Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    మా పెద్ద చెల్లెలు శకుంతల కేసరపల్లిలోనే రజస్వల అయింది.

 

    మేము గార్ల తిరిగి వెళ్లినపుడు ప్రకాశరావు - శ్రీరాములు మున్నగువారు మాతో వచ్చారు. పరిసర గ్రామాలలో స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్లు లేరనుకుంటా. వాళ్ల కుటుంబాలున్నాయి. ఆ విధంగా మేము వారికి కృతజ్ఞత చెల్లించాం.

 

    ఒక చిన్నరామాయణ వృత్తాంతం!

 

    రాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. అధర్మమే అయినా - వాలిని వధించాడు. సుగ్రీవునకు పట్టం కట్టాడు. అది వర్షాకాలం. 'శరత్తు మన సంకేతం. వర్షాలు నిలువగానే సీతాన్వేషణ జరగాలి' అని సుగ్రీవునితో చెప్పాడు. రాముడు రుశ్యమూకం మీద ఉండిపోయాడు.

 

    వర్షాకాలం పోయింది. శరత్తు వచ్చింది. సుగ్రీవుని జాడ లేదు. రాముడు లక్ష్మణుని సుగ్రీవుని దగ్గరికి పంపాడు. అప్పుడు అన్నమాట ఇది:

 

    కృతార్థాహ్య కృతార్థానాం మిత్రాణాం నభవంతియే
    తాన్మృతానపి క్రవ్యాదాః కృతఘ్నాన్నోప భుంజతే.        (4-30-73)

 

    మిత్రులవుతారు. తమపని నెగ్గించుకుంటారు. మిత్రులను మరుస్తారు. వారి పని చేయరు. అలాంటివారు కృతఘ్నులు. వారి శవాలను కాకులు - గద్దలు కూడా ముట్టవు.

 

    'కృతఘ్నుని మాంసం కుక్కలు తినవు' అనే సామెతకు మహా భారతంలో ఒక చక్కని కథ ఉంది.

 

    కృతజ్ఞత మానవ లక్షణం. కృతఘ్నత రాక్షస లక్షణం.

 

    త్వమేవాహమ్ :

 

    ఆరుద్ర రచించిన త్వమేవాహం కావ్యాన్ని గురించి దాశరథి కృష్ణమాచార్య "యాత్రాస్మృతి" నుంచి:-

 

    "ఆరుద్ర 1949లో నాకో లేఖ వ్రాశాడు.

 

    నా 'త్వమేవాహమ్' అచ్చయ్యాక వచ్చిన ఉత్సాహ పరిచే ఉత్తరము నీ వొక్కడి దగ్గర నుంచే వచ్చింది.

 

    'త్వమేవా2హమ్' రాయడానికి ఏది ప్రోద్బలమిచ్చిందో ఎవరికీ ఇంకా తెలియదు.

 

    1948 జూలై 10 వ తారీఖు 'కృష్ణాపత్రిక'లో 'నాకా సిగ్గు? నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది' అనే పతాకతో ఒక 'రజాకార్లచే చెరచబడ్డ స్త్రీ కథనం' పడ్డది. దాని వివరాలు ఇవి:-

 

    'సుమారు పన్నెండు రోజుల క్రితం విషయం. రైలు గుడివాడ దాటి వెళుతూంది. 'ఇందుపల్లి' సమీపంలోకి వచ్చింది. రిఅలు పెట్టెలో ఉన్న ప్రయాణీకులు హైదరాబాదు విషయాలు చెప్పుకుంటున్నారు. రజ్వీ దురంతాలు, కాందిశీకుల కష్టాలు వర్ణించి, విషాద భరితులు అవుతున్నారు.

 

    ఇంతలో ఆ పెట్టెలోనే ఉన్న ఒక వనిత నిలబడింది. వలువలు తీసివేసింది. నగ్నముగా నిలబడింది. ఏమిటీ ఘోరమని అంతా తలలు వంచుకున్నారు. ఆమె అలాగే నిలబడింది. ఆ పెట్టెలో ఉన్న ఒక వృద్ధుడు ధైర్యం చేసి 'అదేమిటమ్మా! ఆడ పిల్లవు, అలా నగ్నంగా ఉన్నావు, తప్పు కదూ!" అన్నాడు.

