Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
చావని చిరునవ్వు
వారిద్దరు రెండు చెట్లలా పెరిగారు - దగ్గర దగ్గరగా. వ్రేళ్ళు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లు, కొమ్మలు చిరుకొమ్మల వ్రేళ్ళతో ఒకదాని నొకటి తాకుతూ, పచ్చ పచ్చగా చిరునవ్వులు నవ్వుతున్నట్లు ఉంటారు వారిద్దరు. వారి ప్రేమ వారి వయస్సులాగ పచ్చగానూ, పచ్చిగానూ, అనుభవరహితంగానూ ఉంది.
అయినా, అదంటేనే అతనికిష్టం. అతనికి తన ప్రాంతపు డోగ్రా సౌందర్యమంటేనే పసందు. అది యు.పి. లాంటి తీక్షణమై, చామనచాయ గలదీకాదు. అది డోగ్రా సౌందర్యం. అతడు సైనికుడుగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని చౌకీల్లో పనిచేయడంవల్ల రకరకాల రూపు రేఖల్నూ చూశాడు. అయినా, అతడు ఠాకురాఁను మరువలేకపోయాడు. పసిడిచాయకలిగి చేరుకులా రసభరితమైన మంకు ఠాకురాఁ అమాయకమైంది. నడుము పిడికెడే అయినప్పటికీ నెత్తిమీద నాలుగు దొంతర కుండలు పెట్టుకొని మూడు మైళ్ళ దూరాన ఉన్న "తోహి" చెలిమెనుంచి నీళ్ళు తెస్తుంది. మండే ఎండలో సైతం గొర్రెలను తీసుకొని పాటలు పాడుతూ తిరిగే ఠాకురాఁ సుస్వరము గగనంలో విహరిస్తుంటే అతడు రెండు మైళ్ళ దూరం నుంచీ వినేవాడు. బాల్యం నుంచీ అది అతని అలవాటు. ఎన్ని సంవత్సరాల ఎడబాటైనా చిరుప్రాయపు అలవాట్లు మరువ గలడా?
ఠాకురాఁ మొక్కజొన్నకండె ఒలిచి పదిహేను గింజలు చేతులో పెట్టి "లెక్క పెట్టుకో - పదిహేనున్నాయి, పదిహేను" అన్నది.
ఠాకూర్ సింహుడు చేయి చాచితే ఆవిడ సగర్వంగా తల ఎత్తి దానం చేస్తున్న రాజకన్యలా చేతిలో పోసింది ఆ గింజలు. క్షణంపాటు ఠాకురాఁ చేయి ఠాకూర్ సింహ చేతికి తాకుతే ఎంతో దూరం వరకు వ్యాపించిన కొమ్మలు చిగిర్చినటైంది.
ఠాకూర్ సింహ లెక్కపెట్టి "పదిహేను లేవు, పన్నెండే ఉన్నాయి" అన్నాడు. "అబ్బే కాదు. లెక్కపెట్టి చూడు, పూర్తిగా పదిహేనున్నాయి." "పదిహేనా? ఎలా? పన్నెండే ఉన్నాయి. ఒక్కటి తక్కువగాని ఎక్కువగాని లేవు, కావాలంటే లెక్కపెట్టుకో" అరచేయి చూపుతూ అన్నాడు.
ఠాకురాఁ తన సుందరమైన వ్రేళ్ళను అతని చేతిమీద పెడ్తే పావురం కొమ్మ మీద వ్రాలినట్లనిపించింది. అంతేకాదు, ఆవిడ వేలుతో అరచేతిమీద నొక్కుతూ లెక్క పెట్టింది మొక్కజొన్న గింజల్ను.
"ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు"- మూడు చోట్ల ఒట్టిగానే వేలుతో పొడిచింది. "చూశావా పదిహేను పూర్తైనాయి" అన్నది నల్లని కళ్ళరెప్పల్ను గబగబా వాలుస్తూ.
ఉల్లాసంతో ఒక నిశ్వాసం పీల్చి "ఆఁ- ఇప్పుడైనాయి" అని అరచేతితో నాట్యం చేయించి, ఊదుకొని నోట్లో వేసుకున్నాడు. బంగారంలాంటి కరకరలాడే మొక్కజొన్న గింజలు అతని పండ్ల సందున నలుగుతుంటే ఠాకురాఁ రూపం కూడ సరిగ్గా అలాంటిదే అనిపించిందతనికి.
