Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
బంగారు గాజులు
తన గ్రామానికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బస్తీకి వెళ్ళి జాతీయ రక్షణనిధి కార్యాలయపు అధికారిముందు, వార్ధక్యం వల్ల కంపిస్తున్న చేతుల్తో రణూభా మూటవిప్పి, బరువైన నాలుగు బంగారు గాజులు ఉంచినపుడు క్షణం చకితుడైపోయాడు అధికారి.
అధికారి మాట అలా ఉంచండి. అంతకు క్రితపు రోజు మధ్యాహ్నం ఇన్సూర్డు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా రణూభాకు ఈ గాజులు చేరినప్పుడు అతడూ చకితుడైపోయాడు.
ఊళ్ళో స్కూలుపనీ, పోస్టుపనీ రెండూ నిర్వహిస్తున్న మాస్టర్ గారు "పార్సల్" తీసుకోవడానికి స్కూలుకు పిలిచినప్పుడు ఒక నిముషంపాటు రణూభా హృదయస్పందనమే ఆగిపోయింది. అరవై-అరవై అయిదు సంవత్సరాల సుఖదుఃఖాల భారం ఒక్కసారి ఆ ముసలి శరీరం మీద పడ్డట్లనిపించింది. కళ్ళు చీల్చుకొని టపాబంట్రోతువైపు చూస్తూ ఉండిపోయాడు.
"ఇంతకే అంత బెదిరిపోయావేం ఠాకూర్? మాస్టర్ గారు పార్సల్ తీసుకోవడానికి రమ్మని పిల్చారు," అన్నాడు బంట్రోతు. "మంచిది." రణూభా మంచం మీదినుంచి లేస్తూ అన్నాడు. ధ్వనిలోనూ, కాళ్ళలోనూ భయంవల్ల కలిగిన కంపం ఇంకా తగ్గలేదు. "కలకాలం జీవించు నాయనా! నా మనసులో ఏవేవో ఆలోచనలు వచ్చాయి భాయీ! నా కొడుకు సమ్రా నుంచి వచ్చిన ఉత్తరాలు నువ్వే తెచ్చి ఇస్తుంటావు కదా! ఈ రోజు మాస్టర్ గారు నన్ను పిలిపించాడంటే.... .... ...." తరవాత మాట్లాళ్ళేకపోయాడు వృద్ధుడు.
"అరే బాబాయి!" బంట్రోతు నవ్వుతూ అన్నాడు" "వృధాగా భయపడ్తావెందుకూ?.... మీ సమ్రా ఏదో విలువైన వస్తువు పంపివుంటాడు.... సరే, నేను వెళ్తున్నా, త్వరగా వచ్చేయ్."
"ఆఁ.... ఇదిగో వస్తున్నా." రణూభా చెమ్మగిలిన కళ్ళను తుడుచుకుంటూ అన్నాడు. అన్నాడేగాని కొంతసేపు మంచం మీద కూలబడే ఉండిపోయాడు. తరవాత ఎన్నో సంవత్సరాలనుంచి గోడకు వ్రేలాడుతున్న పురాతనమైన శివుని పటం వైపు చూస్తూ.... "తండ్రీ నా ముసలితనాన్ని చూడు. నా మీద కాకున్నా ఆ ముసలి దానిమీదనన్నా దయతల్చు తండ్రీ!...." అని గొణిగాడు.
"ఎవరూ వచ్చింది?" ఇంట్లోంచి బైటికి వస్తూ అడిగింది రణూభా భార్య.
"ఆఁ- ఎవరూ లేరు. టపా జవాను. సమ్రా ఏదో పంపినట్లున్నాడు. మాస్టరుగారు పిలిపించారు."
"మా నాయన-" రణూభా భార్య గద్గస్వరంతో, "యుద్ధరంగంలో పోట్లాడ్తూ కూడా ముసలివాళ్ళను మరిచిపోడు మా నాన్న!" అని కొడుకు తన ఎదుటనే ఉన్నట్లుగా భావించి, "దేవుడు నిన్ను రక్షిస్తాడు" అన్నది.
"ఎందుకు రక్షించడు సమ్రా తల్లీ! బ్రతుకు సాంతం ఆ శివుణ్ణి పూలతో పూజించావు. ఒకరికి కీడు కలగాలని కనీసం ఆలోచించలేదు. మరి వాడు నీ మేలెందుకు చూడడూ? ఏమంటావ్?".
