Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                                             బంగారు దిద్దులు

    జూలియస్ ఆగస్టన్ బాగా తాగి ఉన్నాడనీ, నాక్కనిపించాడనీ చెప్పారు. అదెవర్నీ ఆశ్చర్యపరచలేదు. ఎంచాతంటే జూలియస్ చిన్నతనంనుంచే తాగుడు నేర్చుకున్నాడు. అతనికదో ఉల్లాసం. మైకపు ముసుగులో దాక్కోవడం అతనికి బాగా అలవాటే. జూలియస్ పూర్వికులు రోమన్లేమీకారు. అయినా, సాహసకార్యాలంటే పొంగిపోయేవారు. బాణం పట్టడంలోనూ, కొట్టడంలోనూ నేర్పుగలవారు. బల్లెం విసరడంలోనూ అంతే. పెద్ద పెద్ద రాళ్ళు దొర్లిస్తుండేవారు. అయితే, యుద్ధంలో శత్రువును జయించడానిక్కాదు వారివన్నీ చేసేది - యుద్ధం చేయని శత్రువుమీద వారి ప్రయోగం. అయితే, ధనుర్బాణాల విషయంలో ఆసక్తి జూలియస్ కేమీ సంక్రమించలేదు. అప్పుడే అతని భార్య మడుగునుంచి బక్కచిక్కిన గేదెను తోలుకొచ్చింది. ఆవిడ అతని రెండో భార్య. మేరీ అని పేరు పెట్టడం మూలాన "కళాపూర్ణ" అని ఎవరూ పిలువరావిణ్ణి. 'మేరీ' అనేదాన్ని "మెర్రీ" అని పలుకుతారు జనం. మెర్రి జన్మతః సంతోషి. ఇప్పుడామె దేహం నున్నగానూ, నల్లగానూ, ఆరోగ్యంగాను ఉంది. చెమట పట్టనప్పుడు ఆవిడ అందాన్ని చూస్తే నల్లకలువ గుర్తుకు వస్తుందనుకోండి. నాలుగున్నర గజాల నేతచీర సమ విభక్తమైన ఆమె దేహాన్నంతా చుట్టినప్పటికీ బలిష్టమైన ఒక బాహువును నగ్నంగా వదిలేసింది. ఒకప్పుడు ఆ చీర తెల్లగానే ఉండేది. ఆవిడ చేతులు కూడా బోసిగానే ఉన్నాయి. ఆవిడ చేతులకు మందపు ఎర్రని గాజులుండేవి. కొండల్లో తప్పిపోయిన దూడను పట్టుకొచ్చేప్పుడు అవికాస్తా చిట్లిపోయినాయి. ఆనాడు సోమవారం. ఆవిడ భర్త జూలియస్ తాగి పడివున్నాడు. ఎంచాతంటే పాద్రీటిగా అంటే అతనికి గౌరవం. అందువల్ల అతడు ఆదివారాలు తాగేవాడుగాదు.
    అలవాటులేని నా కండ్లకు గూడా ఆవిడ బోసిగా కనిపిస్తూంది. ఆవిడ చెవులు అలా కనిపించేట్టు చేస్తున్నాయి. మినీ ఆవిడ రెండు చెవులకు రంధ్రాలు చేసింది. మినీ మా ఊరి మంత్రగత్తె, ఆ రంధ్రాల్లో అందమైన తెల్లని రెండు బెండ్లు కనిపిస్తుండేవి. వాటి ఒరిపిడికి చెవులకు పెద్ద రంధ్రాలై పోయినాయి. అవి చూచినప్పుడల్లా మినీని తిట్టేవాణ్ణి నేను. గిటిలిపి గ్రామానికి మెర్రీ అలంకార ప్రాయంగా ఉండడం నాకూ గర్వకారణమే. ఎంచాతంటే, పదిహేడు సంవత్సరాల క్రితం ఆవిడ తల్లి సుఖప్రసవానికి సాయపడ్డాన్నేను. ఆ విధంగా మెర్రీ భూమ్మీద జన్మించడానికి కారణం నేను. కొత్తగా విధవ అయిన తల్లి, తన కూతురు తప్పక జీవించాలి అని దృఢనిశ్చయం చేసుకుంది. అందుకే భౌతికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా గ్రామ రక్షణ చేసేవారందర్నీ మంచి చేసుకుంది. నేనన్నా, మంత్రకత్తె అన్నా, ఫాదరీ అన్నా ఆమెకు ఎనలేని అభిమానం. ఆవును పెట్టుకొనేంత ధనవంతురాలు కాదావిడ. నా వాటా మేక పాలూ, వెదురు బుట్టలో మంచి బిందువుల్లాంటి ఊస బియ్యమూ ఆవిడ దగ్గరనుంచి ముట్టుతూండేవి. అప్పుడప్పుడు తేలుకాటుకు పనికివచ్చే నల్లనిరాయి కూడా ఇస్తూ ఉండేది.
