Home » kommanapalli ganapathi rao » Grand Mastar
విశాఖనగరంలో అడుగుపెట్టిన ఉపప్రధాని నిజానికి వుత్సాహంగా లేడు. పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి తనచుట్టూ రక్షకదళాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాడు అప్పటికి.
సిబిఐ ఆఫీసరు పాణి పర్యవేక్షణలో చాలా నిశ్చింతగా వుండే అవకాశమున్నా మానసికంగా అలసిపోవటానికి కారణం మహేంద్ర గురించి డాక్టర్లు చెప్పిన విషయం. ఒక్కగానొక్క కొడుకు, యింతకాలం 'రైజింగ్ సన్'లా ఎదురులేని అస్త్రంలా బ్రతికిన తన ముద్దులకొడుకు యిప్పుడు తనకు దక్కకుండా పోతున్నాడు.
మూడోసారి టాటా ఇన్స్ టిట్యూట్ లో మహేంద్ర రక్తపరీక్ష చేసిన డాక్టర్లు నిర్ధారించేసారు మహేంద్ర శరీరంలో ఎయిడ్స్ క్రిములున్నట్టుగా.
కేవలం సానుభూతిమాటల్తో ప్రత్రికలముందు బాధను అభినయించటానికి మహేంద్ర ప్రజల్లో ఒక మనిషికాదు. సాక్షాత్తు తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డ.
ఏంచేస్తేనేం, ఎలా బ్రతికితేనేం యిప్పుడు శాశ్వతంగా తనకు దూరం కాబోతున్నాడు. ఆ క్షణంలో సైతం తన పాపాలే తననిలా కాటేసి వుండొచ్చని పించలేదు సుదర్శనరావుకి.
దీనికంతటికి కారకుడయిన శ్రీహర్షపై ఉక్రోషం అధికమైంది.
ఎక్కడినుంచో ఈ నేలపై అడుగుపెట్టి యిక్కడ తన సువిశాల సామ్రాజ్యంలో ప్రశాంతతను భంగపరిచిన శ్రీహర్షలాంటి వ్యక్తి ఉరికంబమెక్క కుండా కస్టడి నుంచి తప్పించుకోడానికి కారణమైన సవ్యసాచినీ క్షమించకూడదనిపించింది.
శ్రీహర్ష కథని పుజో ఎలాగు ముగిస్తాడు.
పుజోనుంచి తప్పించుకున్నా తన అధికారం యీ దేశం పొలిమేరలు దాటకముందే 'షా'ని అదుపుచేయగలుగుతుంది.
ముందు కడతేరిపోవాల్సింది సవ్యసాచి.
అందుకే సవ్యసాచి పరారీలోవున్న అతడి ఆస్తుల్ని సీజ్ చేయించాడు.
రాజీవ్ బ్లూఫిలిం రాకెట్ గురించి బయటపెట్టి మరణయాతనలో వున్న రాజీవ్ ని అరెస్టు చేయించాడు. సాయంకాలందాకా యిలాంటి కార్యక్రమాలతో అలసిపోయిన సుదర్శనరావు కార్యకర్తల్ని, జిల్లాకి చెందిన పార్టీప్రముఖుల్ని యిక ఈ రోజు కలుసుకోలేనంటూ తెగేసిచెప్పి పంపేడు.
సరిగ్గా ఆ సమయంలో గెస్టుహౌస్ లో ఫోన్ రింగయింది.
ముందు ఆన్సర్ చేయకూడదనుకున్నాడు.
అలా తన రక్షకదళానికి ఇన్ ఛార్జిగావున్న పాణితో అన్నాడు కూడా.
"సారీ. ఉపప్రధానిగారు విశ్రాంతి తీసుకుంటున్నారు." సెక్రెట్రీలు, పర్సనల్ అసిస్టెంట్సు అప్పటికే వెళ్ళిపోవడంతో పాణి జవాబుచెప్పాడు రిసీవరు అందుకొని.
"నేను అర్జెంటుగా మాటాడాలి."
ఇంగ్లీషు ఉచ్ఛారణ. భారతీయుడిలా అనిపించలేదు. పాణి అడిగాడు "మీరెవరు"
"చెప్పండి. పుజో లైన్ లో వున్నాడని."
