Home » kommanapalli ganapathi rao » Grand Mastar
పాప ఏడుపు యింకా వినిపిస్తూనే ఉంది.
"నా కూతురు" కనీసం ఒక్కసారి పాపను చేరుకోవాలని, అది చివరి సన్నివేశమే అయితే ఓ జీవితకాలపు ధైర్యాన్ని పాపలో నింపి తిరిగిరావాలని తపించినట్టుగా అన్నాడు. "ఒక్కసారి జూలీని చూసి వస్తాను."
"వీల్లేదు మిస్టర్ షా. జూలీని నువ్వు కలుసుకోవాలీ అంటే నన్ను దాటుకుని వెళ్ళాలి."
చేతిలోని రివాల్వర్ ని గురిపెట్టి వికృతంగా నవ్వుతూ అన్నాడు "ఎందుకంటే పాప యిప్పుడు ఏడుస్తున్నది నీకోసం సిద్ధంచేసి వుంచిన కఫిన్ బాక్స్ లో నుంచి కాబట్టి."
శ్రీహర్ష నరాలు జివ్వుమన్నాయి.
"భయపడకు. కఫిన్ బాక్స్ పై కవరు యింకా బిగించలేదు నేను. నువ్వు మాట తప్పితే ఆ పనిచేయాలనుకున్న నేను అందాకా పాప కాళ్ళూ చేతులూ కట్టి అందులో పడుకోబెట్టాను."
"అభినందిస్తున్నాను పుజో. పసికందుల ప్రాణాలు సైతం తీసి ఆ గుండెకాయల్ని కాల్చుకుతినటం నీకలవాటన్నది గుర్తు చేసుకుంటూ యిక్కడ ఈమాత్రం జాలిని ప్రదర్శించినందుకు నిన్ను అభినందించకుండా వుండలేకపోతున్నాను.
రివాల్వర్ దూరంగా విసిరేసాడు పుజో.
అలర్టయ్యాడు శ్రీహర్ష.
ఓ అంతర్జాతీయస్థాయి కిల్లర్ పోరాటానికి సమాయత్తమయ్యే సంకేతమది.
పుజో తనను కాల్చి చంపాలని కాదు. ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు.
"మిస్టర్ షా" రెండడుగులు ముందుకు నడిచిన పుజో తోడేలులా నవ్వేడు "నా గురించి నువ్వు విన్నట్టే నీ గురించి నేను చాలా విన్నాను. కాబట్టి నీ శారీరక శక్తిని కొలిచేక అప్పుడు నీ గుండెని కాల్చుకు తినాలనుకుంటున్నాను."
"తొందర పడుతున్నావేమో ఆలోచించు."
ఆ వ్యంగ్యం బలంగా తాకిందేమో మరుక్షణం బాహువుల్ని ఉక్కుస్థంభాల్లా మార్చి ఒక్క అంగలో శ్రీహర్ష పైకి లంఘించాడు.
ఇద్దరు యోధుల మధ్య పోరాటం ప్రారంభమైంది.
డెత్ లాన్ లా అనిపించిన శ్రీహర్షకి క్షణంపాటు వూపిరి అందలేదు. అయినా ఓ యోగముద్రలా శరీరాన్ని కాంక్రీట్ గా మార్చుకుని మోకాలితో పుజో పొట్టపై తన్నేడు.
కొద్దిగా పట్టు సడలింది.
అంతే... మెరుపువేగంతో దూరం జరిగిన షా గాలిలోకి లేచాడు.
నెలకి సమాంతరంగా కదిలిన 'షా' పాదం పుజో గుండెల్ని తాకింది.
నవ్వేడు జవాబుగా.
మరో దెబ్బ.
ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.
పుజో అసాధారణమయిన శక్తి అర్థమయిన తొలిక్షణమది. ఎంత శక్తివంతుడినయినా నేల కూల్చగల శ్రీహర్ష! ప్రయత్నం విఫలమౌతుంటే అదే వేగంతో పిడికిలిని "బెంచ్ వైస్"గా మార్చి పుజో తలని అందుకున్నాడు.