    ఏదో సామెత చెప్పినట్లు-శుక్ల పక్షచంద్రునిలా-పెరిగింది మెర్రీ. కాని, మెర్రీని పొగుడుతే తల్లి రెచ్చిపోయేది. "అయ్యో, డాక్టర్ గారూ! మురికిపాతలాగుండే ఈ అమ్మాయి ఎవరిక్కావాలండీ?" అనేది ఏదో నిర్లక్ష్యంగా. ఆ మాటలు ఆవిడ గొంతెత్తి పెద్దగా అరచేది. తన అరుపు దేవతలు విని తన కూతురుమీద చెడు కన్ను వేయకుండా ఉండాలని ఆవిడ ఉద్దేశం. దేవతలు మెర్రీ విషయంలో దుష్టంగా ప్రవర్తించకపోవడమేకాక, సౌమ్యంగానూ ప్రవర్తించారు. ఆమెకి అంటువ్యాధులు, మశూచి, కలరా అంటలేదు. పొడుగ్గానూ, సౌష్టవంగానూ పెరిగింది. ఎండకూ, వానకూ, గాలికీ ఓర్చిన ఆమె దేహం నున్నగా పండిన నేరేడు పండులా తయారైంది. ఇంతెందుకు, ఆమె దేవాలయాల్లోని శిల్పంలా ఉండేదంటే సరిపోతుంది. చెమట పొక్కులు కలిగి, సరళవదనం గల బడిపంతులు జోసఫ్ ఉండనిచ్చినంత చిలిపిగానూ, ఆనందంగానూ ఉండేది మెర్రీ.
    జోసఫ్ కు ఆవిడంటే ఒకరకంగా ఆనందమూ, ఒకరకంగా బాధ. మట్టి పేడ కలిపివేసిన నేలపూతలోని చల్లదనాన్ని సైతం కాల్చివేసే ఎండగల ఒకనాటి పగలు మెల్లగా గునిసినట్లుగా అడిగింది, "జోసఫ్ సర్ర్! ఇంగ్లీషులో 'రిసీవ్' అంటే అర్థమేమిట"ని. జోసఫ్ 'టేక్' (తీసుకోవడం) అని అర్థం చెప్పాడు, తనకాళ్ళక్రింద తడబడపోతున్న గుంతను గ్రహించక. "అయితే ఈ ఏసుప్రభువు పదములకు అర్థం ఇప్పుడు తెలిసింది" అన్నది కనుపాపలను పైకి తిప్పి చిలిపి మెర్రీ-కన్నె మెర్రీ-స్పష్టమై అమాయకమైన ఆవిడ స్వరం నాట్యం చేసేప్పుడు పిల్లన గ్రోవి పాటలా ఉంది. "ఇప్పుడు తెలిసింది అతడేమంటాడో. తీసుకోవడం కంటే ఇవ్వడమే పుణ్యం జోసఫ్ సర్ర్" అన్నది.
