Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    "జీ సర్కార్!" అని సర్వర్ సలాం కొట్టాడు. మమ్ములను తీసుకొని బయల్దేరాడు. నా వళ్లు సాంతం నొప్పులుగా ఉంది. వాడి దెబ్బల బాధ తక్కువే! వాడి దుర్భాషలు మనసున మంటలు రేపాయి. వాడు నా దేశాన్ని - నా నేతలను - నా పతాకాన్ని అనరాని మాటలు అన్నాడు!

 

    పోలీస్ స్టేషను చేరుకున్నాం. రిమాండు గది అప్పటికే నిండి ఉంది. రావూరి గోపయ్య వంటి కాంగ్రెస్ మిత్రులున్నారు. వారూ జండా ఎగురవేసే ప్రయత్నంలోనే అరెస్టయ్యారు. వాళ్లంతా భూస్వాములు. ఉన్నవాళ్లు. ఎవరినీ దెబ్బలు కొట్టలేదు. బాగా రాత్రి అయింది. అయినా వాళ్లు నిద్రించలేదు. నన్ను అరెస్టు చేసిన విషయం వారికి తెలిసింది. నన్ను ఏం చేస్తారోననే భయం పట్టుకుంది. అందువల్ల మేలికతో ఉన్నారు.

 

    రావూరి గోపయ్యగారు - లాంతరువెలుగులో - నన్ను చూచారు. దెబ్బల విషయం వారికి తెలిసింది. ప్రాణాలతో బయటపడ్డాను. అందుకే వారు సంతోషించారు. మమ్ములను ఉంచడం అమీనుకు సమస్య అయింది. స్థలం లేదు. అటూ ఇటూ తిరిగారు. వెనక రికార్డురూమ్ ఉంది. అందులో ఉంచడానికి నిర్ణయించారు.

 

    మమ్ములను వెనుక గదిలో పెట్టారు. బయటినుంచి తాళం వేశారు. ఆ గది ఫైళ్లకోసం - మనుషులకోసం కాదు. ఒక్క కిటికీ సైతం లేదు. గాలి రాదు. వెలుగు లేదు. తాగడానికి నీళ్లు లేవు. అమృతారెడ్డి పక్క బట్టలు తెచ్చాడు. అవి ఉపయోగపడ్డాయి. పరుచుకున్నాం. కూర్చున్నాం. నాకు తగిలిన దెబ్బలను గురించి వాళ్లంతా బాధపడ్డారు. నేను బాధపడలేదు. వంటినిండా దెబ్బల దద్దుర్లు!

 

    దెబ్బలు మరీ అంత బాధపెట్టలేదు. అది వాస్తవం. అన్ని దెబ్బలు! ఎందుకు బాధించవు? జీవితం ఆశల - నిరాశల - దురాశల మీద ఆధారపడి ఉంది. ఆశ మనిషిని బతికిస్తుంది. నిరాశ నీరసపరుస్తుంది. దురాశ దుఃఖం చేటు అవుతుంది. ఆశించింది ఎక్కువయి, ఫలితం తక్కువ అవుతే నిరాశ కలుగుతుంది. తక్కువ ఆశించి, ఎక్కువ ఫలితం లభిస్తే శ్రమ తెలియదు. ఒకరకంగా సంతోషం కలుగుతుంది.

 

    నేను రేపటి వెలుగు చూడనని కాజిం ముందుకు వెళ్లాను. వాడు చంపేస్తాడనే వెళ్లాను. దెబ్బలతో బయటపడ్డాను. అంటే, నేను ఆశించిన ప్రమాదంకన్న తక్కువ జరిగింది. అందువలన - బహుశః దెబ్బలు అంతగా బాధించలేదు!

 

    జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి తక్కువ ఆశించడం మంచిది. అసలే ఆశించకపోవడం కర్మ సన్యాసం. అది ఆనందం ప్రసాదిస్తుంది. ఆనందోబ్రహ్మ. ఆనందం లభిస్తే - జీవితానికి లక్ష్యం అయిన - బ్రహ్మం లభించినట్లే!

 

    కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనన్
    మా కర్మఫలహేతు ర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి.        - గీత 2.47

 

    పనిచేయడం నీ విధి. పని ఫలితాన్ని ఆశించడం కాదు. పనివల్ల వచ్చే ఫలితానికి నీవు హేతువు కారాదు. అట్లా అని పని చేయకుండరాదు.

