Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
సామ్రాజ్యవాదుల కుట్ర ఫలితంగా భారతదేశం చీలింది. పాకిస్తాన్ ఏర్పడింది. మౌంట్ బాటన్ అసమర్థతవల్ల చీలినదేశంలో రక్తం నదులయి ప్రవహించింది.
సామ్రాజ్యవాదుల మరో కుట్ర ఫలించి ఉంటే దేశం మూడు కాదు - వందల ముక్కలు కావలసింది. భారతదేశంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి సుమారు 500పై సంఖ్యగల సంస్థానాలను అర - పావు స్వతంత్రంగా ఉంచారు. ఇంగ్లీషు వారు వెళ్లిపోతూ ఆ సంస్థానాధీశులందరికీ స్వాతంత్ర్యం ఇచ్చారు. వారు భారత్ లో కాని - పాక్ లోగాని చేరవచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు.
ఇది ముఖ్యంగా నిజాం రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నిన పన్నాగం. అటు పాకిస్తాను - ఇటు నడిబొడ్డు హైదరాబాదు రాజ్యం తమ స్థావరం చేసుకోవాలని పథకం. స్థావరాలు కాకున్నా భారత ప్రభుత్వానికి బెడద కావచ్చు- సమస్య కావచ్చు - తలనొప్పి కావచ్చు. భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టడానికి చేసిన కుట్ర ఇది.
'జన్మజన్మాల బూజు' నిజాంరాజు ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు. గద్దెకు ఎక్కినా 1911 నుంచి కలలు కంటున్నాడు. ఒంటె పెదవులకోసం నక్కవలె ఎదిరిచూస్తున్నాడు. బ్రిటీషు ప్రభుత్వమూ - మహమ్మదలీ జిన్నా అందుకు ఆ 'ముసలినక్క'ను ఉసికొల్పారు.
12 జూన్ 1947న నిజాం తన సర్వతంత్ర స్వతంత్రం ప్రకటిస్తూ, ఆజాద్ హైదరాబాదు అవతరణ గురించి ఫర్మాను జారీచేశాడు. ఆజాద్ హైదరాబాద్ - అలా హజ్రత్ పాయిందాబాద్ అనే రజాకార్ల నినాదాల మధ్య చార్ మినార్ మీద ఆసఫ్జాహీ పతాకాన్ని ఎగురవేశాడు.
ఇదివరకే మనవి చేసినట్లు అర్థానికి - అధికారానికి మతాలు - కులాలు - ప్రాంతాలు - దేశాలూ ఉండవు. అర్థాన్ని - అధికారాన్నీ ఎవడూ వప్పగించడు. గుంజుకోవలసిందే. బలం శక్తి స్తోమతలు ఉంటే 500 మంది సంస్థానాధీశులూ నిజాంవలె విర్రవీగేవారే. భారత ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చతురత - రాజకీయజ్ఞత -బలప్రదర్శన వల్ల మిగతా సంస్థానాలు భారతదేశంలో లీనం అయినాయి. పాకిస్తాన్ లో ఉరితీయబడిన ప్రధాని జుల్ఫికార్ అలీ భుట్టో జన్మస్థానం 'జునాగఢ్' సంస్థానంకోసం బలప్రయోగం చేయాల్సి వచ్చింది.
అధికారానికి మతంలేదు అనటానికి కాశ్మీర్ మహారాజా 'హరిసింగ్' చక్కని ఉదాహరణ: కాశ్మీర్ లోని ప్రధాన ప్రాంతంలో ముస్లిములు అధిక సంఖ్యాకులు. రాజు హిందువు. భారతదేశం స్వతంత్రం అయింది కదా! అతనూ నిజాంవలె స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. ఆచంద్రార్కం పాలిస్తాననుకున్నాడు!
పాకిస్తాన్ మత ప్రాతిపదిక మీద ఏర్పడిందని జిన్నా ముస్లిములను నమ్మించాడు. కాశ్మీర్ లోని ముస్లిము సోదరులను విముక్తం చేయడానికి పాకిస్తాన్ కాశ్మీర్ మీద దండెత్తింది. అప్పటికీ హరిసింగ్ భారతదేశంలో చేరలేదు. భారత్ సైన్యాలు కాశ్మీరంలో దిగాయి. పాకిస్తాన్ సైనికులను తరిమాయి - ఇప్పటి అధీన రేఖ వరకు. అప్పుడుగాని హరిసింగ్ భారతదేశంలో చేరలేదు. ఆ చేరడం కూడా అనేక షరతులు పెట్టి చేరాడు. అందుకే కాశ్మీరానికి ప్రత్యేక ప్రతిపత్తి!
