Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                                          రణరంగం
                                                  (సమర కథాసంకలనం)    

                                            పొలికేక

    వ్యక్తిగా-వ్యష్టిగా-మానవుడు జీవించింది అతని జీవితకాలంలో అణుమాత్రం.
    సంఘంగానూ-సమిష్టిగానూ జీవిస్తున్నాడతను కలకాలంగా. అందుకతడు తన స్వేచ్చా స్వాతంత్ర్యాలను స్వచ్చందంగా బలి ఇచ్చాడంటే నాకు విశ్వాసం లేదు. బలవంతులైన కొందరు మానవుని స్వేచ్చా స్వాతంత్ర్యాలను గోళ్ళూడకొట్టి లాక్కొని రాజులుగానో, ప్రభువులుగానో తయారైనారంటే నిజమేమో ననిపిస్తుంది. స్వచ్చందంగా ఏర్పడిన కుటుంబంలోని యజమాని అభీష్టంలో యావత్తు కుటుంబ సభ్యుల అభీష్టం ప్రతిబింబించినట్టే, బలదర్పంతో ఏర్పర్చుకున్న రాజ్యంలోని రాజు అభీష్టమే ప్రజల అభీష్టంకాగా, ప్రజలు వట్టి చదరంగపు పావులుగా తయారై, రాజుల కనుసన్నల్లో మెలగాల్సి వచ్చింది. "రాజ్యం" అంటే అనేకమంది వ్యక్తులూ కారు, వ్యక్తుల సముదాయమూ కాదు. అది వట్టి రాజు. "రాజానుమతో ధర్మం" - రాజు అనుమతించింది. మాత్రమే ధర్మం. దాని మంచి చెడుల్తో ప్రజలకు సంబంధం లేదు. ఉండదు, ఉండరాదు.
    "స్పర్థ" మానవ జీవితంలోని ప్రధానాంశం. వ్యక్తిగా జీవించిన కాలంలో మానవునిలో తన పొరుగువాణ్ణి మించాలనే తాపత్రయం ఉన్నట్లే, ఒక కుటుంబం మరొక కుటుంబాన్ని మించాలనీ, ఒక రాజు మరొక రాజును మించాలనీ తాపత్రయపడ్డారు. వ్యక్తిగా పోరాడినప్పుడు ఒక్కనికి కుటుంబంగా, సమూహంగా పోరాడినప్పుడు కొందరికి మాత్రమే నష్టం కలగ్గా, రాజుగా పోరాడినప్పుడు వేలకొలది జనులు బలి అయినారు, తమ రాజు, తమ రాజ్యం అనే కైపు ఎక్కించి, సమరంలో చచ్చిన ప్రజలకు స్వర్గపు లాలూచీ చూపి, వేలాది ప్రజల్ను తన అధికార దాహానికి బలిగొన్న ప్రభువు ఓడిపోతే, ప్రజలు తాము ఎదిరించిన రాజునే భజించాలి. అవసరం ఏర్పడితే ఈ రాజు పక్షాన తమ పూర్వపు రాజు నెదిరించి పోరాడి చావాలి! రాజు చావమంటే చావాలి, బ్రతకమంటే బ్రతకాలి. అది వారి విధి! అది వారి ధర్మం!! పాపం, ప్రజలు వట్టి పిచ్చివాళ్ళు! వెర్రి ఆవేశంతో చస్తారు! ప్రభువులు బలవంతులైతే ఎక్కువ నాశనం అవుతూంది. తురుష్కులు తెచ్చిన తుపాకులు, నరాసులు తెచ్చిన ఫిరంగులు ఇందుకు నిదర్శనాలు.
    అధికార దాహం లేకుంటే మానవుడు దేవుణ్ణి మించగలడు. "శాంతి" అతడు పుట్టిన్నాటినుంచీ కంటున్న పగటి కల! మానవతకు శాంతి సౌభాగ్యాలు సాధించడానిగ్గాను ఎందరో మహానుభావులు తమ జీవితాలను కర్పూరంగా అర్పించి నవమార్గాలు కనుగొన్నారు. రాజకీయ రంగంలో సాగిన అనంత కృషికి నేడు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం ఒక స్వరూపం. డెమోక్రసీలో ప్రజలే ప్రభువులై, లోకం శాంతి సౌభాగ్యాలతో తులతూగుతుందనుకున్న కల - అది క్రియారూపం దాల్చేవరకు పగటి కలగా తయారైంది. అక్కడా రాచరికంనాటివలె బలమూ, అధికారమే వికటాట్టహాసం చేసి స్వైరవిహారం చేశాయి - చేస్తున్నాయి. అతి భయంకరమైన రెండు ప్రపంచ మహా సంగ్రామాలు ప్రజాస్వామ్యం పేరిటనే జరిగాయనీ, మిలియన్లకొద్దీ ప్రజల్ను పొట్టను పెట్టుకున్నాయనీ మనం మరచిపోరాదు.
