Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
వారు మరీ తలమీద ఎత్తుకొని నృత్యం చేశారు.
"సేతు బంధనంలో ఉడుత పాత్ర తక్కువైందేమీ కాదు, తారాదా!".
గుంపు చివర్నున్న గడ్డపుమనిషి, సాధూచరణ్, జనమంతా విడిపోయేదాకా ఉండి రుద్ధ కంఠంతో అన్నాడు- "తారాబాబా! ఇంటికి నడువ్వు" అని.
తారాచరణ్ తలవంచి ఒంటిచేత్తో పాదరేణువు తీసుకొని "ఎందుకలా అంటారు? ఇంటిక్కాకుంటే ఎక్కడ కొచ్చినట్లు? ఆస్పత్రి నుండి విడుదల కాగానే వచ్చేశాను" అన్నాడు.
సాధూచరణ్ మందస్వరంతో "ఏమో! పెద్దవాడవయ్యావు? ఆ చిన్న ఇంట్లో ఉండగల్దువా అని భయం" అన్నాడు.
"హుఁ, నాన్నా! ఏమిటంటున్నారు? అవిటినై మీ అన్నం ధ్వంసం చేయడానికేగా వచ్చింది?"
సాధూచరణ్ నేత్రద్వయం నుంచి అశ్రుకణాలు దొర్లాయి.
"అన్నధ్వంసి!" అనే మాట అనేకసార్లన్నాడతను.
మాట మార్చడానికన్నాడు తారా, "నాన్నా నడవండి. అమ్మను చూడాలని ఆతురతగా ఉంది."
ఇంటికి చేరాడు. నవ్వుకున్నారు. ఏడ్చారు. భోజనాలయ్యాయి.
అప్పణ్ణుంచి ప్రారంభమైంది ప్రజల రాక. నిరంతరంగా వస్తున్నారు - దేవ దర్శనానికిలా - ఉదయం నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం నుంచి రాత్రివరకూ.
ఒక్క బాసంతి మాత్రం లేదు!
బాసంతి నుంచి వార్తకోసం నిరీక్షిస్తున్నాడతను. ఏమిటా వార్త? ఆవిడ తారాతో గల సంబంధాలన్నింటినీ ఛేదించేసింది. జనం మాట్లాడుకునే మాటల్ను బట్టి బాసంతి తండ్రి అమాంతగా పెద్దవాడైపోయాడని. అంగుళ్ గూలే కలాగాచ్ (వ్రేలుపొంగి అరటికాయంతైంది) అని తెలుసుకున్నాడు.
కాని, అది కాళీపురానికి సంబంధించిన వ్యవహారం కాదు, పట్నపు వ్యవహారం. పట్నంలో జనం రేయింబవళ్ళు ధనికులౌతూనే ఉంటారు. అయితే, బాసంతి తండ్రి? ఆ పేదవాడు? అతనికో చిన్న తేయాకు దుకాణం మాత్రం ఉండేది. అదీ "లూజీ" టీ అమ్మేది. ఎక్కడెక్కణ్ణుంచో కొని తెచ్చేవాడతను. బేడా, పావలా లాభానికి అమ్మేవాడు. దాంతో గ్రాసాచ్ఛాదనాలు గడిచేవి.
అమాంతంగా ఎలా.....? ఆశ్చర్యమే!
* * * *
రాత్రయింది. శిష్యులంతా "గప్పాలు" కొడ్తున్నారు. తారాచరణుణ్ణి వదలబుద్ధి కావడం లేదు వారికి. ముందే వారందరికీ హీరో, తారా. ఇప్పుడో? వీరుడైవచ్చాడు.
వారంతా ముక్త కంఠంతో ఘోషించారు: "తారాదా! కాలీపురపు చేయి ఒకటిపోతేనేం, ఇవిగో మరో వంద చేతులున్నాయి. నువ్వు చెప్పు- అంతే. ఎక్కడికి వెళ్తే.... ఏం చేస్తే.... ....?"
ఈలోగా అన్నాడు అమాంతంగా ఒకడు: "అరే, ఏం, రేయి ముగుస్తున్నది. పన్నెండైంది. ఎంత స్వార్థపరులం మనం?
"తారాదా నేమైనా చెప్పనిచ్చామా? అక్కడ వదిన..........."
"వదిన!"