 

    ఇది వేదాంతం కాదు. వైరాగ్యం కాదు. పాప పుణ్యాల కథ కాదు. ఇది జీవిత సత్యం. ఏమీ ఆశించక చేస్తే వచ్చిన ఫలితం ఆనందం కలిగిస్తుంది. ఫలితానికి నీవే హేతువు అనుకుంటే గర్వం కలుగుతుంది. అట్లా అని పని మానరాదు. ఎంచాతంటే - పనియే జీవితం!

 

    చీకటి రికార్డు గదిలో చిరాకుగా వుంది. సూ.నాకు - కాజిం గద్దింపుతో - దొడ్డికి వచ్చేది నిలిచిపోయింది. ఇప్పుడు మూత్రం వస్తున్నది. ఎక్కడ పోయడం! పీత బాధలు పీతవి - అతని బాధ అది. పోలీసును పిలుస్తున్నాం. మేము బంధించిన గదిలో ఉన్నాం. మా పిలుపు రెండు గదులు దాటి వినిపించాలి. వాళ్లు రావాలి. సు.నాకు తొందర.

 

    అమృతరెడ్డి దగ్గర అగ్గిపెట్టె ఉంది. పుల్లగీచి చూచాను. రెండు నాపరాళ్ల మధ్య సిమెంటు లేదు. అగ్గిపుల్లతో మట్టి తీశాను. చిన్న కాలువ తయారయింది. అందులో మూత్రించమన్నాను.

 

    ఇంతలో మరొక మెరుపు ఆలోచన! పోలీసు లొట్ట తుపాకి - లాంతరుతో వస్తాడు. నలుగురం వాణ్ణి పట్టెయ్యాలి. లాంతరులోని కిర్సనాయిలు రికార్డుల మీద పోయాలి. అగ్గిపుల్ల అంటించాలి. వెనకకు మొండిగోడ దాటి పారిపోవాలి. ఇది నా ప్రతిపాదన. అందరూ ముక్త కంఠంతో "చూస్తాం" అన్నారు.

 

    "ప్రాణమే కదా పోయేది!" అన్నాను నేను. నన్ను గురించి వాళ్లకు తెలుసు. తెగిస్తాడని వారు ఎరుగుదురు. నారాయణగారు నా కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. "ఇది మాత్రం చెయ్యకుండి బాంచెను, కాల్మొక్త - పెండ్లాం పిల్లలున్నోణ్ణి" అని ఏడుపు లంకించుకున్నాను. మిగిలిన ఇద్దరు ఏడవలేదు. కాని బ్రతిమిలాడారు.

 

    సూర్యనారాయణగారి మూత్రవేగం పెరిగింది. రెండు బండల సందు కాలువలో మూత్రిస్తున్నారు. అది నిండింది. పడకకిందికి వస్తున్నది. అప్పుడు వినిపించినట్లుంది పోలీసువానికి. లాంతరు పట్టుకొని - కేకవేస్తూ - తలుపు తీయడానికి వచ్చాడు. సూ.నాకు భయం - మూత్రించింది చూస్తాడని. నేను దర్వాజ ముందు నుంచున్నాను.

 

    పోలీసు - లొట్టతుపాకి, లాంతరుతో వచ్చాడు. పాము భయం పాముది. వాని భయం వానిది. ఒక రెక్క తీశాడు. నుంచున్నాడు. ఒకరి తరువాత ఒకరిని వదిలాడు. అందరం మూత్రించి వచ్చాం. అప్పుడు దాహం తెలిసింది. నీళ్లు అడిగారు. బుద్దిహీనుడు పోలీసువాడు. లాంతరు అక్కడ పెట్టాడు. నీళ్లు తేవడానికి వెళ్లాడు. ఇప్పుడు నా పథకం సులభం. వెనుక మొండిగోడ - చెట్లు - బండలూ ఉన్నాయి! చాల తేలిక. పోలీసులు ఇద్దరే ఉన్నారు! ముగ్గురూ భయం భయంగా నన్ను చూస్తున్నారు!

 

    పోలీసు నీళ్లు తెచ్చాడు. ఇందులో తురకోడు తెచ్చినవి తాగాల్నా! అనే సందేహం. నేను తాగేశాను. ఆకలికీ, దప్పికీ కులమతాలు లేవు. అందరూ తాగారు. పోలీసు తాళం వేసి వెళ్ళిపోయాడు. గదిలో ఉచ్ఛకంపు! ముచ్చట్లు - సిగరెట్లతో రాత్రి గడిచిపోయింది.

 

    రాత్రి నేను చూడననుకున్న వెలుగు పరచుకుంది. జవాబు తలుపు తీశాడు. అందరం వరండాలోకి వచ్చాం. రిమాండు గదిలోవాళ్లుకూడా చేరారు. నలుగురు కలుస్తే అదొక తీరు. మాటలు ముచ్చట్లు - నవ్వులు - హాస్యాలు - పరిహాసాలు. సరదాగానే ఉంది. వేపచెట్లకింద ముఖాలు కడుక్కున్నాం.

