Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఈ అమానుష హింసాకాండ 1947 మే వరకు కొనసాగింది. అయినా, ప్రజలు బలపడ్డారు. ప్రజా శత్రువులను ఎదిరించారు.
1. పాత సూర్యపేటలో దొరను, పోలీసు పటేలును చితకబాదారు. కాళ్లూ చేతులు విరిచేశారు.
2. చందుపట్లలో దొరను బండిలోంచి గుంజి బాదారు.
3. కడివెండిలో దోచుకోవడానికి వచ్చిన గుండాలను ఎదిరించారు. దేహశుద్ధి చేశారు.
4. సీతారాంపురంలో పోలీసు పటేలును హతమార్చారు.
5. రామన్నపేటలో దొరను కొట్టి చంపారు.
6. బక్కమంతుల గూడెంలో దొరను, దొరతమ్ముణ్ణి పోరాటంలో హతమార్చారు.
ఈ చైతన్యజ్వాల దొరల - పటేల్ పట్వారీల - ప్రజాద్రోహుల - గుండాల గుండెల్లో మంటలు రేపింది. వారు ప్రాణభయంతో గ్రామాలు వదిలారు. బస్తీలు పట్టారు.
గ్రామాలు మళ్లీ ప్రజలపరం అయినాయి.
గ్రామాల్లో ప్రజాద్రోహుల ఆస్తులకు రక్షణ కరువయింది. సాయుధ సైనికులు దొరల ధన - మాన - ప్రాణాలను రక్షించలేకపోయారు.
గ్రామాలలో ప్రజలకు అరుణోదయం అయింది.
బస్తీలలో దొరలకు తిరిరోదయం అయింది.
ఇరవయి ఒక్కటి
అర్ధరాత్రి అరుణోదయం:
అరవయ్యేండ్ల అనంత సంగ్రామం తరువాత భారతజాతి విముక్తిని సాధించింది.
15 ఆగష్టు 1947 భారతజాతికి వెలుగుల దినం. ఉత్సవ దినం. ఉత్సాహ దినం, పర్వదినం, పరువాల దినం.
భారతజాతికి రెండు శతాబ్దాల అంగ్రేజుల దాస్యం నుంచి విముక్తి గలిగింది. ఇది స్థూల దృష్టి. భారతజాతి ఎన్నో శతాబ్దాలుగా "స్వరాజ్యం" కోల్పోయింది. సురాజ్యమూ నష్టపోయింది.
మనం "స్వరాజ్యం" సాధించుకున్నాం. ఇక మనసు పైవాడు పాలించడు. మనమే పాలించుకుంటాం. ఇది మన దేశం. దీన్ని మనమే చక్కబరచుకుంటాం.
15 ఆగష్టు 1947 అర్దరాత్రి బ్రిటిష్ పతాకం - 'యూనియన్ జాక్' దిగిపోయింది. భారత జాతీయ పతాకం - త్రివర్ణకేతనం - సగర్వంగా ఎగిరింది. అప్పుడు నెహ్రూ అన్నారు:-
'Long ago, we made a tryst with destiny and now the time comes when we shall redeem our pledge, not wholly or in gull measure but very substantially. At the stroke of midnight hour, when the world sleeps, India will awake to life and freedom.'
1947, 15 ఆగష్టునాటి నా ఆనందం - సంతోషం - ఆవేశం - ఆతురత పదాలకు అందనివి. ఈ ఉత్సవాలు దర్శించడానికి బెజవాడ వెళ్లాలని ఆతురత. కాని, ఇక్కడి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అమ్మను, పిల్లలను వదిలి వెళ్లడం అసాధ్యం. గార్లలో కనీసం రేడియో లేదు. అప్పటికే అనేక పత్రికలను నిజాం ప్రభుత్వం నిషేధించింది. రాజ్యంలో రజాకార్లు విలయతాండవం చేస్తున్నారు.
