Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta



                                                   పదిహేడవ అధ్యాయము

                                      శ్రద్ధాత్రయ విభాగ యోగము
    అర్జున ఉవాచః

        యే శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః
        తేషాం నిష్ఠా తు కా కృష్ణ! సత్త్వ మహోరజస్తమః    1

    కొందరు శాస్త్ర విధిని వదలుతారు. శ్రద్ధగా పూజిస్తారు. కృష్ణా! వారి నిష్ఠా సాత్వికమగునా! రాజసమగునా!
    
    శ్రీ భగవానువాచః

        త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా
        సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు    2

    శ్రద్ధ మూడు విధములది. అది మానవుల స్వభావము అది సాత్వికము, రాజసము, తామసము అను మూడు విధములు.

        సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధాభవతి భారత!
        శ్రద్ధామయో -యం పురుషః యో యచ్ఛ్రద్ధ స్స ఏవ సః          3

    అర్జునా! గుణమును బట్టి శ్రద్ధ అగుచున్నది. పురుషుడు ఎట్టి శ్రద్ధ గలవాడో, శ్రద్ధయు అట్టిదే అగుచున్నది.

        యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః
        ప్రేతాన్ భూతగణాంశ్చన్యే యజంతే తామసా జనాః    4

    సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతములను, భూతగణములను భజింతురు.    

        అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః
        దంభాహంకార సంయుక్తా కామరాగ బలాన్వితాః    5

    శాస్త్ర విహితము కానట్టి ఘోరతపమును ఆచరించు జనులు దంభ అహంకారము కలవారు. కామక్రోధ బలాన్వితులు.

        కర్శయంత శ్శరీరస్థం భూతగ్రామ మచేతసః
        మాం చై వాంతశ్శరీరస్థం తాన్ విద్ధ్యాసుర నిశ్చయాన్       6

    దేహమందున్న జీవాత్మను, అంతర్యామిగా నున్న నన్ను, కృశింపచేయువారు అజ్ఞానులు. వారిది అసుర స్వభావము.

        ఆహార స్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః
        యజ్ఞ స్తప స్తథా దానం తేషాం భేదమిమం శృణు    7

        అందరి ఆహారము మూడు విధములు అగుచున్నది. యజ్ఞము, తపము, దానము - వీనిలో గూడా భేదములు వున్నవి. వినుము.

        ఆయుస్సత్త్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః
        రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహార స్సాత్త్విక ప్రియాః    8

    ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతిని పెంచునవియు, పాలు, చక్కెర మున్నగు రసపదార్థములు, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములు హృద్యములు సాత్వికులకు ప్రియములైన ఆహారములు.

        కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్షణ రూక్ష విదాహినః
        ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకా మయప్రదాః    9

    చేదు, పులుపు, ఉప్పు, కారపు రుచులు ఎక్కువ వేడివి, మాడినవి రాజసులకు ఇష్టమైన పదార్థములు. ఇవి దాహము, దుఃఖము, చింత రోగములను కలిగించును.

        యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్
        ఉచ్చిష్టమసి చామేధ్యం భోజనం తామసప్రియమ్    10

    సగము ఉడికినవి, రసహీనములు, దుర్గంధ యుక్తములు, పాచిన, ఎంగిలి, అపవిత్ర పదార్థములు తామసులకు ఇష్టమైనవి.

        అఫలాకాంక్షిభి ర్యజ్ఞః విదిదృష్టో య ఇజ్యతే!
        యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః    11

    ఫలాపేక్ష లేనిదియు విధ్యుక్తమును స్థిర చిత్తమున చేసినదియు సాత్విక యజ్ఞము అనబడును.

        అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్
        ఇజ్యతే భరతశ్రేష్ఠ! తం యజ్ఞం విద్ధి రాజసమ్    12

    ఆడంబరము కొరకు, నిష్ట లేక, ఫలాపేక్షతో చేయునది రాజస యజ్ఞము.

        విదిహీన మసృష్టాన్నం మంత్రహీన మదక్షిణమ్
        శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే    13

    విధి హీనము, అన్నదానము, మంత్రము, దక్షణ, శ్రద్ధలేనిది తామస యజ్ఞము అనబడును.

        దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవమ్
        బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్చతే    14

    దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించునదియు, పవిత్రత, నిరాడంబరము, బ్రహ్మచర్యము అహింసతో కూడినవి శారీరక తపస్సులు.

        అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
        స్వాధ్యాయాభ్యాసనం చైవ వాజ్ఞయం తప ఉచ్చ్యతే    15

    ఉద్వేగము కలిగించనిది, సత్యమైనది, ప్రియము, హితమైన వాక్కు, వేదాధ్యయనము, వాఙ్మయతపస్సు అనబడుచున్నవి.

        మనః ప్రసాద స్సామ్యత్వం మౌన మాత్మ వినిగ్రహః
        భావసంశుద్ధి రిత్యేతత్ తపో మానస ముచ్యతే    16

    ప్రసన్నమానసము, సౌమ్యత్వము, మౌనము, ఆత్మనిగ్రహము అంతఃశుద్ధి, మానస తపస్సులు.

        శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః
        అఫలాకాంక్షిభి ర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే    17

    శారీరక వాఙ్మయ మానసిక తపస్సులు, ఫలాపేక్ష లేని యోగులు అతిశ్రద్దతో ఆచరించునప్పుడు సాత్విక తపస్సులు అగుచున్నవి.

        సత్కార మాన పూజార్థం తపో దంభేన చైవ యత్
        క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చల మధ్రువమ్    18

    తన సత్కారము కొరకు డాంబికముగా చలముగా అధ్రువముగాయైన తపస్సు రాజసము అగుచున్నది.

        మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః
        పరస్యోత్సాదనార్థం వా తత్తామస ముదాహృతమ్    19

    మొండిగా బాధలకు ఓర్చి ఇతరులకు కీడు కలిగించుటకు చేయునది తామస తాపస్సు అనబడును.

        దాతవ్యమితి యద్దానం దీయతే -నుపకారిణే
        దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్    20

    ఇచ్ఛతో యిచ్చునది, ఉపకారము చేయనివానికి యిచ్చునది. దేశకాల పాత్రమైన దానము సాత్వికము.
    
        యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్ధిశ్య వా పునః
        దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్    21

    ప్రత్యుపకారము కొరకును, ఫలమాసించియు, విధిలేకను ఇచ్చు దానమును రాజసముగా గుర్తించునది.

        అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే
        అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతమ్    22

    దేశకాలములకు అనుగుణము కానిదియు అపాత్రమును, గౌరవము లేనిదియు, చులకన భావముతో ఇచ్చునదియు తామస దానము అగును.    

        ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణ స్త్రివిధః స్మృతః
        బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా    23

    ఓం, తత్, సత్ అని బ్రహ్మము మూడు విధములుగా చెప్పబడినది. ఆ బ్రహ్మనుండియే పూర్వము వేదములు, యజ్ఞములు ఏర్పడినవి.

        తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞ దాన తపః క్రియాః
        ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్    24

    అందువల్ల బ్రహ్మవాదులు యజ్ఞము, దానము, తపము- అను వానియందు నిరంతము 'ఓం' అని ఉచ్చరించియే విధానోక్త కర్మలను చేయుచున్నాను.

        తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః
        దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః    25

    మోకాములు యజ్ఞము, తపస్సు, దానము మున్నగు కర్మలను 'తత్' అను నామమును ఉచ్చరించచూ చేయుదురు.

        దద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే
        ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ! యుజ్యతే    26

    సద్భావమును సాధుభావమునను 'సత్' అనుపదమును ఉచ్ఛరింతురు. అర్జునా! ఉత్తమ కర్మాచరణమునందును 'తత్' శబ్దము ఉపయుక్తమగుచున్నది.

        యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే
        కర్మచైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే    27

    యజ్ఞము, తపస్సు, దానాది స్థితులందు 'సత్' ఉచ్చరింపబడును. అందుకు సంబంధించిన కర్మలందు గూడా 'సత్' ఉచ్చరించబడుచున్నది.

        అశ్రద్ధయా హుతం దత్తం తప స్తప్తం కృతం చ యత్
        అసదిత్యుచ్చతే పార్థ! న చ తత్ప్రేత్య నో ఇహ    28

    శ్రద్ధలేక చేయు హోమము, దానము, తపస్సు, ఇతర కర్మలన్నియును దానివలన బతికియుండగా గాని, తర్వాత గాని ఎట్టి ప్రయోజనము కలుగదు.

    శ్రద్ధాత్రయ విభాగయోగమను పదునేడవ అధ్యాయము ముగిసినది.

                                   ఓం శాంతిః శాంతిః శాంతిః   




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.