Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
స్ఫులింగం
దు. అది ఆకాశవాణిద్వారా దిగంతాల్లోకి ప్రసారం చేయబడలేదు. వార్తా పత్రికల ఉదయ సంచికల్లో ప్రకటించబడలేదు. ఊళ్ళో వాళ్ళెవరూ డప్పులు వాయించి చాటించనూ లేదు.
అయినా, ఆ వార్త కాళీపురంలోని ప్రతి ఇంటికీ క్షణంలో పాకింది. కాళీపురం పాతకాలపు పల్లె ఏమీకాదు. కొత్తకాలపు బస్తీగా మారిందిప్పుడు. పూర్వంలా ప్రతి చిన్న వార్తకూ ఉత్తేజితులు కారీనాటి జనం. సాధూచరణ్ తండ్రి కాలంలోనైతే ఎవడైనా రైలెక్కాడూ అంటే అదొక ప్రముఖ వార్త అయిపోయేదా ఊరికి.
తండ్రికాలంలోనే యువకుడైన సాధూచరణ్ పట్నం వెళ్ళి సినీమా చూసివస్తే ఆ విషయమే ఒక నెలదాకా మసిలిందా ఊళ్ళో - ప్రతి ఇంట్లోనూ.
కాని, ఇప్పుడలా లేదు.
ఇప్పుడు ఒకనిమాట ఒకడు వినడు. ఒకని విషయం మరొకనికి పట్టీలేదు - ఆసక్తీలేదు. మానవునికి మానవ సంపర్కం అంటేనే ఉదాసీనత ఏర్పడింది. అనుభూతికి ఉండిన పూర్వపు పదను మొక్కవోయి, నేడది మొద్దుబారింది.
పొరుగింట్లో చావు ఏడ్పులు విన్నా నిర్లిప్తచిత్తుడుగానే ఉంటున్నాడు నేటి మనిషి. అతడు పీనుగు ఉన్న ఇంటిని నిర్లిప్తంగా దాటి, స్టేషను దగ్గర కొత్తగా నిర్మించిన "టాకీ"కి వెళ్ళి సినీమా చూస్తున్నాడు.
ఈ పరిస్థితి కాళీపురంలోనే కాదు - అన్ని పురాల్లోనూ అంతే. బహుశః సర్వేసర్వత్రా ఇదే ఉదాసీనత ప్రబలిందేమో! వైకుంఠపురంలో కూడా పరిస్థితి ఇల్లాగే ఉన్నట్లుంది. స్వయంగా శ్రీమన్నారాయణుని అనుభూతి సైతం మొక్కవోయి మొద్దుబారినట్లుంది. లోకంలో జరిగే ఏ సంఘటనా అతణ్ణి చలింపచేయడం లేదిప్పుడు.
అంటే, నారాయణుడు స్థాణువు అయినాడన్నమాట!
వదలండి. అవన్నీ దేవుళ్ళ కబుర్లు. అక్కడంతా అంతే. అయితే, ఇపుడు కాళీపురం సాంతం కదిలిపోతూంది.
* * * *
ఆ ఊపేసింది సాధూచరణ్ కొడుకు తారాచరణ్. ఎవరినోట విన్నా 'తారాచరణ్ వచ్చాడు.' 'తారాచరణ్ వచ్చాడు.' అన్న కబురు! ఎందుకు? అతడంత ఘనకార్యమేం చేశాడు? అతడొచ్చాడంటే ఆ ఊళ్ళో అంత హడావుడేం?
"యముడు అందర్నీ ఎత్తుకుపోతాడు కాని ఈ తారాచరణుణ్ణి ఎత్తుకుపోడే?" అని వ్యాఖ్యానించేవారు ఆ ప్రాంతపు మధుభాషిణులైన మహిళలంతా తారాచరణుణ్ణి గురించి - అతని కౌమార్యంలో.
ఇరుగు పొరుగుల విషయంలో అట్టే ఆసక్తిలేని ఆడవాళ్ళు "జగడబోతూ, తిరుగుబోతు, ఆబోతు" అనేవారు అతని విషయంలో - యవ్వనంలో.
అలాంటి వానికి పెండ్లి చేసినందుకు ఊరి వారంతా ఛీ ఛీ అన్నారు సాధూచరణుణ్ణి.
అది అంతవరకే.
బాసంతి కాపురం చేసిందీ లేదు.
కొన్ని రోజులు అత్తవారింట్లో కన్నీరు కార్చింది. కోపంతో తల్లిగారింటికి వెళ్ళిపోయింది. తండ్రి నడిగింది - "చూసి, విని నిశ్చయించొద్దూ? ఒక కోతికీ, ఒక భూతానికీ కూతురునప్పగించావు. నీ అన్నం ఎంత తింటున్నానని?" అని.
తండ్రి దిగ్ర్భాంతుడై, "ఏమైంది? అల్లుడేం చేశాడు?" అని అడిగాడు.
"భూతమేం చేస్తుందో అదే చేశాడు. చదువులేదు. ఒళ్ళువంచి పనిచేయడమూ చాతకాదు. పగలంతా పత్తా ఉండడు. రాత్రంతా ఒక దుడ్డుకర్ర తీసుకొని 'టక్ టక్' మనిపిస్తూ తిరుగుతాడు."
