Home » kommanapalli ganapathi rao » Grand Mastar
ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు.
"నా ఆలోచన సమంజసమో కాదో నాకు తెలీదు. కాని కోరేదొక్కటే. పాణి నీకు ఇప్పటికి మంచి స్నేహితుడు మాత్రమే కావచ్చు. రేపు పాపకి మంచి తండ్రీ కాగలడనిపిస్తుంది."
అప్రతిభురాలై చూసింది.
"నేరవ్యవస్థలో తిరిగిన నేను సెంటిమెంట్స్ గురించి మాట్లాడటం నీకు విచిత్రంగా తోచినా ఇది నిజం రేవతీ. పాణిని నేను చూసింది ఒక్కసారే కావచ్చు. కాని అతనిలో ఆర్ద్రత గమనించాను. అంతకుమించి పాణి సమక్షంలో పాపకళ్ళలో కనిపించిన నిబ్బరాన్ని గుర్తించాను. మనకున్న స్వల్ప పరిచయంలో ఇలా నేను మాటాడటం తప్పో ఒప్పో నాకు తెలీదు. చెప్పాలనుకున్నది చెప్పేసాను."
పైకి లేచాడు.
ఆమె ఇంకా తేరుకోలేదు.
ఎక్కడివాడయినా, ఎందుకు కలిసినాగాని మనసుపొరల్ని స్పృశించడం అలవాటు చేసుకున్నాడు.
ఇక వెళ్ళిపోయేవాడే.
లల్లూ పరుగున వచ్చింది.
"అంకుల్" అంటూ అమాంతం చుట్టేసింది "నేను ఆడుకోడానికి వెళ్ళాను."
"లల్లూ" జూలీ గుర్తుకొస్తుంటే గుండెలకు హత్తుకున్నాడు "నువ్వెప్పుడూ యిలాగే ఆడుకుంటూ వుండాలి."
"మరి చదువుకోవడమో" మమ్మీ మాటలు గుర్తుచేసింది.
"పిచ్చిపిల్ల. నేనన్నది నువ్వెప్పుడూ ఆడుతూ పాడుతూ బ్రతకాలని."
"పాడుతూ కూడానా!"
"మమ్మీని నవ్వించే పాటలు."
"నాకు రావుగా."
"పాణి నేర్పిస్తాడు."
శ్రీహర్ష తలని దగ్గరకు లాక్కుని రహస్యంగా అడిగింది "అయితే పాణి అంకుల్ కి పాటలొచ్చా."
తలూపేడు.
"దేవుడు చెప్పాడా?"
"మరేం."
"అయితే డాడీ అంత మంచివాడన్నమాట."
లాలనగా ముద్దు పెట్టుకుని క్రిందికి దించాడు. "గుడ్! ఆ సత్యాన్ని మమ్మీకన్నా ముందే నువ్వు గుర్తించావు."
రేవతి విప్పారిత నేత్రాలతో చూస్తుండగానే బయలుదేరాడు.
"వెళతాను రేవతీ!"
"అలా అనకూడదు" లల్లూ కరెక్ట్ చేసింది "వెళ్ళొస్తాను అనాలి."
తిరిగి రాగలిగితే... నవ్వుకున్న శ్రీహర్ష సరాసరి హోటల్ రూమ్ కి వెళ్ళాడు.
భోజనం చేయాలనిపించలేదు.
మనసదోలా వుంది.
బాల్యం, యవ్వనం, లూసీ పరిచయం, జూలీతో ఆటలూ... హత్యలూ, పరుగులూ, శమంత్ లూ... ఒక్కొక్కరూ వరుసగా గుర్తుకొస్తుంటే...
ఎంత రాత్రిదాకా అలా గడిపాడో అతడికి గుర్తులేదు.
మరో ముప్పై ఆరుగంటలు...
ఉపప్రధాని ఈ నగరంలో అడుగుపెడతాడు.
తన లక్ష్యంలో ఆఖరి వేట ప్రారంభమవుతుంది.
ఎవరి ముగింపు ఎవరు రాసినాగానీ చాలా నికృష్టంగా కడతేరిపోవాల్సిన తను చాలామందికి ఆరాధ్యుడైపోయాడు.
ఎంత ఉత్సాహంగా వుందని...
మరణ పోరాటమూ యింత ఆహ్లాదకరమైందని యిప్పుడిప్పుడే అర్థమౌతుంది.
ఫోన్ రిసీవర్ అందుకున్నాడు.
నిజానికి అవసరంలేదు. కాని రేష్మీతో కూడా మాట్లాడాలనిపించింది "హలో!"
"మీరా?" రేష్మి గొంతు ఆరాటంగా పలికింది. "నేను మీకోసం ఎదురుచూస్తున్నాను."
అర్థంకాలేదు శ్రీహర్షకి.
"మాట్లాడరేం... అదికాదు. మీరోసారి అర్జెంటుగా రారూ"
"దేనికి."
వస్తే చెబుతాను."
నవ్వుకున్నాడు ఆమె గొంతులో ఉత్సాహాన్ని గురించి. రాజీవ్, మహేంద్రలకి తగిలిన చావుదెబ్బ ఆమెకు చాలా ధైర్యాన్నిచ్చింది. "ప్లీజ్! రారూ."
వెళ్ళాలనిపించలేదు "నాకోసం పోలీసులు గాలిస్తున్నారని మీకు తెలుసుగా రేష్మీ!"
"తెలుసు."
"అలాంటప్పుడు రిస్కెలా తీసుకోను?" ఇది సమస్య కాదని, అసలు యిలాంటి సమస్యని తను పట్టించుకోడని రేష్మికేకాదు రేష్మికి తెలుసని అతనికీ తెలుసు "చెప్పండి రేష్మీ?"
క్షణం విరామం తర్వాత అందామె. "శ్రీహర్షా! మీరెలాంటి ఆపదలో కూరుకున్నదీ నాకు తెలుసు. అయినా యిప్పుడే ఎందుకు రమ్మంటున్నానూ అంటే నేను చేసిన ఓ పాపాన్ని మీకు తెలియచెప్పి మీ క్షేమంకోసం అర్థించాలనుకుంటున్నాను."