మహరాజా హరిసింగ్ తన అధికారాన్ని స్వచ్చందంగా వదులుకోలేదు. అటు పాకిస్తాన్ - ఇటు భారత్ వత్తిడివల్ల వదులుకున్నాడు!
నేను ఇదివరకే మనవి చేసినట్లు కాంగ్రెస్ సంస్థానాల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఉంటే ఈ రోజు కాశ్మీర్ సమస్య ఇంత జటిలం అయ్యేదికాదు. అయితే, ఆనాటి స్థితిగతులను ఈనాటి కళ్ళద్దాలతో చూడడం అర్థం లేనిది! అప్పటి కాంగ్రెస్ కు రెండు పోరాటాలు సాధ్యం కాలేదేమో! లేదా 500 మంది సంస్థానాధీశులను శత్రువులను చేసికొనదలచలేదేమో! బ్రిటిషు ప్రభుత్వం సంస్థానాధీశులకు స్వాతంత్ర్యం ఇస్తారని ఊహించలేదేమో!
అది కాంగ్రెస్ బలహీనత మాత్రం అగును.
నిజాం నవాబు తన గద్దెను కాపాడుకోదలచాడు. ఒక రాజ్యం సాధించడానికి జిన్నా మతాన్ని ఆశ్రయించాడు. ఉన్న రాజ్యాన్ని రక్షించుకోవడానికి నిజాం నవాబ్ మతాన్ని ఆశ్రయించాడు. అతడు ఇదివరకే అవలంబించిన "అనల్ మలిక్" సిద్ధాంతానికి మరిన్ని మెరుగులు దిద్దాడు.
భారతదేశం వత్తిడి తెస్తే పాకిస్తాన్ లో చేర్తానని బెదిరించాడు. భారతదేశపు నడిబొడ్డున దక్షిణ పాకిస్తాన్ ఏర్పరుస్తానని బుకాయించాడు. ఇవన్నీ వట్టి బెదిరింపులే! అతడు పాకిస్తాన్ పెత్తనం కూడా సహించడు!
నిజాం నవాబు - బహదూర్ ఖాన్ నాయకత్వంలో - పచ్చి ముస్లిం 'మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్' స్థాపించాడు. బహదూర్ ఖాన్ అల్లాను చేరుకున్నాడు. నిజాం - ఖాసిం రజ్వీని పట్టాడు. ఖాసిం రజ్వీకి బహదూర్ ఖానులోని హుందాతనం లేదు. రజ్వీ క్రూరుడు. నీచుడు. మతదురహంకారి. బహదూర్ ఖాన్ ను మించిన వక్త. అతని ఉపన్యాస ధోరణి - తీవ్రత - భాషాప్రయోగం అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. అతని సభలకు వేలమంది వచ్చి గంటల తరబడి వినేవారు. 'అయిసా సన్నాటా ఛాజాయెకె మేరీ ఆవాజ్ చార్మినార్ సే కింగ్ కోఠీ పహఁచే' - నా ధ్వని చార్ మినార్ నుంచి కింగ్ కోఠీ చేరేంత నిశ్శబ్దం ఆవరించాలి అనేవాడు. "సన్నాటా"కు నిశ్శబ్దంకన్న పదంలేదు. "లాల్ ఖిలేపర్ అసఫ్జుహీజండా లహెరాయ్ గా ఔర్ హమారీ తల్వారేఁ మభీబందర్ కే ఖాలీజె బంగాల్ మెఁ ధోయెంగె" - లాల్ ఖిలామీద ఆసిఫ్జాహీ పతాకం రెపరెపలాడుతుంది. మన కరవాలాలు బందరు బంగాళాఖాతంలో కడుగుతాం!
రజ్వీ ఉపన్యాసాలు సమ్మోహనాలు. అవి నిప్పులు చేరుగుతాయి. రక్తం మండిస్తాయి - హరిస్తాయి. మతాన్ని మసి చేస్తాయి. మనిషిని రక్కసిని చేస్తాయి.
యూనియన్ ప్రాంతానికి వలస పోయినపుడు కూడా రజ్వీ ఉపన్యాసాలు ఉర్దూలో చదవడానికి 'రహన్మా-ఏ-దక్కన్" దినపత్రిక తెప్పించుకునేవాణ్ణి!
నిజాం నవాబు -రజ్వీని 'త్వమేవ శరణంమమ' అన్నాడు. "అన్యథా శరణం నాస్తి" అన్నాడు. అనధికారికంగా అధికారం రజ్వీ హస్తగతం చేశాడు.
