Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
మేము మున్షీగారి ఉపన్యాసం విందామని వెళ్లాం. నిరాశతో తిరిగి వచ్చాం. పార్టీ నిర్ణయం సరియైంది కావచ్చు. నందిగామలో వారి చర్య నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎదుటివానిమాట వినడం ప్రజాస్వామ్యం అవుతుంది. మాట్లాడనీయకపోవడం నియంతృత్వం అవుతుంది. నియంతృత్వం ఏరూపంలో ఉన్నా - ఛాందసం ఏరూపంలో ఉన్నా - ఇవ్వాళ్టికీ - నాకు నచ్చదు!
"పాపీచిరాయుః"
ఇది ఇలా ఉండగా 1947 డిసంబరు 4 న నిజాం నవాబుమీద బాంబు విసిరారు.
నిజాం నవాబు రోజూ నమాజుకు - కింగ్ కోటీనుంచి మక్కా మసీదుకు వెళ్తాడు. అతని వాహనం చేరుకునే దానికి కొంతముందు - పోలీసులు ఒక పక్క ట్రాఫిక్ కాళీ చేయిస్తారు. ప్రభువుల దురహంకారం ఏమంటే - తమ శాసనాలను పాటించరు. నిజాంకారు. ఎడమ భాగంకాదు - రోడ్డుకు కుడి భాగంనుంచి సాగుతుంది.
ఆనాటి సాయంకాలం ముగ్గురు యువకులు - నారాయణరావు పవార్ - గండయ్య - జగదీశ్ నైజాం నవాబును హతమార్చడానికి వ్యూహం ఏర్పరచుకున్నారు. ముగ్గురూ మూడు బాంబులు తీసుకున్నారు. 1. నారాయణరావు పవార్ ఆల్ పెయింట్స్ దగ్గర బాంబు విసరుతాడు. అది తప్పుతే 2. మరికొంత దూరంలో గండయ్య బాంబు వేస్తాడు. అదీ తప్పుతే 3. మరికొంత దూరంలో జగదీశ్ బాంబు విసురుతాడు. ఇదీ వ్యూహం. ఆ సాయంకాలం నిజామును ఖాతం చేయాలని పథకం.
నిజాం వాహనాల బిడారు కింగ్ కోటీనుంచి సాగింది. పోలీస్ విజిల్స్ - జనాన్ని పక్కకు నెట్టడం - హడావుడి ప్రారంభం. బిడారు సాగిపోయింది.
నిజాంకారు ఆల్ సెయింట్స్ ముందుకు వచ్చింది.
పవార్ నిజాం కారుమీద బాంబు విసిరాడు.
బాంబు గురి తప్పింది! కారు తలుపుకు తగిలింది. తుస్సుమన్నది.
డ్రైవరు కారును నిలిపాడు. వెనక్కు తిప్పాడు. నవాబు క్షేమంగా కింగ్ కోటీ చేరాడు. పాపీచిరాయుః.
నారాయణరావును వెంటనే అరెస్టు చేశారు. గండయ్యను మూడు రోజుల తరువాత పాలమాకులలో అరెస్టు చేశారు. అప్పటికే జగదీశ్ నిజాం పొలిమేరలు దాటాడు.
నారాయణరావునూ - గండయ్యనూ సెషన్స్ జడ్జి ముర్తుజాఖాను విచారించాడు. నారాయణరావుకు ఉరిశిక్ష - గండయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు.
ఈ ఉదంతం విని అన్నయ్య దాశరథి జైల్లో రచించిన "అగ్నిరసం" -
"ఒక కప్పు అగ్నిరసం త్రాగిన
నారాయణరావ్!
నీ హస్తం విసిరిన రవిగోళం
నరకాసుర మర్దనానికి
నడచిన యాదవ యోధుని
కోదండ వినిర్గత బాణం."
నారాయణరావు - గండయ్యలు శిక్షలు ధృవీకరించకముందే పోలీసు చర్య జరిగింది. వారిని విడుదల చేశారు.
నేను మున్సిపల్ కార్పొరేషనులో పని చేస్తున్నపుడు జగదీశ్ నా ఆధీనంలో పనిచేసే 'కామటి' అంటే కూలి. అది ఆరవ దశకం. తెల్లని కద్దరు బట్టల్తో చిరునవ్వుతూ - చేతులు కట్టుకొని నుంచునేవాడు. జగదీశ్ ను నాతో సమంగా కూర్చోబెట్టుకున్నాను. ఇద్దరం కలిసి చాయ్ తాగాం. అతనికి కూలిపని తప్పించగలిగాను.
బ్యూరోక్రసీని ఉర్దూలో "నౌకర్ షాహీ" అంటారు. అంటే నౌకర్ల రాజ్యం. ఆఫీసరు, గుమాస్తా అందరూ నౌకర్లే! ప్రజా ప్రభుత్వంలో 'ప్రజ' పేరు కే. ప్రభుత్వం కనిపించదు. కనిపించేది నవుకర్ణ సర్కారే!
జగదీశ్ సమారా యోధుల పెన్షనుకు అప్లైచేశాడు.
జేలు సర్టిఫికేటు సమర్పించమన్నారు!
భగత్ సింగ్ తల్లిని కూడా జేలు సర్టిఫికేటు అడిగారట!
మన అధికారులు అంతటి దేశభక్తులు!
