Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
కాంగ్రెసువారు పొరుగు రాష్ట్రాలయిన మద్రాసులో 21, బొంబాయిలో 23, మధ్యరాస్త్ర సరిహద్దుల్లో 4 క్యాంపులు పెట్టి పోరాటం నడిపించారు.
మరొక విషయం. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించడానికి అన్ని పార్టీలు - హిందూ మహాసభ - ఆర్యసమాజం యుక్తంగా ఆయుధాలు ధరించారు. సోషలిస్టులు సరిహద్దు క్యాంపులు నిర్వహించారు.
కమ్యూనిస్టుల యుక్తంగా అన్ని పార్టీలు 1943 సెప్టెంబరు వరకు కలిసి కాకున్నా - ఒక విధమైన హైద్రాబాదు విముక్తికిగాను జాతీయ పోరాటం నిర్వహించారు.
బెజవాడలో గవర్నర్ పేటలో ఒక బంగళాలో కాంగ్రెస్ ఆఫీసు ఉండేది. అది గందరగోళాల ఆఫీసు. ఒకరి పెత్తనం కాదు. బహునాయకత్వం! యూనియన్ ప్రభుత్వ మద్దతువల్ల నడిచింది.
నేనూ - రావూరి గోపయ్యగారు కాంగ్రెస్ ఆఫీసుకు వెళ్లాం - హయగ్రీవా చారిగారిని కలిశాం. నేను మా పరిస్థితులను అంతగా వివరించాల్సిన అవసరం లేకపోయింది. అన్నయ్య అయ్యవారికి బాగా తెలుసు. పరిస్థితులు అర్థం చేసుకున్నారు.
"నువ్వు కమ్యూనిస్టుల్ల ఎందుకు పనిచేస్తవయ్య. మీ అన్నయ్య కూడ నొచ్చుకున్నాడు. మాతో ఉండరాదు? మేమేం పనికిరామా!"
"అదేం లేదండీ. నేను కమ్యూనిస్టు వ్యతిరేకిని కాను. గార్లలో కాంగ్రెస్ లేదు. పని చేయడానికే వచ్చాను."
"అరే! మేమూ వ్యతిరేకులం కామయ్య! వాళ్లు మనకేమన్న శత్రువులా? నువ్వు పట్టుదల గలవాడివి. నీ సంగతులు అన్నీ విన్న పరిటాల పో. అక్కడ తుపాకి నేర్పుతరు. తరువాత క్యాంపుకు పంపుత, ఏమంటవ్?" అని నాకు కొంత డబ్బు - చీటి ఇచ్చారు.
గోపయ్యగారికి పోరాటం మీద విశ్వాసం లేదు. నాకు తోడుగా వచ్చారు. ఇద్దరం కేసరిపల్లి వెళ్లాం. అమ్మకు డబ్బు ఇచ్చాను. నన్ను తప్పించడానికి ఎంత సాయం చేశారో పెంట్యాల చలమయ్యగారు - కేసరపల్లిలో మా కుటుంబ పోషణకు అంతసాయం చేశారు. తరువాత కాలంలో వారి రుణం మరో తీరుగా తీర్చుకున్నాను.
మా కుటుంబాన్ని చలమయ్యగారు - గోపయ్యగారికి అప్పగించాను. నేను పరిటాల చేరాను. పరిటాలకు ఒక కథ ఉన్నది. వజ్రాల క్వారీలున్నాయి. కోహినూర్ వజ్రం ఇక్కడే దొరికింది అంటారు. అప్పుడు అది గోలకొండ రాజ్యంలోనిది. కాబట్టి కోహినూరు గోలకొండలో దొరికిందంటారు.
పరిటాల నిజాం రాజ్యంలోని జాగీరు. ఆజాగీరు చుట్టూ కృష్ణా జిల్లా ఉభయ ప్రభుత్వాలకు సఖ్యత ఉన్నంత కాలం బావుంది. స్వాతంత్ర్యం రాగానే నవాబు పారిపోయాడు. నిజాంతో సంబంధం లేనందున కాంగ్రెస్ వారు పరిటాలను 'రిపబ్లిక్' గా ప్రకటించారు. ఇందుకు యూనియన్ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఇందుకు విషయం వేరే చెప్పనవసరం లేదు.
నిజాం రాజ్యం నుంచి తొలుత విముక్తం అయిన ప్రాంతం పరిటాల.
పరిటాలను యూనియన్ ప్రభుత్వం ఆక్రమించలేదు. కాబట్టి అక్కడి ప్రభుత్వం ఇండియన్ యూనియనుది కాదు.