    ప్రజలు ఏనాడూ యుద్ధం కోరలేదు, కోరరు, కోరబోరు. వారు కోరేది శాంతి-సౌభాగ్యం. యుద్ధం కోరేదీ, వినాశం తెచ్చేదీ ప్రభువులూ, వారి మతాలే. ప్రజలు వారికి దాసోహం అనాలి. వారికోసం యుద్ధంలో చావాలి. వీరస్వర్గం అలంకరించాలి. ఆ విషయంలో రాతియుగపు ప్రభువులకూ, నేటియుగపు ప్రభువులకూ వ్యత్యాసం Nil.     పైగా, మారణహోమాలు ఆధునిక ఫక్కీలో జరుగుతున్నాయి. బాణాల కాలంలో ఎదురుగా ఉన్న సైనికుడు మాత్రమే చచ్చేవాడు. చంద్రమండలానికి రోడ్డు వేస్తున్న ఆధునిక యుగంలో ఆటం, హైడ్రోజన్ బాంబులు యుద్ధంలో ఏమాత్రం సంబంధంలేని లక్షల, కోట్ల అమాయక ప్రజానీకాన్ని హతమారుస్తాయి. అంతకంటే ఆయా దేశాల అధినేతలు కుస్తీలుపట్టి, గెల్చినవారికి ప్రజల్నప్పగించడం మంచిదికాదూ!
    సర్వరోగ నివారిణిగా పేర్కొనబడే "సోషలిజం" అమలులో ఉన్న కమ్యూనిస్టు దేశాలు సైతం, తాము శాంతికోసం తహతహలాడుతున్నామని ప్రజల్ను బుకాయిస్తూ, మానవతను నాశనంచేసే ఆయుధాలు సృష్టించడంలో కేపిటలిస్టు దేశాలతో పోటీపడుతున్నాయి. "ప్రపంచ శ్రామికులారా, ఏకం కండి!" అనే నినాదం ఇచ్చే "ఇజం"ను భజించే రెండు దేశాలు ఏకం కాలేకపోతున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. సోషలిజం మాకూ ఇష్టమే. ప్రపంచ ప్రజలందరికీ ఇష్టమే. ఎందుచేతంటే, సోషలిజంలో మనిషి విలువ అధికారాన్నిబట్టేగాని డబ్బునుబట్టి కొలవరు. ప్రపంచం మొత్తంలో సామ్యవాదం రావాలి, నిజమే. కాని, మావో మహాశయుని రక్తదాహం సోషలిజం తెస్తుందా? మానవతను మంట కలుపుతుందా? సామ్యవాదం మానవుల పుర్రెలమీదా, కళేబరాలమీదా, శ్మశానాలమీదా వచ్చినా ఫరవాలేదంటాడాయన. శాంతంగా జీవించే జాతిలో కల్లోలం లేపి, తద్వారా ఆయన మతాన్ని పరులమీద రుద్ది వికటాట్టహాసం చేయడం ఆయన మతం. ఆ ఉద్దేశంతోనే చైనా మన దేశంమీద దండెత్తింది. వేలమందిని బలిపెట్టింది.
    వ్యక్తిలాగానే దేశమూ, జాతీ అవమానాన్నీ, ఓటమినీ అంగీకరించవు. బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ పోరాడతాయి. భారతదేశం రాజ్యకాంక్షతో ఇంతవరకూ పరాయి దేశంమీద దండెత్తలేదు. ఆత్మరక్షణకు తప్ప ఆయుధం ధరించలేదు.
    చైనా మిత్రద్రోహం చేసినప్పుడు దేశంలో ఒక మహోజ్వల చైతన్యజ్వాల రగిలింది.

    "గిరి మేల్కొన్నది, పురి మేల్కొన్నది
    గిరి గుహలో కేసరి మేల్కొన్నది
    గిరి పుర వనముల ధర మేల్కొన్నది
    నర నారీ సంతతి మేల్కొన్నది!"

    శాంతిని కోరి, శాంతికొరకై నిర్విరామంగా కర్షి చేసిన మనదేశం దెబ్బతిన్న బెబ్బులివలె రణరంగానికి ఉరికింది.
