Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
"నాన్నా! తప్పక వెళ్ళాలి. తేజసింహుని తలిదండ్రులకు నా నమస్కారాలు అందచేయండి. వదినకు-తేజసింహుని భార్యకు - నా నమస్కారాలందించి, ఇక్కడ అన్నదమ్ముల మిద్దరమూ హాయిగా ఉన్నామని తెలియబర్చండి." ఉత్తరం చివర మరొకసారి వేడుకున్నాడు సమ్రా.
"తప్పక వెళ్ళి వస్తాన్నాయనా! తప్పక! నువ్వు అంత దూరం నుంచి వ్రాస్తే నేను వెళ్ళకుంటానా?" అన్నాడు రణూభా.
ఆ రాత్రి చాలాసేపటివరకూ నిద్రపోలేదు ఆ వృద్ధులు.
మాస్టర్ గారు వెళ్ళిపోయింతర్వాత భర్త చేయిపట్టుకొని "అయితే, నా కొడుకు సమ్రా చనిపోయేవాడే......" అన్నది రణూభా భార్య.
"కాని, మనకు మాత్రం దేవుడు లేడూ సమ్రా తల్లీ! అతడే మన బిడ్డను రక్షించడానికి ఆ దేవపుత్రుణ్ణి పంపాడు." రుద్ధ కంఠంతో అన్నాడు రణూభా.
"వచ్చే సంవత్సరం సమ్రా పెళ్ళి చేయాలనుకుంటే ఈ యుద్ధం వచ్చిపడింది.... .... ఈ యుద్ధం తెచ్చిపెట్టినవాళ్ళు నాశనం కాను" అంటూంటే ఆమె కండ్లలోంచి రెండు బాష్పబిందువులు రాలాయి.
ఇంతలో మాస్టరుగారు తలుపు తట్టారు. లోపలికి వస్తూనే "మీకో ముఖ్యవార్త చెప్పడానికి వచ్చాను. యుద్ధం ఆగిపోయిందనే వార్త పత్రికలో చదివాను. సైనికుల్ను వెనక్కు రప్పించుకుంటామంటున్నారట చైనా వాళ్ళు" అని చెప్పాడు రణూభాతో.
వృద్ధ దంపతులిద్దరూ మాస్టరుగారి పాదాల మీద పడ్డంతపనీ చేశారు.
మాస్టరుగారు వెళ్ళిపోయింతర్వాత వృద్ధురాలు ఆనందపూర్ణమైన స్వరంతో "హ....మ్మ....! నా సమ్రాకింక అపాయం లేదు. భగవంతుడు వాణ్ణి రక్షించాడు. ఇక నన్ను యముడు పిలిచినా......." అన్నది అర్దోక్తిగా.
"ఓసి పిచ్చిదానా!" రణూభా భార్య వీపు నిమురుతూ, "ఇంటికి కోడలు రావాలనే విషయం మరిచిపోయావూ? కలవారింటి ఆడపడుచు వస్తుందని ఆ సంవత్సరం పొలం కూడా అమ్మించావ్! రాబోయే కోడలు సొమ్ములు మన డబ్బుతో..... సమ్రా డబ్బుతో కాదు. ఆఁ... ... అంతకంటే ఏం చేయగలం? ఆ బంగారమంతా పెట్టెలో దాచి పెట్టుకొని యముణ్ణి పిలవడానికి తయారైనావూ?" అన్నాడు.
"కాని... కాని... సరే, మీరే చెప్పండి.... ఆ సమ్రా మిత్రుడు సమయానికి అడ్డుపడకుంటే.... .... ఏమయ్యేది?"
ఆ రాత్రంతా ఆవిడ ఆ విషయాన్ని గురించే అడిగింది భర్తను.
"అప్పుడు.... .... పొలం అమ్మిన డబ్బు.... .... దాంతో కొన్న బంగారం.... ఎలా బ్రతగ్గలం.... చెప్పండి?"
"బ్రతికే ఉంటాం. పోనీ, చచ్చినట్లనుకో. ఆ తేజసింహుడు చేయబట్టేగా బ్రతకడం!..... అరే. తన ప్రాణానికి లెక్కచేయకుండా... ... మన బిడ్డను రక్షించాడు" అన్నాడు రణూభా.
"భగవంతుడు అతని భార్యను దీర్ఘసుమంగళిని చేయుగాక!" వృద్ధురాలు ఆశీర్వదించింది.
తెల్లవారింతర్వాత "రాత్రంతా మన సమ్రాను గురించీ, వాని మిత్రుణ్ణి గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను" కన్ను మలగలేదనుకో!" అన్నాడు రణూభా భార్యతో.
"నేనూ అదే ఆలోచిస్తూ ఉండిపోయా." రణూభా భార్య అన్నది.
"నాకు మరో ఆలోచన వచ్చింది."
"ఏమిటది, చెప్పరాదూ?"
రణూభా భార్య దగ్గరికి జరిగి "నీతో చెప్పాలా, వద్దా? అని ఆలోచిస్తున్నా." అన్నది.
గుండె కొద్దిగా చిలికినట్లైంది.
"చెప్పండి మరి. మాట సగం చెబితే బ్రతుకు సగం అవుతుంది." వృద్ధురాలు ప్రణయ కోపంతో అన్నది.
"అచ్ఛా, చెపుతాగాని 'కాదు' అనొద్దు. తెలిసిందా?"
"కాదనను. సరేనా?"