ఎప్పుడూ ఈ మాటలనే ముసలిదాన్ని ఓదారుస్తాడు. అతనికీ ఆ మాటలు కొంత స్థైర్యాన్ని ఇస్తాయి. అనేకసార్లు కొడుకు కోసం అతని మనసు తపించినప్పుడు, భార్య ఎదురుగా లేనప్పటకీ, మనసులోనే ఆ మాటలు మననం చేసుకునేవాడు. అప్పుడు పగిలిన అతని హృదయానికి ధైర్యమూ, స్థైర్యమూ కలిగేవి.
"కాసిన్ని మంచినీళ్ళు తెచ్చిపెట్టు. మాస్టరుగారి దగ్గరికెళ్ళి పార్సల్ తెస్తాను" అంటూ మంచం మీది నుంచి లేచాడు. తరువాత యువకులు సహితం సిగ్గుపడేంత వేగంగా స్కూలుకు వెళ్ళి పార్సల్ తెచ్చాడు. మాస్టర్ గారితో మాట్లాడ్డానికి రెండు నిముషాలు సైతం అక్కడ నిలువలేదు. త్వర త్వరగా ఇంటికి వచ్చేశాడు.
అతి నాజూగ్గా అనేక చోట్ల వేయబడిన సీళ్ళను విప్పేప్పుడు ఆ వృద్ధ దంపతులకు కుతూహలం పొంగి, ప్రాణం గొంతుదాకా వచ్చేసింది. చివరకు పార్సల్ విడివడి నాలుగు బంగారు గాజులు 'ఖణ్....ఖణ్' మనే ధ్వనితో నేలమీద దొర్లాయి.
రణూభా భార్య ఆశ్చర్యంతో గాజులవైపు చూస్తూ, "కాని.... కాని.... ఇవి....మనం సమ్రా స్నేహితుని భార్య కోసం చేయించిన వాటిలా ఉన్నాయి. మీరు నాలుగు రోజుల క్రితమేగా అహమదాబాదు వెళ్ళి ఇచ్చి వచ్చారు....." అన్నది.
"అవును." రణూభా ఆందోళనగా "అవును, గాజులైతే అవే. కాని, వాపసెందుకు పంపినట్లు సమ్రా తల్లీ! నాకిదంతా ఏమీ అర్థం కాకుండా ఉంది." అన్నాడు.
అవును, నిజంగానే ఇది రణూభాకు అర్థం అయ్యేవిషయం కాదు. పదిహేను రోజులక్రితం రణరంగం నుంచి సమ్రా ఉత్తరం వచ్చింది. అందులో అతని స్నేహితుడు తేజసింహుడు కూడా నాల్గు పంక్తులు వ్రాశాడు. స్కూల్లో మాస్టరు ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు, అప్పటి వారి బాధలు తల్చుకొని గుండె నిండడంతో కళ్ళు చెమ్మగిలసాగేయి. ఒకసారి మాస్టరు స్వయంగా ధోవతితో కళ్ళు తుడుచుకున్నాడు. లిప్తపాటు ఆశ్చర్యకరమైన దృశ్యం తలుచుకొని, కుర్రాళ్ళను గద్దిరిస్తూ, ముఖం పుస్తకాల్లో దాచుకొని "ఠాకూర్! నీ పూర్వజన్మ పుణ్యంవల్ల సమ్రా బతికిపోయాడు. ఆ తేజసింహుడు లేనటైతే మన సమ్రా దక్కేవాడు కాదు" అన్నాడు.
"అవును మాస్టర్ జీ! గరుత్మంతుణ్ణి ఎక్కిన భగవంతుడు తేజసింహుని రూపంలో అవతరించాడు."
"చక్కగా చెప్పావు ఠాకూర్, చక్కగా చెప్పావు. అబ్బ, ఎంత ధైర్యం ఆ స్నేహితునికి! తన ప్రాణం లెక్క చేయకుండా విమానం ద్వారా సమ్రాను రక్షించాడు.........."
"మహాదేవా! అతనికి నిండా నూరేళ్ళ ఆయుష్యం ప్రసాదించు ప్రభూ!" రుద్ధకంఠంతో రణూభా అన్నాడు.
"..... ఎంత బుద్ధిమంతుడు ఠాకూర్! నీకు ఎంత వినయంగా వ్రాశాడనుకున్నావ్!" మాస్టరు వినయంగా అన్నాడు.
"చదవండి మాస్టర్ గారూ! నా కొడుకును రక్షించినవాడేం వ్రాశాడో మరోసారి చదవండీ" రణూభా కళ్ళు చిన్నవి చేసుకొని మాస్టరు చేతిలో ఉన్న కాగితాన్ని చూస్తూ అన్నాడు.
హర్షదాయకమైన ఆ వాక్యాల్ను మళ్ళీ చదివాడు మాస్టర్.