    కొంపలు తగులబడుతుంటే స్పర్థలుమాని గ్రామమంతా ఒక్కటై అగ్గిని ఆర్పడానికి కృషి చేస్తుంది. ఒకడు నీరు తెస్తాడు. ఒకడు వాసాలు లాగుతాడు. ఒకడు తన ప్రాణాలనైనా లెక్కచేయక, అంటుకున్న కొంపల్లోనివారిని రక్షించడానికి అగ్గిలో దూకుతాడు. అలాంటి సమయంలో "కొంపలంటుకున్నాయర్రో!" అని అరచేవారుంటారు కొందరు. వారే కవులు. వారే రచయితలు, చైనా దండయాత్ర సమయంలో కవి కుమారులు కవితా శతఘ్నుల్ను కురిపించారు. రచయితలు కథలు, నవలలు, వ్యాసాలు వ్రాశారు.
    దండయాత్ర అంతం కావచ్చు. రెండు దేశాలూ మిత్రులైపోవచ్చు. కాని, భారతదేశపు గుండెకు తగిలిన ఈ గాయం భారతదేశం ఉన్నన్నాళ్ళూ ఉండేదే. ఇది గజినీ దండయాత్రవంటిది. అతడు మన విశ్వాసంమీద దండెత్తాడు. వీరు మన సంస్కృతిమీదా, మన నమ్మకాలమీద దండెత్తారు. ఏది ఏమైనప్పటికీ చిరస్థాయిగా నిల్చిపోయే ఈ గాయాన్ని పూర్వకాలంలో వీరులు పరిరక్షించుకున్నట్లు పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు కవిజోదులు కురిపించిన కవితా శతఘ్నుల్ను "రణభేరి"గా కూర్చాను. దాన్ని చందా నారాయణ శ్రేష్ఠిగారు ప్రచురించారు. 17 నవంబర్ 1963న పూజ్యులు, అప్పటి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డిగారు ఆవిష్కరిస్తూ, నన్నెంతగానో ప్రోత్సహించారు. వారికి నమోవాకములు.
    దేశం కుటుంబంలాంటిది. కుటుంబంలోలాగే అందులోనూ అనేక అంతః కలహాలు ఉండవచ్చు. కాని, ఆపద వచ్చినప్పుడు అన్నింటినీ మరిచి, అంతా ఏకమై ఆపదను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుంది. సరిగ్గా అదే జరిగింది - భారతదేశంమీద చైనా దండెత్తినప్పుడు. దేశం ఒక్క మనిషిగా ఆలోచించింది. ఒక్క మనిషిగా కార్యరంగంలోకి ఉరికింది. రచయితలంతా ఒకే అంశంమీద వ్రాశారు.
    అది నిరూపించడానికే ఒక్కొక్క భాషనుండి ఒక్కొక్క కవిత, ఒక్కొక్క కథ కూర్చి ఆ భాషకు సంబంధించిన రాష్ట్రంలో రక్షణకుగాను చేసిన త్యాగాలు తెలియజేస్తూ ఒక సంపుటి తయారుచేయాలనుకున్నాను. భారతదేశం మొత్తంలోని సుమారు నూరుగురు రచయితలతో పత్ర వ్యవహారం జరిపాను. చాలామంది రచయితలు సంతోషంగా తమ రచనల్ను పంపించారు. అనువాదం విషయంలో సహకరించారెందరో, అయితే, అస్సాములో ఎంతమంది రచయితలకు వ్రాసినా జవాబు రాలేదు. కేరళకు సంబంధించినంతవరకు ముగ్గురు ప్రఖ్యాత రచయితలు తమ రచనల్ను పంపుతామని ఎగ్గొట్టారు.
    ఇక కవితల విషయంలో ఆకాశవాణిపై ఆధారపడ్డాను. వారుమాత్రం నాకు సహకరించలేదు. కష్మీరీ, అస్సామీ, కేరళ కథల విషయంలో కూడా ఆయా రేడియోస్టేషన్ల సహకారం నిష్ఫలంగా అర్థించాను.
    రక్షణ కృషికి సంబంధించిన వివరాలకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ- ఆంధ్రప్రదేశం తప్ప - వ్రాశాను. కొన్ని రాష్ట్రాలనుంచి జవాబే రాలేదు. కొందరు పంపలేకపోతున్నందుకు విచారం వ్యక్తపర్చారు.