ఇంటిమీద మనసులేక రాత్రంతా అల్లుడు వీధుల్లో తిరుగుతాడని విని బాసంతి తల్లి నేలమీద కూలబడి అడిగింది - "ఏమి, ఏమన్నావు? అల్లుడు రాత్రంతా వీధులు తిరుగుతాడూ? పిచ్చీ గిచ్చేం లేదుకదా?" అని.
"కూతుర్నిచ్చిన, వాళ్ళకు మీకు తెలియాలి - పిచ్చివాడో, గిచ్చివాడో" గర్జించింది బాసంతి.
* * * *
పెళ్ళాం వెళ్ళిపోతే తారాచరణ్ బాధపడలేదనేంకాదు. కాని, అతని స్వభావంలో ఎలాంటి పరివర్తనా కలుగలేదు. యధారీతి ఊళ్ళోని దుడుకు కుర్రాళ్ళతో కలిసి పగలంతా పత్తాలేకుండేవాడు. రాత్రిళ్ళు దుడ్డుకర్ర "టక్ టక్" మనిపిస్తూ తిరిగేవాడు.
తల్లి తండ్రుల బలవంతంమీద అత్తవారింటికెళ్ళాడొకసారి - పెళ్ళాన్ని తెచ్చుకోవడానికి. తీవ్రంగానే అనేసింది బాసంతి - "ఉరిత్రాడు దొరక్కున్నా నీవెంట రాన"ని.
తల గోక్కుంటూ తారాచరణ్ అన్నాడు: "నీ తండ్రి పరిస్థితి చూస్తూ ఆయనకు అదనంగా మరో భారం.... ...."
"ఒహ్హో! కర్తవ్యబోధ!!" బాసంతి మరీ తీక్షణంగా అన్నది - "అది నీదగ్గరే ఉంచుకో. లేదా, మరెక్కడైనా వాడుకో. నా తండ్రి నీ తండ్రిలా తాలూక్దార్ కాకపోవచ్చు. కానీ కూతురుకు పిడికెడన్నం వేయలేని వాడేంకాదు" అని.
వెనుక ముందాడకుండా నిరాకరించింది భర్తను.
గత్యంతరం లేక కాళీపురం వచ్చేశాడు తారాచరణ్. పాతబాటనే నడిచాడు - నిరంకుశ చిత్తంతో. అతని పంథా ఎవరికీ అర్థంకాదు-కాలేదు. తల్లి "ఎలాంటివాణ్ణి కన్నానో!" అంటే, తండ్రి అన్నాడూ, "పురిట్లోనో ఉప్పుపెట్టి చంపక పోయినందుకు అనుభవించాలి కర్మఫలం" అని.
* * * *
కాలం కదిలిపోయింది.
కాలచక్రపు ఆవర్తనం అవనిలో అనేక పరిణామాలు తెచ్చింది. భారతదేశపు చరిత్రలో ఒక నూతనాధ్యాయపు పుట తిరిగింది.
సమస్త జగత్తూ విస్మయంతో స్తబ్ధమైచూసింది. నాగరకతకు పుట్టినిల్లై, మార్దవతకు ఆకరమై, విరోధభావం లేని భారతదేశపు గుండెలో మర్మస్పర్శమైన ఒక బాకు గుచ్చుకున్నది. ఆ పోటుతో రక్తం స్రవించడం మాత్రమేకాక, స్వచ్చమూ, నిర్మలమూ అయిన విశ్వాసం కళంకితమైంది - పవిత్రతా సుగంధం అపవిత్రం అయింది - వేల సంవత్సరాల మహోన్నత సంస్కృతి పంకిలం అయింది.
ఆ రక్తపాతం చూచి ఆసేతు హిమాచలం కంపించిపోయింది - నూతన రక్త తరంగడోలికల్తో.
ఆ రక్తతరంగాలకు ఈ చిన్న కాళీపురపు రక్తస్పందనంతో ఏం సంబంధం? ఎందుకు లేదూ? ఉంది. విశాలమై, గంభీరమైన మహా సముద్రానికి, తుచ్చమై, క్షుద్రమై, అనామకమైన సెలయేళ్ళతో ఉన్నలాంటి సంబంధం-సంపర్కం. మంచునిండిన హిమవదున్నత శిఖరచయం మీద హోమాగ్ని జ్వలిస్తున్నది-దహిస్తున్నది. కాళీపురం నుండి ఒక స్ఫులింగ ఎగిరి హిమవచ్చిఖరాలపై రగులుతున్న మహాగ్ని జ్వాలలో కలసిపోయింది.
ఆ స్ఫులింగం ఎప్పుడు - ఎలా - ఎందుకు ఎగిరిపోయిందో కాళీపురం ఎరుగదు. తరువాత తెలిసింది. ఆ స్ఫులింగం తిరిగి వచ్చేసింది. భస్మావశేషంగా కాక తన రుణం తీర్చుకొని తిరిగి వచ్చేసింది. అది మట్టిరుణం-అది జన్మరుణం.
