Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    కందిగ్రామంలో 1946లో జాతీయవాదుల ఆంధ్రమహాసభ 12 వ సభలు జరిగాయి. జమలాపురం కేశవరావుగారు అధ్యక్షత వహించారు.

 

    ఆ తరువాత ఆంధ్రమహాసభ రద్దయింది. మొదటిసభ కమ్యూనిస్టు పార్టీలోనూ - రెండవది కాంగ్రెస్ లోనూ లీనం అయ్యాయి.

 

    1922లో అవతరించిన - నిజాం ఆంధ్రులకోసం ఏర్పడిన సంస్థ ఆంధ్రమహాసభ. అది సుమారు పావు శతాబ్దం నిజామాంధ్రులకు అన్ని రంగాల్లో సేవ చేసింది. తన పని ముగించుకొని అంతరించింది అనకూడదు అంతర్ధానం అయింది.

 

    ఆంధ్రమహాసభ కార్యకర్తలతో కలిసి వరంగల్లు జిల్లాలో పర్యటిస్తున్న రోజులు. ఊరూరికి వెళ్లడం, సభ పెట్టడం, ప్రజల్ను నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం చేయడం మా పని.

 

    ఒకరోజు వరంగల్లు జిల్లా, మానుకోట తాలూకా జయ్యవరం గ్రామానికి వెళ్లాం. సాయంకాలం చుట్టుప్రక్కల గ్రామాలనుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. నిజాం ముర్దాబాద్. అనే నినాదాలతో సభ ప్రారంభించారు.

 

    "అది సరియైన పనికాదు. మొదట జిందాబాద్ నినాదంతో ప్రారంభించండి" అన్నాను. "మహాత్మాగాంధీ జిందాబాద్."

 

    "పల్లెటూరి ప్రజలనంత, కొల్లగొట్టె నిజామోడా!

 

    కింగుకోటీమీద రేపే, రంగుజండా యెగురు లేరా" అని పాట పాడింది ఒక బాలిక. కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి. "రజాకార్లను గ్రామంలో అడుగుపెట్టనివ్వం" అని శపథం చేశారు జనం. "కలిసికట్టుగా పనిచేస్తాం" అని వాగ్దానం చేశారు. "నిజాం తొత్తులైన జమీందార్లను ఎదిరిస్తాం" అని నినాదం చేశారు.

 

    యాదవులు మాకు భోజనం పెట్టారు. రాత్రి పొద్దుపోయేదాకా పాటలు, పద్యాలు, బుర్రకథలు, ఆటలు. అక్కడికి నా జన్మ స్థలం గూడూరు రెండు మైళ్లే. అక్కడ మా తాతగారు, అమ్మమ్మ వుంటున్నారు. చూచి వెళ్లాలని, ఒక్కణ్ణే తెల్లవారి అక్కడికి చేరుకున్నాను. అప్పటికే మావూరి దొరవారికి (జమీందారుకి) మేం పక్క ఊళ్లో సభ పెట్టామనీ, నేను గూడూరు వస్తున్నాననీ వేగులవాళ్లతో వర్తమానం అందింది. మా తాతగారి ఇంట్లో నేను భోజనం చేస్తుండగా పోలీసులు తలుపు తట్టారు. "గిరఫ్తార్" (అరెస్టు) అన్నారు. "సరే, పదండి" అన్నాను.

 

    మా అమ్మమ్మ గొల్లుమని ఏడ్చింది. మా తాతయ్య నిర్ఘాంతపోయాడు.

 

    పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. అది చిన్న గ్రామం కావడం వల్ల అక్కడ అమీన్ (సబిన్ స్పెక్టర్) లేడు. ఆ రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ లోనే కటకటాల వెనుక గడిపాను. తన గడీ (బంగళా)కి నన్ను తీసుకురమ్మని దొరవారు పోలీసులను కోరారు. నన్ను గడీలోనే చడీచప్పుడూ లేకుండా ఖతం చేయాలని అతని కుట్ర. పోలీసులు అందుకు అంగీకరించలేదు. తెల్లవారి అక్కడికి పది మైళ్లలో వున్న నెల్లికుదురు హెడ్ పోలీసుస్టేషనుకు నన్ను నడిపిస్తూ తీసుకువెళ్లారు. చేతులకు బేడీలు, నడుముకు తాడు. తుపాకులతో ఇద్దరు పోలీసులు వెంటనడిచారు. నెల్లి కుదురు పోలీసు అమీన్ చాల క్రూరుడు. నా జేబులో ఎర్రసిరాతో వ్రాసి ఉన్న పద్యం లాక్కున్నాడు. "విప్లవగీతం వ్రాస్తున్నావా?" అని అడిగాడు.