గార్ల గ్రంథాలయంలో రహస్యంగా పదిమంది మిత్రులం కలిశాం. పేర్లు గుర్తులేవు. కాని, కొదుమూరి వేంకటేశ్వరరావు - నకిరెకంటి కృష్ణమూర్తి - చందా వీరభద్రం - మాటేటి కిషన్ రావు ఉన్నారు. పానుగంటి నాగేశ్వరరావు లేడు. అతను పార్టీ ఆదేశం మీద అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
మేము సరిగ్గా అర్థరాత్రి - తలుపులు మూసినా గ్రంథాలయంలో దీపాలు వెలిగించాం. మిఠాయిలు పంచుకున్నాం. అప్పుడు అక్కడ ఉన్న అగ్నిగుండాన్ని మరిచాం. భారతదేశం స్వాతంత్ర్యం సముపార్జించటం గురించి ఉపన్యాసాలు ఇచ్చుకున్నాం.
"లోకం నిద్రిస్తున్నప్పుడు భారతదేశం మేల్కొన్నది" అన్నాడు జవహర్ లాల్ నెహ్రూ.
భారతదేశంలో అంతర్భాగం అయిన నిజాం రాజ్యంలో మేము చీకట్ల చిందుల్లో రహస్యంగా స్వాతంత్ర్యదినం జరుపుకోవలసి వచ్చింది! భారత స్వాతంత్ర్యదినోత్సవం నాడు మేము కరకు తురక పాలనలో - ఆజాద్ హైదరాబాద్ సంస్థానంలో - ఆసప్జాహీ కామెర్ల పతాకం కింద నలుగుతున్నాం!!
సామ్రాజ్యవాదులు సాధారణంగా అధికారం వదులుకోరు. అసలు అధికారమే అలాంటిది. దాన్ని ఎవడూ వదలడు. స్వచ్చందంగా అధికారం వదలుకున్నవారు చరిత్రలో అరుదు. అర్థం - అధికారం ఈ రెంటినీ వదిలించాలి తప్ప వదులుకోరు. ఈ సూత్రం చిన్న కుటుంబ యజమానినుంచి సామ్రాజ్యవాదుల వరకు వర్తిస్తుంది. అమెరికా ప్రజలు యుద్ధం చేసి, బ్రిటిషు ప్రభుత్వాన్ని తరిమివేశారు.
బ్రిటిషువారు భారతదేశాన్ని విధిలేక విడిచిపోయారు.
1. 1939లో ప్రారంభం అయిన రెండో ప్రపంచ సంగ్రామం నాజీ నియంత హిట్లర్ ఓటమితో 1945లో ముగిసింది. రష్యాలోని సమాజవాద ప్రభుత్వం చావు దెబ్బ కొట్టడంవల్లనే హిట్లరు - అతని నాజీయిజం - అంతం అయినాయి. ఈ యుద్ధం ఆరుకోట్ల నిండు ప్రాణాలను బలిగోన్నది.
అమెరికా ఆటంబాంబు జర్మనీమీద వేయవచ్చుకదా! వేయలేదు. తమజాతి యూరోపియన్లను రక్షించుకోవాలి. ఇది "కృణ్వంతో విశ్వమార్యం" అని హిట్లర్ జాత్యహంకారంకన్న ఏమాత్రం తక్కువకాదు!
అమెరికా - ఆసియాప్రజల మీద - ఆటంబాంబులు ప్రయోగించింది. జపానులోని హిరోషిమా - నాగసాకి నగరాలమీద - విచక్షణారహితంగా బాంబులు వేసింది. ఈ అణుబాంబుల వల్ల లక్షా ఇరవైవేలమంది హతులయారు. లక్షలమంది క్షతగ్రాతులయినారు. అర్ధ శతాబ్దం గడిచినా అణుబాంబు బాధితులు ఇంకా కోలుకోలేదు.
నేను ఇది వ్రాస్తున్న 5-8-94న హిరోషిమా నాగసాకీలలో నాటి దురంతాన్ని గుర్తుచేసుకొని వేల కొలది మంది ప్రార్థనలు చేస్తున్నారు. మానవలోకం నుంచి అణుబాంబు అంతం కావాలని జపాను ప్రభుత్వం ప్రకటించింది.