గబగబా మొక్కజొన్న కండె వలిచి ఠాకురాఁ గింజలను తన చేతిలో పట్టుకొన్నది. ఇరువైఐదు, ముప్పయి గింజలుంటాయి. ఊది నోట్లో వేసుకున్నది. ఠాకూర్ సింహుడు వెంటనే ఆవిడ ముంజేయి పట్టుకొని "ఎక్కువ తినేశావ్" అన్నాడు.
'కాదు' అని ఆవిడ గట్టిగా అరిచి, "పదిహేనే" అన్నది. "కాదు, ఎక్కువ తినేశావ్" ఠాకూర్ సింహుడు చిరుకోపం అభినయించాడు. అందుకు జవాబుగా ఠాకురాఁ రెండోసారి మరికొన్ని గింజలు ఒలిచి నోట్లో వేసుకొని "ఆఁ- తిన్నా, ఏమంటావ్?" అన్నది.
ఠాకూర్ సింహుడు ఆవిడ నడుమ్మీద చేయివేశాడు.
"ఒక్కటి వేసేను" అని వెంటనే చేయి ఎత్తింది కోపంతో. ఠాకూర్ సింహుడు చేయి వెనక్కు లాక్కున్నాడు. అమాంతంగా మెత్తబడి "నాన్నతో ఎందుకు మాట్లాడవూ?" అన్నది.
"అమ్మో నాన్నతోనే!" ఠాకూర్ సింహుడు అడిగాడు.
"ఠాకురాఁని ఠాకూర్ సింహునికిచ్చి పెళ్ళి చేయనంటున్నాడు నాన్న."
"ఎందుకూ?"
"ఇద్దరి పేర్లు ఒక్కలా ఉన్నందుకు."
"అయితే ఏం!" ఠాకూర్ సింహుడు కోపంతో అన్నాడు. "రెండు గంగరేగు చెట్లు ఒకచోటే మొలిచి పెరిగితే వాటిని గంగరేగు అంటారేగాని, రావి అంటారా?"
"అయితే, నన్ను గంగరేగు చెట్టంటావు?"
"తప్పు అర్థం చేసుకున్నావ్."
"తప్పర్థం చేసుకోకుంటే ఏం చేస్తాను? నాన్నను అడగమంటే ఎందుకు అడగవు?" సిగ్గుతో అన్నది ఠాకురాఁ.
ఠాకురాఁ గులాబి పెదవులమీద అక్కడక్కడ నిలిచివున్న మొక్కజొన్న పొట్టు చూచి ఠాకూర్ సింహుడు పిచ్చివాడిలా ముందడుగు వేశాడు. ఠాకురాఁ వెనక్కు అడుగేసి చెయ్యెత్తింది.
"ఒక్కటి వేసేను. ముందు నాన్ననడుగమంటే...."
ఆ సాయంకాలం ఠాకూర్ సింహుడు బాగా తాగేశాడు. తన తండ్రి తుపాకి తీసుకొని బయల్దేరాడు. ఠాకురాఁ ఇంటికి వెళ్ళి తుపాకి ఆవిడ తండ్రి రొమ్ముమీద పెట్టి" చెప్పి, పెళ్ళి చేస్తావా లేదా?" అడిగాడు.
"ఎవరి పెళ్ళీ? ఎవరికిచ్చీ?"
"ఠాకురాఁ పెళ్ళి. నాకిచ్చి. ముప్పై ఏళ్ళొచ్చాయి. మిలిటరీలో హవల్ దారునై పోయాను. ఇంకా కుర్రాణ్ణనుకుంటున్నావా? ఎల్లుండి లడక్ వెళ్తున్నాను. రేపు పెళ్లైపోవాలి. కాదంటావా, తుపాకి గుండు దూసుకుపోతుంది గుండెలోంచి. చెప్పు."
ఠాకురాఁ తండ్రి పెద్దగా నవ్వాడు. రొమ్ముమీద ఉన్న తుపాకిని లెక్కచేయకుండానే పక్కకు తిరిగి తన భార్యను పిలిచి అన్నాడు: "గంగా జ్ఞాపకముందా? నేనూ ఇలాగే మీ నాన్నదగ్గరికెళ్ళి సంబంధం అడిగాను."