తారాచరణ్ ఉలిక్కిపడ్డాడు. "ఎవరు? ఎవరి కథ చెపుతున్నారు?" అడిగాడు.
"వదిన. బాసంతి వదిన కథ." ఆవిడ పాపం చూణ్ణైనా చూడలేదు.
తారాచరణ్ గొంతు తగ్గించి అడిగాడు - "ఆవిడా వచ్చిందా?" అని.
"అరే! వచ్చిందా ఏమిటీ? ఇక్కడే ఉంటేనూ చాలా రోజుల్నుంచి! విననేలేదా?"
తారాచరణ్ తల ఊపాడు వినలేదన్నట్లుగా.
అది అద్భుతమైన వార్త.
ఏ కోశానా ఆశలేకుండింది. సీతాకోక చిలుక రెక్కల్లా, గుండెలో ఏదో మూలనున్న, పిసరంత ఆశ కూడా ఎగిరిపోయింది - బాసంతి. తండ్రి గొప్పవాడైపోయాడనే కబురువిని. హఠాత్సంఘటన. బాసంతి ఇక్కడుంది.
కూతురుకు పెట్టాల్సిన పిడికెడన్నం మిగుల్చుకొని ధనవంతుడైనాడా? ధనవంతుడైం తర్వాత పిడికెడన్నం పెట్టడానికి గుండె పట్టుకుందా?
తారాచరణ్ ముఖంలో క్వశ్చన్ మార్కుల్ను చూచి శలవు పుచ్చుకున్నారు. రోసన్ బుడ్డివత్తి తగ్గించి పడుకున్నాడు తారా. అలసి ఉన్నాడు. మిత్రుల సమాదరం, ఆవేదం, ఆనందం - వీటిభారం మాత్రమేం తక్కువా? కాని, బాసంతి....? ఇంట్లో ఉంటే రోజంతా ఎందుక్కనిపించలేదు! బిడియమా? గర్వమా? విధిలేకనా?
తారాకు నిద్రపట్టిందీ?
అయితే, అంత హఠాత్తుగా ఎలా మేల్కొంటాడు కాళ్ళకు కామినీ కరస్సర్శతగిలి, ఈ స్పర్శతో తన భావం ప్రకటించిందా బాసంతి? తారాచరణ్ లేచి కూర్చున్నాడు. దగ్గరికిలాక్కొని అడిగాడు "బాసంతీ....నీవా?"
"అవును నేనే!" రుద్దకంఠంతో "అదుపు లేని, అసభ్యమైన, మూర్ఖమైన మీ ఆ భార్యనే" అన్నది.
చదువు గురించి తారాచరణ్ ఎన్నడూ పట్టించుకోలేదు. వలపు కథలు చదవడం అతనికి తెలియనే తెలియదు. అయినా, కథానాయకునిలా అన్నాడు బాసంతీ! "రెండు చేతులున్నప్పుడు నిలుపులేకపోయాను. ఒంటి చేయి ఉన్నప్పుడు నిన్ను నీవు అర్పించుకోవడానికి వచ్చావు!"
బాసంతి సైతం చక్కని ప్రత్త్యురమిచ్చింది.
రెండు చేతుల్తోనూ అతని ఒంటి చేతిని పట్టుకొని "అర్పణ చేతులకా జరిగేది?" అడిగింది.
కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి - అర్పణను అనుభవిస్తున్నారా అన్నట్లు.
బాగా ఆలోచించి మెల్లగా అన్నాడు: "పగలంతా వృధా పుచ్చావ్, ఎక్కడున్నావ్?"
బాసంతి గొంతు సవరించుకొని, మాట పెగిలించుకొని "జనానికి రికాబుల్లో మిఠాయి ఉంచుతూ, మీ తల్లి అదృష్టానికి ఈర్ష్య చెందుతున్నాను. నాకా అదృష్టం కలుగుతుందా ఏనాటికైనా?" అన్నది.
