Home » kommanapalli ganapathi rao » Grand Mastar
పాణి మొహం వివర్ణమైపోయింది.
రుషిగా మారిన ఓ కిరాతకుడి కథ అలా ముగిసిపోవటం చాలా కలవర పెట్టిందతడ్ని.
* * *
సరిగ్గా అదే సమయంలో...
అశ్రుశిక్త నయనాలతో ఉత్తరాన్ని చదువుతూంది దృశ్య.
"ప్రియమైన దృశ్యా...
సుదూరంగా వెళ్ళిపోతున్న చివరిక్షణంలో జాలి అంటుకున్న జ్వాలలా ఈ ఆఖరి పంక్తుల్ని నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను.
ఎప్పుడో ఎన్ని దశాబ్దాలక్రితమో గుర్తులేదుకాని ఇక్కడ గాలి ఆటలకి, నేల పాటలకి నే దారంకట్టిన తూనీగల రెక్కల చప్పుళ్ళకీ దూరం కాకపోయివుంటే అమ్మ పొత్తిళ్ళ లాలిత్యానికి కోట్ల ఆమడలదూరం జరిగి వుండకపోతే ఎడారి ఇసుకల సెగలూ తెలిసివుండేవికావు. అరబ్ షేక్ ల పాశవికానందంకోసం అపహరించబడిన నేను ఒంటెల పరుగుపందెంలో క్షణక్షణమూ ప్రాణభీతితో బాల్యాన్ని గడపాల్సిన అవసరమూ వుండేదికాదు. అదే దృశ్యా... నా జీవనగమనాన్ని మార్చింది ఆ సంఘటనే. నా కళ్ళముందే చాలామంది పిల్లలు ఒంటెల కాళ్ళ క్రిందపడి నలిగినపుడు నేను ఏడ్చాను. అమ్మా నాన్నలకి దూరంగా మృత్యువు ఒడిలోకి లాగిన నా దుర్విధినీ తిట్టుకున్నాను. అలా అని ఊరుకోలేదు. నన్నుకొన్న అరబ్ దేశస్థుడ్ని దారుణంగా చంపేసాను. అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళే. ఆ తర్వాత అడవులూ, లోయలూ ఎక్కుపెట్టిన బాణంలా పరుగులూ. నేర ప్రపంచపు చదరంగపు గళ్ళపై ఉన్నవాళ్ళపై హత్యాకాండతో దేశాల సంచారమూ. యిదీ నా జీవితమయిపోయింది.
అంతా గెలుపే అనుకున్నాను. ఆ గెలుపే జీవితమనుకున్నాను. ఎందుకొచ్చినాగాని ఈ నేలపై అడుగుపెట్టాక జనని గుర్తుకొచ్చినా గుర్తించలేకపోయాను. అమ్మ ఎక్కడున్నదీ? నా జన్మభూమిలో కదులుతున్న నాకు అమ్మ కనిపించకపోయినా అమ్మలాంటివాళ్ళ ఆర్తి వినిపించింది. అసాధారణంగా నన్ను కదిలించింది. ఒకపక్క చెదిరిపోతున్న సంస్కృతి, మరోపక్క నేలపాలవుతున్న దేశసౌభాగ్యం. రోడ్ల కూడలిలో వందేమాతరం అంటూ దేశంకోసం ఎప్పుడో నేలరాలిన నేతల విగ్రహాలు ఓ పక్క... రంగు వెలసిన భారతి ఫాలభాగాన ఎర్రసింధూరంలా మెరుస్తున్న పీడిత జనజీవన ప్రాణాలు మరోపక్క.
ఇంటగెలవాలనిపించింది దృశ్యా. అందుకే రెచ్చిపోయిన నేను రచ్చపై ఆశను వదలుకుని నా నేలపైనే బ్రతుకు చాలించాలనుకున్నాను. అదీ నిస్సహాయుడిలా కాదు. నిస్సహాయుల సృష్టికి కారణమవుతున్న దరఖాస్తులో ఎప్పుడో అంటించుకున్న ఫోటోలాంటి నా జీవితంలో ఈ మార్పు ఎందుకు జరిగినాగాని రాజఠీవితో రాలిపోవాలని ఈ జీవితం ఎన్నుకున్నాను.
మరణవాంగ్మూలం కాదిది. మృతసైనికుడిలా నడుస్తున్న నా నేత్రాలనుంచి జారే ఆనందభాష్పాలకు అక్షరరూపం... నిజం దృశ్యా. ఈ సత్యం నీకు మాత్రమే ఎందుకు చెప్పాలనిపించిందీ అంటే నేనూ ప్రేమించానొకప్పుడు... లూసీకి భర్తనయ్యాను. లూసీ ప్రేమతో జూలీకి తండ్రిగా మారేను. ఏ చిరునవ్వుల తోటలో నడిచినాగాని, ఏ సుగంధాల పాటతో అణువంత విశ్రమించినాగాని లూసీ రాలిపోయాక గుండెలనిండా మౌనాన్ని పాతుకున్నాను. ఆ మౌనంతోనే ముందుకు సాగిపోవాలనుకున్నాను.
అలాంటివేళ పరిచయమయ్యావు నువ్వు. నువ్వేకాదు రేష్మికూడా. కాని రేష్మి నిశ్శబ్దసంగీతంకన్నా నీ జలపాతపుహోరే నన్ను అమితంగా కదిలించింది. అది మాత్రమే కాదు. నీ అతివాదంలో నేను కోరుకునే హితవాదమూ దర్శనమిచ్చి నా గుండెలోతుల్లో ప్రతిధ్వనించగల ప్రకరణాలనూ అక్షరమాలల్లా దర్శింపచేసింది. నిన్ను ప్రేమిస్తున్నానన్న సత్యాన్ని నాకు ఎరుకపరిచింది.
