Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
కెప్టెన్ కిశోర్ తమ తమ స్థానాలను జాగ్రత్తగా కనిపెట్టి ఉండండని తమ సైనికులకు ఉత్తర్వులిచ్చి, తాను దుర్భిణీయంత్రంతో శత్రువులు వస్తూ ఉండే వైపు చూచాడు. ఇదేం విచిత్రం! కిశోర్ ఆ దృశ్యాన్ని చూచి నిర్విణ్ణుడయ్యాడు. అసంఖ్యాకులైన భారతీయ మోంఛా సన్యాసులు, పిల్లలు, ఆబాల వృద్దులూ, మహిళలూ ఒక వరుసలో అర్థ వర్తులాకారంగా పడుతూ లేస్తూ వస్తున్నారు. ఆ వరుస వెనక లెక్కలేనంత మంది చీనా సైనికులు ఫిరంగులు, తోపులు, టాంకులు మొదలైన ఆయుధాలతో రావటం కనబడ్డది. ముందు భాగంలో ఉన్న భారత పౌరుల వరుసలో తన గ్రామవాసులు ఉండటం చూచి, కిశోర్ చాలా కలవరపడ్డాడు. సూక్ష్మంగా చూస్తుంటే ఆ వరుసలో తన ముసలితల్లి, పసిబిడ్డ నెత్తుకొని తన భార్య మాలతి దైన్య దశలో వస్తూండటం చూచాడు. తన చెల్లెలు మాత్రం ఆ జనంలో కనిపించలేదు. బహుశః క్రూరులైన చైనా వారు ఆమెను చంపి ఉంటారు. లేదా, మానభంగానైకి భయపడి ఆమె ఆత్మహత్య చేసుకొని వుండవచ్చు.
కిశోర్ ఆ దృశ్యాన్ని చూస్తుంటే, అందులో తన భార్య అర్థనగ్నంగా ఉన్నట్లు కనపడింది. ఆమె కట్టుకొన్న చీర మాత్రం ఉంది. ఒళ్ళో ఉన్న పసిబిడ్డ తల్లి స్తన్యం త్రాగుతూ ఉన్నది. తొందరగా నడవజాలనివారిని వెనకనుంచి చైనా సైనికులు తుపాకీ మడిమలతో ఆ అర్ధనగ్న భారత పౌరులను పొడుస్తూ ముందుకు తోస్తున్నారు. వాళ్ళ వీపులు గాయపడి రక్తం చిమ్ముతున్నాయి. చాలామంది క్రిందపడిపోతున్నారు. పడిపోతున్న వాళ్ళను వెనకనుంచి శత్రువులు ముందుకు త్రోస్తూ ఉన్నారు. వాళ్ళు తమకు చాలా దగ్గరగా వచ్చారు. కెప్టెన్ కిశోర్ కు తాను ఓడిపోయి తన తల్లిని, భార్యను, బిడ్డను రక్షించుకోవాలని అనిపించింది. "వీళ్లు మావారు, విడవండి" అని చైనా వాళ్ళను వేడుకోవాలనిపించింది. ఉఫ్! మరుక్షణంలో అతనికి తనదనే మోహం, మమకారమూ నశించి, ఛీ! తనవాళ్ళకోసం తాను పిరికిపందలాగా వర్తించి, తనను నమ్ముకొన్న సైనికులను శత్రువుల తుపాకీ గుండ్లకు ఆహుతిచ్చి, తన పవిత్ర భూమిని చైనా వాళ్ళకు అప్పగించాలా? వృద్ధమాత, భార్య, బిడ్డకంటే భారతమాత హెచ్చుగాదా? వీటన్నిటికంటే దేశ స్వాతంత్ర్య శ్రేష్ఠం కాదా? అని తలపోస్తూ ఉన్న కెప్టెన్ కిశోర్ ఉడుకురక్తం ఉప్పొంగి, తన కార్యాన్ని సాధించటం కోసం చైనావారు అనుసరించిన కుతంత్రాన్ని విఫలం చేయాలని నిశ్చయించుకొన్నాడు.
చైనా సైనికులు ఈ కుతంత్రాలతో ఇప్పుడు తమ లక్ష్యానికి చేరుకొన్నారు. అంతలోనే వాళ్ళు భారత సైన్యంమీద తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు. అప్పుడు చైనా సైన్యం ముందు వరుసలో వస్తున్న భారత పౌరులందరూ భస్మమై వారితోపాటు భారత సైనికులు నశించారు. దానికంటే ముందు కెప్టెన్ కిశోర్ "ఫైర్, ఎడ్వాన్స్ ఫైర్" అని సింహనాదం చేస్తూ తన సైన్యాన్ని పురికొల్పాడు. భారత సైన్యం వేసిన తోపు గుండ్లు మంటలు గ్రక్కుతూ ముందున్న పౌరులగుండా దూరి చైనా సైనికులమీద పడుతూ పోయినాయి. "ఫైర్-అడ్వాన్సు క్విక్లీ" అని తిరిగి కెప్టెన్ కిశోర్ విజృంభించి గర్జించాడు. అతనిలో మానవాతీతమైన ఉన్మాదం, భయంకర క్రోధమూ పెల్లుబికినై. ఒక తోపును నడిపే తన సైనికుడు గాయపడి క్రిందపడిపోవటం చూచి, దాన్ని తానే నడుపుతూ తిరిగి భయంకరంగా "ఫైర్ అడ్వాన్సు. మారో, యా మారో, ఫీఛే మత్ హటో, ఫైర్" అని గర్జించాడు. శత్రువులుకూడా తేరుకొని భారత సైన్యంమీద ఫిరంగి తోపుల గుండ్లు కురిపిస్తూ వచ్చారు.
