Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    మస్తాన్ ప్రతిరోజూ రాత్రిపూట కాపలా పడుకుంటున్నాడు. నాగేశ్వరరావు అమ్మను చెల్లెళ్ళను విజయవాడ పంపించే ఏర్పాటు చేశాడు. వాళ్లు వెళ్లిపోయారు. అఫ్జల్, మస్తాన్ ఇద్దరు నేను తప్పించుకోవడానికి సహకరించారు.

 

    ఒకనాటి రాత్రి నేను మొండి గోడ దూకాను. మస్తాన్ అక్కడ సిద్ధంగా ఉన్నాడు. మస్తాన్ సుమారు నన్ను ఎత్తుకున్నాడు. ఉరికాడు. గార్ల దగ్గరి పినరెడ్డి గూడెం చేరాం. పెంట్యాల చలమయ్య గారు నాకు ఆప్తమిత్రులు. మస్తాన్ నన్ను వారికి అప్పగించాడు. వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు.

 

    చలమయ్యగారు రాత్రికి రాత్రి బండి కట్టించారు. కచ్చడం బండికి తెరలు కట్టారు. ఆడవారు ప్రయాణం చేస్తున్నట్లు కనిపించాలి. ఎవడయినా అడిగినా పలకాలి. అందుకోసం వారి భార్యను నావెంట పంపారు. 'మంగల గూడెం'లో చలమయ్యగారి తండ్రి ఉంటారు. మేము అక్కడికి చేరాం. అక్కడ నేను గుండు కొట్టించుకున్నాను. అచ్చం పూజారి వేషం వేసుకున్నాను. 'పాపటపల్లి'లో రైలెక్కాను. ఎవరూ గుర్తించలేదు.

 

    ఎర్రుపాలెం ఒక ప్రమాదకరం అయిన స్టేషను. ఆ స్టేషను తరువాత యూనియన్ ప్రాంతం మొదలవుతుంది. ఎర్రుపాలెంలో పోలీసులు - రజాకార్లు బండిని సోదా చేస్తారు. దోపిడీలు - హత్యలు - మానభంగాలు జరిగాయి. మా బండి ఎర్రుపాలెంలో గంట ఆగింది. రజాకార్లు కదలమనేవరకూ బండి కదలదు. నావెంట ఒక పోలీసు పడ్డాడు. నిజరూపం తెలుసుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. నాకు ఉర్దూ రాదని మొండికేశాను. అడుక్కోవడాని వెళ్తున్నానని చెప్పాను. శ్లోకాలు చదివాను. వాణి హస్త రేఖలు చూచాను. సాముద్రికం చెప్పాను. బాగానే నటించాను. బయటపడ్డాను.  

 

    ఎర్రుపాలెం స్టేషను మీద సోషలిస్టులు దాడి చేశారు. స్టేషనులో ఉన్న పోలీసు క్యాంపును తగలపెట్టారు. పోలీసులతో హోరాహోరి పోరాడారు. ఇద్దరు పోలీసులు - నలుగురు సోషలిస్టులు హతులయినారు. ఈ విషయం నాకు మిత్రుడు - సోషలిస్టు నాయకుడు S.B. గిరి చెప్పారు. చాల కాలం వరకు ఎర్రుపాలెం స్టేషను గోడలకు తూటాల గుర్తులు ఉండేవి.

 

    మీనవోలు ఎర్రుపాలెం దగ్గరి గ్రామం. రజాకార్లు - ఒక తెల సార్జెంటు సహితంగా మీనవోలు మీద దాడి చేశారు. ప్రజలు సాహసోపేతంగా ఎదిరించారు. పోలీసులు కాల్పులు జరిపారు. ప్రజల్లో ఎనిమిది మంది కూలారు. ప్రజలు లక్ష్యం చేయలేదు. వెంటపడి తరిమారు. సార్జెంటును చంపారు. ఆయుధాలు స్వాధీనపరచుకున్నారు. సరిహద్దుమీద ఉన్న కాంగ్రెస్ క్యాంపులో వప్పగించారు. అక్కడ జమలాపురం కేశవరావుగారి పలుకుబడి హెచ్చు.

 

    తెల్లవారి పోలీసులు - రజాకార్లు మీనవోలుమీద దాడి చేశారు. నానా బీభత్సం సృష్టించారు. దోపిళ్లు - హత్యలు - మానభంగాలు చేశారు. గ్రామం సాంతం తగలపెట్టారు. ఆ పొగలు చాలరోజులవరకు కనిపించాయి.

 

    నేను క్షేమంగా బెజవాడ చేరుకున్నాను. రావూరి గోపయ్యగారు నాకోసం ఎదురుచూస్తున్నారు. ప్లాట్ ఫారం మీద నన్ను వారు గుర్తించలేదు. ఏదయినా అవాంతరం జరిగిందేమోనని భయపడిపోతున్నారు.

