Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    రెండవసారి బయల్దేరిన బృందంతో మిలిటరీలో చేరడానికి వెళ్ళాడు జూలియస్ ఆగస్టన్. మెర్రీ ఏడ్చింది. "మెర్రీ! ఏడవకు. నన్ను అపహరించేవారికీ, నానా మాటలనే జనానికీ నేనేమిటో తెలియజేయడానికి చక్కని తరుణం వచ్చింది. అవును. నేను తాగుతాను. తాగుతానని చెపుతాను గూడా. అంతమాత్రంతో నా దేశంకోసం పోరాడలేని పిరికిపందను కాను. నీ తల్లికీ, డాక్టర్ గారికీ చూపిస్తాను నేనేమిటో!" అని ఓదార్చాడు. "మెర్రీ! ఇటుచూడు. నీకు డబ్బు పంపుతాను. ఒక్కతెవే పొలంలో పనిచేయాల్సి వస్తుంది. అయినా పిల్లా, నీకలవాటేగా! వెళ్ళు ఆ బంగారు దిద్దులు పెట్టుకొనిరా, ఒకసారి కండ్ల పండుగు చేసుకుంటా" నన్నప్పుడు మెర్రీలో ప్రేమ, భయం, గర్వం ముప్పిరికొని బాష్పధార ప్రవహించింది.
    "వెళ్ళు, దిద్దులు పెట్టుకొనిరా!" సైన్యంలో చేరడానికి వెళ్ళిపోతున్నందున ఏర్పడిన నవమార్దవంతో కోరాడు జూలియస్. మెర్రీ కన్నీరు ఎండిపోయింది. బంగారు దిద్దులు అనే మంత్రవాక్కులు ఆనందంలో ముంచివేశాయి. మెర్రీ మా ఇంటికి పరిగెత్తుకొని వచ్చింది. గ్రామం మొత్తంలోనూ భద్రతమమైన ప్రదేశమనీ దిద్దుల్ను మా ఇంట్లో దాచిపెట్టుకుంది. ఆ నల్లని దేవకన్య "డాక్టర్ గారూ" అనే కేకవిని నేను అదిరిపడ్డాను. "ఆ దిద్దులివ్వరూ? ఆయన చూస్తానంటున్నారు పెట్టుకుంటా. ఆయన... ఆయన వెళ్తున్నారు డాక్టర్ గారూ!" అన్నది. వాటిని ధరించినప్పటి మెర్రీ ముఖం నుంచి పొర్లుతున్న సంతోషాన్ని చూచినప్పుడు చిటపటలాడే చిరాకులో భస్మం అవుతున్నవాడు సైతం నిట్టూర్పు విడువకుండలేడు. అలంకరించుకున్న అతివ! నాలాంటి ముసలి బ్రహ్మచారికేం అర్థం అవుతుంది, ఎక్కడో కాల్పనిక కావ్యాల్లో చదవడం తప్ప.
    దైవదత్తమైన సొగసుకు మానవ కృతమైన అలంకారం మెరుగులు పెట్టుటను కలగని మొనాలిసా (Mona Lisa) నవ్వుకొని ఉంటుంది. అలంకృతకర్ణాల్ను చూచుకుంటున్న మురిపెంలో మొఖం అటుతిప్పీ ఇటుతిప్పీ చూచుకున్నంతటి అదృష్టం నా మంగలి అద్దానికి అంతకుముందు ఎన్నడూ పట్టివుండలేదు. పునర్జాగృతమైన, ఆ అందాన్ని అవలోకించిన జూలియస్ ఆగస్టన్ కు, పాపం, విడిపోవడం కష్టమే అనిపించింది. అయినా, జూలియస్ ఆగస్టస్ ఇతరులతో వెళ్తాడు-ధైర్యంగానూ, విశ్వాసంతోనూ. కాని, సిగ్గుతో తలవిరిగిపోగా తిరిగి వచ్చాడు-ఒక్కడే. వైద్య పరీక్షలో అతడు పనికిరాడని తేలింది. చేర్చుకోలేదు.
