యు.పి. లోని సైద్ పురం గ్రామవాసి. అతనికీ లోకంలో ఎవరూ లేరు. తల్లి, తండ్రి, సోదరులు ఎవరూ లేరు. అతని సర్వస్వం ఈ దేశమే. అతడు దేశభక్తి గీతాలు రాశాడు, పాడాడు.
బ్రతికితే దేశంకోసం బ్రతకాలి. చస్తే దేశంకోసం చావాలి. మాతృభూమి గౌరవ ప్రతిష్ఠలకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పించుకొని తిరగడమా? థూ....! ఏం బ్రతుకు?
రహీమ్ యు.పి. ముసల్మాను. అతడు నవాబుల వంశపు వాడు కాడు. సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఎన్ని కోర్కెలు గుండెలో పెట్టుకొని చచ్చాడో. అయినా అతడు అమరుడైనాడు. అమరవీరుడు. ఒక్కొక్క తుపాకి గుండుతో ఒక్కొక్క శత్రువును కూల్చాడు. అతని తల వంగి ఉంది. అతడు మహత్తరమైన తన దేశానికి ప్రణమిల్లుతున్నాడు.
"జోసెఫ్! మందుగుండు అయిపోయింది."
"మృత్యువు మన ముందున్నది. కాదు. వీల్లేదు. ధైర్యం కోల్పోరాదు. శత్రువు బాంబులు విసురుతున్నాడు. ఎల్లాగో ఈ కందకం నుంచి బైటపడాలి. మరొక కందకానికి చేరుకుంటే బలవంతులమౌతాం."
"కాని, మనను వారికి అప్పగించుకోవడం వినా గత్యంతరం లేదు."
"వీల్లేదు. నేను చెప్పినట్లు చెయ్యి. చూశావా, వాళ్ళు మనం ఊరుకున్నామని కొంతసేపణ్ణుంచి వారూ మౌనంగా ఉన్నారు. నడువ్, ముందరి కందకంలోకి దూకు."
జోసెఫ్ ఒక్క దూకులో కందకంలో పడ్డాడు. అతడు కూర్చొని చావుకోసం నిరీక్షిస్తున్నాడు. నేను దొంగ చూపుల్తో నాలుగువైపులా చూచాను. ఎగిరి గంతేశాను. "ఆహ్" అనే కేక వినిపించింది. గుడ్డిగా కందకంలో పడిపోయాను. పిక్కలోంచి దూసుకొనిపోయింది గుండు. నా గాయాన్ని చూచి జోసెఫ్ అటూ, ఇటూ వెతికాడు. కాని అక్కడేముంది గాయానికి కట్టుకట్టడానికి? జోసెఫ్ నా దగ్గరికి వచ్చి చూస్తూ కూర్చున్నాడు. మా దగ్గరేముంది ఎదిరించడానికి?
అమాంతంగా మా చుట్టూ "మోర్టార్ల" వర్షం కురిసింది. గుండ్లు కురుస్తున్నాయి. బహుశః మేము ఇందులో ఉన్నామని శత్రువుకు తెలిసింది. అందుకే వారు తమ శక్తినంతా ప్రయోగిస్తున్నారు. మేము బాయినెట్లు తీసుకొని అమాంతంగా వారిమీద దూకే స్థితిలో లేము.
అరె! అదేమిటి? జోసెఫ్ మెరుపులా ఎగిరి ఏదో విసరి కందకంలో నక్కాడు. అది చేతి బాంబు. కేకలు తప్ప నాకేమీ వినిపించలేదు.
"అమృత్! దిగులుపడకు. చివరి సమయం కోసం రెండు చేతి బాంబులు అట్టిపెట్టాను. అదిగో, వారు దగ్గరికి వచ్చేశారు. మనం ఇద్దరం చస్తే ఫర్వాలేదు, రెండు వందలమందిని చంపుదాం."
బైటినుంచి గుండ్లు, బాంబులు పడుతున్నాయి వర్షంలా. శత్రువుకు కూడా పట్టుదల పెరిగింది.
జోసెఫ్ మరొకసారి ఎగిరాడు. కాని, తిరిగిరాలేదు. బైటపడిపోయాడు-సగం కందకంలో సగం బైట. బుల్లెట్లు అతని తలను సహస్రచ్చిద్రం చేశాయి. శత్రుసంచలనం పెరిగింది. వారిలో ఓపిక చచ్చినట్లుంది.
జోసెఫ్ శాశ్వతంగా నిద్రించాడు-మద్రాసీ జోసెఫ్,క్రిశ్చియన్ జోసెఫ్. అతడు ఆకసాన్ని చూస్తున్నాడు. కొంతసేపు మౌనం రాజ్యం చేసింది. అతని రెండు చేతులూ ఎత్తి ఉన్నాయి-దేశ క్షేమం కోసమూ, శత్రువు నాశనం కోసమూ ప్రార్థిస్తున్నట్లు. అతని భార్య కూడా ఇలాగే తన భర్త రావాలని ప్రార్ధిస్తూ ఉండవచ్చు! కాని, అతడు హిమాలయపు ఒడిలో శాశ్వతంగా నిద్రించాడు.
బన్తాసింగ్, రహీమ్, జోసెఫ్....ఇక నా వంతు.
నేడు ఆకాశం పసుపు పచ్చగా ఉంది. నిప్పు, నిప్పు. అగ్ని.... అగ్ని. పొగ. పొగ. ధూమం......ధూమం. మేము దేశానికి ఎంత దూరంలో ఇక్కడ చస్తున్నాం? ఛా....ఛా. అలా అనకూడదు. భగవానుడు అందరికీ ఇలాంటి మృత్యువే ప్రసాదించుగాక! భూమాత మాన సంరక్షణమే కదా బిడ్డల కర్తవ్యం? మన మువ్వన్నె పతాకం కోసం, మన ప్రజల గౌరవ రక్షణకు చావడమే బలిదానం. మేమంతా అమరులం. నా దేశం అమరమైంది.
అమృత్ తలెత్తి చూస్తే కందకం చుట్టూ శత్రు సైనికులు తుపాకులు పట్టుకొని నుంచున్నారు.
"ఫైర్" అనే కేక వినిపించింది.
* * * *





