Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    వేదిక చాలా ఎత్తున కట్టారు. అందరికీ దర్శనం అవుతుంది. అది నిరంతర నిరీక్షణ. క్షణక్షణం ఉద్వేగం. అందరి చూపులూ రైలు కట్టవైపు.

 

    రైలు వచ్చింది. ఆవిరి ఇంజను - మూడు పెట్టెలు. వంటి రెక్కదాటి సభాస్థలిన ఆగింది. సభాస్థలంలో బండి ఆగడం అంతవరకు ఎరగం.

 

    మహాత్ముడు రైలు దిగారు. తలమీద గుడ్డ - ముఖాన ఇసుమంత తిలకం - బోసినోటి నవ్వు - కోరాకద్దురువంటి స్వచ్ఛవర్ణం - పైపంచె లేని వక్షం - మోకాళ్లవరకు బట్ట - పాదాలకు ఊరి చెప్పులు - కళ్లకు జోడు - ఒక జ్యోతివలె - ఒక వెలుగువలె - ఒక వెన్నెలవలె - ఒక నీరెండవలె సభవైపు సాగారు.

 

    మహాత్మునితో కాలినడకలోనూ - కర్మనడకలోను అందుకోవడం అసాధ్యం. వారు మెరుపులా సాగారు. అనాయాసంగా వేదిక ఎక్కారు.

 

    "గాంధీజీకి జై" దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.

 

    మహాత్ముడు రెండు చేతులు ఎత్తి వారించారు. అంతే. అంతా నిశ్శబ్దం.

 

    "వైసానహీఁ. అయిసా" అలాకాదు ఇలా:-

 

    "భారత్ మాతాకీ" - మహాత్ములు అన్నారు.

 

    జయనాదం దిక్కులు పిక్కటిల్లింది.

 

    అలా మూడుసార్లు అనిపించారు.

 

    "భాయియో ఔర్ బహనో! మైనే వచన్ దియాహికే యహాఁ సియాసత్ నహీఁ బాలూఁగా. మైఁ వచన్ కా పక్కాహూఁ.అబ్ హమ్ భజన్ కర్తే హైఁ" - సోదర సోదరీమణులారా! ఇక్కడ రాజకీయం మాట్లాడనని మాట ఇచ్చాను. నేను మాట తప్పను. ఇప్పుడు మనం భజన చేద్దాం. "మైఁ జైసా కరూఁగా అవుర్. కహూఁగా ఆప్ పైసా కహీయె అవుర్ కరియే" - నేను చేసినట్లు చేయండి. చెప్పినట్లు అనండి." మహాత్ముడు చేయి ఎత్తినారు. జనం ఎత్తినారు. మహాత్ముడు రెండో చేతితో తాళం వేసినారు. "రఘుపతి రాఘవ' భజన చేయించారు. మహాత్ముడు వేలుచూపి "నిశ్శబ్దం" అన్నారు. అంతా నిశ్శబ్దం. మహాత్ముడు మాట్లాడారు.

 

    "ఆప్ సబ్ ఖద్దర్ పెహానియే అవుర్ హిందీ సీఖియే. యహ్ సియాసత్ నహీఁ" - మీరు ఖద్దరు కట్టండి. హిందీ నేర్వండి. ఇది రాజకీయం కాదు.

 

    మహాత్ముడు చేతులు జోడించి నమస్కరించారు.

 

    వేలమంది ముకుళితహస్తాలతో నమస్కరించారు.

 

    మహాత్ములు వేదిక దిగారు. సాగారు. రైలు ఎక్కారు. రైలు సాగిపోయింది.

 

    "మహాత్మాగాంధీకీ జై
    భారత్ మాతాకీ జై
    హమ్ హిందీ సీఖేంగే
    హమ్ ఖాదీ పహనేఁగే" అనే నినాదాలు రైలు చప్పుడును మించాయి.

 

    అదొక మహోత్తమ అనుభూతి!

 

    అదొక చెరగని అనుభూతి!!

 

    అదొక నిత్యనూతన అనుభూతి!!!

 

    అనుభూతికి అక్షరాలు చాలవు. నాటినుంచి ఖద్దరు కట్టాను. ఖద్దరు వెక్కిరింత పాలయ్యేవరకు విధిగా ధరించాను. నా "మోదుగుపూలు" నవలలో చివరి వాక్యాలు-

 

    "స్టేషనులో రైలు కూసింది. మిలిటరీ స్టేషన్ లో ఆగింది. సిక్కు మిలిటరీ దిగింది. వారిముందు కులశేఖరరావు - రంగారెడ్డి ఖద్దరుదారులయి దిగారు."


                                     ఇరవయి


    "అగ్నిమీళే పురోహితమ్"

 

    తెలంగాణకు ఏనాడూ రాజకీయ ప్రతిపత్తి లేదు. తెలంగాణకు పోరాట ప్రతిపత్తి ఉంది. ఉద్యమ ప్రతిపత్తి ఉంది. విప్లవ ప్రతిపత్తి ఉంది. ప్రజాపోరాటాల మూలంగానే తెలంగాణ అంతర్జాతీయంగా విదితం అయింది. 1946-51 మధ్యకాలపు వార్తాపత్రికలు పరికిస్తే తెలంగాణా పోరాటం ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో వ్యక్తం అవుతుంది.

 

    భారత స్వాతంత్ర్య సంగ్రామం అరవయి ఏండ్లు జరిగింది. అయినా అయిదేళ్ల తెలంగాణా సాయుధ పోరాటమంతటి విప్లవాత్మకంగా కనిపించదు.

 

    భారత స్వాతంత్ర్య సమరం భావావేశంతో జరిగింది. అంగ్రేజు రాజ్యాన్ని తొలగించడమే దాని ప్రధాన లక్ష్యం.