ఇలా ఇరువాగులవారి తోపు గుండ్లకు, ప్రేలుళ్ళకు, రేగిన అగ్నిజ్వాలల నుంచి బయలుదేరిన పొగ నీల మేఘంలా ఆకాశమంతా వ్యాపించింది. శత్రువుల తోపు గుండ్లు తమ ప్రక్కలలో పడి ప్రేలుతున్నప్పటికీ భయపడకుండా కెప్టెన్ కిశోర్ తన తోపుగుండ్లు సూటిగా శత్రువుల టాంకులకూ, తోపులకూ, లారీలకూ తాకేలాగు కొట్టండని ఫైరార్డరు ఇచ్చాడు. కిశోర్ నడుపుతూ వున్న తోపు గుండ్ల "హాట్ ఫైర్" నుంచి అయిదారు చీనా టాంకులు బొమ్డిల్లాలో మిగిలిపోయాయి. అయినా, దైవం అతనికి ప్రతికూలమైంది. చైనావారి మరొక పటాలం భారతీయ సైన్యం వెనకవైపునుంచి తోసుకొని వచ్చి భయంకరంగా దాడి చేసింది. కిశోర్ తన సైన్యాన్ని రెండు భాగాలుగా చేసి, ద్విముఖంగా దాడి చేయటానికి ఆరంభించాడు. అయితే, రెండువైపులా సాగించిన చైనావారి దాడివల్ల భారత సైనికులు చాలామంది గాయపడ్డారు, మరణించారు కూడా. మన తోపు గుండ్లు, టాంకులు పనిచేయకుండా పోయినై. మన సైన్యానికున్న మందుగుండు సామాను అయిపోయింది. ఇప్పుడు చైనా సైనికులు రెండు వైపులనుంచి ముందుకు సాగి, మన సైన్య స్థావర సమీపంలో ప్రవేశించారు. భారత సైన్యంలో కొందరే జీవించివున్నారు. కెప్టెన్ కిశోర్ కుడి భుజానికి గుండదెబ్బ తగిలి, చేయి ఊగులాడుతూ ఉంది.
ఇంతైనా అతడు చేతి బాంబులు దాచిపెట్టిన ఒక మోర్చాలో కూర్చొని, తన పైకి వస్తూన్న శత్రువులమీద వాటిని విసిరివేయసాగాడు. దానివల్ల ఎందఱో చీనా సైనికులు హతమయ్యారు. కుడి భుజం ఎముక విరిగి దేహానికి అంటుకొని వ్రేలాడుతూ ఉన్న కిశోర్ భుజం, చివరి బాంబు శత్రువులమీద విసిరివేసేటప్పుడు ఆ బాంబుతోపాటు అతని దేహంనుండి దూరంగా పోయిపడ్డది. అంతైనా అతి కష్టంతో, ఎడమ చేతిలో పిస్తోలు తీసుకొని ఒకటి రెండు గుండ్లను ప్రేల్చేలోపలనే చైనా సైనికులు ముందుకు వచ్చి అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. కిశోర్ లేవటానికి కూడా వీల్లేకపోయింది. పశువుకంటే హీనంగా ఉన్న కఠినుడైన ఒక చీనా సైనికుడు తన సన్నీ కొనను అతని పొట్టలో గ్రుచ్చి కిశోర్ ను పైకెత్తి నిలిపాడు. కెప్టెన్ కిశోర్ అంతైనా అతని నోటినుండి "ఊహ్" అని కూడా అనలేదు. అంతటితో తృప్తిచెందక తన సైన్యాధికారి కనుసైగతో మరొక చైనా సైనికుడు వెనుకనుంచి కెప్టెన్ కిశోర్ వీపుమీద తుపాకీ కొనతో బలంగా గ్రుచ్చాడు. అది కిశోర్ పొట్ట ముందుభాగంలోగా దూరి వచ్చింది. చైనావారు గ్రుచ్చిన రెండు తుపాకుల కొనల నడుమ ఊగాడుతూ కెప్టెన్ కిశోర్ ఆ దారుణ దుఃఖాన్ని సహించటానికి సాధ్యంకాక, ఇప్పుడో, ఇంకో క్షణానికో ప్రాణపక్షి అతని బొందిలోనుండి ఎగిరిపోయేలాగా ఉన్నది. అప్పుడు చైనా సైనికాధికారి ఒకడి కిశోర్ ఎదుటినిలిచి "తుమ్ హారా నామ్ క్యాహై" అని అడిగాడు. కెప్టెన్ కిశోర్ అతికష్టంతో తన ముఖాన్ని పైకెత్తి, మాట్లాడటానికి శక్తిలేక తన ముందు నిల్చున్న చైనా అధికారిని తిరస్కరిస్తూ చూచి "థూ" అని అతని ముఖం మీద ఉమ్మివేశాడు. దాంతో ఆ సైన్యాధికారి మండిపడ్డాడు. శత్రు సైనికుడొకడు వెనుక నుంచి వచ్చి తన తుపాకీ మడమతో కెప్టెన్ కిశోర్ తలపై బలంగా కొట్టాడు. అప్పుడు, కెప్టెన్ కిశోర్ నోటనుంచి బయలుదేరిన "జైహింద్" శబ్దంతో శరీరం నుంచి ప్రాణపక్షి కూడా ఎగిరిపోయింది.
* * * *