 

    ఆమాటతో ఆమె తోకతొక్కిన రీతిగా లేచిందట. 'తప్పా! నాకు తప్పా! ఏ నోటితో చెపుతున్నారామాట? నేను ఆడదాన్నా? నైజాం కిరాతులు నన్ను వారంరోజులు ఇలా నగ్నంగా చెట్టుకు కట్టివేసి అట్టే పెట్టారు. నా స్త్రీత్వాన్ని ఆనాడే దొంగిలించారు. నా ఆడతనం ఆనాడే పోయింది. ఇంకా ఆడదాని నంటారేమిటి? చూడండి, నావంటి నిండా గాయాలు. స్త్రీత్వం ఒకసారి పోయింతరువాత మళ్లీ వస్తుందా? అలా ఉన్నది మా స్థితి. మీరిలా కూర్చుని కబుర్లు వింటున్నారు. నేనేం సిగ్గుపడవలసింది లేదిక. మీరు పడవలసింది అని ఒక్కొక్క ప్రయాణీకుని దగ్గరకు వచ్చి తన వొంటిని ఉన్న గాయాలు చూపింది. పెట్టెలో వాళ్లంతా సిగ్గుతో తల వంచుకున్నారు. ఆమె విషాద గాథ విని కన్నీరు కార్చారు. తరువాత ఆమె వలువలు ధరించి వెళ్లి ఒకచోట కూర్చుంది. ఆమె అలా అప్పుడప్పుడు అన్ని తరగతుల రైలు పెట్టెలలోకి వెళ్లి ప్రచారం చేస్తుందని తెలిసింది.'

 

    ఆ దృశ్యం కళ్లారాచూచి, ఆమె వాక్కులు విని కన్నీరు కార్చిన ఒక ప్రయాణీకుడు పంపిన ఒక రిపోర్టు అది.

 

    ఈ వార్త చదివాక త్వమేవాహమ్ మొదలెట్టా.

 

    ఆలోచనలు ట్రెయిన్లో ట్రైయిన్లో

 

    పురుషుల మూడవ తరగతి బోగీలో చెట్లనుగురించి

 

    చిట్టెలుకలగురించి చెదపురుగులగురించి

 

    చిన్నచిన్న చీమలగురించి సంభాషణ రెయిన్లో.

 

    ఆరుద్రగారు ఇంత చెప్పినా నాకు "త్వమేవాహమ్" అర్థం కాలేదు. మనం ఎవరికోసం వ్రాస్తున్నామో వాళ్లకు అర్థం కానిది సాహిత్యం - అందునా ప్రగతి శీల సాహిత్యం కాదని నా అభిప్రాయం. ఆరుద్ర రచనలకు వారే వ్యాఖ్యానం చెప్పాలి. మరొకరు చెప్పలేదు.

 

    ఇంతకూ ఇది ఉటంకించింది. కవిత్వ తత్త్వవిచారానికి కాదు. వార్త కోసం. ఆనాటి దౌర్జన్యాలు - ప్రజల యాతనలు - పత్రికల స్పందనా తెలియపరచడానికి మాత్రమే.

 

    "ఒక వీరుడు మరణిస్తే
    వేలకొలది ప్రభవింతురు" - ఇది ఆవంత్స సోమసుందర్ స్పందన!


