Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    బంగారం-చొక్కపు బంగారం. అతివలకు గౌరవం ప్రసాదిస్తుంది. వ్యాపారం చేయదల్చుకున్నవారికి తళ తళ మెరసే పెట్టుబడి. అది భర్తకు, తండ్రికి, కొడుక్కు రక్షణా, ఆధారమున్నూ. పొలాల్లోగాని, కర్మాగారాల్లోగాని, పల్లెల్లోగాని, పట్నాల్లోగాని ఆడవారికి ఒక అంతస్తునిస్తుంది బంగారం. అదొక మంత్రం. అనూచానంగా వస్తున్న ఆచారం ప్రకారం ఆవిడ మనస్సులో నాటుకున్న స్వప్నం యువతుల భద్రతకుగాను సహజమైన కోర్కెలనే నీరు చల్లబడి మొక్క మొల్చి, సౌందర్యపిపాస అనే సూర్యుని వెలుగుకు పెరిగి పెద్దదైంది. ఊహామాత్రమైన దిద్దుల జత తన కర్ణములను అలంకరించబోతూందనే ఆశతో తలదూర్చి పడుకున్న మెర్రీ గాఢనిద్రనుండి మేల్కొని, చెంపలను ఒత్తుకొని, రావిచెట్టులో కూసిన కోకిలలా పరవశురాలయ్యేది. నదిలో స్నానం చేసేప్పుడు, సోమరిగా పారే బంగారంవంటి నీటిలో తన ప్రతిమ చూచుకొని, ఆ ప్రతిమ బంగారు దిద్దులు ధరించినట్లుగా ఊహించుకొని ముగ్ధురాలైపోయేది.
    మెలుకువతో ఉన్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, నెత్తిమీద కడవ పెట్టుకొని నీరు తెచ్చేప్పుడూ, లయబద్ధరాగంతో పంట నూర్చేప్పుడూ, ఎర్రని నేలను దున్ని బాణపు చాళ్ళవంటి చక్కని చాళ్ళు తయారు చేయడానిగ్గాను ఎద్దుల తోకలు విరిచేప్పుడూ, సూర్యునిలోని ఎరుపు రంగులాంటి పూత గోడలకు పూయడానికి చేతులు ఎరుపు చేసుకొన్నప్పుడూ ఆ కల ఆవిడను విడిచేది కాదు.
    ఆవిడ భర్త కూడా ఆ విషయం మరిచిపోలేదు. యువక జీవితంలో మొట్ట మొదటిసారిగా అతని హృదయం ఒక ఆనందాన్ని ఆశించింది. భార్య కోరిన ఒక కోర్కె అతణ్ణి మంచి మనిషిగా మారుస్తూంది - పాద్రీ ఆశించిందానికంటేనూ, మరి మెర్రీ తల్లి విషయమో! ఒక్క రోజు సైతం విరామం లేకుండా పనిచేసిందావిడ. ఓవర్ టైమ్ సైతం పనిచేసింది. ఎంత సాధ్యమైతే అంత పొదుపు చేసింది-మేరీ తల్లి, తనకు ప్రసాదించిన ఒకే ఒక కూతురు కంటున్న బంగారు దిద్దుల కల నిజం చేయడానికి.

                                                        *    *    *    *

    బంగారు దిద్దుల్తో ఆ వూరికి వచ్చిన సన్నాయి వారి స్మృతి పథంలో చిరకాలం నిలిచిపోతుంది. అట్టపెట్టె చేతుల్లోకి తీసుకున్నప్పటి మెర్రీ కన్నులలోని ఆనందాన్ని నేను ఎన్నటికీ మరచిపోలేను. ప్రార్థనకు వలె ఆవిడ చేతులు ఆ పెట్టెమీద ముకుళించాయి. మిక్కిలి మెల్లగా దాని మూత తెరిచేముందు కొన్ని క్షణాలు గడిచాయి. తరువాత ఏమీ చేయలేకపోయింది. పొలం దున్నేప్పుడూ, విత్తులు చల్లేప్పుడూ, పశువుల్ను పట్టేప్పుడూ చలించని బలమైన ఆవిడ చేతులు, ఎగరడానికి ప్రయత్నించే లకుముకిపిట్ట రెక్కల్లా వణికాయి. చివరకు తెరిచింది. ఇప్పుడది ఆవిడ చేతిలో ఉంది. పొట్లం విప్పి చేతులో పెట్టుకునేప్పుడు ఆనందంతో, ఊపిరి పీల్చుకోవడం కూడా మరిచిపోయింది. క్షణాలు- పవిత్ర క్షణాలు దొర్లిపోయాయి. నాకున్న ఒకే ఒక గడ్డం గీసుకునే చిన్న అద్దం ముందుకు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ సాగిపోయింది.