తారాచరణ్ బరువు గొంతుతో "నేను మూర్ఖుణ్ణి బాసంతీ! నీకు బోధించడం కూడా రాదు. అయినా చెపుతున్నా 'రత్నాలకూ, ముత్యాలకూ వలె దేశానికి అప్రమత్తమైన కాపలా అవసరం. అది తప్పనిసరి. ఈ యుద్ధం అంతమయ్యేది కాదు. కాని, చాలా దుఃఖం కలుగుతుంది బాసంతీ! దేశం మొత్తంలోనూ విశ్వాసఘాతుక దళాలున్నాయి. దేశ శత్రు దళాలున్నాయి. తుచ్ఛమైన రెండు రూకలకోసం దేశవాసుల్ని నాశనం చేస్తున్నారు. దేశపు అమృతాన్ని హాలాహలంతో మిశ్రితం చేస్తున్నారు. అందును గురించి ఆలోచించినప్పుడు-" అన్నాడు అర్థోకిగా..
కష్టంగా నిగ్రహించుకొన్నాడు తారాచరణ్.
బాసంతి గర్జించింది.
ఆమె తీవ్రస్వరంతో అన్నది: "పోయింది ఒకే చేయి. ఇంకో చేయి ఉందికదా! దాంతో ఆ దేశద్రోహుల చేతుల్ను ముడిచి ముడిచి విరిచెయ్యలేరు?"
తారాచరణు డొక్క గట్టి నిశ్వాసం విడిచాడు. "నాకు రేయింబవళ్ళు అదే ఆలోచన బాసంతీ! బయటి శత్రువుకంటే ఇంటి శత్రువే భయంకరమైనవాడు. కాని, వాళ్ళను తెలుసుకోవడం కష్టం.... ....".
బాసంతి ఒకరకపు తీక్షణస్వరంతో అన్నది: "ఒక్కణ్ణి నేనెరుగదును. 13/1 మదన్ మిస్త్రీలేన్......".
"ఏమి?.... .... ఏమిటన్నావ్?"
చకితుడై, వణికిపోయాడు తారా.
బాసంతి స్థిరస్వరంతో అన్నది: "సరిగ్గానే చెప్పాను. దేశం కోసం పోరాడే వారి ఆహారాన్ని దాచుకునేవాని చేతిని మడిచి విరిచివస్తే వానికే ఉపకారం చేసినట్లౌతుంది."
"ఎలా....ఎలా జరిగింది బాసంతీ!" మెల్లగా అడిగాడు తారాచరణ్.
"మిలిటరీ కంట్రాక్టుతో మా నాన్నకు "చాయ్' సరఫరా చేసే టోకు వ్యాపారికి మిలిటరీ కంట్రాక్టు దొరికింది. వాని ముఠాలో మా నాన్నను చేర్చుకున్నాడు. అయిదు పౌన్ల చాయ్ లో రెండు పౌన్ల గడ్డినుసి, చర్మపు పొడి, బజారు దుమ్ము....! ఆ తండ్రి కూతుర్ను నేను. అసహ్యంతో నన్ను తాకుతాడో లేదో!" ఆ వేగంతో అని మౌనం దాల్చింది బాసంతి.
గాఢ ప్రేమతో దగ్గరికి లాక్కొని, అన్నాడు: "అర్పణ చేతులకా జరిగేది అన్నావు కదూ బాసంతీ? నేనూ అదే అప్పగిస్తున్నాను. బైట చేయి విరక్కొట్టుకుంటే, ఇంట్లో విరక్కొట్టుకున్నట్లు కాదు. అలా చేయాల్సింది మీ స్త్రీలు. మీరు మందబుద్ధిని విడిచేయాలి. అలా చేసేవారు మీ తండ్రైనా, కొడుకైనా, భర్త అయినా, సోదరుడైనా వదిలివేయాలి. అప్పుడు వారి చేతులు త్రిప్పి విరిచినట్లవుతుంది. అప్పుడే 'పాపచక్రం' పనికిరాకుండా పోతుంది."
బాసంతి అవజ్ఞతో అన్నది: "ఊఁ- మేమూ మనుషులమే! ఈ చరాచర జగత్తంతా మాతోనే నడుస్తూంది!!"
తారాచరణ్ దృఢంగా అన్నాడు: "అలా అనుకోవడం తప్పు. లోకంలోని మనుషులందరికీ ఆధారం మీరే- కాదా? పురుషుల మనసులనే ఇండ్లకు తాళం చెవులు మీరు. తాళం చెవి సరిగ్గా లేకుంటే పనిచేయదు. అది సరిగా పనిచేస్తే వారి మనసు నిర్మలమౌతుంది.
వారు దారికి వస్తారు."
* * * *