 

    "బ్రాహ్మణ బాలుణ్ణి. ఆశ్రయం కోరి వచ్చాను. దక్షిణ ఇప్పించండి" అని వారి వెంటపడ్డాను.

 

    "నేనేమో పరేషాన్ల ఉన్న, నువ్వేమో ఎంట పడ్డవు" అని చిరాకుపడుతున్నారు.

 

    "ప్రశ్న అడగండి. సరిగ్గా చెప్పుత" అన్నాను.

 

    "అట్లనా?" అని లాల్చీ జేబులోంచి పైసలు తీసి నా చేతిలో పెట్టారు.

 

    అప్పుడు గుర్తించారు. "ఓర్నీయవ్వ! ఎంత పని చేసినవయ్య. పరేషానయిన. పానం తీసినవ్" అని పెద్దగా నవ్వారు. నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. గిరగిరా తిప్పారు. అప్పటి వారి ఆనందం అనంతం. వర్ణనాతీతం!

 

    నేను బతికి బయట పడితే వారికెందుకు ఆనందం!

 

    అదిగో, అక్కడే ఉంది మానవత్వం! అదే ఆత్మీయత. అదే అనురాగం. అదే ప్రేమ. అదే వాత్సల్యం. అదే అనుబంధం. అదే జీవితం.

 

    గోపయ్యగారు - నేను "కేసరిపల్లి" వెళ్లాం. అక్కడ వారి కుటుంబం ఉంది. అమ్మ - చెల్లెళ్లు అక్కడికి చేరారు. 'బతికి వచ్చినవా నాయ్నా!" అమ్మ నన్ను పట్టుకుని బిగ్గరగా ఏడ్చింది. "ఇంకెన్నాళ్లురా మనకీ కష్టాలు" అని ఎక్కెక్కి ఏడ్చింది. అమ్మను ఓదార్చడం చాల కష్టం అయింది. ఆమె కష్టాలకే పుట్టింది! సుఖాలు ఎండమావులుగా కూడా కనిపించలేదు!

 

    అమ్మా - చెల్లెళ్లు క్షేమంగా చేరిన వార్త గార్లలోనే తెలిసింది. అయినా, వారిని చూచేదాకా నా ప్రాణంలో ప్రాణం లేదు. వారిని చూచిం తరువాత మనసు కుదుటపడింది. అమ్మను - చెల్లెళ్లను కూర్చుండబెట్టుకున్నాను. నా కథ సాంతం చెప్పాను. వారి కథ సాంతం విన్నాను. కలిసి భోజనాలు చేశాం. నేను మానసికంగా ఎంతో ఎంతో అలసిపోయాను. నిర్భయంగా నిద్రపోయాను!

 

    కేసరిపల్లెలో మేము - గోపయ్యగారి కుటుంబం - చలమయ్యగారి కుటుంబం ఉన్నాం. సీతంరాజు కమ్యూనిస్టు. అండర్ గ్రౌండులో పని చేస్తున్నాడు. వాడి భార్య సరస్వతి. వర్ణాంతర విధవా వివాహం. ఆమెను నాకు వప్పగించి వెళ్లాడు. అంత నమ్మకం!

 

    సరస్వతి అందం అయింది. వయసులో ఉంది. నేను గార్లలో సారాయి కొట్లో కూర్చున్నంత నిర్భయంగా కలిసి ఉన్నాం. కలిసి తిన్నాం. కలిసి తిరిగాం. కొందరు అనుమానించారు. కాని, నిష్కళంకంగా తిరిగాం - సీతను వలె - సరస్వతిని - సీతంరాజుకు అప్పగించాను.

 

    తెలంగాణం నుంచి యూనియన్ ప్రాంతానికి లక్షల మంది వలస వచ్చారు. అప్పుడు 'ఆంధ్ర', 'తెలంగాణం' అనే విషపదాలు లేవు. తెలంగాణం నిజాం రాజ్యంలో ఉంది. అది నైజాం. "ఆంధ్ర" ఇండియన్ యూనియన్ లో ఉంది. అందువల్ల అది యూనియన్ ప్రాంతం.

 

    స్వాతంత్ర్యం వచ్చిన మరుక్షణంలోనే "బ్రిటిషిండియా" అనే పదం మాయం అయింది. ఇందువల్ల స్వరాజ్యం కోసం జనం ఎంత తపిస్తున్నారో అర్థం అవుతుంది. ఇది ప్రభుత్వాలకు గుణపాఠం కావాలి. అయితే ప్రభుత్వ నిఘంటువునుంచి 'ప్రజలు', 'గుణపాఠం' అనే పదాలు మాయం అయి చాల కాలం అయింది. మంచి మాట ఏ ప్రభుత్వమూ వినదు. అయినా చెప్పడం మన విధి.