    కేంద్ర ప్రభుత్వపు సమాచారశాఖ అధికారులను గురించి కొంత చెప్పాల్సి ఉంది. ఒక బాధ్యతగల అధికారి నా ప్రయత్నాన్ని చూచి హర్షించి, ఏదైనా ఒక కథ అనువాదానికిగాను తమకివ్వవలసిందన్నారు. వారికి గుజరాతీ కథ, దాని హిందీ అనువాదం ఇచ్చాను. రెండు నెలలవరకు వారి దగ్గరికి తిరిగాను. అనేకసార్లు టెలిఫోను ద్వారా మాట్లాడాను. కాని, "ఇవ్వాళ - రేపు" అని టలాయించారేగాని, ఈనాటికీ వారినుండి అసలు కథకాని, అనువాదంగాని లభించలేదు. అదృష్టవశాత్తూ హిందీ అనువాదం చేసిన వారివద్ద ఒక ప్రతి ఉండిపోయింది. వారి దగ్గరి నుంచి తీసుకొని అనువదించాను.
    ముఖ చిత్రానికిగాను యుద్ధపు చిత్రం ఒకటి సరఫరా చేయవలసిందని కేంద్రప్రభుత్వపు ప్రచారశాఖవారిని కోరాను. ఆ అధికారి నన్ను ఒక క్లార్కుకు అప్పగించారు. ఆయన చీదరించుకొని, "మా దగ్గర మనుషులు లేరు. మనుషుల్ను తెచ్చుకుని దింపి చూసుకోండి, బోలెడున్నాయి మీద, ఎవడు దింపుతాడు?" అన్నారు. మళ్ళీ ఒకటి రెండుసార్లు ప్రయత్నించి విఫలుణ్ణైనాను. ఆ తరువాత ఢిల్లీవారికి వ్రాస్తే ఒక నెల తరువాత జవాబు వచ్చింది - "మా దగ్గర చాలా పటాలున్నాయి. ఎన్నుకోడానికి ఢిల్లీ రావలసింది. లేదా, ఢిల్లీలో తమ ప్రతినిధికి ఈ పని అప్పగించవలసింది" అని.
    ఒక్క పటం కోసం ఢిల్లీ వెళ్ళే స్తోమత లేక ఆ ప్రయత్నం మానుకున్నాను. ప్రస్తుత ముఖచిత్రం బి.పి రాజుగారు వేసింది.
    అధికారులు సహకరించినా, సహకరించకున్నా రచయితలు, కవులు ఎంతగానో సహకరించారు. తమ కవితలను పంపి వానిని రణరంగంలో చేర్చుకోవడానికి పంజాబీ రాజ్యకవి. శ్రీమతి ప్రభుజోత్ కౌర్, అస్సామీ కవయిత్రి శ్రీమతి నళినీ బాలాదేవి, మరాఠీ కవయిత్రి పద్మావతీ గోళే. కేరళ కవి శ్రీ ONV కురుప్ అనుమతించినప్పటికీ - అన్ని భాషల నుండీ కవితలు అందనందున, వాటిని ఇందు చేర్చలేకపోయినందుకు ఎంతో విచారిస్తున్నాను.
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పూజ్యులు కాసు బ్రహ్మానందరెడ్డిగారిని 2-5-65న ఒక సందేశం ఇవ్వవలసిందని విన్నవించాను. వారికి తీరుబాటులేని పనులున్నప్పటికీ అదేరోజు సందేశం వ్రాసి, పోస్టులో పంపారు. వారికెంతో కృతజ్ఞుణ్ణి.
    ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామాత్యులు శ్రీ బి.వి. గురుమూర్తిగారిని ఆంధ్రుల త్యాగాన్ని గురించిన వ్యాసం వ్రాసి ఇవ్వవలసిందని అర్థించగానే వ్రాసి ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.
    ఈ పుస్తకం తయారు కావడానికి ఎంతోమంది సహాయం చేశారు. అందులో అన్ని భాషల, అన్ని ప్రాంతాల రచయితలూ, మిత్రులూ ఉన్నారు. వారందరి పేర్లు ఇవ్వడం సాధ్యపడదు. వారి సహాయమే లేకున్నట్లైతే ఈ పుస్తకం వచ్చేదికాదు.
    ఈ విషయంలో ముఖ్యంగా పేర్కొనవలసినవారు సందెపూడి రామచంద్రరావుగారు. వారు ఇందు విషయంలో ఎంతో సహకరించడమే కాకుండా భారాన్నెంతో వహించారు. వారి సహకారమే లేకున్నట్లైతే ఈ పుస్తకం వెలుగు చూసేదికాదు.
    వారందరికీ హార్ధిక నమోవాకములు.
    రామాయణంనాటి నుండి నేటివరకూ భారతీయాత్మ ఒక్కటేనని సాహిత్య కృషి సాగుతూంది. నా ఈ "రణరంగ" కృషికూడా అందుకు తోడ్పడితే ధన్యుణ్ణి.

                                                                                             దాశరథి రంగాచార్య.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.