 

    అప్జల్ అనుకుంటా - పేరు సరిగ్గా గుర్తులేదు. నన్ను లోనికి పిలిచాడు. మరొక ప్రమాద సూచిక అనుకున్నాను. ఆశించని ఆశ్చర్యం! అనుకొని ఆత్మీయత!! మరల లభించని ఆతిధ్యం!!! ఒకే టేబుల్ మీద ఇడ్లీ, పెసరట్టు - చాయ్ - సిజర్స్ సిగరెట్టు పాకెట్టు!

 

    "సాబ్! ఆప్ తో ఇన్సానోఁ మే ఫరిప్తే హైఁ ఆప్ కో కైసీ తక్లీఫ్! అల్లామియాఁనే ఆప్ కో బచాలియా! యహ్ మేరే తరఫ్ సే ఆప్ కే లియే. ఖుబూత్ ఫర్మాయియే - అయ్యా! మీరు మానవుల్లో దేవతలు మీకేమిటి కష్టాలు! అల్లా మిమ్ములను దక్కించినాడు. ఇది నా తరపు ఉపాహారం స్వీకరించండి" అని భక్తి కలిగినట్లు నుంచున్నాడు.

 

    కన్నీరు కాజిం దెబ్బలు సహించగలిగింది. ఆఫ్జల్ ఆతిథ్యాన్ని దాచుకోలేక పోయింది. "ఆఫ్జల్, మేరే భాయ్!" అని గట్టిగా కౌగిలించుకున్నాను. నా హృదయం పొంగింది! గండి కొట్టింది! బాష్పధార అయింది. ఎక్కెక్కి ఏడ్చాను.

 

    బయట వారంతా ఉరికి వచ్చారు.

 

    మా దృశ్యం చూశారు.

 

    చిత్తరువులలా నిలిచిపోయారు!

 

    నా జీవితపు ఎడారిలో ఇవి ఒయాసిస్సులు! ఇవి మనసులో చిరకాలం నిలిచే మల్లెపొదలు!! అర్థం - అధికారం కాదు. ఇలాంటివే నా జీవితానికి ఆధారం!!!

 

    శబరి రాముని కోసం జీవిత పర్యంతం వేచింది. కళ్లల్లో వత్తులు వేసుకొని చూచింది. మేఘశ్యాముడు -రాముడు వచ్చాడు. ఆమె బాష్పాకుల అయింది. బీటలు వారిన హృదయం కన్నీటితో పులకించింది.

 

    శబరి రామునికి ఆతిధ్యం ఇచ్చింది. పుల్లగా ఉంటాయో - చేదుగా ఉంటాయోనని పళ్లు రుచి చూచి తినిపించింది. ఒక చల్లని మాట మాట్లాడింది. రుశ్యమూకానికి బాట చూపింది.

 

    ఒక చల్లని మాట - ఇన్ని చల్లని నీళ్లు - ఇంత చల్లని నీడ మనిషికి కొండంత ధైర్యం కలిగిస్తాయి. ఆ ధైర్యంతోనే రాముడు సీతను తెచ్చుకున్నాడు.

 

    అమ్మ ఇంటినుంచి గుండి చెంబులో చాయ్ పంపించింది. ఇద్దరు చెల్లెళ్లు తీసుకుని వచ్చారు. అందరం టీ తాగాం. ఇంతలో అమృతరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డిగారు వచ్చారు. కొడుకును విడిపించుకు పోయారు. సాయంత్రం వరకు పూసాల నారాయణ - గూడా సూర్యనారాయణ కూడా విడుదలయినారు. రావూరి గోపయ్యగారితో వచ్చిన కొందరు కూడా విడుదలయినారు. ఇంటి వార్తలు మస్తాను గాని, అఫ్జల్ గానీ చెపుతున్నారు. భోజనం తెస్తున్న చెల్లెళ్ళవల్ల గూడా తెలుస్తున్నాయి.

 

    గ్రామస్థులు ఇంటిని కనిపెట్టుకొని ఉన్నారు. బియ్యం వగైరా సామాగ్రి పుష్కలంగా అందుతున్నది. పోలీసు స్టేషనులో అంతగా నిర్బంధం ఏమీలేదు. గోపయ్యగారు కూడ విడుదలయినారు. వరదయ్యగారి వంటి గ్రామ పెద్దలు నా విడుదల గురించి ప్రయత్నించారు. విఫలులు అయినారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.