రెండవ ప్రపంచ సంగ్రామ విజయం - సుమారుగా - ప్రజావిజయం. ఇది సోషలిస్టు విజయం. యుద్ధం ముగిసిన తరువాత వెలువడిన 'ఖేమీజంగ్' వారపత్రికలో సుత్తీ కొడవలి అరుణ పతాకం కింద సజ్జాద్ జహీర్ కవిత అచ్చయింది. 'సుర్ఖ్ పర్చమ్ ఉడ్ ర్ హమైసీన్ ఏ బర్లిన్ పె ఆజ్' - నాకు ఇంకా గుర్తుంది. బెర్లిన్ గుండెమీద ఎర్రజండా ఎగురుతున్నది అని దాని అర్థం.
ప్రపంచ ప్రజల ప్రజాపోరాటాలకు బలం చేకూరింది. సామ్రాజ్యవాదులు ప్రజలను పాలించ కలిగే స్థితిలో లేరు. ఎనిమిదవ దశకంలో - రానున్న శతాబ్ది గురించి నావ్యాసం ఆకాశవాణిలో ప్రసారం అయింది. "ఇది బానిసల జాతులకు విముక్తి కలిగించిన శతాబ్దం. ఆసియా - ఆఫ్రికా ఖండాలనుంచి సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టిన యుగం. శ్వేతజాతి అహంకారం చివరి ఊపిరితో ఉన్న రాక్షస ప్రభుత్వం మీద నల్లజాతి యుగం. శ్వేతజాతి అహంకారం చివరి ఊపిరితో ఉన్న రాక్షస ప్రభుత్వం మీద నల్లజాతి మాత్రమే కాదు - నాగరిక ప్రపంచం యావత్తూ తిరుగులేని ఉద్యమం సాగిస్తున్నది. ఈ శతాబ్దం ముగియకముందే దక్షిణాఫ్రికా - నమీబియాలలో స్వాతంత్ర్య భానూదయం అవుతుందని ఆశిద్దాం" అని రాశాను.
నా ఆశయం ఫలించింది. దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యదిన వేడుకలు T.V.లో చూచాను. నా ఒడలు పులకరించింది. నాకే స్వాతంత్ర్యం వచ్చినంత పొంగిపోయాను.
2. భారతదేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టుల ఉద్యమాలతో ప్రజలలో అనంతమైన చైతన్యం వచ్చింది. వారు పరాయి ప్రభుత్వాన్ని సహించే స్థితిలో లేరు. సైన్యం సహితం వారి మాట వినేటట్లు లేదు. నావికుల తిరుగుబాటు ఇందుకు నిదర్శనం. అమెరికాలో వలె కాక - గౌరవంగా బయటపడడం మంచిదని సామ్రాజ్యవాదం భావించింది.
3. బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో చర్చిల్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ప్రజలు విచిత్రులు. రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత సమర్థవంతంగా దేశాన్ని రక్షించిన చర్చిల్ ను ఓడించారు. ఇందుకు ప్రపంచంలో వస్తున్న ప్రగతివాదం కారణం. ప్రజలు లేబర్ పార్టీని గెలిపించారు. సామ్రాజ్యవాదులు విధిలేక భారతదేశం వదిలారు అనడానికి ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. చరిత్ర తెలియని - తెలుసుకోలేని నేటి యువత - బ్రిటీష్ వాడు. దయాధర్మంతో వదిలిపోయాడనే తప్పుడు అభిప్రాయంతో ఉంది.
సామ్రాజ్యవాద విధానం - విభజించడం. వాళ్లు వెళ్లిపోయేపుడు దేశాలను విభజిస్తారు. ఒక ముక్క అయినా - కొంతకాలం అయినా తమ చెప్పుచేతుల్లో ఉంటుందని వారి అభిప్రాయం. వారు వియట్ నామ్ ను - కొరియాను విభజించారు. వియత్నాం ప్రజాపోరాట విజయం వియత్నాంను ఏకం చేసింది. ఉత్తర - దక్షిణ కొరియాలు, పాకిస్తాన్- భారత్ స్థితిలోనే ఉన్నాయి!