"పూజ్యులైన బాబాయిగారికి,
సాష్టాంగ దండప్రణామములు. లెఫ్టినెంట్ సమరసింహుడు....." (లెఫ్టినెంట్ సమరసింహ... మన సమ్రా కాదు ఠాకూర్). ఉత్తరం చదువుతూ చదువుతూ మధ్యలో అన్నాడు మాస్టర్. "నా స్వంత సోదరుడైపోయాడు. అందువల్ల మీరు నాకు పితృతుల్యులు. సమరసింహుడు మీకు వ్రాసినట్లు నేనూ గుజరాతీనే. నా తండ్రిగారు పది, పదిహేను సంవత్సరాల్నుంచి అహమదాబాదులో వ్యాపారం చేస్తున్నారు. మీరు అహమదాబాదు వెళ్ళినప్పుడు మా తండ్రిని తప్పక కలుసుకోవాలి. అక్కడ నాలుగు రోజులుండాలి. మిమ్మల్ని కలుసుకొని నా తండ్రి చాలా సంతోషిస్తారు. నేను మా నాన్నకు ఉత్తరం వ్రాశాను. మీ చిరునామా కూడా తెలియజేశాను. నాకు గుజరాతీ బాగా రాదు. వచ్చినంతలో వ్రాశాను. నవ్వొద్దు బాబాయీ"!
"అరే నాయనా! నువ్వు మాకు సర్వదా సంతోషం కలిగించే పని చేశావు. నీ తల్లి తండ్రుల్ను కూడా అలాగే సంతోషపర్చు బాబూ!" అన్నాడు రణూభా మధ్యలోనే.
మాస్టర్ గారు "మీ తేజసింహుడు" అని పూర్తిచేశారు. తర్వాత రణూభా మాస్టరుగారిని వేడుకున్నాడు - ఇంటికి వచ్చి ఉత్తరం చదువమని. ఎప్పుడు ఉత్తరం వచ్చినా మాస్టరుగారు రెండుసార్లు చదవాల్సిందే - ఒకసారి స్కూల్లో, మరొకసారి సాయంకాలం రణూభా ఇంటి దగ్గరా.
సాయంకాలపు భోజనానికి ముందు మాస్టరుగారు రణూభా ఇంటికి వచ్చారు. రణూభా భార్య వింటూండగా సమ్రానుంచి వచ్చిన రెండు పుటల ఉత్తరమూ, దాని చివరనున్న తేజసింహుడు వ్రాసిన ఎనిమిది, పది పంక్తులూ చదివారు. అలా చదువుతున్నప్పుడు వృద్ధదంపతుల ముఖాల్లో క్షణక్షణానికీ మారుతున్న భావాల్ను చూచి ఒకటి రెండుసార్లు ఉత్తరం చదవడమే మరిచిపోయారు మాస్టరుగారు.
అత్యున్నతమైన హిమవత్పర్వత శిఖరాలపై, తుపాకి గుండు కాలుకు తగిలి సమ్రా ఎలా గాయపడిందీ. ఫ్లాయిట్ లెఫ్టినెంట్ తేజసింహ్ తన ప్రాణాలను లెక్కచేయకుండా, ఆకసాన్నంటే శిఖరాల్లో అతికష్టం మీద బాటచేసుకొని, హెలీకాఫ్టర్ మీదినుంచి సమ్రాను రక్షించేప్పుడు తేజసింహునికి శత్రువు తుపాకి గుండు తగిలి గాయపడినప్పటికీ, క్షేమంగా సైనిక వైద్యశాలకు చేర్చిన వృత్తాంతమూ స్పష్టంగా వర్ణించి వ్రాశాడు సమ్రా. ఇద్దరూ సైనిక వైద్యశాలలో పక్కపక్క పడకలపై విశ్రాంతి తీసుకుంటున్నారు. జంటగా ఇద్దరూ చావుపయనం సాగించింతర్వాత ప్రాణస్నేహితులైపోయారు వారు. అంతేకాక తేజసింహుడు గుజరాత్ వాడు కదా! అతని తండ్రి రణజితసింహుడు రిటైర్డ్ బ్రిగేడియర్- ఉన్నత సైనికాధికారి. దేశం ముక్కలుగా చీలింతర్వాత ముందు ఢిల్లీ వచ్చి, ఆ తర్వాత తన జ్యేష్ఠపుత్రునితో అహమదాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు. అతని పెద్ద కొడుకు అహమదాబాదులో మోటార్ల వ్యాపారం చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడు అహమదాబాదు వెళ్ళి రణజితసింహుని కలుసుకోవలసిందని వ్రాస్తూ బ్రిగేడియర్ అడ్రెసు కూడా వ్రాశాడు సమరసింహుడు.