 

    ప్రజలు సహకరించనిది ఏదీ ప్రభుత్వం చేయలేదు:

 

    బెజవాడ తెలంగాణా నగరం అనిపించేంత మంది అక్కడ చేరారు. ఆకాలంలో కొత్త సినిమాహాళ్లు - కొత్త హోటళ్లు వెలిశాయి. పత్రికల అమ్మకాలు - అప్పటికి ఎన్నడూ లేనంతగా పెరిగాయి. అన్ని పత్రికల్లో నిజాం వార్తలే ప్రధానంగా వచ్చేవి.

 

    నిజాం నుంచి వచ్చిన వాళ్లంతా యూనియన్ వాళ్లు తమను దోచుకుంటున్నారు అనుకువేవారు. ఎంచాతంటే, ఇళ్ళఅద్దెలు, సరుకుల ధరలూ పెరిగాయి. కాని, అది సరికాదు. ధరలు అందుబాటు - అవసరం - DEMAND AND SUPPLY మీద ఆధారపడ్తాయి. వర్షంలో రిక్షావాడు ఎక్కువ డబ్బు అడుగుతాడు. అది అతని దోపిడీకాదు. మన అవసరం.

 

    నిజాం ప్రజలు అప్పటికి ఉన్న పరిస్థితుల్లో కావలసింది ఆశ్రయం. అది లభించింది. అందుకు సంతోషించాలి. మిత్రులు వెంకటేశ్వరరావు - కృష్ణమూర్తి బెజవాడ గవర్నరు పేటలో ఉండేవారు. నేను వాళ్లల్లో స్వతంత్రుణ్ణి. అందువల్ల నా ఉనికి విజయవాడ అనవచ్చు. చందా భద్రంగారిని పోలీసులు అరెస్టు చేసి జేలుకు పంపారు. భద్రంగారి భార్య ధనలక్ష్మి గర్భవతి. ఆమె పుట్టింటి వారితో బెజవాడ వచ్చింది. ఆమె కాన్పు బెజవాడ ఆప్సత్రిలో జరిగింది. ఆమెను ఆదుకోవడానికి నేను, వెంకటేశ్వరరావు - కృష్ణమూర్తి ఆస్పత్రిలోనే ఉండిపోయాం. భద్రం లేడు కాబట్టి అది మా విధి అవుతుంది.

 

    శ్రీమతి ధనలక్ష్మిగారికి కాన్పు కష్టం అయింది. ఆడపిల్లను కన్నది. బిడ్డ కళావతికి ఇప్పుడు మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు.

 

    బెజవాడ - గుంటూరు - తెనాలి - ఏలూరు - నూజివీడు - గుడివాడ - వాటి పరిసరాల పల్లెలనిండా నిజాం వాళ్లే. నేను అంతటికీ తిరిగాను. తెనాలి దగ్గరి నాజర్ పేట అనుకుంటా - నాగేశ్వరరావు సోదరి అత్తవారు. ఆ పేట వీధి హోటల్లో పొగలు కక్కుతున్న ఇడ్లీ వంటి రుచికరం అయింది మళ్లీ దొరకలేదు!

 

    కేసరిపల్లి మంచి మున్యాశ్రమంలా ఉండేది. అక్కడి ప్రజలు మమ్ములను ఎంతో ఆదరించారు. ప్రకాశరావుగారి కిళ్లీ బడ్డీమీద కూర్చునేవాళ్లం. గోపయ్యగారి ఉర్దూ కలిసిన తెలుగు అక్కడి వారికి ఎంతో బాగనిపించేది. గోపయ్య గారివి ఇసుమంత ఎచ్చులు. తానే తెలంగాణంలో కాంగ్రెసును నిర్వహిస్తున్నానన్నట్లు మాట్లాడేవారు. సరదాగా ఉండేది. జలగం వెంగళరావుగారు అక్కడే ఉన్నట్లు గుర్తు.

 

    సాయంత్రం పంచాయతీవాళ్ల రేడియోలో వార్తలు వినడానికి కూడేవాళ్లం. కొంగర జగ్గయ్యగారు - పన్యాల రంగనాథరావుగారు వార్తలు చదివేవారు. మంచి స్వరం - స్పష్టమైన ఉచ్చారణ. వార్తలు - పాటలవలె - ఉండేవి.

 

    మా చిన్న చెల్లెలు అరుణకు ఉక్కపట్టే జబ్బు ఉండేది. ఎప్పటికప్పుడు పోయే ప్రాణం, వచ్చే ప్రాణంలా ఉండేది. ఆమెను డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ దగ్గరికి తీసికెళ్లాం. ఆమె పార్టీ వ్యక్తి. శ్రద్ధగా చూచారు. మందులు ఇచ్చారు. జబ్బు తగ్గింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.