"పుజో." స్వగతంలో పాణి గొణుగుతుండగానే దూరంనుంచి విన్న సుదర్శనరావు ఒక్క అంగలో పరుగున వచ్చాడు.
"యస్ పుజో."
"కఫిన్ బాక్స్."
"వ్వాట్" సుదర్శనరావు మొహంలో పైశాచికానందం "అంటే ఆపరేషన్ పూర్తయిందన్నమాట."
"మాట తప్పడం పుజో చరిత్రలోలేదు. రిషివేలి గుట్టదిగువునవున్న కఫీన్ బాక్స్ ని కలెక్టు చేసుకోండి. ఓకే."
ఫోన్ క్రెడిల్ చేసిన సుదర్శనరావు యిక జాప్యం చేయలేనట్టు బయలుదేరబోతుంటే అడిగాడు. "సర్ యీ సమయంలో మీరు."
"వెళ్ళాలి మిస్టర్ పాణీ. నా గెలుపుని చూసుకురావాలి."
"దయుంచి వివరంగా చెప్పండి."
"వస్తే నువ్వూ చూడవచ్చు"-
ఉన్నట్టుండి ఉపప్రధానిలో ఈ చైతన్యమేమిటో అర్థంకాలేదు పాణికి.
అయినా ఓ సాధారణపౌరుడిలా అతడు బయటతిరగటాన్ని అంగీకరించలేకపోయాడు.
"సర్. ఇంటెలిజెన్స్ రిపోర్టునిబట్టి 'షా' యీ నగరంలోనే వున్నాడు."
"లేదు పాణీ. షా చచ్చిపోయాడు.
ఉద్విగ్నంగా చూసాడు పాణి "ఐ డోంట్ థింక్ సో. ఇన్ని దేశాల్ని వంచిస్తూ యిక్కడ పటిష్టమైన పోలీసు బలగాన్ని తప్పించుకుంటూ తిరగ్గలిగే షా కథ అంత సులభంగా ముగిసిపోదు."
"కమాన్ ఐ సెడ్"
సుదర్శనరావు వినేట్టులేడు.
ఓ దేశ ఉపప్రధాని రక్షకదళాన్ని పర్యవేక్షించే వ్యక్తిగా వారించగలడేతప్ప నిరోధించలేడు.
"ఇది ఓ ట్రాప్ గా అనిపిస్తూంది" చివరిమాటలా అన్నాడు పాణి.
"అదే నీ అనుమానమయితే మొత్తం ప్లీసుబలగాన్ని వెంటతీసుకెళదాం." ఏమూలనో వున్న భయం సుదర్శనరావుచేత యిలా మాట్లాడించింది.
పదినిముషాల వ్యవధిలో...
నగరం మొత్తం విశ్రమించటానికి సిద్ధమౌతున్న రాత్రి పదిగంటలవేళ.
సాయుధులయిన పోలీసులు మూడు వేన్స్ లో ఉపప్రధాని కారుకి ముందూ వెనుక రక్షణలా అనుసరించారు.
రిషికొండని చేరగానే ఉత్సాహాన్ని ఆపుకోలేని సుదర్శనరావు చెంగున సీట్లోనుంచి బయటకి దూకేడు.
భీతినిగొలిపే నిర్జన ప్రదేశం.
పక్కనే నిలబడ్డ పాణి చేతిలోని టార్చ్ అందుకున్న సుదర్శనరావు గుట్ట దిగువ భాగంకేసి ఫోకస్ చేసాడు.
ఆకాశంలో నక్షత్రాలు రాలిపడబోయి ఉల్కల్లా నేలకి చూస్తున్నాయి.
ఓ పొదమాటున కఫిన్ బాక్స్.
క్షణంపాటు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
సుదర్శనరావు ఆత్రంగా కఫిన్ బాక్స్ ని చేరుకోబోతుంటే వారించిన పాణి తనే పైనున్న కవరు తీసాడు.
అంతే...
పట్టలేని ఆనందంతో సుదర్శనరావు కేకపెట్టాడు.
నిర్వికల్ప సమాధిలో వున్నట్టు కనిపిస్తున్నాడు శ్రీహర్ష కఫిన్ బాక్స్ లో.





