Home » kommanapalli ganapathi rao » Grand Mastar
రేష్మి గొంతులో కలవరం అర్థమైంది.
"ఎందుకు రేష్మి? మీకు పుట్టని బిడ్డనయినా తల్లి మనసుతో స్వీకరించగల మీరు పాపం చేయగలిగే మనిషిలా యెందుకు మాట్లాడుతున్నారు?"
"నేను మీనుంచి ఆశించింది నా ప్రత్యర్థులపై దాడిని. అందుకే జూలీ గురించి మీకు పూర్తిగా చెప్పలేకపోయాను."
అది ప్రకంపన కాదు... అణువంత అలజడిలా స్పందిస్తూ అడిగాడు "చెప్పండి అదేమిటో?"
"జూలీ క్షేమంగా నా దగ్గరే వుంది."
"వ్వాట్?"
"ఇక్కడే యిప్పుడు నా ఇంట్లోనే ఉంది. మీరొచ్చారని చెప్పేసరికి ఏడ్చింది. డాడీని రప్పించమంటూ మారాంచేసి నిద్రపోయింది. మీరెక్కడున్నారో తెలీక..."
శ్రీహర్ష కళ్ళలో ఓ నీటిపొర నిలిచింది.
చిత్రమైన సందిగ్ధత.
ఇప్పుడా? ఇంతకాలం తర్వాత అదీ రేపేమయ్యేదీ తెలీని స్థితిలో తను కలుసుకోవాలా?
అశాశ్వత మజిలీలో అడుగుపెడుతూ శాశ్వతమైన బంధంకోసం అంగలార్చుకుపోయే పాపకి తను కనిపించాలా?
బూడిద కాబోతున్న స్మృతిలా సహజమరణాన్ని నిషేధించుకుని మృత్యునేపథ్యంలో ఒక్కో అడుగు వేస్తూ కదులుతున్న తను ఈ క్షణంలో జూలీని ఎత్తుకుని జోలపాట పాడాలా? లేదు రేష్మి... అది నాకు సాధ్యంకాదు.
"మాట్లాడరేం?"
"వద్దు రేష్మి! ఓ వారం తర్వాత."
"ఇప్పుడేమైంది?"
"పాప నిద్రపోతూందిగా!"
"కాని ఆ నిద్రలోనూ నాన్న కలలతోనే కలవరపడుతూంది."
"నన్నిలా కలలతోనే కలుసుకోనియ్..." మరేదో చెప్పబోయాడు.
ఇంతలో కెవ్వుమన్న ఆర్తనాదం.
అది వినిపించింది రిసీవర్ లోంచే.
ఉద్విగ్నంగా పైకిలేచాడు. "రేష్మి... ఏమయింది...? మాటాడవేం?"
"వింటావా?"
ఉలిక్కిపడ్డాడు శ్రీహర్ష.
"ఎస్ మిస్టర్ షా! ఇట్స్ పుజో" వజ్రాయుధపు శబ్దంలా వినిపించింది. "ఇంతకాలానికి నిన్నిలా కలుసుకోవడం ఆనందంగా వుంది."
శ్రీహర్ష మెదడుతంత్రులపై వినిపిస్తున్న యుద్ధభేరీ నినాదం.
కొన్ని క్షణాలు శవయాత్ర ప్రశాంతతను గుర్తుచేస్తూ దొర్లిపోయాయి.
"రేష్మి యిప్పుడు స్పృహతప్పి పడిపోయింది మిస్టర్ షా! నీ బిడ్డ జూలీ నా వేళ్ళమధ్య చిన్న వానపాములా నలిగిపోతూంది. వెంటనే కల్సుకుంటావా?"
ఓ ధ్యానంలా కళ్ళు మూసుకున్నాడు శ్రీహర్ష.
విషజిహ్వ నిశ్శబ్ద సమరం అఖాతమవుతున్న గుండె సరిహద్దు దృశ్యాదృశ్య మృత్యురేఖల ఆహ్వానం.
"అభ్యంతరంలేదు పుజో! జూలీకోసం మాత్రమేకాదు. చిరకాల ప్రత్యర్థిగా వినిపిస్తున్న నీ శక్తిని తెలుసుకుంటానికి సైతం ఉత్సాహంగా వుంది. చెప్పు. సంగ్రామానికి కాలం, ప్రదేశం కూడా నువ్వే నిర్ణయించు."
చెప్పాడు పుజో.
"ఈ రాత్రికే... రేపు తెల్లవారకముందే నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నాను శ్రీహర్ష. ఎందుకంటే సుదర్శనరావుకి మాటిచ్చాను. అతడి పర్యటనలో తొలిసారి అందరూ యిచ్చే ఫ్లవర్ బొకేలకన్నా ముందు నీ శవాన్ని కఫిన్ బాక్స్ లో అందిస్తానని."
"నిజంగా"
"యస్. లక్ష డాలర్ల ఒప్పందం."
"కఫిన్ బాక్స్ సిద్ధంగా వుంచావా"
"మేకులతో సహా"
"వెల్ కమ్."
* * *
తెల్లవారుజామున మూడుగంటల సమయం.
విశాఖపట్టణానికి సమీపంలోని రిషివేలీ ప్రాంతంలో అడుగుపెట్టాడు శ్రీహర్ష.
సముద్రహోరు.
సమరానికి ముందే సిద్ధం చేయబడ్డ గోరీల్లా గుట్టలు, పొదలూ ఆ ప్రదేశ స్మశాన స్తబ్ధతను నింపుతున్నాయి.
సన్నని కాలిబాటను దాటి ఏటవాలుగా వున్న గుట్టపైకి నడిచాడు బ్రహ్మజెముడు మొక్కల మధ్యగా.
చీకటి ప్రేవుల్ని బ్లేడ్లతో చీల్చుతున్నట్టు కీచురాళ్ళ రొద.
"పు... .జో" కేకపెట్టాడు శ్రీహర్ష.
ముందు ధ్వనిలా మొదలై క్రమంగా ప్రతిధ్వనిగా విస్తరించి పిశాచ గణ హాహాకారంలా అది ప్రకృతిని చేరుకుంది.
"క... మా... న్... నేను వచ్చాను."
చీకటి కరిగేట్టు సముద్రం మరిగిపోయేట్టు మరోసారి అరిచాడు.
నిశ్శబ్దం.
క్షణంపాటు గాలి గడ్డ కట్టుకుపోయింది.
వెనువెంటనే ఓ పసికందు ఆర్తనాదం.
నాడీమండలాన్ని కోస్తున్నట్టు జూలీ గుక్కపెట్టి ఏడుస్తుంది.
ఉద్విగ్నంగా కదిలాడు శ్రీహర్ష.
ఎక్కడోకాదు. ఈశాన్య దిక్కున వున్న వెదురు పొదలవేపునుంచి వినిపిస్తూందది.
"ఆగు."
ఆదేశంతో గుట్ట కంపించింది.
ఆగ్నేయ దిశలో సరిగ్గా పదిహేను అడుగుల దూరంలో నిలబడివున్నాడు పుజో. మెరుపులా పైకి లంఘించే సింహంలా.





