Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



                           శ్రీ వేంకటశేషశాస్త్రి, గడియారము

    జయపతాక

    అరెరే! యెంతటి మోస మెంచి
        రిపు డున్నట్లుండి చైనీయ ము
    ష్కరు లీ భారతభూస్వతంత్రకు!
        నేస్తంబాడి నమ్మించుచున్
    గుఱిగా వెన్నున బాకుపోటటు
        ఫిరంగుల్ ప్రేల్చు సైన్యాలతో
    సరిహద్దుం గడ లాక్రమించిరి
        దురాశాధూత దుర్భావులై.

    మోస మదొక్కటా! ప్రతిన పూనిన
        యచ్చపుఁ "బంచశీల" కు
    ద్వాసనచెప్పి; బుద్ధునిమతంబున
        కెగ్గొనరించి, స్నేహవి
    శ్వాసము లగ్గిఁబెట్టిన కసాయులు
        నేఁడిటు వచ్చినారు చై
    నా సరదార్లు ధర్మపరిణద్ధము
        భారతమున్ జయింపఁగన్.

    శాంత్యహింసాత్మ ధీ ధర్మ సత్యబలము
    సాధనముగాఁగ స్వాతంత్ర్య సమరజయము
    గొన్న మనపై కవే తుపాకులు ఫిరంగు
    లెత్తుకొని వచ్చి; రెట్లు జయింపఁగలరొ!.

    ఆయతవిక్రమక్రమ ని
        రంకుశ వీరవిహారులైన రా
    మాయణభారతస్తుత
        మహారథులన్ గనినట్టి భారత
    శ్రీ యిపుడేమి కాన్పుడిగి
        చేవ దొరంగెనె? నేఁడు లేరె చై
    నీయుల కుత్తుకల్ దఱిగి
        నెత్తురు లానెడు వీరసింహముల్!

    ఉన్నారిప్పుడుఁగూడ నాఁటి
        యభిమన్యుల్ బాలచంద్రోపముల్
    కన్నయ్యల్ రణతిక్కనల్;
        కలరు ఘూర్కాలున్ మరాటాలు సం
    పన్నక్షాత్రులు రాజపుత్ర
        మలబార్ పంజాబు సింహంబు లీ
    యన్నల్ తమ్ములు చుట్టుముట్టి
        రిపుసైన్యశ్రేణి చెండాడరే!

    భారతభూప్రతిష్ఠ నిలుపు౬
        బురుషోపమ ధీరుమూర్తులై
    పోరిన వీరమాత లభిభూత
        సపత్నులు వీరపత్నులు
    న్నారిటఁ గార్యఖడ్గనిపుణల్
        తొలినాఁడును నేఁడుగూడఁ, ద
    ద్వీర విహారముల్ తుడిచిపెట్టవె
        ముట్టిన శత్రుసేనలన్.

    వీరక్షేత్రము, వేదశాస్త్ర విలస
        ద్విజ్ఞానవిద్యా కళా
    ధారక్షేత్రము - భారతంబు -
        హిమవద్గంగాదిక క్షేత్ర తీ
    ర్థారామస్తుత పుణ్యభూమి -
        ఋషి దేవావాస; మిచ్చోట చై
    నారక్షో రణభేరి మ్రోగిన
        నకాండ క్షోభ ముప్పొంగదే!

    ఈ పరిస్థితి రాదు - రానీయకుండఁ
    జూచుచున్నాఁడు శివుడు త్రిశూలధారి
    శీతనగముపైఁ గైలాసశిఖర మెక్కి
    ప్రమథగణముతో నిజధర్మపత్నితోడ.

    చేతఃప్రీతిఁ బ్రపంచ రాజ్యపతులు
        జేదోడుగా భారత
    స్వాతంత్ర్యంబున శాంతి సౌఖ్యముఁ
        బ్రజాస్వామ్యంబు రక్షింపఁ జే
    సేత సైనిక శస్త్ర సాధన ధన శ్రీ
        యిచ్చుచున్నారు; చై
    నా తంత్రంబులు సాగ నీ కిపుడు
        సన్నాహంబు సంధింపుఁడీ!.

    'ఆయతమైన ధర్మబల
        మండగనున్నది, దేశదేశముల్
    సాయము చేయుచున్న' పని
        జాగొనరింపఁగ రాని దిప్డు చై
    నీయులతోడి యుద్ధ; మవి
        నీతియు వంచన యస్త్ర శస్త్ర పై
    న్యాయతిఁ గూర్చి పేర్చు నభియాతి
        యలంతుల వీగిపోవునే?.
    ఐన, భారతజాతి యేకమయి
        సర్వాయత్తత నిల్చి, నె
    హ్రూ నేతృత్వముక్రింద
        జాతి మత వైరుద్ధ్యాదుల వీడి, గాం
    ధీ నిర్ణీత పథంబున జయము
        సాధింపంగ మున్ దూకుబో
    చైనా దాడి మరల్చు టెంత
        భరత స్వాతంత్ర్య యోధాళికిన్.

    రణము గాదు-ప్రజాస్వామ్య రాజసూయ
    యజ్ఞ మిది-సాగుచున్న దత్యంత దీక్ష;
    ధన కనక శస్త్ర వస్తు వహనము లెల్లఁ
    దెచ్చి యర్పింపుఁ డో భారతీయులారా!.
    
    రాష్ట్రపతి కృష్ణుఁ, డిందు సర్వప్రధాని
    విజయుఁడే యెందు, రక్షణవిధికి చ్యవనుఁ
    డల మహారాష్ట్ర వీరాపరావతార;
    మగుట ధర్మమే గెల్చు, జయంబు మనదె!.

    హిమగిరి యన్న లోక జనయిత్రికి
        దుర్గకుఁ బుట్టి నిల్లున త
    ద్విమల ఝరీ దరీ విపిన వీధి
        విహారము లామె కింపు; ర
    మ్యము లవియెల్ల నేఁడు
        రిపు మర్దితముల్ శవ రక్త మాంస దూ
    ష్యము లగు దృశ్య మామె
        హృదయంబున నగ్గి రగుల్ప కుండునే!.

    కోయని హుంకరించి యదిగో
        రణదుర్గ కరంబునన్ ద్రిశూ
    లాయుధ మెత్తి, మున్ను
        మహిషాసుర శుంభ నిశుంభ ముఖ్య దై
    తేయులఁ బోలె నిప్పుడు
        వధించుచు నున్నది మూగియున్న చై
    నీయుల; నింక భారతము
        నిర్గత శాత్రవమై వెలింగెడిన్!.

    కనుక నంతిమ విజయమ్ము మనది నిజము
    దైవబలముతో మనకుండె ధర్మబలము
    ప్రబల జాతీయతా ప్రజాబలముఁ బెంచి
    శాత్రవులఁ దోలి యెత్తుఁ డీ జయపతాక!.

                                         *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.