పరిటాలలో - ఒక రాజకీయ పార్టీ - కాంగ్రెస్ పరిపాలన సాగించింది.
సుదీర్ఘ భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక భూభాగాన్ని - ఒక రాజకీయ పార్టీ పాలించడం - హైదరాబాదు స్వాతంత్ర్య సమర చరిత్రలోనే సాధ్యం అయింది.
ఒక నిర్దిష్ట ప్రభుత్వం విధానం లేదు. నామ మాత్రంగా ప్రభుత్వం సాగింది. రోడ్డు పక్కనున్న "ముసాఫర్ బంగ్లా" ఆఫీసుగా ఉండేది. బెజవాడ నుంచి నైజాం పోవడానికి "పరిటాల" దాటాలి. వాహనాల్లో ఆయుధాలు రవాణా కాకుండా చూడడం కార్యకర్తల ప్రధాన కర్తవ్యం. కార్యకర్తలే వలంటీర్లు - పోలీసులు. వారు వాహనాలను సోదా చేసి పంపేవారు. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను.
పరిటాల క్యాంపు ముఖ్య కార్యక్రమం తుపాకి నేర్పడం. పర్సా కిషన్ రావుగారనుకుంటా నేర్పేవారు. గురి చూడడం - కొట్టడం నేర్పేవారు. నాకూ నేర్పారు. నాకు గురి చూడడం - కొట్టడం చాల తొందరగా వచ్చింది. నేను అందరికంటే సూటిగా కొట్టాను. ఫస్టు కూడా వచ్చాను. పర్సావారు నన్ను మెచ్చుకున్నారు.
తుపాకి నేర్చుకోవడమే - ప్రయోగం తక్కువ. ఆయుధం బెదిరించడానికే - వాడకం తక్కువ. ప్రపంచంలో ఆయుధాలు - ఆటం - హైడ్రోజను బాంబుల సహితంగా - కోట్ల కోట్ల డాలర్లని తయారవుతున్నాయి! వీటిలో ఎన్నింటిని వాడుతున్నారు! ఎన్నటికయినా వాడడం సాధ్యమా? ఇంత వృధా ఖర్చు ఎందుకు జరుగుతున్నది? ఒక దేశం తమ పెత్తనం నిలుపుకోవడానికి - ఇతర దేశాలు ఆ దేశంనుంచి రక్షణకు!
ఈ దుష్టవ్యయం నిలిపివేస్తే లోకంలో ఆకలి - దరిద్రం దూరం అవుతాయి.
ఒక జాతిగా మానవునికి - ఒక వ్యక్తిగా మానవునికి శాంతి ఎల్లవేళలా ఎండమావులే. అందుకే వేదం 'శాంతిరేవ శాంతిః' అంటుంది. శాంతికి సహితం శాంతి కావాలట!
"తాత్కాలికం":
నిజాం రాజు - జన్మజన్మల బూజు - స్వతంత్ర భారత ప్రభుత్వానికి ఒక బెడదగా తయారయ్యాడు. వాడి మాటలు - చేతలు వెర్రివాని చేష్టలు అయినాయి. ఏనుగును దోమ సతాయించగలదు. వెర్రివాడు అందరిని ఏడిపించగలడు!
భారతదేశం అనధికార దిగ్బంధం విధించింది. భారత భూభాగం నుంచి మందులు, ఉప్పులాంటి వస్తువులు నిలిచిపోయాయి. రజ్వీ - నిజాము చిందులు తొక్కారు. కాని, బాధపడింది ప్రజలు! ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. పెట్రోలు లేదు. రవాణా బంద్!
నిజాం దుష్టత్వానికి దిగాడు. పాకిస్తానులో చేర్తానంటాడు. పాకిస్తానుకు ఇరవై కోట్లు ఇస్తాడు. సిడ్నీకాటన్ తో దొంగ ఆయుధాలు తెప్పిస్తాడు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ - U.N.O.కు ప్రతినిధులను పంపుతాడు.
ఈ బెడదను నిలుపు చేయడానికి 1947 నవంబరు ప్రాంతంలో ఉభయ ప్రభుత్వాలకు ఒక ఒడంబడిక కుదిరింది. అది యథాతథపు ఒడంబడిక - STAND STILL AGREEMENT. ఇది ఒక సంవత్సరం అమల్లో ఉంటుంది. అందులో పెద్దగా చెప్పుకోదగింది ఏమీలేదు. అంతకు ముందున్న పద్ధతి కొనసాగుతుంది. ప్రధాన విషయం - నిజాం పాకిస్తాన్ లో చేరడు! ఉభయ ప్రభుత్వాలు ఏజంట్స్ - జనరల్ ను నియమించుకోవచ్చు.
