Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ రంగారావు, మాదిరాజు
హిమజ్వాల
ఈ ఉషస్సాహిత్య వీధుల
రెక్క విప్పిన మొగిలు నీడలు!
ఈ నిశా నిద్రాంబరమ్మున
సాశ్రు శిఖల విషాద స్వరములు!
ఈ ప్రశాంత మహాకాశము ఒక్కసారిగ
మృత్యు తాండవ రవము విన్పించు నేమిది?
ఆ హిమాలయ కందరాసీమ మ్రోగెడి
కృతఘ్నతాభర శతఘ్నిచయ యత్నములు!
ఈ గడ్డపై వీచు శీతలవాయువులు
సదా సుమనోభిరామములు
రివ్వున దూసి చను పదను కత్తులవోలె
ఎదకు భాసించునవి యేమి?
ఆ హిమ భూమి కదలు సైనిక నేత్రములు
వదలు సర్పదృశాగ్ని కీలాచయమ్ములో!
పురాణ వీధీ చరన్మనోజ్ఞ దేవతా
సమూహ సమూహ దీపించు నివసనము
హత్యాబుద్ధి ఇట చరించెడి జీవులెవ్వరు?
సూర్యతేజము మ్రింగ నెంచెడి మబ్బు మూకలు!
శత పత్ర ముగ్ధ వదనముపైన
నెత్తురు గంట్ల వలె అంతలో
హిమ శీతల స్వచ్ఛ భూమిపై
అగ్ని కణముల వోలె భాసించి
మూకలు మూకలుగ వచ్చి పడు
కాల ముద్రా మూర్తు లెవ్వరు?
శాంత తేజో లీన రేఖాదేవి
హిమాచ్ఛ సుషమా ఫాలతలమున
అగ్ని కీలలు రక్త ఝరులు సృజింప
నెంచెడి చీకటి ముద్ద యెవ్వడు?
ప్రతి భారతీయుడు విడిచిన
ఒక్కొక్క కోష్ణ నిశ్వాసమ్ము
తమో రాత్రి వలె భయదమై
దీర్ఘమై హిమభూమి చుట్టినది!
ఒక్కొక్క హృదయమ్ము రవి
బింబ సదృశ తేజస్ఫూర్తి
చీకటి శవము కాల్చగా
పండు నిప్పులను చెరగినది!
ఉదయాస్తమయ దివా రాత్రములు
బుతువులు కామనవ కాస్థానములు
క్షణములు, త్రుటిలో మరచి సర్వము,
ప్రదీప్తమతియై; గగనమెత్తున
ఫణసహస్రము విప్పి నా జాతి
నిలచినది కాలభుజగము రీతి.
నిప్పు గప్పిన నివురు గాలికి లేచెను
ఎవని చూచిన ఒక్కొక్క డగ్నిగోళము!
ఎవని హృదయము ఎంచిన దుఃఖభరితము
బాడబాగ్ని వహించు మహా సముద్రము!
స్వేచ్చా సమాజ రిరక్షా వ్యగ్రమై
నా దేశమే చైతన్య సంభృతమై
మేల్కొని జ్వాలవలె శతకోటి ముఖముగ
లేజో సహ్య మయ్యెను శత్రుకోటికి!
కొండవలె నిలిచి కదలిక లేక
కలల తూగెడు జాతి కాదిది.
చెలియలి కట్ట ఎరుగని వార్నిధి
నిత్య భాస్వర దేవతామతి.
మహాదాహము గొన్న కాలము
రక్త ఝరులను కోరుతున్నది
కాలమును కబళించనీయము
ఖడ్గ వ్యూహము విభేదింతుము!
ఎదపై నిప్పుల కుంపటి
దింపిన ఆ కృతఘ్నులను
తుదముట్టింపగ త్వరగా
హిమ జ్వాలలను ఆర్పగ
జ్యోతిర్ధూమ జల సంభృత
నవ ఝంఝాహంకృతితో
ఉరుములతో మెరపులతో
రణవ్యూహ నవమతితో
కదలుము నేఫా ప్రాంతము!
తరలుము లడక్ భాగము!
* * * *