 

    "ఇది విప్లవగీతమే కాని, సర్ మహ్మద్ ఇక్బాల్ ఉర్దూ గీతానికి అనువాదం - నా స్వంతరచన కాదు" అన్నాను. ఒరిజనల్ చదవమన్నాడు. చదివాను. "ఇంత విప్లవం ఇక్బాల్ కవిత్వంలో ఉందా?" అన్నాడు. "ఉంది. అది 'బాల్-ఏ-జిబ్రాల్' అవే ఇక్బాల్ కావ్యంలోది" అన్నాను. చేతుల బేడీలు తొలగించమనీ, నడుము తాడు విప్పేయమణి పోలీసులకు ఆజ్ఞాపించాడు. అంతవరకు బాగానే ఉంది.

 

    "నన్ను త్వరగా వరంగల్లు సెంట్రల్ జైలుకు పంపండి" అని అడిగాను.

 

    "జైలుకు నీ శవం పోతుంది. మొదట దేహశుద్ధి" అన్నాడు. హడలిపోయాను. చిత్రహింసలకు అతడు ప్రసిద్ధుడు. ఇంతలో దైవికంగా అతని కూతురు, అల్లుడు దిగారు. ఆ గొడవలో పడి నన్ను మరిచిపోయాడు. నన్ను కాపలా కాస్తున్న పోలీసులు అలసిపోయి ఉన్నారు. బావర్చీ (వంటవాణ్ణి)ని మచ్చిక చేసుకొన్నాను ఖానాకోసం. ఇదే సమయమని ఉడాయించాను. పొలాల్లో, నదుల్లో, అరణ్యాల్లో పరిగెత్తుతున్నాను."

 

                                        (దాశరథి కృష్ణమాచార్య యాత్రాస్మృతినుండి)

 

    అన్నయ్య దాశరథి అలా పోలీసుల బారినుండి తప్పించుకున్నాడు. అప్పటికి మానుకోట తాలూకాలో ఉండిన పిండిపోలు చేరుకున్నాడు. అక్కడ కవిరాజ మూర్తి ఇంట్లో అజ్ఞాతంగా ఉండిపోయాడు. కవిరాజ మూర్తి కాంగ్రెసు. పిండిపోలులో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంది. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కవిరాజమూర్తి ఒక కమ్యూనిస్టు కార్యకర్తను హత్య చేశాడు.

 

    దాశరథి కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేశాడు. వారితోపాటు పెండ్యాల సత్యనారాయణ, పెరవెల్లి వెంకట రమణయ్య, పర్సా దుర్గాప్రసాదరావు మున్నగువారు పార్టీకి రాజీనామాలు చేశారు. కాంగ్రెసులో చేరారు.

 

    హిట్లర్ రష్యామీదికి దండెత్తాడు. అప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ దానిని ప్రజాయుద్ధం అన్నది. "రష్యాలో వానపడితే కమ్యూనిస్టులు భారతదేశంలో గొడుగు పట్టుకుంటారు" అనేవాళ్లు కమ్యూనిస్టు వ్యతిరేకులు. ఆ కారణంగానే మేము రాజీనామా చేశామన్నారు దాశరథి మున్నగువారు. కాని, అది సరయయిన కారణం అనిపించదు. ఎందుకంటే, హిట్లరు రష్యామీద 1941 జూన్ లో దాడి చేశాడు - ఈ రాజీనామాలు 1946లో జరిగాయి.

 

    ఈ మధ్య ఒక సీనియర్ కమ్యూనిస్టు నాయకుణ్ణి అడిగాను. వ్యక్తిగత విభేదాలు తప్ప - సిద్ధాంతపరం అయిన విభేదాలు కావన్నారు. తరం అంతరిస్తున్నది. ప్రత్యేకంగా ఈ సంఘటన గుర్తున్నవాళ్లూ కనిపించరు.

 

    దాశరథి కొంతకాలం పిండిపోలులో ఉన్నాడు. తరువాత కారేపల్లిలో పర్సా దుర్గా ప్రసాద్ రావుగారింట్లో ఉన్నాడు. అసందర్భంగా నేను కొన్నిసార్లు కారేపల్లి వెళ్లివచ్చాను.

 

    ఒకనాడు అన్నయ్య - రహస్యంగానే - ఇంటికి వచ్చాడు. పోలీసులు కనిపెట్టారు. దాశరథిని అరెస్టు చేశారు. రాత్రికి రాత్రి రైలెక్కించి వరంగల్లు జేలుకు పంపారు. అప్పటికి ఇంకా భారతదేశం స్వతంత్రం కాలేదు. రజాకారు రాక్షస మూకలు మరింత చెలరేగలేదు.