"ఉన్న బంగారంలోంచి నాలుగు బంగారు గాజులు చేయించి అహమదాబాద్ తీసికెళ్ళి తేజసింహుని భార్యకు అర్పించాలని ఉంది. తేజసింహుని తండ్రితో ఏమంటానో తెలుసా? తేజసింహుడు నాకు కొడుకులాంటివాడు. నన్నూ, సమ్రా తల్లినీ చిన్నపుచ్చొద్దు...."
"ఓ....... హో...... హో......" వృద్ధురాలు పెద్దగా నవ్వేసింది. గుండె నిండా విచారాలున్నప్పటికీ ఎందుకూ పిచ్చిదానిలా నవ్వుతుంది? వెంటనే గంభీరురాలై "ఇంతేనా! అ సమ్రా మిత్రుని కోసం మన చర్మంతో చెప్పులు కుట్టిచ్చినా తక్కువే. ఈ కొద్ది బంగారం ఒక లెక్కా? మీరు ఇవ్వాళే బస్తీకి వెళ్ళండి. వనమాజీ కఁసాలి దగ్గర గాజులు చేయించుకురండి."
"సరేగాని, తరవాత నువ్వే ఈ పిచ్చిపని చేశావని కోపగించొద్దు. ఏమంటావ్?" రణూభా అన్నాడు.
తొమ్మిది పదిరోజుల తర్వాత రణూభా కొత్త బట్టలు కట్టుకొని, తలపాగా చుట్టుకొని అహమదాబాదులో బ్రిగేడియర్ రణజితసింహుని బంగళాగేటుముందు నుంచున్నప్పుడు అపారమైన ఆనందం అనుభవించాడు. ఆ బంగళా వైభవాన్ని చూచి క్షణం చకితుడైనాడు. గుమ్మం దగ్గరికి వస్తే అతనికి ఒక మధ్య వయస్కుడైన సిక్కు కనిపించాడు.
"ఏం పని? ఎవరితో?" అడిగాడా సిక్కు.
"నేను... నేను రణజితసింహగారిని కల్సుకోడానికి వచ్చాను. మీరు వారి ప్రథమ పుత్రులు కాదూ?"
"అవునండీ"
"సమరసింహుని తండ్రి రణూభా వచ్చాడని చెప్పండి."
"ఏమీ?" సిక్కువాని నోటినుండి ఆ ధ్వని అమాంతం వెలువడింది. తమాయించుకొని అడిగాడు: "ఏమిటి? ఏమన్నారు?.... కాని.... నాన్నగారు.....వారి శరీరం బావుండలేదు."
ఇంతలో లోపల్నుంచి ఒక ముసలి సర్దార్ జీ వచ్చాడు. ఎత్తుగా ఉన్న ఆ వృద్ధుడు ఇంకా బలంగానే ఉన్నాడు.
"ఎవరు మీరు?" గంభీర స్వరంతో "నేను రణజితసింహుణ్ణి" అన్నాడు.
"నేను...నేను..." రణూభా ఆగి ఆగి అన్నాడు-తన భాష అతనికి అర్థం అవుతుందో కాదో అని సందేహిస్తూ.
"చెప్పండి. నాకు కొద్ది కొద్దిగా గుజరాతీ వస్తుంది. అరే! మీరిక్కడే నుంచున్నారేం? లోపలికి విచ్చేయండి. రండి రండి ఠాకూర్ జీ!" అన్నాడు రణజితసింహుడు. రణూభాకు తేజసింహుని వచ్చీరాని గుజరాతీ పదాలు గుర్తుకు వచ్చాయి. అతడు చిరునవ్వు నవ్వుకొని పక్కనే ఉన్న దీవాన్ ఖానా (వసారా)లో ప్రవేశించాడు. ఇద్దరూ ఒక సోఫాలో కూర్చున్నారు.
కొంతసేపు ఇద్దరిలో ఎవరినోటినుండీ మాట వెలువడలేదు. సంభాషణ ఎలా ప్రారంభించాలో రణూభాకు అర్థం కాలేదు. వృద్ధుడైన ఆ సిక్కు నోటనుండి కూడా ఎందుకు మాట వెలువడలేదో ఎవరికి తెలుసు? అది కాస్త విచిత్రం అనిపించింది రణూభాకు. అపరిచిత వ్యక్తి ఒకడు దూరం నుంచి వచ్చినప్పుడు నోరుమూసుకొని కూర్చోవడం.... ఏమీ లేకున్నా కనీసం ఒక నవ్వు నవ్వాలే.... ఇదేమీ బావుండలేదు. పెద్ద కొడుకు చూస్తూనే అబద్ధం చెప్పేశాడు. రణూభా మనసు ఎలాగో ఉంది. ఇంతలో అతనికి తేజసింహుడు గుర్తుకు వచ్చాడు. అప్పుడతడు స్వయంగా ప్రారంభించాడు "తేజసింహుడు మీకు ఉత్తరం వ్రాసే ఉంటాడు."
క్షణంపాటు ఏదీ విననట్లే కూర్చున్నాడు రణజితసింహుడు. వెంటనే ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ".... ఆఁ.... ఆఁ- వచ్చింది ఠాకూర్ గారూ!..... పది పన్నెండు రోజులై ఉంటుంది." అన్నాడు.
మళ్ళీ అమాంతంగా ఆగిపోయాడు. తరువాత "మీరు చాలా దయ చూపారు ఠాకూర్ జీ!" అన్నాడు.
"దయా.... దయా.... దయ చూపించింది మీ చిరంజీవి.... మా వృద్ధులకు తేజసింహుడొక నవజీవనం ప్రసాదించాడు."
"అవును."
ఆ జవాబు నచ్చలేదు రణూభాకు. ముఖం పీక్కుపోయింది. 'ఏం మనిషి! రకరకాల మనుషులుంటారు' అనుకున్నాడు.