గుర్తుందా... నానుంచి నీకోబిడ్డ కావాలీ అన్నావు. ప్రేమ పరిపక్వతనుదాటి ముగ్ధత్వపు శరతల్పంపై బ్రతుకునిపేర్చి పెళ్ళికిముందే ఇలాంటి కోరికను వ్యక్తం చేసిన నిన్ను నేను అపార్థంచేసుకోలేదు దృశ్యా. ధన్యుడినయ్యాను. నీ కోరిక తీర్చాలనుకున్నాను. నిజంగానే... కాని నిన్ను కలిసికాడు. రేష్మి దగ్గర భద్రంగావున్న జూలీని నీకు అందించి... నీకొక్కదానికేకాదు దృశ్యా... ఎవరూలేని జూలీకిప్పుడు మీ యిద్దరూ అమ్మలే... నాకన్నా నా బిడ్డే అదృష్టవంతురాలు కదూ.
నా చివరి అధ్యాయాన్ని యిలా స్వహస్తాలతో రాసుకుని వెళ్ళిపోతున్న ఈ క్షణంలో నిన్నూ, రేష్మిని అర్థించేదొక్కటే దృశ్యా. నేను కనిపించకపోయినా నాకోసం కన్నీరు చిందించకంది. మీ మనోగగనంపై అప్పుడప్పుడూ ఉరిమే ఆత్మఘోషని నా భాషగా మార్చుకుని నన్ను పునీతుడ్ని చేయండి. శలవ్...
ఈ ఉత్తరం అందేసరికి చాలాదూరం వెళ్ళిపోతున్న శ్రీహర్ష కాదు. నిన్నటి 'షా'
వణుకుతున్న చేతులతో చివరి పంక్తుల్ని మళ్ళీమళ్ళీ చదివింది దృశ్య.
ఏమయ్యాడు శ్రీహర్ష. ఇప్పుడేస్థితిలో ఉన్నాడు?
లేఖను మడిచి అపరాత్రివేళనే రేష్మి దగ్గరకు బయలుదేరింది.
సరిగ్గా అప్పుడు...
రిషివేలీ కొండగుట్ట దగ్గరగా పైశాచికంగా పగలబడి నవ్వుతున్న సుదర్శనరావు ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు.
... ... ...
... ... ... 'షా' శవం కదిలింది.
అనుమానంగా పరిగెత్తబోయాడు.
కాని అప్పటికే శ్రీహర్ష చేతిలో రివాల్వర్ నిప్పులుకక్కింది.
తనచేతిలో మరణించిన పుజో శవానికి బదులు శ్రీహర్ష పాణితోబాటు అందరూ తేరుకునేలోగానే మెరుపులా అదృశ్యమైపోయాడు.
రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న సుదర్శనరావు 'మరణం శరణం' అన్న గీతాన్ని ఆలపిస్తున్న ముష్కరుడిలా వున్నాడు.
దేశం మొత్తాన్ని కలవరపెట్టిన, కాదు అలరించిన సంఘటన అది.
అయితే శ్రీహర్ష జాడలేదు.
* * *
కెవ్వుమన లేదా తల్లి.
రోషంగా తాకిన కెరటం ఉక్రోషంగా వెనక్కి వెళ్ళిపోయింది.
అయినా ఆ వృద్ధురాలితో పూర్వపు నిరీక్షణే.
సముద్రపు ఒడ్డున నిలబడి దూరంగా నక్షత్రాల ఆకాశం నీటిని కలుస్తున్న సరళరేఖలోకి కళ్ళు చిట్లించి మరీ చూస్తుంది.
"రాలుగాయిపిల్లాడు ఈరోజురాలేదమ్మా" అనుకోలేదు ఎప్పటిలా.
"ఏడేడు సముద్రాలుదాటి ఎక్కడికయినా వెళ్ళి బ్రహ్మాండాన్ని తొట్టిగా మార్చి నేల నాలుగుచెరగులా వ్యాపిస్తున్న దుఃఖాన్ని చెరిపే నాలుగువేదాలుగా మారు తండ్రీ" అని పల్లవిమారిన పాటతో చీకటి సంద్రంలోకి చూస్తుంది.
ఆ వృద్ధురాలికి దూరంగా...
మరోమూల ఇద్దరు యువతులు కూర్చుని వున్నారు.
ఇద్దరి మధ్య ఓ ముద్దులపాప.
చల్లబడని గుండెహోరు.
దృశ్యతోపాటు రేష్మికూడా పాప చేతుల్ని... తన చేతుల్లోకి తీసుకుంది...
"ఇక వెళదామా"
అడిగింది దృశ్య.
పాప జవాబు చెప్పలేదు.
మరోతరంలో శ్రీహర్షకోసం మొదలయిన నిరీక్షణ ఎన్ని దశాబ్ధాలు కొనసాగేది ఆ ఇద్దరికీ తెలీదు.
కాని ఆ ఉప్పు సంద్రపుఒడ్డు ఎంత వూరటని కలిగిస్తూందని!
అనంతమంత శ్రీహర్ష మనసుని, ఉప్పెనలా ఎగిసిపడే అతడి వుద్రేకాన్ని స్పురణకి తెస్తుంటే... ...
ఇంతకాలానికి ప్రశాంతంగా కనిపించే ప్రపంచంమధ్యకి పాపతోబాటు నెమ్మదిగా నడుస్తున్నారు అశ్రుశిక్త నయనాలతో.
* THE END *