ఈ అవకాశాన్ని పుజో సైతం వదులుకోలేదు. చేతిని గునపంగా మార్చి శ్రీహర్ష మోచేతిపై గుద్దేడు.
శ్రీహర్ష కళ్ళు బైర్లు కమ్మాయి.
అయినా పట్టు విడవలేదు.
పిడికిలిని యింకా బిగిస్తున్నాడు.
"బా... స్ట... ర్డ్..." ఉక్రోషంగా అరిచిన పుజో రెండు చేతుల్తో శ్రీహర్ష కాళ్ళని లాగేడు.
"అంతే..."
దబ్బుమన్న చప్పుడు.
ముళ్ళకంచెలో వెల్లకిలా పడ్డాడు శ్రీహర్ష.
పిడిబాకుల్లా ఒంటిలో గుచ్చుకున్న ముళ్ళని విదిలించుకోటానికి వెంటనే సాధ్యం కాలేదు.
పుజో సమీపంలోని ఓ బండరాయిని పైకెత్తాడు.
పైకి విసిరేవాడే.
బుస్ మన్న చప్పుడు.
తన విశ్రాంతికి భంగమయినట్టు బండరాయిక్రింద విశ్రమించిన ఓ త్రాచు బుసకొడుతూ పైకి లేచింది.
తప్పనిసరైంది. ఆ రాయిని త్రాచుపైకి వదిలాడు పుజో.
పడగ పగిలిన తాచుతోక గిలగిల కొట్టుకుంటూంది.
పుజో దృష్టి మరలిన ఆ సంఘటన్ని అవకాశంగా మార్చుకున్న శ్రీహర్ష పుజో వెన్నెముకపై చాచి తన్నాడు.
గుట్ట కదిలిన చప్పుడు.
ఇద్దరూ కొండచిలువల్లా కలియబడి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పొదలు నాశనమౌతున్నాయి.
నిశీధి వణికిపోతూంది.
ఒకరిపై మరొకరు గెలుపుకోసం పోరాడుతూ దొర్లుతున్నారు.
అరగంట గడిచింది. గంట పూర్తయ్యింది. తూర్పురేఖలు విచ్చుకుంటున్నాయి.
అయినా పోరాటం కొనసాగుతూనే ఉంది.
ఏనుగులు ఘీంకరిస్తున్నట్టు, పులులు గాండ్రిస్తున్నట్టు రక్తసిక్తదేహాలతో అలసిపోతూ యింకా గెలుపుకోసం శక్తిని కూడగట్టుకుంటున్నారు.
శిధిలమౌతున్న హిమవన్నగాల్లా, గర్జిస్తున్న సింహాల్లా, కదిలే ఉష్ణోగ్రతా వలయాల్లా వివర్ణ దావానల చిత్రాల్లా గ్రహాంతరాలనుంచి రాలిపడిన నక్షత్రమండలాల్లా నిర్గమ్య గమనంతో పోరాడుతూనే వున్నారు.
మృత్యునేపధ్యం. మరఫిరంగుల హుంకరింపులు.
గుట్టపైనుంచి దొర్లారిద్దరూ.
దొర్లుతూ నేలకి ఏభై అడుగుల లోతుపై వున్న బండరాళ్ళపై పడ్డారు.
కెవ్వుమన్న ఓ ఆర్తనాదం.
ఇద్దరిలో ఒకరి కథ ముగిసినట్టు.
ఆకాశ పరివ్యాప్త ధూమపుష్పమొకటి నేలరాలినట్టు ఓ శరీరం అచేతనమైంది శాశ్వతంగా.
భస్మసముద్రంపైకి ఓ సూర్యకిరణం వాలుగా ప్రసరించింది.
* * *