    తల్లి కళ్ళు తుడుచుకొని "బిడ్డా! పెట్టుకో- చూడనీ అందర్నీ" అన్నది. దిగ్భ్రాంతితో తల ఊపింది మెర్రీ. గాజు వెండి వినా ఏ ఆభరణాన్నీ అంటలేదావిడ. చిరకాలంగా ఆవిడ బంగారు దిద్దులకోసం కలలు కంటూంది. ఆ కల కరతలామలకమైందిప్పుడు. బంగారానికి ఒక అగోచరమైన విలువ వచ్చింది. అందువల్ల కలిగిన విజయోత్సాహం, ఆ దిద్దుల జత ధరకంటే ఎన్నో రెట్లు హెచ్చించింది. సూర్యభగవానుని రశ్మికి తళతళ మెరిసే గోపురంవంటి కాంతి గల ఈ బంగారం - ఈ అందం - ఈ ధనం - కష్టానికి కాయకాసిన ఆమె అరచేతిలో ఉంది.

                                           *    *    *    *

    ఖాకీరంగు జీపు ఊళ్ళో ప్రవేశించింది. అది పులిలా గర్జిస్తూ ప్రవేశించినప్పటికీ పులికి ఉన్న అందంలో సగం కూడా లేదు దానికి. అది పట్నంనుంచి "సాహెబ్"ను తెచ్చింది- అర్జంటు పనిమీద డప్పుల ఛోటూ డప్పు చాటించాడు - పవిత్రమైన సాలవనంలో మీటింగు జరుగుతుందనీ ఊళ్ళో వాళ్ళంతా రావాలనిన్నీ. జనం గుంపులు గుంపులుగా చేరారక్కడికి. ఎంచాతంటే, ఆ వార్త దావానలంలా వ్యాపించింది - అశ్రు పూర్ణమైన ప్రమాదం వాటిల్లింది దేశానికి. జిత్తులమారి పగవాడు మన సరిహద్దు దాటి వచ్చాడు. ఇదీ వార్త. సభ అందును గూర్చేననిన్నీ తెలిసింది వారికి. మన జవాన్లమీద అమాంతంగా దాడి జరిగిందనీ, అయినా, వారు శౌర్య ప్రతాపాల్తో పోరాటం సలుపుతూ మన మాతృభూమి గౌరవాన్ని కాపాడ్డానికిగాను తమ ప్రాణాల్ను పణంగా అర్పిస్తున్నారనిన్నీ విన్నారు వారు. గుండె మండింది వారికి. కోపోద్రిక్తులై సాలవనానికి తరలి వచ్చారు. వ్రుద్ధుల్ను యువకులూ, వికలాంగుల్ను పూర్ణాంగులూ తీసుకొని వచ్చారు. తలబిరుసు పూజార్లు, అమాయకులైన ఫాదరీలూ, హరిజనులూ కులీనులూ ఒకరి సరసన ఒకరు కూర్చున్నారు. యువతులు చంకల్లో పాపల్తో చీరకొంగులు సర్దుకుంటూ వచ్చారక్కడికి. కులాసా రాయుళ్లు కూడా వచ్చేశారు. ఇంతెందుకూ, వారి నాయకుడూ, మెర్రీ భర్తా, జూలియస్ ఆగస్టన్ కూడా వచ్చాడని చెపుతే సరిపోతుంది.
    పట్నం నుంచి వచ్చిన అధికార్లు శత్రువును గురించి మాట్లాడారు. ప్రధాని సందేశం వినిపించారు. కొందరికి అది అర్థం కాలేదు. కొందరు స్త్రీలు భయపడి, తమ బిడ్డల్ని రొమ్ముకు హత్తుకొని, ఆతురతగా తమ భర్తల్ను చూచారు. అయినా, వారందరి గుండెల్లోనూ "ఏదో" మొలకెత్తింది. ఆ "ఏదో" పేరులేదుకాని వారు "జైహింద్" నినాదాలు చేసినప్పుడు కోపోద్రిక్తతా, హార్దికానురాగమూ వ్యక్తమైనాయి.