    ఊరంతటికీ సొగసుకత్తె అయిన మెర్రీ ఒక్కతే సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది. పొలాల్లో పనిచేసే రైతులూ, కర్మాగారాల్లో పనిచేసే శ్రామికులూ దేశరక్షణ కృషిలో పాల్గొంటున్నారనే ప్రధాని సందేశం తనకే ప్రత్యేకంగా ఇవ్వబడినట్లు భావించింది మెర్రీ. ఎముకలు నుసిచేసి పనిచేయసాగింది పొలంలో.
    తన భర్తను సైన్యంలో చేర్చుకోకపోడం మెర్రీ గుండెను గాయపర్చింది. సిగ్గుతో కుంచించుకొనిపోయింది. పేరుకుగాని, ప్రకృతికిగాని తగినట్లుగా లేదు మెర్రీ. చర్చిపండగ్గానీ, కోతుల పండగ్గానీ జరిగినప్పుడు పాటలు పాడ్డంలో ప్రధాన పాత్ర వహించడం లేదు. ఇప్పుడామె కౌశల్యం గల నాట్యకత్తెగానీ, ఊరికి సొగసుకత్తెగాని కాదు. పనిపాటలు అయింతర్వాత ఆడవాళ్ళంతా ముచ్చట్లకు కూడినప్పుడు నూతి నీటికంటే స్వచ్చంగా వినిపించే ఆవిడ నవ్వు ఇప్పుడు వినిపించడం లేదు. పగవానితో పోరాడ్డానికి మనిషిని పంపని ఆడది ఆవిడ ఒక్కతే. ఆవిడ ఓడిన ఆడది. తండ్రి చనిపోయి చాలాకాలం అయింది. ఆవిడకు అన్నదమ్ముల్లేనేలేరు. కొడుకు (కొడుకే అవుతాడని ఆశ) ఇంకా కడుపులో అయిదు నెలలవాడే. భర్తను చేర్చుకోలేమన్నారు. ఆవిడ దగ్గర దేశానికి అర్పించుకోవడానికి ఏమీలేదు.

                                 *    *    *    *

    నాడు పౌర్ణమి. తెల్లని, చల్లని చంద్రుడు నిర్లక్ష్యంగా సాలవనంలో ఉదయించాడు. నగరం నుంచి అధికార్లు జీపుల్లో వచ్చారు, దేశానికి సహాయం చేయమని కోరడానికి. వారికి అత్యవసరంగా కావల్సివున్నది బంగారం. పర్వతాకారంగల గ్రామసర్పంచ్ భార్య తమ మిత్రుల్ని ఇంటికి రప్పించింది. ఆ సందేశం విని మరికొంతమంది కూడా అక్కడికి వచ్చేశారు. వారిలో కొంతమంది మెడ తరగని బంగారు నగలు గలవారూ ఉన్నారు. కిషన్ లాల్, ఛగన్ లాల్ వ్యాపారుల భార్యలూ, జోగెన్ బాబు వకీలు భార్యా, మొగుని ముందు కూర్చుని అతని యాతన చూడలేక మెర్రీకూడా వెళ్ళిందక్కడికి. ఇదొక కొత్తయాతన-మైకం తెచ్చే సారాయి తాగాలనిపించే యాతన కాదది. జోగూబాబు పెళ్ళాం మాట్లాడింది. ఆవిడ పట్నం పిల్ల. చదువుకున్నది కూడా - మెట్రిక్లేషన్ పాసైంది. మెర్రీ చిరాగ్గా అక్కడికి ప్రవేశించేప్పుడు తరళ అంటూంది:- "జవాన్ల కోసం మన డబ్బిచ్చాం. మన మగవాళ్ళను అర్పించాం. రక్షణ కృషికిగాను మన శక్తిసామర్థ్యమంతటితోనూ సాయం చేద్దాం-కాని, మనం బంగారం ఇవ్వగలమా? సోదరీమణులారా! బంగారం మనకు పూర్వీకుల నుంచి వస్తున్న భద్రత. బంగారం మన లక్ష్మి. మనకు సౌభాగ్యమైన బంగారం ఇచ్చేసి ఎలా బోసి మెడలు చేసుకుంటాం?" ఆడవారంతా వేడి నిట్టూర్పు విడిచి అన్నారు - "కాదు. వీల్లేదు. ఇవ్వలేం. ఇవ్వం" అని.