తర్వాత పెద్దగా నవ్వి ఠాకూర్ సింహుని లాగి మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు.
* * * *
ఓ పదినెల్ల తర్వాత ఎక చౌకిమీద మేజర్ హజారాసింహుడు "అటెన్ షన్" అన్నాడు.
హవల్ దార్ ఠాకూర్ "సింహుడు" అటెన్ షన్ గా నుంచున్నాడు.
మేజర్ హజారాసింహుడు "సాల్యూడ్" అని గర్జించాడు.
మేజర్ స్వరం ఠాకూర్ సింహుణ్ణి చకితుణ్ణిచేసింది. తానేం తప్పు చేశానని మేజర్ కోపంగా ఉన్నాడని ఆలోచించాడు.
మేజర్ హజారాసింహుడు మీసం మెలేసి ఒక మట్టి రంగు కాగితం చేతులో పట్టుకొని తీక్షణ స్వరంతో "హవల్ దార్ ఠాకూర్ తమ శక్తినంతా కూడగట్టుకొని ఫిరంగులు, తోపులు, టాంకులతో భయంకరంగా దాడి చేశారు. దానివల్ల డేరాల్లో ఉన్న పెట్రోలంటుకొని ఆ సమీపంలో ఉన్న కృత్రిమ టాంకులూ, లారీలు అన్నీ తగలబడ్డాయి. తమ భయంకర దాడి కారణంగా భారత సైన్యం నశించింది, లేదా ఓడిపోయింది అని శత్రువులు తలచి, ఆ మాయాజాలం, వైపు వారు త్రోసుకొని వచ్చారు. ఇప్పుడు చైనా సైన్యమంతా రెండు వైపులా ఉన్న భారత సేనల మధ్యలో ఉండిపోయింది. శత్రువులను. రణరంగానికి బలివ్వటానికి ఇదే తగిన సమయమని తెలుసుకొని కెప్టెన్ కిశోర్ తన సైన్యానికి 'ఫైర్' ఆర్డర్ ఇచ్చాడు. రెండు వైపులనుంచి మన సైనికులు తోపులు నడుమ ఉన్న చైనా వారి మీద అతి భయంకరంగాను, ఎడతెగకుండాను, సూటిగా గుండ్లను ప్రేల్చటానికి ఆరంభించారు. అప్పుడు చైనా వారికి ఆత్మరక్షణ మార్గమంటూ లేకపోయింది. తమ సాధన సామగ్రితోనే శత్రువులు అసంఖ్యాకంగా నశించారు. మిగిలిన కొందర్ని మాత్రం మన సైనికులు తరిమికొట్టి, హతమార్చారు.
[నా దగ్గర ఒకే రణరంగం ప్రతి ఉంది. దానిలో 48 పేజి నుంచి 64 పేజి దాకా లేవు. 48 పేజీలో కృష్ణచందర్ హిందీ కథ సాగుతుంటుంది. 65వ పేజీలో మరొక కథ సాగుతుంది. ఆ కథ భాషను, రచయితను గుర్తించలేకపోతున్నాను, మన్నించాలి.
- దాశరథి రంగాచార్య]
ఇదంతా తెలుసుకొని సైన్యాధికారులు, హోం మినిష్టరు, కెఫ్టెన్ కిశోర్ ధైర్యసాహసాలను కొనియాడుతూ టెలిగ్రాములు పంపారు. కిశోరు సైనికులందరూ హర్షోల్లాసాలలో తేలియాడారు.
మర్నాడు సాయంత్రం అయిదు గంటలకు ఈశాన్యదిశగా వేలాది చైనా సైనికులు, వారి ముందు భాగంలో వేలాది మోంఛా భిక్షువులను, ఆబాల వృద్ధులను, స్త్రీలను వరుసలుగా నిలబెట్టి వారిని బలత్కారంగా ముందుకు తోసుకుంటూ బోండీలా వైపు సుమారు రెండు మైళ్ళ దూరంలో సాగివస్తున్నారని మంఛూనీ సైనికులు చెప్పారు.