 

    దాశరథిని వరంగల్లునుంచి నిజామాబాదు జేలుకు - హైదరాబాదు చంచల్ గూడా జేలుకు మార్చారు. జేలు జీవితాన్ని గురించి వారు "యాత్రాస్మృతి"లో వివరంగా వ్రాశారు.

 

    దుర్లభదర్శనం:

 

    "మహాత్ముడు ఖమ్మం వస్తున్నారు." ఇది వార్త. మహాత్ముడు మహిమాన్వితుడు. వారు భారత ప్రజలను ఉద్యమింపజేశారు. తెల్లవాని గుండెలో నల్లపిడుగులు కురిపించారు. మహాత్ముని అనేకమండి అవతారంగా భావించారు. దేవునిగా పూజించారు. వారికి అనేక మహిమలు ఆపాదించారు. నాకు మాత్రం మహాత్ముడు దైవత్వం అధికంగా ఉన్న మహా ఉన్నత మానవుడుగా కనిపిస్తారు.

 

    దైవత్వం - రాక్షసత్వం రెంటి కూడిక మానవుడు. ఏది అధికంగా ఉంటే వాడవుతాడు. నరుడు దేవుడు కావచ్చు. రాక్షసుడు కావచ్చు. మానవుడు కావడం కష్టం. మానవునిలో దైవత్వ రాక్షసత్వాలు సమానంగా ఉంటాయి.

 

    "మహాత్ముడు" - ఆ పేరు వినగానే ఒక జ్యోతిర్మూర్తి ప్రత్యక్షం అవుతారు. మస్తకం అవనతం అవుతుంది. గుండెలో గౌరవం, భక్తిభావం పొర్లుతాయి.

 

    మహాత్ముడు రామునివంటి వీరుడు కాడు. శ్రీకృష్ణునిలాంటి యుగ కర్త కాదు. బుద్ధునివంటి ప్రబోధకుడు కాడు. క్రీస్తు, మహమ్మదుల వంటి ప్రవక్త కాదు.

 

    మహాత్ముడు సామాన్య మానవునివలె జీవించారు. సాధారణునివలె తప్పులు చేశారు. ఒప్పులు మరిన్ని చేశారు. వారి జీవితమే ఒక మహాగ్రంథం. చెప్పినవారు అనేకులున్నారు. చేసి చూపినవారు గాంధీజీ!

 

    మహాత్మునిది ఒక సమ్మోహన శక్తి. నలుబది కోట్లమంది భారతీయులు వారి కనుసన్నలలో నడిచారు. మానవ జాతి సాంతం వారిని ఆదరించింది. అభినందించింది. వారి అనుయాయులలో వారితో ఏకీభవించేవారు తక్కువ. వ్యతిరేకించేవారు ఎక్కువ. అయినా అందరూ వారినే అనుసరించారు.

 

    మహాత్ముడు - ముమ్మూర్తులా మహాత్ముడు. సూర్యుడు క్రుంగని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. సింహాన్ని ఖద్దరు నూలుతో కట్టిపడేశారు. మహాయంత్రాల చక్రాలను రాట్నం తిప్పి నిలిపారు.

 

    శత్రువును మిత్రునిగా ప్రేమించడం మహాత్మునికే సాధ్యం. అతడు అజాత శత్రువు. శత్రువులు సహితం మహాత్ముని అభినందించకుండా ఉండలేకపోయారు.

 

    మహాత్ముడు ఖమ్మం వస్తున్నారు. వారిని మనం దర్శించగలం! మహాత్ముని దర్శించామని సగర్వంగా చెప్పుకోగలం!! మహాత్ముని దర్శించడమే ఒక మహాభాగ్యం!!!

 

    అది చలికాలం. ఆరోజుల్లో చలి ఎక్కువ. వంటినిండా బట్టల్లేవు. రాత్రి బండికే ఖమ్మం చేరుకున్నాం. తెల్లవారేవరకు చేరుకోలేమని భయం. అందరం బయలుదేరాం. రాత్రి వజవజ వణుకుతూ ఖమ్మం స్టేషన్లో గడిపాం. తెల్లవారి ముఖాలు కూడా కడగలేదు. మహాత్ముని దర్శనం లభించదని భయం! మసక చీకట్లోనే సభాస్థలికి చేరుకున్నాం.

 

    నేల ఈనినట్లు జనం. అంతా క్రమశిక్షణగా కూర్చున్నారు. మంత్రం వేసినట్లే నిశ్శబ్దంగా ఉన్నారు. తోసుకోవడం - అరవడంలాంటివి మచ్చుకు లేవు. మేమూ ఒక చివరన కూర్చున్నాం.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.