Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    ఇంతలో రణూభా తనముందున్నాడని గమనించి రణజితసింహుడు "మీకు కూడా అతడు....నా కొడుకు ఉత్తరం వ్రాశాడు కదూ?" అడిగాడు.
    "అవును" రణూభా ఉత్సాహంతో "తేజసింహుడు మిమ్మల్ని కలుసుకొమ్మని చాలా ఇదిగా వ్రాశాడు. అలాంటి భాగ్యశాలియైన పుత్రుని తండ్రిని చూడాలనిపించింది. అహమదాబాద్ వెళ్ళొద్దామని బైల్దేరాను. మీ దర్శనం కూడా అవుతుంది...."
    "చాలా మంచిపని చేశారు ఠాకూర్ జీ' అని రణజితసింహుడు ఉచ్చస్వరంతో "సుర్జీత్... బాబూ...." అని కేకవేశారు.
    "ఏం నాన్నగారూ?" లోపల్నుంచి ధ్వని వచ్చింది.
    "ఠాకూర్ జీ కోసం ఫలహారం అదీ ఏర్పాటు చేయి.... .... పాలూ మీగడా.... .... ఫలహారం ఇంతవరకు రాలేదు." కోపంతో అన్నాడు.
    అతని జ్యేష్ఠపుత్రుడు లోపల్నుంచి బైటికివచ్చి "మంచిది నాన్నగారూ!" అన్నాడు. "తయారౌతున్నది" అని ఇంట్లోకి వెళ్తూ, "అమ్మకు జబ్బుగా ఉందికదూ, అందుకే ఆలస్యం...." అన్నాడు.
    "కాని.... నాకిప్పుడేమీ అవసరం లేదండీ! అనవసరంగా....శ్రమ ఎందుకూ?...."
    "ఇందులో శ్రమ ఏముంది ఠాకూర్ జీ! నా.... నా.... కొడుకు ఉత్తరంలో ఏం రాశాడో తెలుసునా? నా స్నేహితుడు సమరసింహుని తండ్రిగారు వస్తారు. వారిని ఘనంగా గౌరవించాలని." మొదటిసారి నవ్వాడు. ఆ నవ్వు కూడా పేలవంగా కనిపించింది రణూభాకు. "వాడు వ్రాసినంతగా గౌరవించే స్థితిలో కూడా లేను" అన్నాడు మళ్ళీ రణజితసింహుడు.
    "వాళ్ళు అలాగే వ్రాస్తారు అన్నగారూ! ఇవ్వాళ రేపటి కుర్రాళ్ళ సంగతి అడగబోకండి" అన్నాడు రణూభా ఒక నవ్వు నవ్వి.
    రణూభా మాట విననే విననట్లు రణజితసింహుడు పండ్లు వత్తిపట్టి "నాన్నా! నీ ఆజ్ఞ నీ తండ్రి ఎలా పాలిస్తాడో చూపాలని ఉందిరా!" అని గునిశాడు.
    "రణజిత్ అన్నగారూ, ఏమో అన్నారూ?" రణూభా అడిగాడు. "ఏమీలేదు, ఏమీలేదు." రణజితసింహుడు అంటుండగానే ఒక దాసీది ఉపాహారం తెచ్చింది. రెండు గాజు ప్లేట్లలో పండ్లూ, మిఠాయీ ఉంది. ఒక పెద్ద కప్పులో "కేసరీపాలు" ఉన్నాయి. ఇంకో గిన్నెలో మీగడ....
    "ఇవన్నీ!" రణూభా అన్నాడు.
    "అహఁ- ఎన్ని ఉన్నాయి అన్నగారూ!.... తీసుకోవాలి. నాకోసం కాకున్నా నా బాబు......" అన్నాడు రణజితసింహుడు. స్వరం భారంగా ఉంది.
    "తింటాను అన్నయ్యా, తింటాను. కాని మీరేమీ తీసుకోరూ?"
    "నేనేమీ తినలేనండీ. శరీరం బావుండలేదు. ఈ విషయంలో నన్ను బలవంతం చెయ్యొద్దు."
    రణూభా ఉపాహారం, పాలు, మీగడ అన్నీ తీసుకోవాల్సే వచ్చింది. రణూభా బలవంతం మీద తన కుమారుడు సమ్రామీద ఒట్టు పెట్టింతర్వాత రణజితసింహుడు ఒక మిఠాయి ముక్క నోట్లో వేసుకున్నాడు. కాని, వెంటనే ఆ వృద్ధుని కళ్ళల్లో కన్నీరు నిండింది. తరువాత రణూభా కూడా అంతగా బలవంతం చేయలేదు. అప్పుడుగాని అతడు నిజంగానే జబ్బుగా ఉన్నాడనుకోలేదు రణూభా.
    అర్ధగంట తరువాత రణూభా రణజితసింహుణ్ణి శలవు కోర్తే, స్నేహంతోనూ, చెమ్మగిల్లిన కండ్లతోనూ ఆ వృద్ధ సైనికుడు రణూభా భుజం మీద చేయివేసి "ఠాకూర్ జీ! మీరు సమరసింహునికి ఉత్తరం వ్రాసేప్పుడు నా ఆశీస్సులు తెలియజేయండి. మీవాడు వీరుడు. 'రణజితసింహుడు నీ క్షేమం కోసం సర్వదా ప్రార్థిస్తుంటాడు.' అని వ్రాయండి" అన్నాడు.
