Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి
ఈశ్వరో -హ మహం భోగీ సిద్ధో -హం బలవాన్ సుఖీ 14
శత్రువును నేను చంపినాను. మిగిలినవారిని హతమార్తును. నేను ఈశ్వరుడను. భోగించువాడను. సర్వసిద్ధుడను. బలవంతుడను సుఖపరుడను.
ఆఢ్యో-భిజనవానస్మి కో -వ్యో -స్తి సదృశో మయా
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః 15
అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే -శుచౌ 16
నేను గొప్ప ధనవంతుడను. నన్ను మించినవాడు లేడు. నేను యజ్ఞదానాదులు చేయగలను, అని అజ్ఞనమును మోహితులగుదురు. అనేక చిత్తవిభ్రాంతులు గలవారు. మోహలాలసులు. కామ భోగముల కూడినవారు అశుచులు. నరకమున బడుచున్నారు.
ఆత్మ సంభావితాః స్తబ్ధాః ధనమాన మదాన్వితాః
యజంతే నామయజ్ఞెస్తే దంభే నావిధి పూర్వకమ్ 17
తను గొప్పలే చెప్పువారు మొద్దులు, ధనమదాన్వితులు. అవిధి పూర్వకముగా ఆడంబరము కొరకు నామమాత్ర యజ్ఞములు చేయుదురు.
అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః
మామాత్మ పరదేహేషు ప్రద్విషన్తో - భ్యసూయకాః 18
అహంకార బల దర్ప, కామ క్రోధములను ఆశ్రయింతురు. తమ దేహములందును, ఇతరుల దేహములందును, నేను ఉన్నానని గ్రహింపరు. నన్ను ద్వేషించుచుందురు.
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్
క్షిపామ్యజస్ర మశుభాన్ ఆసురీష్వేవ యోనిషు 19
ద్వేషించువారు. క్రూరులు, నరధములు. ఈ లోకమున నేను వారిని ఆసురీయోనులలోనే పడవేయుచుందును.
ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని
మామప్రాప్యైవ కౌంతేయ! తతో యాంత్యధమాంగతిమ్ 20
ఈ మూఢులు జన్మజన్మలు ఆసురీయోనులందునే జన్మింతురు. అర్జునా! నన్ను తలచరు. తుదకు నీచగతికి చేరుదురు.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామః క్రోధ స్తథా లోభః తస్మాదేతత్ త్రయం త్యజేత్ 21
కామము, క్రోధము, లోభము - వివి మూడు విధముల నరక ద్వారములు. ఇవి ఆత్మ వినాశకములు. కావున యీ మూడింటిని త్యజించవలెను.
ఏ తైర్విముక్తః కౌంతేయ! తమోద్వారై స్త్రిభిర్నరః
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిమ్ 22
అర్జునా! ఈ మూడు చీకటి ద్వారములనుండి విముక్తుడైనవాడు తనకు శ్రేయస్సు గలుగు కార్యములనే చేయును. చివరకు పరమ గతిని పొందును.
యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ 23
శాస్త్రవిధిని వదలి ఎవడు కోరికలచే ఆటలాడునో వానికి సిద్ధి లభించదు. సుఖము లభించదు. పరమగతి లభించదు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకార్తు మిహార్హసి 24
కావున కర్తవ్య, అకర్తవ్యములను నిర్ణయించుటకు, శాస్త్రమే ప్రమాణమగుచున్నది. శాస్త్రములందు విధించిన దానిని తెలియుము. దాని ప్రకారము కర్మలను ఆచరించుము.
దీపిక:
భగవద్గీత - జగత్తుగీత, లోకగీత, మానవగీత, మహాగీత. ఇహపరలోకముల తీరును, ఆచరింపవలసిన విధులను, సత్య మార్గమును తెలియపర్చుచున్నది. గీత సత్యము. సత్యమునకు క్షయములేదు.
దైవాసుర సంపద్విభాగయోగము మానవుని దైవాసుర సంపదలను గురించి వివరముగా తెలియపర్చినది.
గుణత్రయ విభాగములో, మానవుల స్వభావమును బట్టి మూడుగా విభజించినాడు. ఈ విభాగమున రెండుగానే విభజించినాడు. ఒకడు సన్మార్గుడు, రెండవవాడు దుర్మార్గుడు ఒకనిది దైవీ సంపద. రెండవ వానిది ఆసురీ సంపద. అట్లనగా రాక్షసనీతి, రాక్షస సంపద, మన పురాణములందు అనేకమంది రాక్షసులు వున్నారు. రావణుడు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, భస్మాసురుడు, త్రిపురాసురుడు మున్నగువారు.
మానవజాతి అదృష్టమో దురదృష్టమో తెలియదుగాని, రాక్షసులదే ఆధిపత్య మగుచున్నది. పాపము పెత్తనము చేయుచున్నది. దుష్టనీతి ప్రభుత్వమును నడిపించుచున్నది. అధర్మము పెరిగినపుడు స్వామి అవతరిస్తున్నాడు.
ఇట్లు ఎన్నిసార్లు అధర్మము పెరిగినదో, స్వామి ఎన్ని అవతారాలు ఎత్తినాడో మనకు తెలియదు. ధర్మానికి గ్లాని సంభవిస్తూనే యుంటుంది. స్వామి అవతరిస్తూనే యుంటాడు.
ఈ అధ్యాయములో కృష్ణపరమాత్మ ఆసురీ సంపదను గురించియే ఎక్కువ చెప్పియున్నాడు. బహుశా అదియే రాజ్యమేలునేమో! గ్రామమునుండి ప్రపంచము వరకు అసురులే రాజ్యమేలుచున్నారు. సురలు నోరు మెదపక పడియున్నారు. వీరు మూక బహు సంఖ్యాకులు. ఇది తెలిసియే స్వామి ఆసురీ సంపదను ఎక్కువగా వర్ణించినాడు. గత కొంతకాలముగా ఒక జాతి ప్రపంచము మీద పెత్తనము చెలాయించుచున్నది.
దైవన్యాయము తెలియదుగాని, ఏలిన ప్రతివాడును పతనము చెందుచున్నాడు. ఈ పాలన తరుష్కులతో ప్రారంభమైనది. ఐరోపావారు ఫిరంగులతో దిగినారు. తురుష్కుల ప్రాబల్యము తగ్గినది. ఐరోపావారు గత శతాబ్ది అర్ధభాగము వరకు పరిపాలించినారు. తోక ముడిచారు.
ప్రస్తుతము అమెరికా తోకాడిస్తున్నది. ఈ అధ్యాయములో చెప్పిన అన్ని దుర్లక్షణాలు అమెరికాను పట్టుకొని వేలాడుతున్నవి. స్వామి అమెరికా పసను గూడా తగ్గించినాడు. రానున్న కాలము ఆసియా దేశాలది కావచ్చును. వారు రాక్షసులు కాకుందురుగాక.
స్వస్తి ప్రజాభ్యః ఇది వేదపు ఆశయము. ప్రజలకు శుభములు కలుగును గాక.
దైవాసుర సంపద్విభాగ యోగము అను పదునారవ అధ్యాయము ముగిసినది.
ఓం శాంతిః శాంతిః శాంతిః





