Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ సత్యనారాయణ శాస్త్రి, మధునాపంతుల
ఆవాహనము
అదనెంచి మధియించు నందాఁకఁ గడుపులో
నమృతంబు దాఁచుకొన్నట్టి యబ్ధి
తఱి వచ్చి చిలికెడి వఱకు దారువు వోలెఁ
బడియుండు తీరుఁ జేపట్టు నరణి
సమయమ్ము చూచి యుత్తముఁడు చెప్పెడిదాఁకఁ
దన విక్రమముఁ గప్పుకొనెడి హనుమ
యుత్తరాయణ సువేళోదయం బగుదన్కఁ
దన దీప్తి ముకుళించుకొనెడి తరణి.
యసదృశ తపస్సమాధి భంగాంతరమునఁ
గాక కను విచ్చనట్టి పినాకపాణి
దురవగాహ గభీర యుద్ధర కృపాణి
మజ్జనని పుణ్య భారత మహిత ధరణి.
ఎది! యేది!! యొకసారి యొక్కపరి
తల్లీ! చల్లనౌ నీదుకన్
తుదఁ గ్రోధారుణిమంబు చిందు
మదె విందు ల్వోయ నా బోఁటిక
ర్మ దరిద్రాయకు నోట; నీ కినుక
చాఱల్ మేరగా నమ్రతన్
ముదమారన్ భవదంఘ్రులం
దడవికొందున్ భారతోర్వీ ప్రసూ!.
వెలిదమ్ముల్ నెలరేలు మల్లె విరులున్
బెంపారు ముత్యాల పే
రులుఁ గ్రొమ్మించులు మంచు పొంగులును
నీ రూపంబుగా నెంచి క
న్నులలో వత్తిడు కొంచు నిన్నుఁ
గనుఁగొందున్ నీ పదాబ్జాత రే
ఖలు మత్ఫాలతలంబు సోఁకి
యెఱుపెక్కన్ జక్క దీవింపవే!.
* * * *