అసలే మతపిచ్చి. అందునా అధికారం తాగాడు. పైగా ఆయుధం చేతికి వచ్చింది. రజ్వీ సుమారు లక్షమండి - రక్తపిపాసువులు - మతదురహంకారులూ - అన్యమతద్వేషులూ అయిన 'రజాకార్' సేనను సిద్ధం చేశాడు. వారు పురాణాల్లో రాక్షసుల్లా స్వైర విహారం చేశారు. మిర్జాఇస్మాయిల్ తరువాత ప్రధాని అయిన చిత్తారే నవాబ్ మీసాలు పట్టుకొని నోట్లో ఉమ్మేసటంతటి సాహసం చేశారు. నిజాం ప్రధానిని మార్చుకున్నాడు. కాని, రజ్వీని పల్లెత్తి మాట అనలేదు. లాయకలీని తెచ్చుకున్నాడు.
నిజాం నవాబు రజ్వీని రాజ్యంమీద వదిలి ఊరుకోలేదు. భారతదేశంలో మత కలహ బాధితులను వేనవేలుగా రప్పించాడు. 'పనాహ్ గజీర్' - శరణార్థులు అని వారికి పేరు పెట్టాడు. వారికి ఆశ్రయం ఇచ్చాడు. తాను ఇస్లాంమత రక్షకుడను అని చాటుకున్నాడు.
పనాహ్ గజీర్ కు చెంది ఒక వింత సంఘటన జరిగింది. శరణార్థులు ఫుట్ పాత్ లమీద ఉండేవారు. వంటలు సంసారాలు అన్నీ అక్కడే. ఫుట్ పాతుల మీదనే దుకాణాలు పెట్టుకునేవారు. చిన్న చిన్న హోటళ్లు కూడా వెలిశాయి. వాళ్లు కారుచవకగా - అర్థరూపాయీకి అనుకుంటా - ప్లేటు బిర్యానీ అమ్మారు. హైదరాబాదు జనం సాంతం ఎగబడ్డారు. ఇంత చవకగా ఎలా సాధ్యం అని ఎవడూ ఆలోచించలేదు. కొందరు వంటలే చేసుకోలేదు. ఇలా కొంతకాలం సాగింది.
రజకులు - చాకళ్లు - తమ గాడిదలు కనిపించడం లేదని వెతకసాగారు. తుదకు పోలీసువారికి మొరపెట్టుకున్నారు. రక్షక భటులు రంగమున దిగినారు. అన్వేషణము సాగించినారు. వారికి గార్ధభముల ఎముకలు చర్మములు లభించినవి. వానిని చూచినారు. రక్షక భటులే కల్లోలితులు అయినారు. మరింత పరిశోధించినారు. అప్పుడు తేలినదేమనగా - శరణార్థులు గార్ధభములను వధించి కూడు చేసి అమ్ముచున్నారని! తెల్లవారి ఉర్దూ పత్రికలలో వార్త -
"గధేకీ బిర్యానీ - ధోబియోఁకీ పరేషానీ" - గాడిదల బిర్యానీ - రజకుల పరేషానీ!
"తస్మాధ్యుధ్వస్వ భారత్":
1947లో స్టేట్ కాంగ్రెస్ ప్రథమ మహాసభలు జరిగాయి. స్వామి రామానంద తీర్థ అధ్యక్షత వహించారు. స్వామీజీ - వారి వర్గము ప్రగతి భావాలు కలది. నిరంతరం చేస్తూ ఉండిన - బాధ్యతాయుత ప్రభుత్వం అనే నినాదం నుంచి ముందడుగు వేసింది. నిజాం రాజ్యం భారతదేశంలో లీనమై పోవాలనే తీర్మానం చేయడం జరిగింది.
తీర్మానాన్ని బూర్గుల రామకృష్ణరావుగారు ప్రతిపాదించారు. తీర్మానంలో వాడిన పదజాలం విషయంలో తీవ్రమైన చర్చ జరిగింది. భాష సౌమ్యంగా ఉండాలని బూర్గుల వర్గం వాదించింది. ఆనాటి పరిస్థితులు, ప్రజల ఆవేశ కావేశములను దృష్టిలో ఉంచుకొని భాష తీవ్రంగా ఉండాలని స్వామీజీ వర్గం అభిప్రాయపడింది. స్వామీజీ వర్గం కోరిన పదజాలంతోనే తీర్మానం ఆమోదించబడింది.