    అప్పుడు నాకో టెలిగ్రాం వచ్చింది. టెలిగ్రాం అంటే ఒక వెధవ కాగితం- అదెప్పుడూ చెడ్డ కబుర్లే మోసుకొస్తుంది. నా ఇంటి పక్కనే సర్పంచ్ ఇల్లు ఉండడం మూలాన అసాధారణమైన టెలిగ్రాం విషయం వారికి సంభాషణ మార్చింది. వారంతా ఊపిరి బిగబట్టి నన్ను చూశారు. కవరు చింపి టెలిగ్రాం బయటికి తీశాను. వారంతా నా ముఖాన్ని చూచారు. వారి గొంతుల్లో క్వశ్చన్ మార్కు ఇరుక్కుంది. మెర్రీ అడిగింది: "డాక్టర్ గారూ! ఏం వార్త?" అని. గొంతులో ఇరుక్కున్న ఒక విచిత్రమైన ఉండను వెనక్కునెట్టి "ఛోటూ...అవును...ఛోటూ నేఫారంగంలో మరణించాడు. వీరునిగా పోరాడుతూ ప్రాణాలర్పించాడు" అని చెప్పాను. ఛోటూ-శ్రావ్యమైన గొంతుగల రైతు యువకుడు. ఊరిపెద్ద ఒక్కగానొక్క కొడుకు.
    ఆ రాత్రికి ప్రజలు సభ చేశారు. చల్లని చంద్రుడు తెల్లని తన వెన్నెల కాన్వాసు మీద విచారంతో గడ్డకట్టిన ముఖాలు చిత్రించాడు. పవిత్రమైన సాలవనానికి వింత ఊరేగింపు ఒకటి బయల్దేరింది. విగతాత్మలు ఆ సాలవనంలో విశ్రాంతి తీసుకుంటాయని ఆ ఊరి ప్రజల విశ్వాసం.
    ఆ ఊరేగింపుకు నాయకత్వం వహించింది మెర్రీ.
    అప్పుడు నా గొంతు నుంచి ఒక కేక వెలువడింది. అది ఆశ్చర్యమో, ఆనందమో, గర్వమో, మూడింటి కలయికో నేటికీ తెలీదు నాకు. మెర్రీ హుందాగా అడుగులు వేస్తూ, ఎవరినో అనుగ్రహించడానికి వెళ్తున్న రాణిలా నడిచి, ఆఫీసుకు ముందు నుంచుంది. ఆవిడ చేతులు చెవులమీదకి పోయినై. వాడిపోయిన కృష్ణచురా మొగ్గల్ను తీసినట్లు చెవులనుంచి దిద్దుల్ను తీసి అధికారి చేతుల్లో పెట్టింది. మిగతా స్త్రీలూ ఆవిడననుసరించారు. కాని, మిగతా వాళ్ళివ్వాల్సింది ఇంకా చాలా ఉంది. ధోవతి చెంగుతో నా ముసలి కళ్ళు తుడుచుకునేప్పుడు పదిహేడు సంవత్సరాల క్రితం నా సహాయంతో జన్మించిన అమ్మాయిని చూస్తే, ఆవిడ అమ్మాయిగాకాక జ్యోతిర్మూర్తిగా కనిపించింది నాకు. ఒకసారి, ఒకే ఒకసారి, ఆవిడ చేతులు కర్ణరంధ్రాల్ను తాకేయి. చూపులు భర్త చూపుల్లో ఇరుక్కున్నాయి. జూలియస్ ఆగస్టన్ గర్వంగల చక్రవర్తిలా, తన భార్య నుంచున్న చోటికి నడిచిపోవడం నేను చూచాను. ఓటమి, తిరస్కారము, ఆక్షేపణల వల్ల ఏర్పడ్డ విషాదచ్చాయలు ఉభయ వదనాల్నుంచీ మాయమైనాయి. అతడు తన రెండు చేతులూ ఎత్తి, బోసిగా ఉన్న ఆమె కర్ణరంధ్రాల్ను నిమిరాడు. ఆ పేదపిల్ల త్యాగాన్ని దేశం పరిగ్రహించింది. రంగంలో పోరాడుతున్న సైనికుల్లా భార్యా భర్తలిరువురూ సంతృప్తి చెందారు.

                                          *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.