                                  ఇరవయి రెండు


    "నిస్సీమాశ్చరిత్ర విభూతయః"
    "చరిత్ర సృష్టించిన వారికి హద్దుల్లేవు":

 

    చరిత్ర గత సంఘటనల కూర్పు. చరిత్ర గత సంఘటనల విశ్లేషణ. చరిత్ర గత సంఘటనల వాస్తవ చిత్రణ. కాని ఎప్పుడూ విజేతలే చరిత్ర వ్రాశారు. గెలిచినవాడు వ్రాసింది చరిత్ర అయింది. రావణుడు గెలిచి ఉంటే రామాయణం - దుర్యోధనుడు గెలిచి ఉంటే భారతం ఎలా ఉండేవో తెలియదు. అయితే కాలగతి, దైవిక న్యాయం అపరిహార్యములు. మనకు తెలిసిన మానవ చరిత్రలో దుష్టులు - దుర్మార్గులు - నియంతలు గెలవలేదు. న్యాయం గెలిచింది. ధర్మం గెలిచింది. సత్యం గెలిచింది. మానవత గెలిచింది.

 

    హైదరాబాదు స్వాతంత్ర్య సమర చరిత్రలో అసాధారణములయిన విషయాలు వున్నాయి. కొన్ని ఇంతకు ముందు వివరించాను. అహింసయే తమ విధానంగా ప్రకటించిన కాంగ్రెసువారు సాయుధ పోరాటం జరిపారు.

 

    సిద్ధాంతాలకన్నా కర్తవ్యం మిన్న. నియమ నిబంధనలకన్న మానవుడు మిన్న. అక్షరాలకన్నా విద్య - విజ్ఞానం మిన్న.

 

    ఉద్యమాల్లో - పోరాటాల్లో సాధించాల్సింది - లక్ష్యాలను. లక్ష్యసాధనకు సూత్రాలు మార్చడం దోషం కాదు. తన లక్ష్యసాధనకు రాముడు వాలిని వధించాడు. దుర్యోధనుణ్ణి ఓడించడానికి పాండవులు అధర్మాలు చేశారు. కృష్ణుడు చేయించాడు. కాంగ్రెసువారు ఆయుధాలు ధరించడానికీ కారణాలున్నాయి.

 

    1. నిజాం నవాబు నిరంకుశుడు. అతడు అహింసకు లొంగడం అసంభవం.

 

    2. నిజాం నవాబు రజాకార్ల దండును పురికొల్పి ప్రజల మీదికి తోలాడు. వాళ్లు విలయం - వినాశం సృష్టిస్తున్నారు. వారి ముందు సాధువచనాలు చెవిటి ముందు శంఖాలు.

 

    3. కాంగ్రెస్ అనైక్యతల పుట్ట! అది ఎన్నడూ ఏకంగా లేదు. ఎన్నడూ విచ్చిన్నం కాలేదు. బహుశః అనైక్యతయే దాని ప్రజాస్వామ్య బలం. కాంగ్రెసులో ఒక గ్రూపు మాత్రమే సాయుధం అయింది. మరొక గ్రూపు నిజాం మంత్రిమండలిలో చేరారు.

 

    4. కమ్యూనిస్టులు సాయుధ పోరాటంతో విజయాలు సాధిస్తున్నారు. ప్రజాయత్తం అవుతున్నారు. వారు గ్రామాలను విముక్తం చేస్తున్నారు.

 

    5. అఖిల భారత కాంగ్రెసు, సంస్థానాల్లో పోరాటాలు నడుపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక వాళ్లను లొంగదీయాలనే సంకల్పం కావచ్చు. 'పిల్లలకు బలవంతంగా ఆముదం తాగించినట్లు సంస్థానాధీశులను బలవంతంగా లొంగదీయాలి' అన్నారు మహాత్ములు.

 

    6. పోరాటం సందర్భం కావడానికి వీల్లేదు. 'వజ్రం వజ్రేన భిద్యతే' వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.

 

    7. కాంగ్రెసువారు ఆయుధాలను ధరించడాన్ని మహాత్ముడు అంగీకరించారు అంటారు.

 

    ఇక్కడ ఒక విషయం వివరించాలి. పోలీసు చర్య తరువాత ప్రభుత్వానికి వచ్చిన కాంగ్రెసువారు - సాయుధ కాంగ్రెస్ వారు కారు. అందువలన చరిత్రలోని ఈ రక్తాక్షరాలను కరెన్సీనోట్లతో చెరిపేశారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.