Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
శ్రీ పిచ్చయ్య శాస్త్రి, దీపాల
ప్రబోధము
చిలిపి బుద్ధిఁ జేసి చీనా దురాత్ముండు
హద్దు మీఱి కడు నహంకరించి,
కదిసి కయ్యమునకు కాల్ ద్రవ్వుచున్నాఁడు
లేచిరండు వాని పీఁచ మడఁప.
'చీనా ఇండియ భాయి భాయి' యని
సుస్నిగ్ధ ప్రసంగంబులన్
తేనెల్ చిందఁగఁ జేయుచున్,
కపటమైత్రి గోముఖవ్యాఘ్రమై
యీ నాఁడిట్టె దురాక్రమమ్మునకుగా
నెత్తెత్తి నాఁడట్టి దు
ర్మానిన్ ద్రోహిని మట్టుపెట్టక
సహింపం జెల్లునే యేరికిన్!.
సామమునఁ జూచి చూచి నెహ్రూ మనీషి
మోహరము తీర్చి నిల్చి నాఁడాహవమున
వానికిని బుద్ధిచెప్ప; నిప్పట్ల మనము
సాయపడవలె మన మహానాయకునకు,
మారణ యంత్రవ్రాతముఁ
జీరికిఁ గైకొనక పిడుగు చిట్లిన క్రియఁ దెం
పారంగఁ జొరఁబడి హోరా
హోరిగఁ బోరెదరు మన సహోదరు లరుగో!.
భారతదేశరక్షణకు ప్రాణములొడ్డి పెనంగుచున్న హం
వీరుల కండగా నిలిచి, విత్తసహాయ మొనర్చి యుద్ధ సం
భారము లందఁజేసి, పగవాని మదం బడఁగించి, గెల్పు జెం
డారహినిల్ప దీక్షగఁగడంగుఁడు నిశ్చలధీర చిత్తతన్.
కడగండ్లమారి చీకటి బందిఖానలే
రమణీయ భర్మహర్మ్యములటంచు
ఓకిలింతలు తెచ్చు తూకంపు మెతుకులె
షడ్రసోపేత భోజనములనుచు
క్రూర భటాళి కఠోర గర్హణములే
యాప్తసల్లాప వాక్యములటంచు
కృపణాధికారి నిర్దిష్ట కృత్యంబులే
మహనీయ పుణ్యకర్మమ్ములనుచు
నెంచి సహియించి యరుల సాధించి మనము
కొన్న స్వాతంత్ర్యమును వృధా కోలుపోవఁ
దగునె! దర్ప మెలర్పఁ దద్రక్షణమున
కాయితము కండహోభారతీయులార!
* * * *