కాళీపురపు ఏ వీధిలో విన్నా ఇదే కథ:-
"చూచి వస్తున్నావా?.... .... చూడబోతున్నావా?.... ....
"ఇప్పుడే వస్తున్నా.... .... ఎంత ఆశ్చర్యమైన పనులు చేశాడు!"
"రెండు చేతులా?.... .... కాదు కాదు ఒకే చెయ్యి.... ....
"ఎడమచెయ్యి.... .... ఆ తుంటరి మళ్ళీ ఒంటి చేత్తోనే యుద్ధం చేస్తానంటున్నాడు."
సాధూచరణుని కళ్ళు రెండూ కన్నీరు కార్చాయి జలజలా. రెండు చేతుల్తోనూ అందుకున్నాడు కానుకలు. తమ ప్రాణదేవతకోసం అర్పించుకున్నట్లు తమ కతిప్రియమైన వస్తువులు కానుకలుగా అర్పించుకుంటున్నారు కాళీపుర ప్రజలు.
మొదటి చెట్టు మొదటి పండు - కొత్త ఆవు మొదటి పాలు - కొత్త కోతల మొదటి ధాన్యం - సాలీలు తమ చేతుల్తో నేసిన ధోవతులు - కుమ్మరి తన నేర్పరితనమంతా కూర్చి చేసిన కూజా-
ఇవన్నీ అకస్మాత్తుగా కలిగిన ఫలితాలు కావు. చాలాకాలం నుంచి దాచిపెట్టి ఉంచినవి. సాధూచరణుని అంతర్గృహం శూన్యమైందని తెలిసిన్నాటినుంచే కాళీపురం ఇందుకు సన్నాహాలు చేస్తూంది.
అయితే తారాచరణ్?
అతడు స్తబ్ధుడై పోయాడు. చకితుడై పోయాడు. విస్మితుడై పోయాడు.
ఒక చేయి పోగొట్టుకొని తిరిగి రావాల్సి వచ్చినప్పుడు సిగ్గు, లజ్జ, బిడియము, కొంత భయమూ కలిగాయి. అవహేళన జరుగుతుందనే భయం కూడా తక్కువేం కాదు - అవహేళన - అవమానము.
అదొక లజ్జ. అదొక బిడియం.
"ఇప్పటిదాకా గాలి తిరుగుడు తిరిగావు. ఇప్పుడు చేయి పోగొట్టుకొని అవిటివై వచ్చావు-ముసలి తండ్రికొక బరువై - బ్రతుకంతా ఒళ్ళు అలవకుండా మేపాల్సిన బాంధవ్యమా?" అని సాధూచరణుడంటే?
అతడలా అనడం అసాధారణ మేమీ కాదు.
కొడుకు రెండు చేతులమీదనే ముసలి తండ్రుల ఆశలన్నీ.
సాధూచరణ్ ఆశలు అడియాసలు చేయలేదూ తారాచరణ్?
తండ్రి ఎదుటపడి, హతాశుడైన తండ్రి తిట్లు తినడానికి సిద్ధపడి వస్తున్నాడు. అతనిక్కొంత బుగులూ అయింది. అయితే అంతా తలక్రిందులైంది.
మొదట తారాచరణుణ్ణి స్టేషన్లో చూచినవాడు అతని శిష్యవర్గంలోని రాజీవ్, భయంతో వడకిపోయాడతను ముందు. తరువాత ఎగిరి గంతేసి అతని దగ్గరకెళ్ళి చేయిపట్టుకున్నాడు - అభిమానమూ గౌరవమూ వ్యక్తం చేయడానికి.
"తారాదా! ఇంత మోసమా? కలకత్తా వెళ్తున్నానని....."
తారాచరణ్ చిరునవ్వు నవ్వాడు. "ఒక చేయి ఇదివరకే పోయింది. ఇంకోటి లాగేస్తావా ఏం?" అని, "ఏం, కలకత్తా వెళ్తానని అబద్ధం చెప్పానా? కలకత్తాకు వెళ్ళలేదనా?" అన్నాడు.
"ఆగు తారాదా! పిల్లల్ను మరిపించినట్లెందుకు మరిపిస్తావ్? గోప్యంగా చేశావిదంతా, మాకేమీ తెలియనీయకుండా....."
ఇంకేవో వారి సంబంధాలనుబంధాల్ను గురించి వేల మాటలు మాట్లాడ్తూ రాజీవ్ జనంలోంచి నెట్టుకుంటూ తీసికెళ్ళాడు తారాను.
తరువాత?
తరువాత శంఖనాదాలు, ఉలూధ్వనులు, పుష్పమాలలు, కౌగిలింతలు, ఆశీర్వాదములు, అడావుడి.
తబ్బిబ్బైన తారాచరణ్ నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. "అరే భాయి! మీరేమనుకుంటున్నారు నన్ను? నన్నేం ఘనుణ్ణనుకుంటున్నారా? కర్నల్, లెఫ్టినెంట్, మేజర్ జనరల్? హుఁ- నేను ఒక ఈగను, దోమను!".