ఈ ఒడంబడికను పార్టీలు - ప్రజలు - పత్రికలు హర్షించలేదు. ఉభయ ప్రభుత్వాలూ మెచ్చుకోలేదు. ఇది BREATHING TIME - అన్నాడు సర్దార్ పటేల్ ఉభయులకూ కొంత విరామానికి సమయం దొరికింది.
భారతప్రభుత్వం కన్హయ్యాలాల్ మానిక్ లాల్ మున్షీ - K.M. మున్షీని ఏజెంట్ జనరల్ గా నియమించింది. నిజాం ప్రభుత్వం "జయిన్ యార్ జంగ్" ను నియమించింది.
మున్షీ విద్వాంసుడు. రచయిత. భారత సంస్కృతి విషయంలో ఎనలేని అభిమానం గలవాడు. వారు భారతీయ విద్యాభవన్ వ్యవస్థాపకులు. "జై సోమనాథ్" అనే ప్రఖ్యాతమైన నవల వ్రాశారు. "కృష్ణావతారం" వారు రచించిన విశిష్ట గ్రంథం.
మున్షీ వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అడవుల అవసరాన్ని గుర్తించారు. వన మహోత్సవ సంప్రదాయం వారే ప్రారంభించినట్లు గుర్తు.
1948 జనవరి 5 న మున్షీ హైదరాబాదు చేరుకున్నారు. నిజాం - వారి నివాసానికి రెసిడెన్సీ కోటీ - ఇవ్వలేదు. నిరాకరించారు. అతనికి భయం - మున్హీకి బ్రిటిష్ రెసిడెంట్ హోదా వస్తుందని! మున్హీ సికిందరాబాదులోని సైనిక నివాసంలో విడిశారు.
K.M. మున్షీ 'నందిగామ' వస్తున్నారని తెలిసింది. నందిగామ పరిటాలకు కాలి నడక దూరం.
నందిగామ కమ్యూనిస్టులకు పెట్టిన కోట. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒకే కమ్యూనిస్టు సభ్యుడు పిల్లమర్రి వెంకటేశ్వరరావు నందిగామనుండి ఎన్నిక అయినారు.
మున్షి నందిగామ వస్తున్నారు అనే విషయం తెలిసింది. నేను, పరిటాల మిత్రులు - కాలినడకన - నందిగామ చేరుకున్నాం. అప్పటికి గూడా సూర్యనారాయణగారు పరిటాల చేరుకున్నారు. మున్షీగారు రోడ్డు పక్కనున్న డాక్ బంగళాకు వస్తారు. జనం ఎక్కువగా లేరు. కాని వచ్చినవాళ్లు రోడ్డుమీద - బంగళా ఆవరణలో - ముచ్చట్లు - పెట్టుకుంటూ నుంచున్నారు.
కమ్యూనిస్టు బృందం అరుణ పతాకాలతో వచ్చింది. మున్షీ వ్యతిరేక నినాదాలు ప్రారంభించింది. వారు తాత్కాలిక ఒప్పందాన్ని నిరసిస్తున్నారు. తాత్కాలిక ఒప్పందం వల్ల నిజామును ప్రజా ఉద్యమాలను అణచే అవకాశం లభించిందని పార్టీ అభిప్రాయం. వాస్తవంగా తాత్కాలిక ఒప్పందం భారత ప్రభుత్వం సహితంగా ఎవరికీ నచ్చలేదు.
మున్షీ వచ్చారు. అరుగుమీద కుర్చీలో కూర్చున్నారు. సభకు వచ్చినవారు విడిస్థలంలో కూర్చున్నారు. మున్షీ మాట్లాడటానికి ఉపక్రమించారు. కామ్రేడులు నినాదాలు చేశారు. వారిని వెనక్కు వెళ్లిపొమ్మన్నారు. వారిని మాట్లాడనివ్వలేదు. మున్షీ నచ్చ చెప్పారు. వారి హిందీ వీరికి అర్థం కాలేదు. కొన్ని వాదోపవాదాలు జరిగాయి. కమ్యూనిస్టులు మున్షీ మీద పడ్డారు. పోలీసులు వారిని రక్షించారు. మున్షీని ఒక గదిలో ఉంచారు. దానికి కాపలా కాశారు. అయినా కమ్యూనిస్టులు కదల్లేదు. మున్షీకారులో వెళ్లిపోయింతరువాత వాళ్లు వెళ్లిపోయారు!