 

    తెలంగాణా పోరాటానికి నిర్దిష్టమైన ఆర్ధిక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి.

 

    1. నిజాం రాజ్యం పోవాలి, 2. భూస్వామ్య విధానం నశించాలి, దున్నేవానికి భూమి దక్కాలి, 3. తెలుగు భూమి ఒకటి కావాలి, విశాలాంధ్రం ఏర్పడాలి.

 

    భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అధిక సంఖ్యాకులు ఉన్నత వర్గాలవారు. మధ్యతరగతుల వారు. సాధారణ ప్రజానీకం స్పందించిన మాట వాస్తవం. కాని, పాల్గొనలేదు.

 

    తెలంగాణా పోరాటంలో మధ్యతరగతివారు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పోరాటంలో పాల్గొన్నంతమంది ఏ పోరాటంలోనూ పాల్గొనలేదు. వారు పురుషులతో సమానంగా - కాశెగట్టి వడిశెల పట్టి పోరాటంలో దూకారు.

 

    భారత స్వాతంత్ర్య సమరానికి కవుల - రచయితల - కళాకారుల స్పందన అంతగా కనిపించదు. ఉద్యమస్ఫూర్తితో సాహిత్యం రాలేదనడం పొరపాటు. కాని, అరవయి సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి రావలసినంత సాహిత్యం రాలేదు.

 

    అయిదేళ్ల తెలంగాణా పోరాటంలో అరవయి ఏండ్ల స్వాతంత్ర్య పోరాటంలో వచ్చిందానికన్న - వాసిలోనూ, రాసిలోనూ అనంతం అయిన సాహిత్యం ప్రభవించింది.

 

    పోరాటకాలంలో అజ్ఞాత కవులు ఆవిర్భవించారు. జానపద కళారూపాలు - బుర్రకథ, జముకులకథ, గొల్ల సుద్దులు, కోలాటం, ఉయ్యాల పాట, భాగోతం, ధూల, ఫకీరుపాట మున్నగువానిలో సాహిత్యం అవతరించింది. సుద్దాల హనుమంతు - యాదగిరి - తిరునగరి ఆంజనేయులు - నాజర్ వంటి కళాకారులు రచనలు చేశారు, ప్రదర్శనలు ఇచ్చారు.

 

    దాశరథి "అగ్నిధార", "రుద్రవీణ", కాళోజీ "నా గొడవ", సోమసుందర్ "వజ్రాయుద్ధం," గంగినేని "ఉదయిని", కుందుర్తి "తెలంగాణ", ఆరుద్ర "త్వమేవా2హమ్" పోరాట స్ఫూర్తితో వచ్చిన కావ్యాలు. గమనించదగిన విషయం - శ్రీరంగం శ్రీనివాసరావు - శ్రీశ్రీ - కావ్యం లేకపోవడం! అతను స్పందించక పోవడం!!

 

    గంగినేని వేంకటేశ్వరరావు మూడు సంపుటాల ఎర్రజండాలు - వట్టి కోట ఆళ్వార్ స్వామి - పొట్లపల్లి రామారావు- కాళోజీ -సి.వి. కృష్ణారావు మున్నగువారు కథానికలు రచించారు.

 

    బొల్లిముంత శివరామకృష్ణ 'మృత్యుంజయులు' - ఆళ్వార్ స్వామి 'ప్రజల మనిషి' , 'గంగు', లక్ష్మీకాంతమోహన్ 'సింహగర్జనలు', మహీధర రామమోహన్ రావు 'ఓనమాలు', 'మృత్యువు నీడలో', గొళ్లపూడి నారాయణరావు 'తెలుగు గడ్డ', నేను ;చిల్లరదేవుళ్లు', "మోదుగుపూలు", 'మాయజలతారు', 'జనపదం' నవలలు రచించాం.

 

    భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను బలిదానం చేసిన భగత్ సింగ్ వంటివారి సంఖ్య తక్కువ. సంఖ్యమాత్రమే తక్కువ, ప్రభావం తక్కువకాదు.

 

    తెలంగాణా పోరాటపు అయిదు సంవత్సరాల కాలంలో నాలుగువేలకు పైగా వీరులు తమ ప్రాణాలను అర్పించారు.

 

    భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సాధించిన స్వాతంత్ర్య ఫలం దక్కింది. భారతజాతి స్వతంత్రం అయింది. రాజ్యాంగాన్ని ఏర్పరచుకుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం కొనసాగుతున్నది.

 

    తెలంగాణ పోరాటపు ఫలితం ప్రజలకు దక్కలేదు. మూడు వేల గ్రామాలలో పంచిన పది లక్షల ఎకరాల భూమిని భూస్వాములు తిరిగి ఆక్రమించుకున్నారు. అయితే తెలంగాణ పోరాటపు వారసత్వం, పోరాటస్ఫూర్తి నిలిచి ఉంది. భూసంస్కరణలు - జాగీరుల రద్దువంటివానికి ప్రజాపోరాటమే ప్రధాన కారణం. పోరాట స్ఫూర్తితో తలంగాన కాంగ్రెసులో సహితం కొంతకాలం 'ప్రగతి వర్గం' కొనసాగింది.

 

    ఇంతటి మహత్తర విప్లవానికి నిజాం నిరంకుశత్వం - దొరల దౌర్జన్యమే కారణమగునా?

 

    1940 ప్రాంతంలో అత్యధిక భూమిగల భూస్వాములు వీరు:-

 

    1. విసునూరు దొర    40,000 ఎకరాలు

 

    2. సూర్యాపేట దొర    20,000 ఎకరాలు




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.