నేను రాజ్యంలో ఎక్కడున్నా అరెస్టు చేయమని నిజాం ప్రభుత్వపు హోం సెక్రటరీ వారంటు జారీ చేశారు. నేను అది సమర్పించుకున్నాను. "చెల్లదు" అని జవాబు వచ్చింది!
అనంతరం పెద్దలు గ్రహించారు. జగదీశ్ కు, నాకూ పెన్షను వచ్చింది.
సూర్యబింబం రాలింది:
తుపాకి శిక్షణ పూర్తి చేసుకుని బెజవాడ చేరుకున్నాను. కార్యక్రమం చేపట్టే ముందు కేసరిపల్లి వచ్చాను. అమ్మా - చెల్లెళ్లు బావున్నారు. అమ్మకు - ఏదో బరువు దింపుకున్నట్లనిపించింది. ఉభయ మిత్రులూ వారికి ఎలాంటి లోపం రానివ్వడం లేదు. అన్నయ్య దగ్గరినుంచి అప్పుడప్పుడూ ఉత్తరాలు వస్తున్నాయి.
నిజాం నుంచి బయట పడ్తే ఏదో జేలునుంచి - నిర్బంధం నుంచి - యమకూపం నుంచి బయటపడినట్లుంది. స్వతంత్ర దేశంలో - విశాల ప్రపంచంలో - వెలుగులోకి వచ్చినట్లుంది. ఏదో ఒక రకంగా పోరాటంలో పాల్గొంటున్నామని తృప్తి ఉంది.
ఆర్జించడంలో ఆనందం లేదు.
త్యాగంలో ఆనందం ఉంది.
అది ఇంకెందులోనూ లేదు.
1948 జనవరి 30 శుక్రవారం. మేమంతా ప్రకాశరావు కిళ్లీ బడ్డీమీద కూర్చున్నాం. సాయంత్రపు సోడాలు తాగాం. సిగరెట్లు కాల్చాం. సరదా కబుర్లలో ఉన్నాం.
బస్సు బెజవాడనుంచి గన్నవరం పోతున్నది.
"మహాత్ముని హత్య చేశారు!" బస్సులోంచి కేక వేసి చెప్పారు.
అమాంతంగా నిశ్శబ్దం.
అంధకారం అలముకుంది.
నేను తల బాదుకున్నాను. ఎలుగెత్తి ఏడ్చాను. అందరూ దుఃఖంలోనే ఉన్నారు. ఏడ్చింది మాత్రం నేనే. తల బాదుకొని ఏడ్చాను. నా ఏడుపే ఊరికి ఎరుకపరచింది. అమ్మ పరిగెత్తుకొని వచ్చింది. నన్ను పట్టుకున్నది. తల నిమిరింది. ఓదార్చింది. అప్పుడన్నాను:-
వెలుగులేని లోకంలో
బ్రతికేదెట్లా భాయీ!
ఊరంతా పంచాయితీ రేడియో దగ్గర కూడింది. వార్త అదే. జగ్గయ్య వార్తలు చదివినట్లు గుర్తు. ఖంగుమనే గొంతులో విషాదం!
ఊరు సాంతం మూగపోయింది.
"The light has gone out of our lives" అని - సరిగ్గా నేను తెలుగులో అన్నమాటలే జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రధాని - ఇంగ్లీషులో అన్నారు.
ఆ దురంతం చూడలేకపోయాడు. సూర్యుడు అస్తమించాడు. లోకంలో చీకట్లు కమ్ముకున్నాయి! వివరాలు:--
1948 జనవరి 30 శుక్రవారం సాయంత్రం 4.00 గంటలు. సర్దార్ పటేల్ మహాత్ముని దర్శించారు. ఇద్దరూ మాట్లాడుతున్నారు. అయిదు అయింది. ప్రార్థన సమయం. మహాత్ముడు సర్దార్ ను పంపించారు.
మహాత్ముడు గడియారం తీశాడు. చూచారు. 5.10 అయింది. ప్రార్థనకు బయలుదేరారు. మనుమరాళ్లు మను, అభ పక్కన ఉన్నారు. వారు ప్రార్థనాస్థలానికి సాగారు. ఇద్దరు పిల్లలమీద రెండు చేతులు వేశారు. నడిచారు.
మహాత్ముడు కొంతదూరం నడిచారు. ప్రార్థనకు వచ్చిన జనం కనిపించారు. వారంతా నమస్కరించారు. గాంధీజీ పిల్లల బుజాలమీదినుంచి చేతులు తీశారు. చేతులు జోడించారు. ఎల్లరకూ నమస్కరించారు.
అలా సాగుతున్నారు జాతిపిత. అప్పుడు నాధూరామ్ గాడ్సే గుంపును నెట్టుకుంటూ దూసుకు వచ్చాడు. 'మను' గాడ్సేను చూచింది. అతడు బాపూజీకి పాదాభివందనం చేయడానికి వస్తున్నాడనుకుంది. అతని బుజం పట్టుకుంది.
గాడ్సే 'మనూ'ను విదిలించాడు. విడిపించుకున్నాడు.
బాపూజీ ముందుకు వంగారు.
గాడ్సే పిస్తోలుతో బాపూరొమ్ముకు పేల్చాడు.
నమస్కరించడానికి లేచిన బాపూ చేతులు మెల్లగా వాలేయి. గుండు రొమ్ముకు కుడిపక్కన తాకింది!
గాడ్సే వెంటనే మరో రెండు బుల్లెట్లు పేల్చాడు.
మహాత్ముడు కుప్పకూలారు!