    నేలమీద కూర్చుని విన్నారు. లాంతర్ల వెలుగుకు వారి ముఖాల మీద ప్రాచీన పౌరుషం స్పష్టంగా కనిపిస్తూంది. వందల సంవత్సరాలుగా నిద్రిస్తున్న పూర్వీకుల శౌర్యపూరితమై, మృత్యువును జయించగల సాహస కణాలుగల రక్తం వారి నరాల్లో ప్రవహిస్తుంది. తక్షణావసరాల్ను గురించి వారు విన్నారు. పొలాల్లో అధికోత్పత్తి, హోంగార్డులో చేరడం, డబ్బు, బంగారం కావాలి. శత్రువును వెనక్కు నెట్టడానికి మనుషులు కావాలంటే ఊరి కుర్రకారంతా ముందంజ వేసింది. పంటలు ఎక్కువ పండించాలన్నప్పుడు రైతులు తమ నిశ్చయం వ్యక్తపరుస్తూ తలలూపి వాగ్దానం చేశారు. నర్సులు కావాలన్నప్పుడు ఊళ్ళో ఉన్న మెట్రిక్యులేషన్ పాసైన ముగ్గురమ్మాయిలూ చేతులెత్తారు. డబ్బు అడిగినప్పుడు చమటోడ్చి సంపాదించిన నాణేలూ, నోట్లూ, ఇచ్చేశారు-దప్పిగొన్న తమ సోదరునికి దాహం తీర్చినంతటి సంతోషంతో. కాని, బంగారం? అందుకు లజ్జావనత వదనాల గుసగుసలే జవాబైనాయి. బంగారం బోలెడుంది ఊళ్ళో. అనేక సంవత్సరాలు పొదుపుచేసి కూడ బెట్టిందది. అదంటే ఆడవారు పడిచస్తారు.
    అధికారి మళ్ళీ అన్నాడు: "అన్నిటికంటే, ముఖ్యంగా బంగారమే కావాలి దేశానికి. సరిహద్దుమీద పోరాడే మన వీర సైనికుల గుండెల్లో ధైర్య సాహసాలేమీ తక్కువ లేవు. వారిని చీమల్లానూ, ఈగల్లానూ చావనిద్దామా? వారికి తుపాకులందించలేమా? ఆ తుపాకుల కోసమే బంగారం కావాలి. అది మన స్త్రీల దగ్గర ఉన్నది. దేశంలోని అన్ని ప్రాంతాల స్త్రీలూ తమ మాతృభూమి పాదాలమీద బంగారు వర్షం కురిపించి సాయపడ్డారు. అయినా, మనకింకా కావాలి. ప్రతి ఒక్కరి నుంచి కావాలి. మీ నుంచి కావాలి. మాతృదేశ రక్షణ కోసం కావాలి."
    ఆ వూరి పడతులేం పిరికివారు కారు ప్రకృతి చాలా గడుసుకన్నె. జీవితమంతా ప్రాకృతిక బంధాల్తో పోరాడాల్సివుంది వారికి. వారు మూర్ఖులూ కారు. చాలామందికి స్కూలు చదువు లేకపోయినప్పటికీ అంతా కొంత నేర్చినవారే. హాట్ డే" (hat-day) నాడు సరుకులు కొనడానికి వచ్చే గ్రాహకుల నుంచి తమకు రావలసిన డబ్బు లెక్కకట్టి రాబట్టగలవారే. మొత్తంమీద అంతా నిరాడంబరులు, బిడ్డను కన్నప్పుడూ, కోతలు జరిగినప్పుడూ, తమకున్న ఒకే ఒక బావినుంచి నీరు తోడుకున్నప్పుడూ ఆనందంతో పొంగిపోతారు. ఆవులు ఈనినప్పుడూ, గ్రామంలో పండుగ జరుపుకున్నప్పుడూ ఆనందాతిరేకంతో నృత్యం చేస్తారు. పాటలు పాడతారు. అయితే, వారు బంగారం మాత్రం వదలరు!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.