    "మీ ఆశీర్వాదం వల్ల వాడికెట్టి కీడూ కలగదు" అని మళ్ళీ గొంతు సవరించుకొని "మీ... మీ.... తేజసింహునికి కూడా భగవంతుడు నిండా నూరేళ్ళ ఆయుష్యం ఇస్తాడు" అన్నాడు.
    రణజితసింహుని చేయి రణూభా భుజంమీదనుంచి జారిపోయింది. మరుక్షణంలో రణూభా చేయి నొక్కాడు. కొంత దూరం వెళ్ళి రణూభా మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
    "ఏమైంది ఠాకూర్ జీ? మరచిపోయారా ఏమైనా?"
    బంగళా ఎక్కే చివరి మెట్టు మీద నుంచుని రొంటినుంచి మూటతీసి రణజితసింహుని పాదాలవద్ద పెట్టాడు రణూభా.
    "ఇదేమిటి ఠాకూర్ జీ!" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రణజితసింహుడు.
    "ఏమీలేదు అన్నగారూ!" రణూభా సంకోచిస్తూనే సమ్రా తల్లి తేజసింహుని భార్య కోసం నాలుగు గాజులు పంపింది" అన్నాడు.
    "ఏమిటి?" కేక వేశాడు రణజితసింహుడు.
    "వద్దనొద్దు అన్నగారూ!" మిక్కిలి వినయంగా "ఇది తేజసింహుని భార్యకు మా ముసలిదాని దీవెనల్లాంటివి. తీసుకోండి బాయీజీ!" బ్రతిమిలాడాడు రణూభా.
    "కానీ, ఠాకూర్ జీ!......" కంపిత స్వరంతో అన్నాడు సింగ్.
    "అన్నగారూ! ఈ విషయంలో మీనుంచి ఒక్కమాట కూడా వినను" అని వెనక్కు తిరిగి వెళ్ళిపోతూనే "తేజసింహుని భార్య అఖండ సౌభాగ్యవతి అగుగాక!" అంటూ సాగిపోయాడు రణూభా.
    రణూభా ఊరికి వచ్చేశాడు. నాలుగైదు రోజులూ గడిచిపోయాయి. బంగారు గాజుల పార్సల్ వాపసు వచ్చేసింది. రెండో రోజు పోస్టులో రణజితసింహుని ఉత్తరం కూడా వచ్చింది. అందులో తేజసింహుడు వ్రాసినలాంటి గుజరాతీలోనే గాజులు తిప్పి పంపించినందుకు క్షమాపణ కోరాడు. తర్వాత రణూభా అహమదాబాదుకు వచ్చిన్నాటికి ఐదు రోజుల క్రితమే తేజసింహుడు రణక్షేత్రంలో కొండచరియల్లో చిక్కుకున్న సైనికుల్ను రక్షించేప్పుడు శత్రువు దాడి జరగడంవల్ల నిహతుడైనాడనే వార్త ప్రభుత్వం టెలిగ్రామ్ ద్వారా అందించిందని వ్రాశాడు.
    అది విని రణూభా కండ్లు చీకట్లు క్రమ్మాయి. కొంత స్పృహ వచ్చింతర్వాత "కాని, మాస్టర్ గారూ! మీరు యుద్ధం ఆగిపోయిందని చెప్పారే - ఇదే........."
    "ఈ రాక్షసుల కుట్రకూ అబద్ధాలకూ అంతులేదు ఠాకూర్ జీ!" మాస్టర్ గారు జవాబు చెప్పారు.
    వళ్ళు తిరిగినట్లు కాగా నిలద్రొక్కుకొని నుంచున్న రణూభా చేయిపట్టుకొని "ఇంటిదాకా వదిలిరానా?" అడిగాడు మాస్టర్ గారు.
    "అవసరం లేదండీ మాస్టర్ గారూ, అవసరం లేద"ని నడవడానికి ప్రయత్నిస్తూ "వెళ్ళిపోతాను. నన్ను గురించి విచారించకండి" అన్నాడు రణూభా.

                                      *    *    *    *

    రెండో రోజు తన ఊరికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బస్తీలోని "జాతీయ రక్షణనిధి"కి వెళ్తున్నప్పుడు త్రోవలో రణూభాకు అహమదాబాదు వృత్తాంతాలే జ్ఞప్తికి రాసాగేయి... ...
    వృద్ధుడైన రణజితసింహుడు.... వారి ప్రథమ పుత్రుడు సుర్జిత్ సింహుడు.... .... రణజితసింహుని వ్యవహారమూ, మాటలూ ప్రత్యేకమైనవి.... .... గాజులు ఆయన పాదాల వద్ద ఉంచి మళ్ళీ అతడేమన్నా అంటాడేమోనని వెనక్కు తిరిగి చూడకుండానే వచ్చేశాడు తాను... "కాని... ఠాకూర్ జీ!" రణజితసింహుని స్వరం చెవుల్లో ఇంకా రింగుమంటూనే ఉంది.
    నాటి అహమదాబాదు ఘటనలకు నేడు నిజమైన అర్థం తెలుస్తూంది.

                                              *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.