    జరగబోయేదాన్ని గురించి తెల్సుకోవడం వృధా అని ఆలస్యంగా గ్రహించాడు జోసఫ్. ఏ విషయం అయినప్పటికీ కుర్రాళ్ళకే విజయం కలిగేది. "అయితే, జోసప్ సర్ర్! మాకు సగం రోజు ఆట విడుపు ఇవ్వండి. మా పాఠాలు తీసుకోవద్దు. సగం రోజు ఆటవిడుపు ఇవ్వండీ. ఏసుప్రభువు మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అనుగ్రహిస్తాడు. ప్లీజ్ సర్ర్, సర్ర్, కుర్రాళ్ళం మేం కాకుంటే నాట్లు వేయడానికి ఎవరు సహాయం చేస్తారు?" పిచ్చుకలు గింజల కోసంలా కుర్రాళ్ళంతా ముక్తకంఠంతో అడిగారు. జోసఫ్ స్వయంగా పేదరైతు, కుర్రాళ్ళ కోర్కెను అంగీకరించక తప్పేదికాదు. ఆవిడ ఎగురుతూ, గంతులేస్తూ పాఠశాల గది వదలి పరిగెత్తుతే, కుర్రాళ్ళంతా రెప్పలల్లార్చుకుంటూ ఆవిడను అనుసరించారు. వెళ్ళిపోయేప్పుడు "ఏసుప్రభువా! చాలా మంచి విషయాలు చెప్పావు" అని కేకలు వేశారు. "ఏ అమ్మాయి 'జేసుసర్' అనకు" అనే తన కేక ఖాళీస్థలానికేననే విషయం తరువాతగాని గ్రహించలేదు జోసఫ్.

                                *    *    *    *

    మెర్రీకి జీవితంలో కోరినవన్నీ లభించాయి-కష్టపడి సంపాదించే భర్త తప్ప. తాగిన మైకంలో అంటూండేవాడు "మెర్రీ! ఆ అగ్నిద్రవాన్ని అంటను, కష్టించి పనిచేసి పంటలమ్మి నీవు కోరిన నగలన్నీ చేయిస్తాన"ని. ఒక్కసారి మాత్రం ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆవిడ బరువైన కాళ్ళ కడియాలను మార్చి, పడగెత్తిన పాములాంటి మెడగొలుసు చేయించమని అడిగింది. తళతళ మెరిసే ఆ గొలుసు అంతకు ముందెప్పుడూ అంతకంటే అందమైన గళాన్ని అలంకరించి ఉండదు. ఒకసారి స్నేహితురాలి దగ్గర దండ కడియం అరువు తీసుకొని ధరిస్తే, ఆవిడ నల్లని రతీదేవిలా కనిపించింది. చెవులు బోసిగా ఉన్నాయి. ఆ కర్ణరంధ్రాల్లో నున్నవి బెండ్లు పెట్టుకుంటే రాబోయే దిద్దుల జతకు పునాది వేస్తున్నదా అనిపించేది. ఆవిడ ముంజేతికున్న మందారపు ఎరుపు గాజులు ఆమె శరీరంలో భాగంగా పరిగణించినప్పటికీ, ఆవిడ వెంట్రుకల్లా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నట్లుంటాయి. పెద్ద పండుగ "బారాదిన్" జరుపుకోవడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. అదే జేసూసర్ర్ జన్మదినోత్సవం (క్రిస్మస్).
    ఆ వారం ఆవిడ తల్లి దగ్గర్నుంచి పోస్టుకార్డు వచ్చింది. అది వారందర్నీ దిగ్భ్రాంతుల్ను చేసింది. ఎంచాతంతే, ఆ ఊళ్ళోకి పోస్టుకార్డు రావడం అంటే పర్వం. పోస్టుబంట్రోతును చాపవేసి కూర్చోపెట్టారు. తినడానికి గట్టి సున్ని ఉండలూ, త్రాగడానికి చల్లని బావినీరూ ఇచ్చారు. కార్డు చేతులూ, కళ్ళూ మారింది. కాని, ఎవరూ చదవలేకపోయారు. ఉత్తరం చిన్నదే అయినా అందులో విజయగర్వం ఉంది. ఆ ఉత్తరం మాతృప్రేమను మోసుకొని వచ్చింది. జీవితం అంతా తన కూతురు వేటికోసం తపిస్తూ వుందో అవి ఇస్తానంటున్నదా కార్డు-అదే బంగారు దిద్దుల జత!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.